
“సుధా! 'నీక్కావలసింది నాదగ్గర ఉంది' ఏమిటో చెప్పుకో చూద్దాం?" ఇంట్లోకి వస్తూనే సుడిగాలిలా ప్రశ్నించాడు మోహన్.
"మొదలైందా మీ పాటల విన్యాసం?" అడిగింది సుధ.
"ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదోయ్… అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకో చెకుముకి" అన్నాడు మళ్ళీ మోహన్.
"జగదాంబలో పాత పుస్తకాల షాప్ లో ఏదైనా నవల దొరికితే తీసుకువచ్చారా?" అడిగింది సుధ.
"మధు…నేను చెప్పేనా? సుధకి పుస్తకం తప్ప ఇంకేదీ సంతోషం కలిగించదనీ, విలువైనది కాదనీ…" దెప్పి పొడిచాడు మోహన్, మధుని చూస్తూ.
"నువ్వుండరా! నవల కాదమ్మా… విషయం తెలిస్తే నువ్వు కూడా ఆశ్చర్యపోతావు" అన్నాడు మధు.
"త్వరగా చెప్పండి. అసలే ఆకలి మంట.. ఇప్పుడీ సస్పెన్స్ తంటా" అంది లక్ష్మి.
"మరేం లేదోయ్… మధుతో తన వ్యాపారం పని మీద వెళ్ళామా… అక్కడ పని చూసుకుని తిరిగి వస్తుంటే మా నాన్న కనిపించారు. మధునే చూసి, పిలిచాడు. మానాన్న నన్ను చూసి ఎంత ఏడ్చాడో తెలుసా…నాకు కూడా ఏడుపు వచ్చేసిందనుకో… 'జరిగిందేదో జరిగిపోయింది, ఇన్నేళ్లు మాకు దూరంగా ఉన్నారు, ఇంక మనింటికి వచ్చేయండర్రా!' అన్నారు. నాకైతే కొంచెం బాధ, కొంచెం కోపం రెండూ వచ్చాయనుకో! సర్లే అని మనింటికి రమ్మన్నాను. 'అమ్మను తీసుకుని వస్తానని, ఇప్పుడు పని చూసుకుని వెళ్తానని చెప్పి' నాన్న వెళ్లిపోయారు." అన్నాడు మోహన్.
సుధ ఆనందం పట్టలేకపోయింది. లక్ష్మి చేతులు రెండూ పట్టుకుని, "లక్ష్మీ! నువ్వు మధుకే కాదు నాకు కూడా అదృష్టలక్ష్మివే. నువ్వు అడుగుపెట్టిన వేళావిశేషం చూడు, మా ఇంట్లో సంతోషం ఎలా వెల్లివిరిసిందో" అని ఆ చేతులు కళ్ళకు అద్దుకుంది.
లక్ష్మి సిగ్గుపడిపోయింది. "నేనేం చేసాను సుధా. ఎలా జరగాల్సింది అలా జరిగింది. నా వలన ఏం జరగలేదు కదా… వదిలేయ్" అంది.
"ముందు భోజనాల సంగతి చూడండి. మీ పొగడ్తలు తర్వాత. నా నోరు తీపి చేస్తానంటే మరో తియ్యని కబురు కూడా చెప్తా…" అన్నాడు మోహన్.
'సరే' నని గబగబా భోజనాలు వడ్డించి, పాయసం, గారెలు తెచ్చి పెట్టింది సుధ. "అరె, నేను శుభవార్త తెస్తానని ముందే తెలుసా?" అనుమానంగా అడిగాడు మోహన్.
"అలా ఎలా తెలుస్తుంది నాకు? నేను లక్ష్మి, మధు తొలిసారిగా జంటగా మనింటికి వచ్చారని ఇవి చేసాను." అంది సుధ.
భోజనాలు చేసి, తీరిగ్గా కూర్చున్నారు మధు, మోహన్. "ఇప్పుడు చెప్పండి" అంటూ ఆకు, వక్క, సున్నం, కాచు వగైరాలు పెట్టిన తాంబూలం పళ్లెం పట్టుకుని, లక్ష్మితో సహా వచ్చి కూర్చుంది సుధ.
"నీ ఫోన్ తీసుకురా!" అన్నాడు మోహన్.
సుధ లోపలికి వెళ్లి ఫోన్ తీసుకుని వచ్చింది. మధు దగ్గర కాగితం తీసుకుని, దానిపై రాసి ఉన్న నెంబర్ ని సుధ ఫోన్ లో ఎక్కించి, కాల్ చేసి "మాట్లాడు" అన్నాడు మోహన్.
"ఎవరండీ… ఎవరికి చేశారు?" అంటూ అటువైపు నుంచి "హలో' అని వినబడడంతో "హలో" అంది సుధ.
"ఎవరు? ఎవరు మాట్లాడేది?" అంది ఒక స్త్రీ గొంతు.
ఒక్క క్షణం మోహన్ వైపు అనుమానంగా చూసి, గొంతు గుర్తుపట్టి, "అమ్మా!" అంది సుధ.
అటునుంచి సుధ తల్లి, "ఎవరూ? మా సుధే… తల్లీ ఎన్నాళ్లకు విన్నానే నీ గొంతు? ఎలా ఉన్నావు? ఎక్కడ ఉన్నారు? అల్లుడుగారు ఎలా ఉన్నారు? పిల్లలా?" వరసగా తల్లి ప్రశ్నలు వేస్తూ ఉంటే సుధ "అమ్మా" అంటూ ఏడ్చేసింది. లక్ష్మి ఓదార్పుగా సుధ భుజం పై చేయి వేసింది. ఆ చేతిని అలాగే పట్టుకుని, "అమ్మా! మేము బాగున్నాము. మీరెలా ఉన్నారు? నాన్నగారు బాగున్నారా?" అని ప్రశ్నించింది సుధ.
"ఇంక మన లోకంలో ఉండదురా… లక్ష్మీ, కొంచెం టీవీ పెట్టమ్మా… ఏదో ఒక సినిమానో, పాటలో వస్తాయి. చూసి తరిద్దాం. అవి పూర్తయ్యేసరికి ఈవిడ గారి మాటలు అవుతాయి. టీ సమయం కూడా అవుతుంది," అంటూ మోహన్ హడావుడి చేసాడు. లక్ష్మి నవ్వుతూ, సుధ చేతిలో నుంచి, తన చేతిని తీసుకుని, "నువ్వు కొనసాగించు" అన్నట్లు, సుధ వైపు ఓ చూపు విసిరి, వచ్చి, టివి పెట్టింది. మధు పక్కనే కూర్చుని వీళ్ళతో పాటు టివి చూడసాగింది.
***
"టీవీలో వచ్చే ప్రోగ్రాం కూడా అయిపోయింది. మీ స్నేహితురాలి మాటలు ఇంకా పూర్తయినట్లు లేదు. ఒకసారి చూసి రామ్మా!" అని లక్ష్మికి చెప్పాడు మోహన్.
ఇంతలో సుధ వచ్చింది. వస్తూనే చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా, మోహన్ బుగ్గపై ముద్దు ఇచ్చింది. మధు, లక్ష్మి ముఖాలు చూసుకుని నవ్వుకున్నారు. మోహన్ సిగ్గుపడ్డాడు.
"మా అమ్మ ఫోన్ నెంబర్ మీకు ఎలా దొరికింది? ఎంత సంతోషం అనిపించిందో… నాన్నగారు బయటకు వెళ్ళేరట. వచ్చేక మీతో వాళ్లిద్దరూ మాట్లాడతారని చెప్పింది." అంది సుధ పట్టరాని సంతోషంతో.
"అది కూడా మధు చలవే సుధా. మా నాన్నని కలిసి వచ్చేస్తూ ఉంటే, మీ ఊరివారైన పొదుపు సంఘం మహిళలు కొందరు సింహాచలం యాత్రకు వచ్చారట. గుంపుగా కనిపించారు. వారిలో ఒకరు మధుకి పరిచయం ఉన్నారు. వచ్చి పలకరించారు. అంతలో మధుకు జ్ఞాపకం వచ్చింది, 'మోహన్, వీళ్ళది మీ అత్తగారి ఊరే' అన్నాడు. ఆవిడ వెంటనే 'ఉమా గారి అల్లుడా? అదే సుధమ్మ భర్తా?' అని అడిగింది. కుశలప్రశ్నలు అయ్యాక, 'ఉమా గారి ఫోన్ నెంబర్ ఉందా?' అని ఆవిడని అడిగేడు మధు. ఆవిడ వెంటనే ఇచ్చింది. అది కథ" అన్నాడు మోహన్.
"మధు, లక్ష్మీ, మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు." అంది సుధ.
"ఏముంది? స్నేహాన్ని బంధుత్వంగా మార్చేసుకుందాం. పుట్టబోయే పిల్లలు ఆడ, మగ అయితే వియ్యంకులం అయిపోదాం. పెద్ద, చిన్న అని ఆలోచించక్కర్లేదు." అన్నాడు హాస్యంగా మధు.
"అప్పటి సంగతి తర్వాత తీరిగ్గా ఆలోచిద్దాం. ముందు కాస్త టీ తీసుకురా సుధా!" అన్నాడు మోహన్.
లక్ష్మి అప్పటికే టీ పెట్టి, నాలుగు కప్పులలో పోసి, చిరుతిళ్ళతో సహా తీసుకువచ్చింది.
***
"హారం ఎలా ఉంది ఫ్రెండ్స్? వెతికే పనికి సిద్ధమేనా?" ప్రశ్నించాడు నగేష్.
రాఘవరావు, విజయన్, నసీర్ ఏమీ మాట్లాడలేదు.
"ఈ హారం దక్షిణాదిలో ఉంది అన్నది ఒక అనుమానం మాత్రమే. దేశవ్యాప్తంగా మన అన్వేషణ ఉండాలి. ధనవంతులైన ప్రతీ ఒక్కరిపై మన నిఘా ఉండాలి. అతి ప్రాచీనమైన ఆ హారం మన దేశం దాటిపోలేదు. అలాగే దానిని కరిగించినట్లు కూడా ఆధారాలు లేవు. దొరుకుతుందనే ఉద్దేశ్యంతోనే మన అన్వేషణ కొనసాగించాలి. బంగారు నగల వర్తకులు, పల్లెటూళ్లలోని అమ్మవారి దేవాలయాలు, కొండలు, కోనల్లోని అమ్మవార్ల ఆలయాలు ఏవీ వదలకూడదు." చెప్పాడు నగేష్.
"చాలా పెద్ద నెట్వర్క్ నడిపించాలి అయితే" అన్నాడు నసీర్.
"చాలా మంది పనివారిని వినియోగించాలి. అదే సమయంలో మన అన్వేషణ దేని కోసమో తెలియకూడదు. చాలా ఖర్చు అవుతుంది" అన్నాడు విజయన్.
"హారం దొరికితే ఎవరి వాటా ఎంత? దాని అసలు విలువ ఎంత? ప్రస్తుతం మార్కెట్ రేట్ ఎంత? ఎవరికి ఎంత వస్తుంది? ఎవరు ఎంత ఖర్చుపెట్టాలి? ఈ వివరాలు చర్చించకుండా పనిలోకి ఎలా దిగగలం?" అనుమానం వ్యక్తం చేశాడు రాఘవరావు.
"మనం ఈ వివరాలు చర్చించేముందు మీకు మరికొన్ని వివరాలు తెలియాలి. మీకు తెలిసే ఉంటుంది, మధురైలో మీనాక్షి అమ్మవారి దేవాలయం ఉంది. ఆ దేవత విగ్రహం పచ్చ అదే మరకతంతో చేయబడింది. అలాగే శివలింగాలు పచ్చతో తయారు చేయించి ఇళ్లలో పెట్టుకుంటారు. మరకతం ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తుందని భారతీయుల నమ్మకం. ఈ మధ్యకాలంలో ఒక గనిలో తవ్వి తీసిన ఒక మరకతం బరువు ఒక కేజీ పైగా ఉంది. అదే అతి పెద్ద మరకతంగా రికార్డు సృష్టించి ఉంది. దాని ఖరీదు వందల కోట్లలో ఉంది. అదే పెద్ద మరకతం అనుకుంటే మరి మధురై మీనాక్షి అమ్మవారి విగ్రహ తయారీకి ఉపయోగించిన మరకతం ఎంత బరువు ఉండి ఉంటుంది? అంటే ప్రపంచానికి మరకతం విలువ తెలియక ముందే భారత దేశంలో అనేక నవరత్నాల వినియోగం, నాణ్యమైన వజ్రాలు వంటి రత్నాల తవ్వకం జరిగిందన్న మాట. కాబట్టే ఈ మరకత హారానికి అంత డిమాండ్ ఏర్పడింది.
విదేశీయుడు తన కలలో ఈ పచ్చల హారం కనబడిందని చెప్పి ఏడాది దాటింది. అప్పుడే ఆ చిత్రం ఆధారంగా అంతర్జాతీయ మార్కెట్ లో ఈహారం విలువ సుమారు మూడువందల యాభై కోట్లుగా నిర్ణయించారు. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది. ఇక మన రేట్లలో ఎంత ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. మన సౌలభ్యం కోసం 500 కోట్లుగా అనుకుందాం. అప్పుడు మన ఐదుగురం ఒక్కొక్కరు వంద కోట్లు తీసుకోవచ్చు." అన్నాడు నగేష్.
నసీర్, విజయన్, జేమ్స్, రాఘవరావు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు. ఏ వంద కోట్లో ఉంటుంది, తలకొక ఇరవై కోట్లు వస్తాయి. ఒక కోటి రూపాయలు అన్వేషణకు ఖర్చు పెట్టినా పర్వాలేదు అనుకున్నారు వాళ్ళు. కానీ నగేష్ చెప్పిన అంకె వినగానే తల గిర్రున తిరిగింది వాళ్ళకి. టేబుల్ మీద ఉన్న గ్లాసులోని ద్రవాన్ని ఒక్క ఉదుటన గొంతులోకి ఒంపుకున్నారు. గొంతు మండేసరికి బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. నసీర్, జేమ్స్ ఆలోచనలు వేరే దారికి సాగాయి.
"ఎప్పుడో నగ దొరికిన తర్వాత మేము ప్రయాణ ఏర్పాట్లు చేయడం ఎందుకు? మేము కూడా ఈ అన్వేషణలో పాలుపంచుకుంటాం. ఎగుమతి చేయడం విషయం తర్వాత ఆలోచిద్దాం." అన్నాడు జేమ్స్ కాస్త ఆశగా.
నగేష్ చిరునవ్వు నవ్వాడు. "ఏమంటావు" అన్నట్లు నసీర్ వైపు చూసాడు. జేమ్స్ అన్న మాటలను బలపరుస్తున్నట్లు జేమ్స్ చేతిమీద తన చేయి వేసాడు నసీర్.
"సరే! మీ వ్యూహాలు చెప్పండి." అన్నాడు నగేష్.
"ఈ ఒక్క ప్రాంతం వెతికితే సరిపోదని నా ఉద్దేశ్యం. మొత్తం దేశం అంతా వెతకాలేమో" అన్నాడు రాఘవరావు.
"ఇన్నేళ్లలో దేశంలో కోట్లకు పడగలెత్తినవారు, జమీందారులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయనాయకులు, కొంతమంది క్రీడాకారులు ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. అలాగే అప్పుడు జమీందారులుగా, ధనవంతులుగా ఉన్నవారు, కొన్ని రాజవంశాల వారు ఆర్ధికంగా చితికిపోయి ఉన్నారు. వీరి దగ్గర ఆ హారం ఉంది ఉంటే, చేతులు మారి ఉండేది. కాబట్టి ముందు చెప్పిన జాబితాలోని వారి భోషాణాల్లో ఆ హారం చేరుకుందేమో చూడాలి. చిన్న, పెద్ద అమ్మవారి దేవాలయాలు సుమారు అరవై వేల వరకు ఉన్నాయి. కొండలు, కోనల్లో కూడా అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి నగ కొండల్లో ఉండే దేవతలకు అలంకరించి ఉంటే, వన్నె తగ్గి ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించి, నిర్ధారణ చేసుకోవాలి. దేశంలో ఉన్న కోటీశ్వరుల జాబితా మీకు కొద్ది రోజుల్లో అందే ఏర్పాటు చేస్తాను. వారిలో మీకు ఈసరికే మిత్రులైనవారు ఉండి ఉంటారు. పరిచయమైనవారు, కొంచెం తెలిసిన వారు ఎవరెవరున్నారో చూసుకోండి. వారితో ఎలా వ్యవహరించాలో మీదే అంతిమ నిర్ణయం. ఇక మిగిలిన గ్రామ, పట్టణ ప్రాంతాలలోని దేవాలయాల విషయం, దేశం నాలుగు వైపులా నలుగురు పంచుకోండి. ఎవరెవరికి ఏ ఏ రాష్ట్రాలు వస్తాయో ముందే అనుకుంటే పర్వాలేదు." అన్నాడు నగేష్.
"ఇకపోతే ఈ అన్వేషణ కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందపత్రాలు మీ అందరికీ కొద్ది రోజుల్లో అందజేయబడతాయి. మీరందరూ వాటిపై సంతకాలు చేసి ఇస్తే, ప్రతి ఒక్కరికి ఒక్కో నకలు అందజేయబడుతుంది." అని చెప్పాడు నగేష్.
తనతో తెచ్చిన బ్రీఫ్ కేస్ తెరచి, నలుగురికి నాలుగు డబ్బు కట్టలు, నగ నమూనా చిత్రం అందించాడు. "ఈ డబ్బు మీ ప్రాథమిక అవసరాలకు ఉపయోగించుకోండి. నాకు తిరిగి ఇవ్వనవసరం లేదు, మీ వాటాలో తగ్గించను. చురుకైన, తెలివైన కుర్రాళ్ళ అవసరం ఉంటుంది, అలాగే బుర్ర లేకపోయినా, బండగా చెప్పిన పని చేసుకుపోయే వ్యక్తుల అవసరం కూడా ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించండి." అని చెప్పి, గది బయటకు నడిచాడు నగేష్. తలుపులు మూసుకున్నాయి. ఒక్క ఉదుటన నసీర్ తలుపుల దగ్గరకు చేరుకుని, తలుపు తీసి చూసాడు. నగేష్ లేడు అక్కడ, లిఫ్ట్ వైపు చూసాడు. 4 వ అంతస్తులోనే ఉంది. మెట్లవైపు చూసాడు, అక్కడ కూడా కనబడలేదు నగేష్. ఏమైపోయాడు? బహుశా అదే అంతస్తులో ఏదో ఒక రూమ్ లో ఉంటాడని అనుకున్నాడు నసీర్.
"నగేష్ కనబడలేదా?" అడిగాడు జేమ్స్. "నగేష్ చేసే పనులు చాలా చిత్రంగా ఉంటాయి నసీర్. అంతేకాదు చాలా ప్రమాదకరమైన వ్యక్తి కూడా. అందుకే నగేష్ చీకటి ప్రపంచానికి రారాజు కాగలిగాడు." అన్నాడు జేమ్స్.
"జేమ్స్! నగేష్ ది ఏ ప్రాంతం?" అడిగాడు నసీర్.
"ఒక ప్రాంతమని లేదు. అన్ని రాష్ట్రాల్లో అతని వ్యాపారాలు ఉన్నాయి. ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంది. పెద్ద పెద్ద వారి పరిచయాలున్నాయి. కొన్ని విదేశీ భాషలతో సహా, అనేక భారతీయ భాషలు చక్కగా మాట్లాడగలడు. భారతీయుడే కానీ ఏ రాష్ట్రం వాడో చెప్పడం కష్టం." అన్నాడు జేమ్స్.
"చేసేది ఎగుమతులు, దిగుమతులు వ్యాపారం అంటాడు. ఏం ఎగుమతి చేస్తాడో, ఏం దిగుమతి చేయిస్తాడో భగవంతునికే ఎరుక. చీకటి వ్యాపారాలు ఏం చేస్తాడో కూడా ఎవరికి తెలీదు. అంతా గుట్టు చప్పుడు వ్యవహారం." చెప్పాడు జేమ్స్. రాఘవరావు, విజయన్ మౌనంగా వింటున్నారు.
రూమ్ బాయ్ ని పిలిచి, మరింత మందు, తిండి పదార్థాలు తెప్పించుకున్నారు. మద్యం మత్తులో, రాబోయే ధనం గురించిన ఊహలతో పిచ్చి పిచ్చిగా వాగుతూనే ఉన్నారు. వారి వాగుడంతా పక్క గదిలోనే ఉన్న నగేష్, మైక్రో ఫోన్ నుండి వింటున్నాడు. వీళ్ళ వలన కార్యసాధన అవుతుందా అని అనుమానం కలిగింది నగేష్ కి. అన్వేషణలో హారం ఎవరికి దొరికినా మిగతావారికి చెప్పకుండా తామే అమ్ముకునే ప్రమాదం కూడా ఉంది. వారి మాటల్లో వినబడక పోయినా, మనసుల్లో ఆ భావం మెదిలినట్లు ఊహించాడు నగేష్. దానికి తగిన చర్యలు చేపట్టాలని కూడా తలచాడు.
****సశేషం****
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల... ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.
ముందుమాట:
"అనామిక" అనే ఈ నవల 90' లలో మొదలైన ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? అనామిక ఎవరు? ఆ ప్రేమ జంటకి అనామికకు సంబంధం ఏమిటి? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది.
దైవిక శక్తులతో ఆటలాడడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాంటి వారిని శిక్షించే పని భగవంతుడే వివిధ రూపాలలో పూర్తి చేస్తారు. అలా జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ నవల రూపు దిద్దుకుంది.
ఈ నవల మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ....మీ అభిప్రాయాలను, సూచనలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ.. "అనామిక" నవలను సీరియల్ గా ప్రచురిస్తున్న సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమప్రియ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ...
- నాగమంజరి గుమ్మా, శృంగవరపుకోట