Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
అరుణాచలేశ్వరుఁడు
చం. ధిమిధిమిదింధిమిధ్వనులఁ దీరుగ నాడు నటేశ్వరాద్రిజా
       సమపదనృత్యకేళిఁ(1) గని స్వాంతము గంతుఁ బ్రదోషవేళలోఁ
       దమికొని(2) సర్వసృష్టి తముఁదామె యెఱుంగక పాల్గొనంగఁ ద
       త్సమయభవస్వరంబులె సుశబ్దములౌ గద వాఙ్మయంబునన్
             (1) ఈశ్వరుడు, పార్వతి సమానముగా చేయు తాండవము
             (2) కుతూహలపడి 228
చం. లలితములైన కైతననలన్ గొని యల్లితి భక్తిసూత్రమే
       నిలుపఁగ నొక్క గీత పయి నిర్ణితరీతిని మాల గాఁగ నీ
       గళమున వైచి సంతసిలఁ గాన్కగఁ గైకొని తాల్చు మమ్మరో
       పలుకులతల్లి నా కిడిన భాగ్య మిదే యరుణాచలేశ్వరీ!(1)
             (1) కూచాంబిక 229

వినాయకచవితి
తే.గీ. ముజ్జగాలకు నొజ్జయౌ బొజ్జవేల్పు
        గుజ్జురూపాన నెలుకపై సజ్జకముగ(1)
        పజ్జ(2) నుండఁగ సేవించు సజ్జనముల
        కజ్జ(3) మేదైన బన్నముల్(4) నుజ్జునుజ్జు
               (1) మనోజ్ఞముగా (2) సమీపములో
               (3) కజ్జము=పని (4) విఘ్నాలు 230

వేంకటేశ్వరనివేదనము
ఉ. వేచితి నీదు రాకకయి వేయివిధంబుల శ్రీనివాస! నా
      తోఁచినరీతిఁ బద్యములతోడను మాధురి గల్గు శబ్దముల్
      వాచవి గాఁగఁ భక్ష్యముల వండి యలంకృతులన్(1) నయించితిన్(2)
      కాఁచిన వెన్నమీఁది నెయిగాఁ గడుకమ్మఁగ స్వీకరింపుమా!
            (1) శబ్దార్థాలంకారములను (2) చేర్చితిని 231

సీ. ప్రతిరోజు నీ దివ్యపదపద్మదర్శన
         భాగ్య మొసంగుమా పరమపురుష!
    రమణీయసౌవర్ణరత్నద్యుతుల నీను
         మకుటాదిభూషణమండితాంగ!
    ప్రస్ఫుటఘనసారరమ్యకస్తూరికా
         వరనామ! చక్రాబ్జ(1)ధరకరయుగ!
    అనపాయినీశ్రీధరాంచిత(2)వక్షమ్ము
         ప్రేమాలయ మ్మగు వేంకటేశ!
తే.గీ. నీ కటాక్షము సోఁకఁగా మోకరిల్లు
        దేవతానీకమునిభక్తదృగ్ద్విరేఫ
        పంక్తి ఝంకార మొనరించు భవదనన్య
        చరణసారససన్నిధి శరణు శరణు!
              (1) అబ్జ=శంఖము (2) ఎప్పుడును విడువని
              (3) నిత్యమైన లక్ష్మితో భూదేవితో పూజింపబడిన 232

సూర్యోదయము
కం. తెలవాఱువేళ గ్రహపతి
      తొలికరములు తాఁక లేచు తొయ్యలి వోలెన్
      బులకించు ప్రకృతి విధులనుఁ
      దలపడఁ దొలఁగించు వలపుతలఁపుల తెరలన్ 233
Posted in September 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *