అతని గాన మాధుర్యంలో ఒలికే ప్రతి బిందువు
ఏవో దూరతీరాల నుంచి వేరే లోకాలకి చేరుస్తుంటే
ఆ గమకాల గమనంతో మన తలలూపించి
స్వరాల సరిగమలతో సరసాలాడించి
గీతకారుని భావంలో కొంగ్రొత్త అర్ధాల్ని వెదికిస్తూ
ఏకబిగిని పాడే ఆ పాటతో తాదాత్మ్యం చెందిస్తూ
ఆ గళానికి మనసులోనే జోహార్లు పలుకుతూ
సంగీత రసికుడు కాలాన్ని మరిచి ఓలలాడుతూ ఉంటే
ఆ పాట, ఆగళం 'బాలు' డిది కాక మరెవ్వరిది అవుతుంది?
భక్తిగీతాలలో 'అంతర్యామిని' చూపిస్తూ పారవశ్యాన్ని కలిగించేది
విషాద గీతాలలో ఆర్ద్రత పెంచి కన్నీరొలికించేది
ప్రణయగీతాలలో పారవశ్యంతో ప్రియరాలిపై ఆత్మీయత పెంచేది
అనురాగ గీతాలతో ఆనందాన్ని అనుభవానికి తెచ్చేది
పాటతో అనుభవాల ఎత్తుపల్లాలు నడిపించి చూపించేది
స్వానుభవాలు పునశ్చరణ చేయించి కంటతడి పెట్టించేది
సంగీతమే పరిచయంలేని వానికి దాని సొబగులు చూపించి
ఆర్ద్రత మేళవించి అనుభంలోకి తెచ్చి సార్ధకతకూర్చేది
ఆ 'బాలు' గళం చిరకాలం సుగంధాలనందిస్తూనే ఉంటుంది.
ఏభాషైనా అతడి స్వంతం, ఆ సాహిత్యానికి మంచి విశ్లేషకుడు
సంగీతంలో ఏ రాగమైన అతడికి కరతలామలకమే
ధ్వన్యనుకరణ అతనికి నేర్పుతో అలవడిన విద్య
గొంతుతో చేయగలిగే క్రియల మెళకువలన్నీ కొట్టినపిండి
నటన తో సరిచేరే దర్శకత్వం, ఎందునా తగ్గడు మరి,
వ్యక్తిత్వమా అద్భుతంగా పరిమళించే ఆదర్శ పుష్పం,
అందుకే మరి అందరి మనసుల్లో అనన్య కళాకారుడిగా
స్వరశిల్పిగా, గాన శిక్షకుడిగా, ‘గాన గంధర్వుడి’గా
నిలిచాడు, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.