వ్యాఖ్యానములను చదువుటకు వారి పేర్ల మీద క్లిక్ చేయండి!!
తేటగీతి:
౧. | శ్రీకరమగు తెలుగు విరిసె సిరిమల్లె బుడమగుంట వారుల పంట పూలు జల్లె తెలుగు వారల ఇండ్లకు తేనె పంచె సాహితీ పత్రికై మనసంత మించె |
౨. | సాహితీ కుసుమం, సిరి సౌరభాల మల్లె సోయగాల విరి ఘుమఘుమలలర కాలిఫోర్నియా, ఇండియా కలయజుట్టి తెలుగు భాష యందు కవన తేజమొప్ప |
౩. | ఎన్ని జన్మల రుణమేదొ, యిపుడు మీరు తెలుగు నుడి ఉమ మధువులై తీర్చినారు జాతి మరువదయా మిమ్ము సతము నిజము సాటి తెలుగు పత్రిక మాకు జాను తెలుగు |
౪ . | తెలుగు సాహితీ ప్రియులకు తేనెలొలుక వివిధ అంశాల అందాలు వీనులకును కనుల కింపు సొంపులు గూర్చు, కవితలెన్నొ సిరుల మల్లెమాలలతోడ సేవ జేయ |
౫. | మన తెలుగు సిరిమల్లె ఘుమఘుమలలను మది మదిని తెల్గు పరిమళం మరులు గొల్పి వెలుగ వలె వినువీధుల తెలుగు కీర్తి మన చిరు సిరిమల్లె సతము మహితనొందు |
సిరి ఎక్కడుంది? సౌభాగ్యలక్ష్మిలో
ఆమెక్కడుంది? ‘సిరిమల్లె’ ఎదలో
సిరిమల్లె ఎక్కడ? మధు ‘మాస’ సుధలో
సుధ ఎక్కడుంది? పాఠకుల ఎదలో.
మూడు వసంతాల వయసున్న మీ పాప
పాపపుణ్యాలెరుగని నిష్పాప హృదయ
ఆమె పుట్టిన రోజు పబ్బాన నా వంతు
నాలుగు మాటలా
మనసుబ్బ దీవింతు
తెలుగువారి ఇంట తేజమై వెలసి
తెలుగు భాషకు కోటి భూషలై వెలిగి
తెలుగు వారికి గూర్చు ఎనలేని ఖ్యాతి
సమకూర్చిపెట్టు నీ ‘సిరిమల్లె’ బాల
తెనుగు వారి యొక్క కతలను వెతలను
తెనుగు జాతి యొక్క చక్కదనములను
విశ్వమందలి జరుగు వింతలు, వార్తలు
ఇది అది అననేల తానె విశ్వమై ఎదిగి
తా నెదిగి, తాళ వృక్షపు రీతి
మిమ్మలను ఎదిగుంచు; ఏటికాయేడు
నిండు నూరేళ్ళ పైబడి
వర్థిల్లుదురుగాక మీరు, మీ పిల్లలు ‘సిరిమల్లె’ తోటి
అస్తు-శుభమస్తు !!!!!
మూడు వత్సరంబు లయ్యె ముద్దుముద్దుమాటలన్
తోడుగా పసందుగా మనోహరంబుగా నిటుల్
వీడనట్టి దీక్ష పంచి వేడుకల్ సృజించె తా
రాడు బాలవోలె వృద్ధినందు పత్రికౌ నిదే.
విరులలో చిరువిరియై
స్వచ్ఛతకు అధికారియై
కురులకు సింగారియై
సువాసనలు విరజిమ్మే ...అందాల సిరిమల్లె
అందమైన శీర్షికలతో అలరి
అధ్భుత వ్యాసాలతో అమరి
తేట తేట తెలుగున విరిసి
తెలుగువారి మదిని మురిపించే...అందాల సిరిమల్లె
సాహిత్యప్రియుల మానస పుత్రియై ఉద్భవించి
సాహితీవేత్తల పలు ప్రశంశలు అందుకుంటూ
సాహిత్యాభిలాషుల హృదయాల పరిమళాలు వెదజల్లుతూ
సాహితీవనంలో మూడు వసంతాలను పూర్తిచేసుకుని
సాహితీ ప్రపంచంలో దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ
తృతీయ వార్షికోత్సవ దిశగా పరుగులిడుతున్న..... అందాల సిరిమల్లె
మధు & ఉమ గార్ల మూడు వసంతాల ముద్దుల పత్రిక (బాలిక) "సిరిమల్లె" కు మనసారా జన్మదిన శుభాకాంక్షలు.
స్రవంతి, సాహిత్య కుసుమం, ఆలయసిరి, ఆదర్శమూర్తులు, తేనెలొలుకు, సాహితీ పూదోట, మనోల్లాస గేయం, బాల్యం, వీక్షణం వంటి ఆసక్తిదాయకమైన శీర్షికలతో అద్వితీయంగా వెలువడుతున్న సిరిమల్లె కు అభినందనలు.
ప్రతి నెలా "వీక్షణం" శీర్షిక ద్వారా కాలిఫోర్నియా బే ఏరియా లో గత 6 సంవత్సరాలుగా నెల నెలా జరుగుతున్న మా వీక్షణం కార్యక్రమాల నివేదికలను క్రమం తప్పకుండా అందజేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
"సిరిమల్లె" తోటలో ఇంకా ఎన్నో కుసుమాలు విరబూయాలని ఆశిస్తూ-
తృతీయ వార్షికోత్సవ శుభాభినందనలు
సిరిమల్లె సౌరభం -
- మున్నేట ముత్యాల సింగారం
మదు-ఉమల మాతృభాషాభిమతం
మన కందరికి మహా సమ్మతం
మన భావి తరాలకు మహిమాన్వితం
‘మల్లె‘ పరిమళానికి మనస్సు పులకిస్తుంది.
గుండుమల్లెలు -గండుకోయిలల్లా పులకింపజేస్తాయి.
అది రెక్కమల్లైనా, బొండుమల్లైనా సౌరభం సమానమే!
అలాంటి మల్లె అమెరికానుంచి వెబ్ సైట్ లోకి దిగుమతై,
ప్రపంచ దేశాల్లోని ఆంధ్రుల మనస్సులను దోచి పులకింపజేసి,
మాతృభాషా సౌరభాలనువిశ్వవ్యాప్తం చేస్తూ,
దిగ్ దిగంతాల్లో ప్రభవిస్తూసుగంధాలు వెదజల్లుతూ,
ముచ్చటగా మూడు వసంతాలు పూర్తి చేసుకున్న మామల్లె
‘సిరిమల్లె’ - బుడమగుంటవారి బొండు మల్లె
బుడిబుడినడకలు పరుగులై
ఇంకా ఇంకా అందంగా ఎదిగి, తెలుగువారి ప్రియతమై
మల్లెతోట పరిమళంతో మాతృభూమి విరాజిల్లాలని,
మల్లెతోట మాలులు సుఖసంపదలతో కలకాలం -
మాతృ భాషా సేవ లో వర్ధిల్లాలనీ -
మనసారాకోరుకుంటూ!
మూడు వసంతాల సిరిమల్లె
ప్రతిమాసం మధుమాసంలా
ప్రతి అక్షరం సాహిత్య వధువులా
ప్రవాహంలా వస్తోంది
కవిత్రయ ఘంటా కవితారీతుల వాణి
శివకవుల జాను తెలుగు బోణి
ప్రబంధ కవుల వర్ణనా కవితా హోళి
తిమ్మక్క, మొల్లల కవితా ఝరి
తంజావూరు నాయకీ నాయకుల
ఆధునిక కవిత్వ వ్యవహార బాణీ
గురజాడ అడుగు జాడల ఓణి
నవ్యసంప్రదాయ చిరుగాలి సవ్వడి
భావ కవిత్వ కృష్ణశాస్త్రి మనోజ్ఞి
శ్రీశ్రీ విప్లవ మహాప్రస్థాన హేళి
దిగంబర కవుల కలకత్తా కాళీ
మూడు వసంతాల మధువని
మన సిరిమల్లెకు అభినందన నివాళి
తెలుగుభాషా సంపదలో మా అందరిని 'సి'రి సంపన్నులను గావిస్తూ
తెలుగుభాషా సంస్కృతికి, దేశవిదేశాలలో ప'రి'మళభరితమైన సేవలందిస్తూ
తేనెలొలుకు తియ్యనైన తెలుగుభాషలో ఉత్త'మ' సాహిత్యాన్ని రుచిచూపిస్తూ
మనోల్లాసా గేయాలతో సుగంధాల మరుమ'ల్లె'లు వెదజల్లుతూ
మీరు చేసే (సా)హిత్యం- (హ)స్యం- (సం)గీతం...................
సర్వం = "మధు"కరం & "ప్రియ"కరం
తృతీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు
'సిరిమల్లె' అప్పుడే మూడవ పుట్టినరోజు గడుపుకుంటుందా? మొన్నీమధ్యే చిన్న చిన్న అడుగులు వేస్తూ, నా శీర్షిక 'ధర్మం శరణం గచ్ఛామి' ని ప్రోత్సహించిన సిరిమల్లెకి, అప్పుడే 3 సంవత్సరాలు నిండాయి?! అని ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. ‘మన పనిని మనం చేసుకు పోవాలి’ అన్నది మధుగారి పద్ధతి. తనకి కావల్సినన్ని శీర్షికలు వచ్చినా రాక పోయినా, క్రమం తప్పకుండా ప్రతి నెల ఎంతో ఆసక్తి కరమైన విషయాలని అందిస్తూ, ఎంతో దక్షతతో ఇటువంటి సమాజసేవకి పూనుకున్న మధుగారికి, వారి శ్రీమతి ఉమగారికి, నా హృదయపూర్వక అభినందనలు. లక్ష్యం మంచిదైనప్పుడు దారి దానంతట అదే తెరుచుకుంటుంది. సిరిమల్లంత స్వచ్ఛమైన మనసున్న మీకు, ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ-
తృతీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు
“సిరిమల్లె” పత్రిక మూడవ వార్షికోత్సవము సందర్భముగా నాకు ఆ పత్రికలో ఇష్టమైన అంశముల మీద ... కవనగానము ...
సీ. | ఆదర్శ మూర్తులే యమరులగుదురిట నాలయములసిరి వ్రాలుచుండుసాహిత్య కుసుమాల సరులు దొరకునిట తేనెలొలుకుచును తెలుగు సిరులుసాహితీ వనములు సాంత్వమునిడునిట నెదలన్ని మురియగ పదములలరుసామెతల రుచులు సంప్రాప్తమగునిట శతకముల నియతి జాస్తి గలుగు |
ఆ.వె. | సిరుల మల్లె జల్లు సురస సౌరభములు యరయనాంధ్ర కల్పతరువునల్లి వ్రాలి మధువు గ్రోలు పాఠకులు సురలుస్వర్గ సీమ యదియె జాలమవగ!! |
వైవిధ్య భరితమైన శీర్షికలతో వికసిస్తూ, పాఠకుల మనస్సులను ఆకర్షిస్తున్న ఈ చిన్నారి ‘సిరిమల్లె’, ముచ్చటైన మూడు సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో, ఈ పత్రిక అభివృద్ధికై పాటుపడుతూ, మా అందరికీ సాహిత్యానందాన్ని పంచుతున్న మీ నలుగురికి(కుటుంభానికి) మనఃస్ఫుర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సిరిమల్లె ఇంకా ఇంకా ఎంతో వినూత్నంగా ఎదగాలని కోరుకుంటున్నాము.