అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
శుక్రవారాభిషేకము - తిరుచానూరు కం. స్రగ్జజలజాంచితకంఠీ!(1) దిగ్జిద్దేదీప్యమానదివ్యాభరణా! దృగ్జితహరిణీ! శ్రితవి ష్వగ్జయకారిణి!(2) దయఁగను పద్మసరోజా!(3) (1) పూలమాలలోని కమలములచే పూజింపబడిన కంఠము కలది (2) ఆశ్రయించినవారికి సమస్త/ఐశ్వర్య, జయములను కలిగించునది (3) పద్మసరస్సులో పుట్టినది 241 ఉ. నీ నగుమోముఁ దాఁకుటఁ బునీతములై దిగుచున్న పండ్లు నీ మేనున నాటలాడుచును మెల్లఁగ హాయిగ మాటలాడుచున్ తేనియఁ మున్గి, యమ్మయొడిఁ దీరుగఁ జేరిన పిల్లలో యనన్ నేను గనంగఁజేసితివి; నీ వొక పండుగఁ(1) జేయుమా ననున్ 242 (1) ఫలముగా సరస్వతీవిన్నపము ఉ. హృద్యకవిత్వసంపదకు నీ సుతుఁ బాత్రునిఁజేసి చూచి, యే విద్యల నభ్యసింప నవి విజ్ఞుల మన్నన లొందు రీతిగన్ సద్యము(1) పొందఁజేసితివి నాదవినోదిని! వాణి! నీకు నై వేద్యము పద్యపుష్పరసపృక్త(2)భవత్కరుణాప్తసత్కృతుల్ 243 (1) వెంటనే (2) నిండిన విజయదశమిశుభాకాంక్షలు మ. సరదా లెన్నియొ మూటగట్టుకొని విశ్వశ్రేయమున్ గూర్ప సు స్థిర సద్బుద్ధి నొసంగి మంచికి జయశ్రీమోద మందించి ప ల్వురి రక్షించుచు శక్తి నిచ్చి మిసిమిన్(1) బొల్పొందఁ(2) జేయంగ శాం కరి మమ్మేలుతఁ బ్రాంగణాల దసరాకాంతుల్ దువాళింపఁగన్(3) 244 (1) క్రొత్తకాంతిని (2) వృద్ధిపొందేలా (3) ప్రసరింపగా ఈ పద్యములో మొదటిపాదములో ‘వి’, రెండవపాదములో ‘జయ’ మఱియు ‘ద’, మూడవపాదములో ‘శ’ మఱియు ‘మి’ వెరసి ‘విజయదశమి’ నిక్షిప్తమయింది. ఇంతే కాక, మొదటిపదములో ఉన్న ‘సరదా’ లే నాల్గవ పాదములో ఉన్న‘దసరా’ లో చొరబడ్డాయి. వేంకటేశ్వరుఁడు మ. కరుణాసింధుఁడ వీవ వేంకటపతీ! కల్యాణధామస్థితా! కరిరాణ్మోక్షణచంగచక్రధర! శ్రీక్ష్మానాథ! మమ్మేలు నీ చరణాంభోరుహభృంగమై తిరుగు నా స్వాంతంబు, నీ దివ్యసుం దరలీలామనుజాకృతీక్షణమహానందానఁ జిందాడఁగన్ 245 చిటుకుల చాముండేశ్వరి ఉ. పట్టెద మమ్మ గుల్ఫముల బాహుయుగంబులఁ జుట్టి, యంఘ్రులన్ బెట్టద మమ్మ మస్తముల నీదుపదాంచితహేర(1)కుంకుమల్ పెట్టిన రీతి నాస్యముల విస్తృతమంగళవర్ణకేళి క న్పట్టఁగ నిట్టి భాగ్యమిడి పట్టులఁ(2) బ్రోచెడి మాత వీవెగా 246 (1) పసుపు (2) బిడ్డల సంగారెడ్డిజిల్లా జోగిపేటకు ఏడు కిలోమీటర్ల దూరములో ఉన్న చిటుకుల గ్రామములో పూజలందుకొనే శ్రీచాముండేశ్వరీమాత ఆలయములో భక్తులు స్వహస్తములతో అమ్మవారి పాదాల మీద పసుపు, కుంకుమలను ఉంచి, రెండు చేతులతో ఆ పాదాలను పట్టుకొని నుదుటిని ఆనించి మ్రొక్కడం సంప్రదాయం. ఇది ఇక్కడి ప్రత్యేకత.