ఈ వివరాలు విన్న విజయన్ మనస్సు అనేకానేక భావనలతో నిండిపోయింది. అమ్మకు మరోసారి నమస్కారం చేసి బయలుదేరాడు. "మిగతా ముగ్గురి పరిస్థితి ఎలా ఉందో… వారు తమ అన్వేషణ లో ఎంతవరకు పురోగతి సాధించారో… ఒకసారి విచారణ చేస్తే బాగుండును" అనిపించింది. రాఘవరావు కు ఫోన్ చేద్దాం అని ఫోన్ చేతిలోకి తీసుకునే లోగా అదే మోగింది. అటు నుంచి నగేష్ ఫోన్ చేసాడు. "విజయన్ చేస్తున్న ప్రయత్నాలకు సంతృప్తి చెందుతున్నట్లు చెప్పి, నసీర్ బృందం ఈశాన్య భారత అడవుల్లో ఆటవికుల బాణాలకు ప్రాణాలు కోల్పోయిన విషయం" తెలియజేశాడు.
విజయన్ కు పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించింది. పుంజుకుంటున్న వ్యాపారం, పెరుగుతున్న తన పరపతి కళ్ళముందు నిలిచాయి. నగేష్ చెపుతున్న విషయాలపై ఆసక్తి పోయింది. ఇక్కడ తను చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడో ఉన్న నగేష్ కు ఎలా తెలిశాయి? నసీర్ బృందం మొత్తం నశించిపోయింది అంటే ఆ హారం ప్రభావం అనుకోవాలా? యాదృచ్చికంగా జరిగింది అనుకోవాలా? ఆలోచిస్తూ అన్యమనస్కంగానే ఊఁ కొడుతూ వచ్చాడు. నసీర్ మరణవార్త కు విజయన్ దిగ్భ్రాంతుడైనట్లు నగేష్ గ్రహించాడు. విజయం కలగాలని ఆశిస్తున్నట్లు తెలియజేసి ఫోన్ పెట్టేసాడు. నగేష్ ఫోన్ పెట్టేసిన విషయం కూడా గమనించలేదు విజయన్. అంతకు ముందే అమ్మవారి ఉగ్రరూపాన్ని ప్రత్యక్షంగా తిలకించిన తాను ఈ పని నుండి తప్పుకోవడమే మేలు అని గ్రహించాడు. కానీ, ప్రయత్నాన్ని ఆపేస్తున్నట్లు నగేష్ గమనించకుండా జాగ్రత్త తీసుకోవాలి అనుకున్నాడు.
*******
అధికారికంగా మరోసారి పెద్దలందరి ఎదుటా శుభకార్యం జరిపించుకున్న మోహన్, సుధలు ఆరోజు శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయడానికి సకుటుంబ సపరివార సమేతంగా ఒక బస్సు, మూడు కార్లలో అన్నవరం బయలుదేరి వెళ్ళారు. చక్కగా వ్రతం పూర్తి చేసుకుని, స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. తిరిగి వస్తుండగా సుధ అనారోగ్యానికి గురైంది. రెండు రోజులుగా ఇంట్లో హడావిడులు, అంతకు ముందు వారమంతా బయట తిరిగి వచ్చారు. రాత్రి సరిగా నిద్రలేకపోవడం వలన కాస్త సొమ్మసిల్లింది సుధ. చల్లని నీళ్లతో మొహం తుడిచి, కొబ్బరినీళ్లు తాగించి, ఉపచర్యలు చేసేసరికి కోలుకుంది. తిరిగి ఇంటికి అందరూ చేరుకున్నారు. ఇంటికి వచ్చేసరికి మధు, లక్ష్మి వచ్చి ఉన్నారు. జరిగినదంతా తెలుసుకుని, సుధ, మోహన్ లను ఆటపట్టించారు మధు లక్ష్మి.
******
మరకత మణి హారం అన్వేషణ లో ఒకరు మరణించారు, ఒకరు విరమించారు. మిగతా వారి పరిస్థితి ఏమిటో… వారి ప్రణాళిక ఏమిటో… మరకత మణి హారం దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో… ఇంతకీ అసలు ఆ హారం ఉందో లేదో…
*****
సుధ, మోహన్, మధు ముచ్చట్లాడుకుంటూ ఉండగా, మధును సైగ చేసి పిలిచింది లక్ష్మి. "సరే" అన్నాడు మధు.
"ఏమిటిరా? ఏమిటి మీ సైగలు? "మనసున ఉన్నది చెప్పాలనున్నది…' అంటోందా మీ శ్రీమతి" నవ్వుతూ అడిగాడు మోహన్.
"అదేం లేదురా… నీతో ఓ విషయం మాట్లాడాలి… ఓసారి అలా బయటకు వెళదామా?" అడిగాడు మధు.
"దానికి రహస్యంగా సైగలెందుకురా బాబూ… పద వెళదాం" అని, సుధకు, తల్లిదండ్రులకు, మధుతో బయటకు వెళ్తున్నట్లు చెప్పి, బయలుదేరాడు మోహన్.
గదిలో లక్ష్మి, సుధ మాత్రమే మిగిలారు. విషయమేమిటన్నట్లు చూసింది సుధ.
"మనం విశాఖపట్నం బీచ్ లో మధు వాళ్ళ బాబాయి రాఘవరావు గారిని చూసాం, నీకు జ్ఞాపకం ఉందా?" అడిగింది లక్ష్మి.
"ఊఁ, అయితే?"
"ఆయన ఏదో వ్యాపారం ఇక్కడ కొత్తగా మొదలుపెడుతున్నారట. మా వారిని చేరమని అడిగారు. కొందరు ఆసక్తి ఉన్న కొత్తవారు కావాలన్నారు. అందుకే ఆ వ్యాపారం గురించి మధు, మోహన్ తో మాట్లాడుతున్నారు. ఎలాగూ ఇక్కడికి వచ్చేసారు కదా, ఆసక్తి ఉంటే మావారితో కలిసి వ్యాపారం చేయవచ్చు." వివరించింది లక్ష్మి.
"బావుంది కానీ, మొదట్లో కొన్ని రోజులు ఇక్కడ లెక్చరర్ గా, తర్వాత నాకోసం విశాఖపట్నంలో ఆఫీస్ లో పనిచేశారు. ఇప్పుడు వ్యాపారం అంటే ఏమంటారో..?" సందేహం వ్యక్తం చేసింది సుధ.
"చూద్దాం, మాట్లాడుతున్నారు కదా!" అంది లక్ష్మి.
ఇంతలో మధు, మోహన్ తిరిగి వచ్చారు.
"ఏమిటోరా… నా దారి ఎడారి… నా పేరు బికారి… అన్నట్లుంది. మొదట ఇక్కడ లెక్చరర్ ఉద్యోగం, తర్వాత వైజాగ్ లో ఆఫీస్ పని, ఇక్కడికి వచ్చాక మళ్ళీ అదే కాలేజికి వెళ్లి అడుగుదాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు వ్యాపారం అంటున్నావు. పైగా నేను చేయాల్సిన పనేమో కుర్రాళ్లను చేర్చుకోవడం మాత్రమే అంటున్నావు. ఏమిటో… ఏమి అర్ధంకాకుండా ఉంది. కొంచెం ఆలోచించి చెప్తానురా!" అన్నాడు మోహన్.
మరి కాసేపు కూర్చుని, మాట్లాడి వెళ్లిపోయారు లక్ష్మీ, మధులు. వచ్చిన బంధువులు కూడా ఒకరొకరుగా వెళ్లిపోయారు. సుధ తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. సుధని, మోహన్ ని తమతో తీసుకువెళ్తామని విజయ ప్రభాకరరావులను అడిగారు. గత నాలుగు రోజులుగా అలసిపోయి ఉన్నారు, పైగా నిన్న సుధ కాస్త అస్వస్థతకు గురైంది కాబట్టి, ఒక్క రెండు రోజులు అందరూ విశ్రాంతి తీసుకున్నాక, అప్పుడు సుధ, మోహన్ లను తీసుకువెళ్ళమని చెప్పారు మోహన్ తల్లిదండ్రులు. పిల్లల మీద వారికి ఉన్న అభిమానానికి సంతోషించారు ఉమ, మహేశ్వరరావులు. కానీ అక్కడ పనులు నిలిచిపోవడం వలన, రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి తీసుకువెళ్తామని, ఇప్పుడు బయలుదేరి వెళ్తామని చెప్పారు. సుధ, మోహన్ లకు, వారి ఇంటికి తీసుకువెళ్ళే విషయం చెప్పి, అనుమతి తీసుకుని, బయలుదేరారు ఉమామహేశ్వరరావులు.
సుధకు బడలిక ఇంకా తీరనందున త్వరగా భోజనం చేసి నిద్రపోయింది. మధు చెప్పిన వ్యాపారం విషయం గురించి ఆలోచించి, తండ్రితో ఈ విషయం మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు మోహన్. తాను కూడా త్వరగా నిద్రపోయాడు.
****
గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలలో తన అన్వేషణ ప్రారంభించాడు జేమ్స్. ఒకప్పుడు సౌరాష్ట్ర గా పేరు పడిన ప్రాంతం గుజరాత్, మహారాష్ట్ర. ఘుర్జరులు ప్రతీహారులు, శివాజీ మహరాజ్, రాజపుత్రులు, శాతవాహనులు ముఖ్యంగా గౌతమీ పుత్ర శాతకర్ణి తదితరులు పాలించిన ప్రాంతం. అప్పట్లో సంస్కృతికంగా అత్యున్నత స్థితిలో ఉండేది. వివిధ దేవాలయాలు, అద్భుతమైన కోటలు, రాజమందిరాలు, కట్టడాలు నిర్మించారు. విపరీతమైన సంపదలతో తులతూగిన ప్రాంతం. కానీ తాను చేసిన మరకత మణి హారం ఈ ప్రాంతంలో లభిస్తుందా అన్నది సందేహమే. ఎందుకంటే వివిధ దండయాత్రలలో అనేక హిందూ దేవాలయాలు దోపిడీకి గురయ్యాయి. కానీ ఈ హారాన్ని బ్రిటిష్ పాలకులు చూసారు కాబట్టి దోపిడీకి గురి కాకుండా ఉందన్నమాట. ఆ హారం ఆకారం మారిపోకుండా, హారం నుంచి మరకతమణి తొలగించబడకుండా ఉండాలి.
తనకు దేవుని హారం, పాపం వంటి నమ్మకాలు లేవు కాబట్టి, తనలాంటి మరో ఇద్దరు కఠినాత్ములైన అనుచరులను మాత్రమే తీసుకుని, ఒక జీప్, దానిలో ముఖ్యావసరాలు, ఆయుధాలు పెట్టుకుని బయలుదేరాడు. వారిద్దరికీ నగ నమూనా చూపించాడు. అది కనుక దొరికితే అటు నుంచి అటే బొంబాయి లేదా గుజరాత్ రేవుల నుంచి విదేశాలకు వెళ్ళిపోయి, అక్కడ అమ్మేసి వచ్చిన సొమ్ము పంచుకుందాం అని చెప్పాడు. ప్లాన్, ధన సహాయం తనది కనుక 40 - 30 - 30 శాతాలలో పంపకాలు చేసుకోవాలని చెప్పాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. వారిద్దరూ విక్టర్, డేవిడ్. ఇద్దరూ చూడటానికి నవ నాగరికుల్లా, స్టయిల్ గా ఉంటారు. వారిద్దరిదే జీపు నడిపే బాధ్యత. ఒకరు జీపు నడిపితే మరొక వ్యక్తి వెనుక విశ్రాంతి తీసుకుంటాడు. ఇద్దరూ అలిసిపోయినపుడు జేమ్స్ కాసేపు నడపడమో లేదా సరైన స్థలంలో విశ్రాంతి కొరకు ఆగడమో చేసేవారు. దొరికిన చోట తినడం, తిరగడం, వెతకడం ఇదే పని. రెండు నెలలుగా వారు ఇదే పనిలో ఉన్నారు. అంత త్వరగా అన్వేషణ పూర్తి కాదని తెలుసు. అయినా ఓపికతో వేచి చూస్తున్నారు. వచ్చే సొమ్ము తక్కువ కాదు. ఎన్నో దేవాలయాలు సందర్శించి, అక్కడ ఆభరణాల వివరాలు, రక్షణ చూసే అధికారులకు లంచం ఇచ్చి, తర్వాత బెదిరించి ఆ ఆభరణాల చిత్రాలు సంపాదించేవారు. వాటిలో తమ దగ్గర ఉన్న నగను లేదా మణిని పోలిన నగ వెదికేవారు. ఒక్కొసారి ఆలయ అధికారులు లంచానికి లొంగకపోతే వారి కుటుంబ సభ్యులకు హాని కలిగించి మరీ బెదిరించాలని అనుకున్నారు. అయితే ఎక్కడా కూడా అసలు నగలను చూపమని లేదా ఇవ్వమని అడగలేదు కాబట్టి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు.
విశాలమైన ఎడారి ప్రాంతంలోకి ప్రవేశించారు జేమ్స్ బృందం. ముందే తెలిసి ఉండటంతో ఆహారం, నీళ్లు వగైరాలు సమృద్ధిగా జీపులో పెట్టించాడు జేమ్స్. చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక ఎడారి తండాను కనిపెట్టారు. ఎడారులలో పగలు ఎంత వేడి ఉంటుందో రాత్రి అంత చలి ఉంటుంది. పైగా అనుకోకుండా ఇసుక తుఫానులు ముంచెత్తుతాయి. అప్పటివరకు ఉండే మైదాన ప్రాంతంలో ఇసుక దిబ్బలు చేరుతాయి. నిత్యం ప్రయాణించే తండాల వారు తప్ప ఎడారి వాతావరణం అంచనా వేయలేరు. ప్రపంచంలోని మిగతా ఎడారుల కంటే థార్ ఎడారిలో జనసాంద్రత ఎక్కువ. ఒయాసిస్సులు ఉన్నచోట తండాల వారు తమ జంతువులతో సహా జీవిస్తూ ఉంటారు. కొద్దిపాటి వ్యయసాయం కూడా చేస్తూ ఉంటారు.
జేమ్స్ బృందం అలాంటి ఓ తండాకు చేరుకున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి పర్యాటకులు తండాలకు రావడం పరిపాటి కాబట్టి వారు పెద్దగా ఆశ్చర్యపోలేదు. తండా పెద్ద వచ్చి జేమ్స్ ను కలిసాడు. జేమ్స్ ఆ రాత్రి తమకు కావలసిన సౌకర్యాలను గురించి అడిగాడు. వీలైనంత వరకు వసతి, భోజన సౌకర్యాలు అమరుస్తానని చెప్పాడు పెద్ద. విక్టర్ కు, డేవిడ్ కు ఎడారిలో లభించే మత్తు పానీయం కూడా తాగాలనిపించింది. వాటి గురించి కూడా చెప్పారు. అవి కూడా ఏర్పాటు చేస్తానన్నాడు పెద్ద. అయితే ఎక్కువ సొమ్ము అడిగాడు. తమకు రాబోయే సొమ్ముతో పోల్చితే ఇవేవి పెద్ద ఖర్చు కాదు కాబట్టి సరేనన్నారు. భోజనం సిద్ధమయ్యే లోపు వసతి చూపించాడు.
తమ సామాన్లు అక్కడ పెట్టి, తండా చుట్టి వస్తామని బయలుదేరారు ముగ్గురూ. ఆ తండా పెద్దది. రెండు వందలు దాటి గుడిసెలు ఉంటాయి. ఒక్కో గుడిసెకు ఆరేడు మంది నివసిస్తారు. ఆసక్తిగా చూస్తూ వెళ్తున్నారు. రంగు రంగుల దుస్తులు, పాలిష్ చేసిన ఎముకలతో చేసిన ఆభరణాలు ధరించిన అమ్మాయిలు ఆకర్షణీయంగా కనిపించారు. ఆరేళ్ళ పిల్ల మొదలు అరవయ్యేళ్లు దాటిన వృద్ధ మహిళల వరకు ఒకే రకమైన వస్త్రధారణ. వయసులో ఉన్న అమ్మాయిలను చూసేసరికి విక్టర్, డేవిడ్ లకు మనసులో కాస్త అలజడి రేగింది. రెండు నెలలు పైగానే జీపులో కాపురం. జనావాసాల్లో తిరిగినా, ఇలా అందమైన అమ్మాయిల వైపు మనసు ఎప్పుడూ పోలేదు.
జేమ్స్ ఇవేవి గమనించలేదు. ఒక దిశ నుంచి వస్తున్న స్త్రీలను పరిశీలిస్తున్నాడు. బహుశా అటువైపు దేవాలయం ఏదో ఉన్నట్లుంది. వెనక్కి తిరిగి, వేరేవైపు అడుగులు వేయబోతున్న విక్టర్, డేవిడ్ లను హెచ్చరించి, ఆ దిశగా బయలుదేరాడు. ఉసూరుమంటూ జేమ్స్ ను అనుసరించారు ఇద్దరూ…
అక్కడ భగవతి అమ్మవారి ఆలయం ఉంది. ఆలయం అంటే పెద్ద ఆవరణలాంటిదేది ఉండదు. అది కూడా ఒక గుడిసె. ఖర్జురపు ఆకులతో పైకప్పు నేయబడి ఉంది. వంగి లోపలకు వెళ్ళాలి. జేమ్స్ లోపలికి వెళ్ళడానికి సంశయించాడు. కానీ వెళ్లకపోతే విషయం తెలీదు. ధైర్యం చేసి, మనసు చిక్కబట్టుకొని లోపలికి ప్రవేశించాడు. లోపల విశాలంగానే ఉంది. కొందరు స్త్రీలు పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తున్నారు. ఆ వాతావరణం జేమ్స్ కు చికాకుగా అనిపించింది. అయినా తప్పదు. ఆ పొగలకు ముక్కు మూసుకుంటూ, విగ్రహం వైపు తేరిపార చూసాడు. అంతే. కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లైంది. అమ్మవారి మెడలో హారం అచ్చంగా మరకతమణి హారాన్ని పోలి ఉంది. మధ్యలో అరచేయి కంటే పెద్దదైన ఎర్రని రాయి కాంతులీనుతూ కనిపించింది. ఎన్నో ఏళ్ల నుంచి అలా ఉందేమో, వెలిసిపోయి ఉంది. నగ బంగారమా కాదా పోల్చలేదు. డిజైను సరిపోయిందో లేదో చూసుకోలేదు. ఎర్రని ఆ రాయి మాత్రమే సూదంటురాయిలా జేమ్స్ ని ఆకర్షిస్తోంది. గబగబా బయటకు వచ్చాడు.
విక్టర్, డేవిడ్ అక్కడ కనిపించలేదు. వారిని వెతికే సమయం కానీ, పిలిచే అవసరం కానీ లేదు. పరుగు పరుగున తన వసతి గదికి వెళ్ళాడు. బేగ్ లో నుంచి చిత్రాన్ని బయటకు తీసాడు. అదే ఆకారం. అదే డిజైను. మధ్యలో అరచేతి కంటే పెద్దదైన మణి. నలుపు తెలుపుల్లో ఉన్న ఆ చిత్రం, భగవతి అమ్మ మెడలో హారం ఒకటే అని కచ్చితంగా అనిపించేసరికి పట్టలేనంత ఆనందం కలిగింది. గబగబా ఆ చిత్రం తీసుకుని బయటకు వచ్చాడు. మళ్ళీ దేవాలయం వైపు వెళ్ళాడు.
దారిలో ఒక నడక దారి పక్కగా ఏవో మాటలు, మూలుగులు వినిపించాయి. తనకెందుకులే అని వెళ్లిపోబోతూ, ఆ గొంతు డేవిడ్ స్వరంలా అనిపించి అటువైపు అడుగులు వేసాడు. కొంత దూరం నడిచి, మాటలు వినిపిస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడ కాలిబాట లేదు. రక్కసి ముళ్ళ పొదలు ఉన్నాయి. బహుశా ఒకప్పుడు అక్కడ ఒయాసిస్సు ఉండేదేమో. అక్కడ విక్టర్, డేవిడ్ ఇద్దరూ ఇద్దరమ్మాయిలను నోరు నొక్కి, చేతులు కట్టి, అత్యాచారానికి ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయిలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. జేమ్స్ కి చాలా కోపం వచ్చింది. వచ్చిన పని మరచిపోయి, ఇలా అమ్మాయిల కోసం వెంపర్లాడటం నచ్చలేదు. వెంటనే ఇద్దర్నీ కేకేశాడు. ఇద్దరూ ఒక్క క్షణం వాళ్ళు చేస్తున్న పని ఆపి, వెనుదిరిగి చూసారు. జేమ్స్ కోపంగా ఉన్నాడు. అతడి చేతిలో నగ నకలు ప్రతి ఉంది. అమ్మాయిలను అక్కడే వదిలేసి వచ్చారు.
"ఏమిటి జేమ్స్?" అన్నాడు విక్టర్.
"మన అన్వేషణ పూర్తికావచ్చింది. విజయం సాధించబోతున్నాం. అప్పుడు మన చుట్టూ అమ్మాయిలే. త్వరగా వారిని విడిచిపెట్టి రండి." అన్నాడు జేమ్స్.
"ఇక్కడా? ఇక్కడా హారం ఉంది? నువ్వు చూసావా?" అడిగాడు ఆత్రంగా డేవిడ్.
"అవును డేవిడ్. అక్కడ భగవతి అమ్మ దేవాలయం ఉంది. ఆ దేవత మెడలో ఇదే హారం ఉంది. నాతో రండి." అన్నాడు జేమ్స్.
అమ్మాయిలను అక్కడ అలాగే వదిలేసి, ముగ్గురూ పరుగుపరుగున భగవతి అమ్మ దేవాలయం వైపు వెళ్లారు. చెప్పులు కూడా విడవకుండా లోపలకు పరుగెత్తి, నకలుతో అసలు నగను పోల్చుకున్నారు.
ఈలోగా కొందరు స్థానికులు వీళ్ళు చెప్పులతో ఆలయ ప్రవేశం చేయడం చూసి, బయటకు వెళ్లి చెప్పులు విప్పి రమ్మని చెప్పేరు. ముగ్గురూ నవ్వుతూ బయటకు వెళ్లిపోయారు. ఆలయానికి కాస్త దూరంగా వెళ్లి కూర్చున్నారు.
****సశేషం****
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల... ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.
ముందుమాట:
"అనామిక" అనే ఈ నవల 90' లలో మొదలైన ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? అనామిక ఎవరు? ఆ ప్రేమ జంటకి అనామికకు సంబంధం ఏమిటి? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది.
దైవిక శక్తులతో ఆటలాడడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాంటి వారిని శిక్షించే పని భగవంతుడే వివిధ రూపాలలో పూర్తి చేస్తారు. అలా జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ నవల రూపు దిద్దుకుంది.
ఈ నవల మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ....మీ అభిప్రాయాలను, సూచనలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ.. "అనామిక" నవలను సీరియల్ గా ప్రచురిస్తున్న సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమప్రియ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ...
- నాగమంజరి గుమ్మా, శృంగవరపుకోట