Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

11. అశోకుడు - మహారాణులు

అనేక మూలాధారాల ప్రకారం అశోకుడికి అయిదుగురు భార్యలున్నారు. వీరు: దేవి (విదిష-మహాదేవి; శాక్యకుమారి), కౌరవాకి (కారువకి; చారువాకి), అసంధిమిత్ర, పద్మావతి; తిష్యరక్షిత (Tishyarakshita). ఈ అయిదుగురు వేరు వేరు మనస్తత్వాలు, ప్రవర్తనలు, నడవడికలు కలిగియున్న రాణులు. అలాగే బౌద్ధ సిద్ధాంతాలను అనుసరించే విషయంలో కూడా.

దేవి: మొదటి భార్య ‘దేవి’ (వెదిశదేవి; విదిష-మహాదేవి, విదిషా-దేవి) మధ్య భారతంలో అవంతి (Avanti) రాజ్యంలోని విదిష నగర ముఖ్య నాయకుడు, వ్యాపారస్తుడు, వైశ్య వర్ణానికి చెందిన ‘దేవ’ అనే వ్యక్తికి ఏకైక పుత్రిక. ఈమెకు ‘వైశ్యపుత్రీ-దేవి’ అనే నామం కూడా ఉంది. క్రీ.పూ. 282 లో బిందు సారుడు తన 22 ఏళ్ల పుత్రుడు అశోకుడిని అవంతి రాజ్యానికి రాజప్రతినిధి (Viceroy) గా పంపించటం జరిగింది. ఒకసారి అశోకుడు విదిష నగరాన్ని దర్శించినప్పుడు అత్యంత సుందరి అయిన దేవి ని చూసి మోహించి వెంటనే ఆమెను వివాహం చేసుకోవటం జరిగింది.

వివాహం తరువాత ఉజ్జయినిలో ఆమెకు క్రీ.పూ. 280 లో ఒక సుందరుడయిన బాలుడు, ‘మ హేంద్ర’ (పాలీ నామం: మహేంద) జన్మించాడు. రెండు ఏళ్ల తరువాత (క్రీ.పూ. 278) ఒక పుత్రిక కలిగింది. ఆమె పేరు ‘సంఘమిత్ర’ (పాలీ: సంఘమిత్త). మహేంద్ర, సంఘమిత్ర జననం అశోకుడి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం, ఆయన భవిషత్తు జీవితాన్ని మలుపు తిప్పిన విషయం. అశోకుడి తరువాత కాలం లో బౌద్ధ మతాన్ని స్వీకరించిన బౌద్ధ సన్యాసి మహేంద్ర, సన్యాసిని సంఘమిత్ర శ్రీలంక కు వెళ్లి అచ్చట బౌద్ధ మతాన్ని ప్రవేశపెట్టి, దాని వ్యాప్తికి కృషి చేశారు. పట్టపురాణి హోదా కలిగిన ‘దేవి’ అశోకుడితో కలిసి పాటలీపుత్రలో ఉన్నదో లేదో ఇదమిద్ధంగా తెలియదు. కాని కొన్ని గ్రంధాల ప్రకారం అశోకుడు రాజు అయ్యే ముందు పాటలీపుత్ర తిరిగి వెళ్ళేటప్పుడు (క్రీ.పూ. 272 లో) దేవి తన పిల్లలను పెంచుకుంటూ విదిశ లోనే ఉండిపోయింది.

కౌరవాకి: ద్వితీయ రాణి అయిన ఈమె కళింగ రాజ్యానికి చెందిన ఒక జాలరి కుమార్తె. కౌరవాకి అశోకుడి రెండవ పుత్రుడు ‘తీవల’ (Tivala/Tivara) మాతృమూర్తి. కౌరవాకి తన భర్త జీవన శైలి మార్చి, ప్రజల సంక్షేమాల గురించి ఆలోచింపచేసి, వాటి విధివిధాలను శిలా శాసన రూపంలో తీసుకు రావటానికి కారణమైన నారీమణి. అశోకుడి ఇష్ట సఖి అయిన ఈమె నామం అశోకుడి శాసనాలలో జొప్పించబడింది. ఉదాహరణకు అలాహాబాదు (ప్రయాగరాజ్) లోఉన్న ధర్మ స్థంభం మీద ఈమె పేరుతోపాటు ఈమె రాజ కుమారుడు ‘తీవల (తీవర) తల్లి’ అని చెక్కబడింది. ఈమె అధికారులకు, మహామాత్రలకు మతపరమైన విషయాలలో, దాన ధర్మాల గురించిన ఆదేశాలను జారీ చేసినట్లు కూడా చెక్కబడింది.

ఆత్మస్థైర్యం, గట్టిసంకల్పం పుణికి పుచ్చుకున్న కౌరవాకి తన దాతృత్వం గురించి శాసనాల ద్వారా తన పేరు మీద భద్ర పరచాలనే కాంక్ష, కోరిక బలీయంగా ఉండేది. ఈ రెండవ రాణి బౌద్ధ విషయాలలో తన భర్త లాగానే కొంచెం సాత్వికురాలు.

పద్మావతి: మూడవ రాణి అయిన పద్మావతి గురించి వివరాలు లభించలేదు. కాని ఈమె ఒక రాజ పుత్రిక. అశోకుడితో ఈమె వివాహం వీరిద్దరి చిగురించిన ప్రేమ పర్యవసానమా లేక రాజకీయ బంధమా అనేది తెలియదు. కాని ఆమె అత్యంత సౌందర్యవతి. ఈమె అశోకుడి మూడవ పుత్రుడయిన ‘కునాల’ (Kunala) కి తల్లి. మధ్య వయస్సులో ఉన్నప్పుడే ఆమె మరణించింది.

అసంధిమిత్ర: ఈ నాలుగవ రాణి ఇప్పటి హరియాణా లోని కర్నల్ జిల్లాకు చెందిన ‘అసంధివత్’ అనే చిన్న రాజ్యానికి చెందిన రాజపుత్రి. అసంధిమిత్ర గురించి వివరాలు తెలియవు గాని ఈమెను అశోకుడు సింహాసనం ఎక్కిన తరువాత వివాహం చేసుకొనటం జరిగింది. అశోకుడి ‘ప్రియ సతి’ అయిన అసందిమిత్ర బుద్ధుడి యెడల అత్యంత విశ్వాసం గల బౌద్ధ భక్తురాలు.

ఒకసారి అసంధిమిత్ర చెరకుగడ ముక్క తింటున్నప్పుడు అశోకుడు “నీవు దీనిని తినే యోగ్యతను (కర్మను) ఆర్జించకుండా తింటున్నావుకదా” అని పరిహాసమాడటం జరిగింది. దీనికి ఈ మహా రాణి “నా అన్ని ఆనందాలు, సుఖాలు నా కర్మ ఫలితమే” అని జవాబు ఇచ్చింది. వెంటనే అశోకుడు “బౌద్ధ సన్యాసులకు 60,000 వస్త్రాలు మరుసటి రోజుకు లభించేటట్లు చేయి” అని సవాలు విసిరాడు. ఈ సవాలును అసంధిమిత్ర స్వీకరించి రాత్రి నిద్రకు ఉపక్రమించింది.

ఆ రాత్రి పాలక దేవుళ్ళు (guardian gods) ఆమెకు కలలో కనిపించి “క్రిత జన్మలో నీవు ‘ప్రత్యేకబుద్ధ’ (pratyekabuddha) కు ఒక బహుమతి ఇచ్చావు గాబట్టి దానికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది” అని తెలియజేశారు. మరుసటి రోజు ఆమె అద్భుతంగా 60,000 వస్త్రాలు సేకరించగలిగింది. ఉప్పొంగిపోయిన ఈ మౌర్య చక్రవర్తి ఆమెను తన అత్యంత ఇష్ట సఖి (భార్య) గా చేసుకొనటం (నియమించటం) జరిగింది. ఆ తరువాత ఆమెను ‘పరిపాలకురాలుగా’ నియమించబోతే ఆమె ఈ పదోన్నతి తిరస్కరించింది. అసంధిమిత్ర యెడల అశోకుడికి ఉన్న అధిక ప్రేమ ఇతర భార్యల ఈర్ష్యకు కారణమైంది.

దీనిని అశోకుడు గమనించి అందరి రాణులకు ఒక పరీక్ష పెట్టటం జరిగింది. వంటశాలలో 16,000 రొట్టెలను (cakes) తయారుచేయించి ఒక దాని మీద రహస్యమైన చోట ‘రాజముద్ర’ ను వేయించాడు. ఈ రొట్టెలలో రాజముద్ర ఉన్న రొట్టెను తనకివ్వమని రాణులను ఆదేశించాడు. ఒక్క అసంధిమిత్ర మాత్రమే వెంటనే ఆ రొట్టెను కనిపెట్టి ఆయనకు ఇచ్చింది. అలా ఆమె ఉన్నత స్థాయి ఇతరరాణులకు తేట తెల్లమయ్యింది.

పట్టపురాణి హోదా పొందిన ఈ అసంధిమిత్ర సుమారు క్రీ.పూ. 240 లో అశోకుడి ముందే పైలోకానికి వెళ్ళిపోయింది. ఆమె మరణంతో అశోకుడి జీవితానికి ముగింపు ప్రారంభమైంది.

అశోకుడి పాలనలో 29 వ ఏట ఆమె మరణించటం జరిగింది. అది ఈ మౌర్య రాజు మరణానికి 8 ఏళ్ళు ముందు. అసంధిమిత్ర మరణానికి ఒక సంవత్సరం ముందు అశోకుడు తన ఏడవ ధర్మ స్థంభ శాసనం (Seventh Pillar Edict) ఇవ్వటం జరిగింది. ఆ తరువాత ఆయన శాసనాలు ఇవ్వటం ఆగిపోయింది. దీనిని ముఖ్య కారణం అసంధిమిత్ర మరణం వల్ల ఆయనలో కలిగిన విచారం, బాధ. దీనితో పాటు కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా. ముఖ్యంగా అయిదవ భార్య (తిష్యరక్షిత: Tishyarakshita) సృష్టించిన సమస్యలు. వచ్చే సంచికలో (జూన్ 2024) తెలుసుకుందాము.

అశోకుడు తన ఏడవ ధర్మ స్థంభం మీద చెక్కబడిన శాసనం ఈ క్రింది విధంగా ఉంది.

ఏడవ ధర్మ స్థంభ శాసనం (Seventh Pillar Edict)

తండ్రి బిందుసార మరణం తరువాత దాదాపు 4 ఏళ్ల తరువాత క్రీ.పూ. 268 లో తన కుటుంబం నుంచి అశోకుడు మూడవ మౌర్య చక్రవర్తిగా రాజ మకుటాన్ని ధరించటం జరిగింది. అశోకుడు రాజు అయ్యేటప్పటికి జ్యేష్ఠ పుత్రుడు (మహారాణి ‘దేవి’ పుత్రుడు) మహేంద్ర వయస్సు 14 ఏళ్ళు.

‘దేవనామ ప్రియదర్శి’ (అశోక చక్రవర్తి) తన పాలనలో 27 వ ఏట (క్రీ.పూ. 241 లో) ఢిల్లీ-తోప్రా (Delhi-Topra) లో నెలకొల్పిన ఒక పెద్ద సంభం మీద ఒక భారీ శాసనం చెక్కించటం జరిగింది. ఈ స్థంభం మీద బౌద్ధ ధర్మం గురించి తన యోచనను, అభిప్రాయాన్ని, సందేశాన్ని, విధానాన్ని వివరించటం వెలిబుచ్చటం జరిగింది.

“గతంలో రాజులు ప్రజలలో నైతికతను పెంపొందిస్తే వారు పురోగతి సాధించగలరు అని ఆశించారు. కాని ఆ ప్రజలలో నైతికత పెంపొందించటానికి వారు తగిన కృషి, ప్రయత్నాలు చేయలేదు.”

దీనిని గురించి ఆయన ఈ విధంగా పలకటం జరిగింది.

“ప్రజలు నైతికతను ఎలా పెంపొందిచుకోవచ్చు అనే విషయంమీద చాలా ఆలోచించాను. ఫలితంగా ఇవి స్ఫురించాయి: ‘నైతికత గురించి ఒక రాజాజ్ఞ ఇస్తాను. దీనిని చూసి, విని ప్రజలు పాటించి, క్రమక్రమంగా తమలో నీతి, నియమాలను పెంపొందించుకుంటారు. ఈ లక్ష్యసిద్ధి నెరవేరటానికి ప్రజలకు వివిధ ఆజ్ఞలను ఇవ్వటం జరుగుతుంది. వీటిని సమర్ధవంతంగా నిర్వహించి, ప్రజలలో నైతికత, సత్ప్రవర్తన పెంపొందించి, దానిని వృద్ధి చేయటానికి నా అధికారులు కృషిచేయటం జరుగుతుంది. ‘లజుకులు’ (Lajukas; ఒక స్థాయి అధికారులు) పర్యవేక్షణలో కొన్ని వేలాది ప్రజలు ఉన్నారు.”

“వెంటనే వారికి నేను ఆజ్ఞలు ఈ విధంగా జారీ చేశాను: ప్రజలు నైతికతకు దాసోహం అవ్వాలంటే పరి పరి విధాలుగా మీరు ఉద్భోదించండి. ఏవిధం అనేది మీ బుద్ధిని, తెలివిని వినియోగించి, నిర్ణయించండి.”

దేవనామ ప్రియదర్శి ఇంకా ఈ క్రింది విధంగా వెల్లడించాడు:

“ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, నేను అనేక శిలా స్తంభాలను (ధర్మ స్తంభాలను) నెలకొల్పి, ‘ధర్మ మహామాత్రల’ను నియమించి నీతి, నియమాల గురించి ప్రకటనలు జారీ చేశాను.....రహదారుల వెంట మర్రి చెట్లు నటించాను, ఇవి మానవులకు, పశువులకు నీడను కల్పిస్తాయి.......విరివిగా మామిడి తోటలు వృద్ధి చేశాను.....ఒక బావికి మరో బావికి మధ్య 8 కోసుల దూరం ఉండేటట్లు అనేక బావులను త్రవ్వించాను; బావి లోపలకు దిగటానికి అనువుగా మెట్లు కట్టించాను. అనేక చోట్ల ప్రజలకు, బాటసారులకు త్రాగునీరు అందించటానికి చలివేంద్రాలు ఏర్పాటు చేశాను; పశువులు కూడా సమృద్ధిగా నీరు త్రాగటానికి అనేక ఏర్పాట్లు చేశాను. ఈ వివిధ సదుపాయాలను నా పితామహుడు, తండ్రి కూడా కల్పించారు. కాని నేను ప్రజలలో నైతికతను అమితంగా ప్రోత్సాహించటానికి ఈ కార్యక్రమాలను మరింత శ్రద్ధతో, నిర్వహించటం జరిగింది.”

“నిజాయితి, నైతికత కలిగిఉన్న మహామంత్రులు సాధువులకు, ప్రజలకు లాభం చేకూరే వివిధ వ్యవహారాలతో పాటు అన్నివర్గాల ప్రజల విషయాలలో కూడా నిమగ్నమయి ఉన్నారు. కొందరు మహామంత్రులను కేవలం బౌద్ధ సంఘ విషయాలలో మాత్రమే నిమగ్నమవమని నేను ఆదేశించాను. అలాగే కొంత మంది మంత్రులను బ్రాహ్మణులు, జైనులు, అజీవికలు, ఇతర శాఖల ప్రజలకు సేవ చేయమని ఆదేశించాను.”

“వీరు, ఇతర ముఖ్య అధికారులు, నేను, నా రాణులు, అంతఃపుర స్త్రీలు ఇచ్చిన బహుమతులను ఉత్తమ ప్రజలు, నైతికతను పెంపొందించుకున్న వారికి, యోగ్యులకు, ఉత్తమోత్తములకు, భిక్షుకులకు అందజేశారు. మరి కొంతమంది అధికారులు నా పుత్రులు ఇచ్చిన బహుమతులను న్యాయవర్తులు, సద్భుద్ధులు కలవారికి, గొప్ప పనులు చేసిన వారికి ఇవ్వటం జరిగింది.”

“నేను చేసిన కార్యాలు, ఘనకార్యాలను ప్రజలు అనుకరించి పురోగతి సాధించటం జరిగింది. ఈ పురోగతి వల్ల వారు మాతా పితామహులకు విధేయులుగా ఉంటూ, పెద్దవారికి మర్యాదను ఇస్తూ, బ్రాహ్మణులు, ‘శ్రామణులు’ (Sramanas: సంచార సన్యాసులు), పేదవారికి, కష్టాలపాలు అయిన వారికి, చివరకు సేవకులకు, బానిసలకు కూడా సౌజన్యం చూపించారు. ఈ నా ఆజ్ఞలు నా పుత్రులు, మనవళ్లు, మునిమనవళ్ల కాలంలో కూడా నిలిచి ఉంటాయని నా నమ్మకం. అలాగే సూర్య చంద్రులు ప్రకాశించేవరకు కూడా! వీటిని పాటిస్తే వారు ఈ లోకంలోనే గాక, పైలోకంలో కూడా ఎంతో సంతోషంగా ఉండగలరు.”

పైన వివరించిన శాసనంలో అశోకుడు తన రాణులు, అంతఃపుర స్త్రీలు ఇచ్చిన బహుమతులు, దానాలు ఉత్తమ ప్రజలకు, యోగ్యులకు అందజేసినట్లు తెలుస్తుంది. ఆయన పాలన 27 వ సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి రాజ అతఃపురంలో కొన్ని మార్పులు చోటుచేసుకొనటం జరిగింది.

‘రాణి కౌరవాకి’ శాసనం

ఈ మార్పులు ఎలా చోటుచేసుకున్నాయో ఇదమిద్ధంగా తెలియదు గాని వీటికి ముఖ్య కారణం అశోకుడి ద్వితీయ రాణి ‘కౌరవాకి’ (కౌరవాకి: Kauravaki) అని ఒక శాసనం ద్వారా ధ్రువపడింది. ‘రాణి శాసనం’ (Queen's Edict) గా పేరొందిన ఈ శాసనం అలహాబాదులో నెలకొల్పబడిన స్థంభం మీద చెక్కబడి ఉంది. ఈ శాసనం ఈ క్రింది విధంగా ఉంది.

“దేవనామ ప్రియదర్శి ఆజ్ఞ ప్రకారం మహామాత్రలు రెండవ రాణి ఏమేమి బహుమతులు ఇచ్చిందో అనే సంగతి అన్ని చోట్ల ఉన్న ప్రజలకు తెలియ చెప్పాలి. ఈ బహుమతులు, మామిడి తోటలు, సన్యాసుల మఠాలు, భిక్ష-గృహాలు, వగైరా.....వీటినన్నిటిని ఈ రాణి పేరనే నమోదు చేయాలి. ఈ అభ్యర్ధన ‘తీవల’ (Tivala; Tivara) తల్లి, రెండవ రాణి ‘కౌరవాకి’/‘కురువాకి’ (Kauravaki/Kuruvaki) కి చెందినది.”

[తీవల అశోకుడికి రెండవ రాణి ' కౌరవాకి/కురువాకి' ద్వారా కలిగిన పుత్రుడు.] యదార్ధానికి ఈ రాణి కౌరవాకి (కురువాకి) ఒక సామాన్యమైన, తీసివేయదగిన వ్యక్తి కాదు. ఈమె తాను ప్రజలకు బహుమతులను ఇచ్చే రాణిగా రాజ్యమంతా తెలియాలి అనే కోరిక బలీయంగా ఉంది. ఆమె తన ఈ కోరికను రాజుకు (అశోకుడికి) తెలియజేస్తుంది; ఆయన తన అధికారులను ఆమె కోరికను నెరవేర్చమని ఆదేశించటం జరుగుతుంది; వారు ఆమె కోరిన విధంగా అమలుపరుస్తారు. ఆమె కోరికను తిరస్కరించగలిగే ధైర్యం ఆయనకు లేదు అనేది తేటతెల్లమవుతుంది.

అశోకుడిలో మార్పులు

మౌర్య చక్రవర్తిగా గద్దెనెక్కిన తరువాత సుమారు 25 ఏళ్ళు అశోకుడు అనేక అవతారాలలో దర్శనం ఇచ్చాడు. కళింగయుద్ధం వరకు అమిత క్రూరుడైన రారాజు; కళింగులమీద విజయం తదుపరి పశ్చాతాపం చెందిన చక్రవర్తి; అహింసను బోధించి, ప్రోత్సహించి, వ్యాప్తి చేసిన పాలకుడు; ఆటవిక (అడవులలో నివసించే) ప్రజలను నిర్దాక్షిణ్యంగా హింసించే దురహంకారి అయిన రాజు; లుంబిని ని దర్శించిన పవిత్ర బౌద్ధ యాత్రికుడు; భార్య కోరికలకు మద్దతు తెలిపి వాటిని అమలు చేయించే సహచరుడు (భర్త).

ఆయన పరిపాలనా కాలంలో అనేక వర్గ ప్రజలను కలవటం జరిగింది. వీరిలో అధికారులు, లేఖకులు, రచయితలు, పొరుగు రాజ్యాధినేతలు, సనాతనధర్మ (హిందుత్వ) ఋషులు, పురోహితులు, జైనులు, బౌద్ధులు, గాంధార దేశపు మాంసాహారులు; వివిధ మత సన్యాసులు, సన్యాసినులు, తపస్విని లు, మొదలగువారు ముఖ్యులు.

అనేక శాసనాలతో నిండిన ధర్మ స్థంభాలను, బౌద్ధ విహారాలను (ఆరామాలను) నెలకొల్పిన తరువాత అశోకుడి స్వరం ఒక్క సారిగా మూగబోయింది. అనేక ఏళ్ల పాటు ఆయన నుంచి తన అధికారులకు, ప్రజలకు వెళ్లే సందేశాలు ఆకస్మికంగా ఆగిపోయాయి. తనకు తన ప్రజలకు మధ్య ఉన్న సంబంధం, అనుబంధం, ఆత్మీయత, ఇతర బంధాలు ఆయన జీవిత సంధ్యాసమయంలో (twilight years) అసంతృప్తి దశలో పూర్తిగా తెగిపోయాయి. ఈ ఆకస్మిక నిశ్చబ్ధం ఆశ్చర్యకరమైన విషయం!

ఎందుకు? ఏమయింది? ఏమి జరిగింది? అప్పటికి అశోకుడు జీవించే ఉన్నాడు; అప్పటికి ఆయన సింహాసనం మీద ఉన్నది 27 ఏళ్లే. అప్పటినుంచి ఆయన పాలన ఇంకా 10 ఏళ్ళు సాగింది. అంటే క్రీ.పూ. 232 వరకు. ఈ పది ఏళ్లలో ఏమి జరిగింది?

(వీటిని వచ్చే సంచికలో పరిశీలిద్దాము, తెలుసుకుందాము.)

Sanchi-King-Ashoka-with-his-Queens
Photo Credit: Wikimedia Commons

తనకు ఇరువైపుల భార్యలు కౌరవాకి, అసంధిమిత్ర లతో (సాంచి) అశోకుడు (మధ్యలో); రాణులకు ప్రక్కన నిలబడి ఉన్న ఇద్దరు చెలికత్తెలు, క్రింద కూర్చున్న మరో చెలికత్తె.

Emperor-Ashoka-and-his-Queen-at-the-Deer-Park
Photo Credit: Wikimedia Commons

మహారాణి అసంధిమిత్ర తో అశోకుడు. (ఆధారం: సాంచి లో ఉన్న Deer Park లో ఉన్న శిల్పాలు)
Ashoka-Pillar-at-Feroze-Shah-Kotla-Delhi
Photo Credit: Wikimedia Commons

ఏడవ ధర్మ స్థంభం కుడి వైపున ఉన్న అశోకుడి శాసనంలోని కొంత భాగం

అశోకుడి శేషజీవితంలోని మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వచ్చే సంచికలో తెలుసుకుందాము.

మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు నా ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com

****సశేషం****

Posted in May 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!