అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
మాతృదినోత్సవము ఉ. ‘మాతృదినోత్సవం’ బనుచు మాతకు నొక్క దినాన మ్రొక్కఁగా ధాత విధించెనా? మఱి సుతాసుతవాసర మిట్టిదే కదా! ఆ తొలిప్రేమమూర్తి కని నందుకు నొక్క దినంబె పా లిడన్ జేతులు గల్గునా యిటు రచింప, నమింప, భుజింప నీ భువిన్? 193 సహధర్మచారిణి కం. జీవనపథదర్శినిగా మా వెలుగై యింట వెంట మధురిమ లొలుకున్ ఆ విధి సృజియించెనుగా యీ వనితామణిని, నాకు నిదె సద్వరమౌ 194 ఉ. దేవత లందఱిన్ బిలిచి దీవెన లీయఁగ వేఁడుకొందు నా దేవికి మాకు నందఱికిఁ దీరగు భావినిఁ గల్గఁజేసిఁ మా భావకవేలముల్(1) నెనరుకౌముది(2)తో వికసించు భాగ్యమున్ జీవనయానమార్గమున నిత్యముఁ బ్రాప్తముసేసి ప్రోవఁగన్ (1) హృదయాలనే కలువలు (2) కృతజ్ఞత అనే వెన్నెల 195 వేదాంతము ఉ. వచ్చిన వెన్నొ(1) వెళ్ళినవి; వచ్చిన నచ్చిన నచ్చకున్నఁ దా(2) విచ్చిన వెళ్ళ కుండును మఱెన్నియొ(3) వెంట భవంబు మాఱినన్, నిచ్చలుఁ జిత్రగుప్తుఁడు గణించుచు నిచ్చిన పుణ్యపాపముల్ కచ్చితమౌ(4) ఫలంబు లిడ, జ్ఞానసముద్రుల కైనఁ దప్పునే? (1) పాలపళ్ళు మొదలు జవసత్వాలు, సుఖదుఃఖాలు, భయభ్రాంతులు, అనందోత్సాహాలు, పదవులు, సమావేశాలు, మొదలగునవి (2) చోటు (3) మమకారాలు, అనురాగాలు, ఋణానుబంధాలు, మొదలగునవి (4) ఎచ్చుతక్కువలు లేక సరిగా నుండు 196 కృతజ్ఞత ఉ. ఎన్ని భవంబులో గడచి యీ మనుజోత్తమజన్మ గల్గె, ని న్నెన్నివిధాల నా నుడుల నెంచి వచించి భజించినన్ సరే అన్నియు నా కృతజ్ఞత సమగ్రముగాఁ దెలుపంగఁ జాల వా పన్నదయాసముద్ర! గుణభద్ర! వరప్రదముద్ర! హే ప్రభూ! 197