Menu Close

Science Page title

అసలు వజ్రాలు, నకిలీ వజ్రాలు

వజ్రాలు ధగధగ మెరుస్తాయి కనుక వాటికి ఆ ఆకర్షణ వచ్చింది. అలా మెరవటానికి కారణం వజ్రంయొక్క విక్షేపక సామర్ధ్యం (dispersive capacity) చాల ఎక్కువ. విక్షేపక సామర్ధ్యం అంటే ఏమిటి? కాంతి కిరణం వజ్రంలో ప్రవేశించినప్పుడు కాంతిలో ఉన్న “సప్త” వర్ణాలు విడిపోయి ఎవరికివారే అన్నట్లు అన్ని దిశలలోనూ, వివిధమైన వేగాలతో ప్రయాణం చెయ్యగలిగే సమర్ధత. నిపుణులు వజ్రాలని మలచినప్పుడు కాంతి ఎన్నో రంగులుగా విడిపోయి అవి అన్ని దిశలలోకీ చెల్లాచెదురయేటట్లు చేస్తారు. అందుకే వజ్రానికి ఆ ధగధగ!

ఒకానొకప్పుడు వజ్రాలు విరళం, అపురూపం. మహరాజుల కిరీటాలలో కాని, సింహాసనాలలో కాని పొదగబడేవి. అందరికీ లభ్యం అయేవి కావు. అందుకని వాటికి బజారు ధర అంటూ ఏదీ ఉండేది కాదు. ఈ రోజుల్లో అసలు వజ్రాలు పూర్వపు రోజుల్లోలా అపురూపం కాదు కనుక వాటి ధర అంత ఎక్కువ ఉండవలసిన అవసరం లేదు. కాని వజ్రాల వర్తకులు కూడబలుక్కుని వజ్రాల సరఫరా అదుపులో పెట్టి వాటి ధర ఎక్కువ పలికేటట్లు చేస్తున్నారు. పైపెచ్చు “వజ్రం ప్రేమకి చిహ్నం,” “ప్రేమ లాగే వజ్రాలు కూడ శాశ్వతం” అని ఒక పుకారు లేవదీసి, ప్రేమలో పడ్డ కుర్రాళ్లకి కిర్రెక్కించి వజ్రాల గిరాకి పడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. వజ్రాలే కాదు, వైడూర్యాలూ శాశ్వతమే, ప్లేస్టిక్‌తో చేసిన పాల సంచులూ శాశ్వతమే అన్న విషయం మనం మరచిపోకూడదు.

ప్రకృతిసిద్ధంగా దొరికే వస్తువులన్నిటిలో వజ్రం ఎక్కువ కఠినమైనది. అందుకని పరిశ్రమలలో వజ్రానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇంత కఠినంగా ఉండే పదార్థం ప్రేమకి ఎలా చిహ్నమౌతుంది?

ప్రియురాలికి ప్రేమని చాటాలంటే వజ్రాల దుద్దులు, వజ్రపు ఉంగరం, వజ్రాల తావళం బహుమతిగా ఇవ్వాలనే ఆచారం అనాదిగా ఉన్నది కాదు; ఈ మధ్య వజ్రపు వ్యాపారులు పుట్టించినది. దక్షిణ ఆఫ్రికాలో, సా. శ. 1870 లో, బ్రిటిష్ వాళ్లకి వజ్రపు గనులు కనిపించేయి. అంతవరకు వజ్రాలు చాల అపురూపం. సామాన్యులకి అందుబాటులో ఉండేవి కావు; కనుక వాటి బజారు ధర ప్రసక్తే లేదు. కొత్తగా కనుక్కున్న గనులలో వజ్రాలు కొల్లలుగా కనిపించడంతో అవి అందరికీ అందుబాటు ధరలోకి వచ్చేయి. ఇన్ని వజ్రాలు ఒక్క సారి బజారున పడితే వాటి ధర పడడం ఖాయం. అందుకని ఆ గనులలో పెట్టుబడి పెట్టిన వాటాదారులు కూడబలుక్కుని, డి బీర్స్ అనే కంపెనీ పెట్టి, ఆ వజ్రాల సరఫరాని అదుపులో పెట్టాలని నిశ్చయించుకున్నారు.

సరఫరాని అదుపులో పెడితే సరిపోదు కదా. ఉన్న వజ్రాలని ప్రజల చేత కొనిపించాలి. అందుకని డి బీర్స్ అమెరికాలో ఉన్న “ఎన్. డబ్ల్యు. ఏయర్స్” అనే పౌర సంబంధ కంపెనీని ఆశ్రయించి వారిచేత వ్యాపార ప్రకటనలు తయారు చేయించేరు. ఈ కంపెనీ చెయ్యవలసిన పని వజ్రాలు అమ్మడం కాదు, బజారులో ఒక షాపుకి ప్రజలని రప్పించడం కాదు; వారు చెయ్యవలసినదల్లా ఒక ఊహని అమ్మడం. ఏమిటా ఊహ? ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ప్రేమించేడనడానికి ఋజువు తోటలో స్టెప్పులు వెయ్యడం కాదు, విరహవేదనతో యుగళ గీతాలు పాడడం కాదు. నిజమైన ప్రేమని చాటాలంటే వజ్రం తోటే చాటాలి. ఈ భావాన్ని ప్రజలకి అమ్మాలి. ఏయర్స్ కంపెనీ వారు రంగంలోకి దిగేరు. రకరకాల కలం పేర్లతో పత్రికలలో కథలు, వ్యాసాలు ప్రచురించేరు. తెర తారల వేళ్లకి వజ్రాల ఉంగరాలు, మెడలలో తావళాలు ఉన్నట్లు రంగురంగుల బొమ్మలు వేయించేరు. ఆ వజ్రాల పరిమాణం ఎంతో, విలువెంతో ప్రచారం చేసేరు. ప్రియురాలికి ఇచ్చే వజ్రం మీద ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత ప్రేమ అనుకునేటట్లు కథలు అల్లి ఈ లోకాన్ని మభ్యపెట్టింది ఆ కంపెనీ. “ఎ డయమండ్ ఈజ్ ఫర్ ఎవర్” (a diamond is forever) అనే నినాదం 1949 నాటికి అందరి నోటా నానే ఒక సామెతగా రూపొందింది. సామాన్యులు కూడా అప్పో, సొప్పో చేసి ప్రియురాలికి వజ్రపు ఉంగరం కొనకపోతే అదేదో మహా పాపంలా భావించేవారు. ఈ ధోరణి ఇప్పటికీ తగ్గలేదు.

అమెరికా ప్రభుత్వం వ్యాపార రంగంలో గుత్తాధిపత్యం ఎవ్వరికీ ఉండకూడదని నిబంధనలు (antitrust laws) జారీ చెయ్యడంతో డి బీర్స్ కంపెనీ ఆటలు సాగలేదు. ఇప్పుడు వజ్రాల వ్యాపారంలో దరిదాపు గుత్తాధిపత్యం సంపాదించినది రష్యా దేశపు “అల్‌రోజా” అనే కంపెనీ. వజ్రాల ధరలు పడిపోతున్నాయని ఈ కంపెనీ వజ్రాల సరఫరాని డిసెంబరు 2008 లో ఆపివేసింది. “ధరని నిలబెట్టలేకపోతే వజ్రానికి విలువెక్కడుంది? అది కేవలం బొగ్గే కదా!” అన్నాడుట అల్‌రోజా తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతూ ఒక వ్యక్తి.

మరి పేదవాడు తన ప్రేమని ఎలా చాటుతాడు? ఈ వెలితిని పూడ్చటానికి ఈ రోజుల్లో జనతా వజ్రాలు – క్యూబిక్ జర్కోనియా - సులభంగా విపణివీధిలో దొరుకుతున్నాయి. ఈ నకిలీ వజ్రాలని ప్రయోగశాలలో తయారు చెయ్యవచ్చు. అసలువాటి కంటె ఈ నకిలీ వజ్రాల విక్షేపక సామర్ధ్యం ఎక్కువ. అందుకని ఇవి అసలువాటి కంటె బాగా మెరుస్తాయి. అసలు వజ్రాలలో లోపాలు ఉంటాయి. ఈ నకిలీ వజ్రాలని ఏ లోపాలు లేకుండా చాల అందంగా, ఏ ఆకారంలో కావలిస్తే ఆ ఆకారంలో చెయ్యవచ్చు. పైపెచ్చు అసలు వాటితో  పోల్చితే ఇవి చచ్చు చవక. నా దగ్గర ఈ రకం నకిలీ వజ్రపు ఉంగరం ఉంది. నా శ్రీమతి నాచేత కొనిపించింది తప్ప తను కొని ఇవ్వనంది. తనే కొనిస్తే తన ప్రేమని చవకబారు ప్రేమ కింద జమ కట్టెస్తానేమోనని భయం ట.

అసలు వజ్రాల కంటె ఈ నకిలీ వజ్రాలు అందంగా ఉండటంతో ఒక చిక్కు వచ్చి పడింది. వజ్రాల ప్రసక్తి వచ్చేసరికి “అందం ముఖ్యమా? వెల ముఖ్యమా?” అని ప్రజలని అడిగితే వెలకే ఓట్లు పడ్డాయి. అసలు వజ్రపు తావళం వెల ఎక్కువగా ఉండటానికి కారణం ఆ తావళం అందమూ కాదు, ఆ తావళంలో ఉన్న బంగారపు వెలా కాదు; వజ్రాల వెల ఎక్కువగా ఉండటం.

క్యూబిక్ జర్కోనియాతో వచ్చిన మరొక చిక్కు ఏమిటంటే నిజానికి ఇది వజ్రం కంటె అందంగా ఉంటుందేమో, “ఇంత అందంగా ఉన్న వజ్రం, ఇంత పెద్ద వజ్రం, ఈ గొట్టం గాడు ఎలా కొనగలడు, కనుక ఇది మూడొంతులు నకిలీదే అయుంటుంది” అని నకిలీ వజ్రాలు ధరించిన వారిని మొహమాటం లేకుండా ముఖం మీదే అడిగెస్తున్నారు. అందుకని ఇప్పుడు శాస్త్రవేత్తల ముందు ఉన్న సవాలు ఏమిటంటే – క్యూబిక్ జర్కోనియా అందం ఒక్క రవ తగ్గించి నిజం రవ్వలలా కనిపించేటట్టు చెయ్యటం. అప్పుడునిజం రవ్వలేవో నకిలీ రవ్వలేవో చెప్పటం నిజంగా కష్టం!

Posted in April 2020, Science

1 Comment

  1. Siva

    మరి రశుల ప్రకారం వజ్రం ధరించడం శుద్ధ దండగేననమాట 👌

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!