అనసూయ కొడుకు శ్రావణ్ వార్డెన్ నిరంతరం చదవమని జోరీగలా పోరు పెడుతున్నాడంటూ ఇంటికి వచ్చేశాడు. అనసూయ గుండెల్లో రాయి పడింది. ఇంట్లో ఉంటే చదువు మూల పడిపోతుంది. వాడి భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఉంది.
ఈ మధ్య శ్రీధర్ రావు వైఖరి ముట్టుకుంటే అంటుకునేట్టు తయారయింది. భార్యాభర్తలిద్దరికి డబ్బుకోసం గొడవలు మొదలయ్యాయి. ఉన్న ఉద్యోగం గోటుతో మానేశాడు. నగరంలో పెద్ద పెద్ద షాపుల్ని ఎంచుకుని భారీమొత్తాలు డైలీ వేజెస్ మీద అప్పులు ఇచ్చి వసూలు కార్యక్రమం చేపట్టాడు. అడిగిన వాళ్ళకి ఆడిగినంత అప్పు ఇచ్చి పారేశాడు. అనసూయ అత్యాశ తో మొగుడికి తన దగ్గర ఉన్న నిల్వ కూడా అతడి చేతిలో పెట్టింది.
అన్న సుందరమూర్తి ని అడిగి మరి కొంత భారీ మొత్తం ఇచ్చింది.
షాపుల వాళ్ళు మొదట్లో బాగానే డబ్బులు ఇచ్చేసేవారు. రాను రాను ఒక్కరొక్కరుగా ఎగ్గొట్టడం మొదలు పెట్టారు. శ్రీధర్ రావుకి వ్యాపార కిటుకులు ఏ మాత్రం తెలియవు. డబ్బుని పదింతలు చేద్దాం అనుకున్నాడే గానీ ఇలా వ్యాపారులంతా కూడబలుక్కుని మోసం చేస్తారని అనుకోలేదు. టాక్స్ లు, లెక్కలూ తలనొప్పి వ్యవహారం అనుకుని నోటు కూడా రాయించుకోలేదు. అలా దివాళా తీస్తానని అనుకోని శ్రీధర్ రావు ఇప్పుడు పెళ్ళాం దగ్గర ఉలుకు, పలుకు లేని మూగ వాడిలా అయిపోయాడు.
డబ్బు పోగొట్టుకున్న భర్త. ఒక పక్క మాట వినని కొడుకు. లోలోపల ఈ బాధ సుడులు తిరుగుతుంటే ఇక తట్టుకోలేక ఒక రోజు పొద్దున్నే చెల్లెళ్ళిద్దర్నీ తమ సీక్రెట్ ప్లేస్ లో కలిసి చెప్పుకుని చెప్పుకుని ఏడిచింది.
సావిత్రికి, అనులేఖ కి ఆ కబురు కమ్మగా అందింది. కథక్ డాన్స్ చేసినట్టు గుండ్రంగా తిరిగేంత హాయి. అనసూయ వెళ్ళాక -
“ఈ ఇంటి మహారాణి లా పొజిచ్చింది. ఇప్పుడు పెద్ద అన్నయ్యని అడుగుతుంది చూడు. కాస్త కనిపెట్టి ఉండు. వాడికి అసలు చేతికి ఎముకే లేదు!" అంది సావిత్రి.
“అదంతా నాకొదిలేయ్. చూసుకుంటా!" అంది అనులేఖ.
మొదటి నుంచి ఆ సీక్రెట్ చాడీల చోటు కనుగొన్న ఒక వ్యక్తి సైలెంట్ గా వినేసి ఎప్పటిలా ఇంట్లోకి వెళ్ళిపోయారు.
ఆ సాయంత్రం అనులేఖ సరాసరి పెద్దన్న దగ్గరికి వెళ్ళింది. సుందరమూర్తి పొద్దుటి నుంచి బిజినెస్ పనులమీద తిరిగి తిరిగి విశ్రాంతి తీసుకుంటున్నాడు.
చిన్న చెల్లి అంటే ముద్దు ఎక్కువ. ఇప్పటికీ పిలక జడలేసుకుని ముద్దు మాటలు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. లేఖ రాగానే పడుకున్నవాడు కాస్తా లేచి కూర్చుని నవ్వాడు.
చిన్నప్పటి నుంచి దానికి వచ్చింది ఒక్క కంప్లైంట్ ఇవ్వడమే. అందుకే నవ్వుతూ అడిగాడు ఏమిటో చెప్పమని.
శ్రీధర్ రావు చేసిన నిర్వాకం అంతా చెప్పి-
“జాగ్రత్త నిన్ను మళ్ళీ మళ్ళీ పెద్దక్క డబ్బు అడుగుతుందేమో?" అంది.
నవ్వి ఊరుకున్నాడు.
‘నాకు తెలుసు. నువ్వు ఇలాగే నవ్వుతావని!' అంది గోముగా.
మళ్ళీ నవ్వి ప్రతి నెల ఇస్తున్నట్టే కొంత డబ్బు ఇచ్చాడు.
అది తీసుకుని హాయిగా బయటికి వచ్చింది అనులేఖ.
సుందరమూర్తి నెలకింత అని వచ్చిన లాభాల్లో సంతోషంగా డబ్బు ఇస్తాడే గానీ ఎవరేనా వచ్చి ఎక్స్ట్రా అడిగితే ఒక డైరీ ఇచ్చి దానిలో వారెంత ఆడిగారో, ఎంత తీసుకున్నారో వారిచేతే రాయించి సంతకం పెట్టించుకుని డబ్బు ఇస్తాడు. అది ఎంత చిన్న అమౌంట్ అయినా సరే.
★★★
వసంత్ పరిచయం అయ్యాడు శ్రావణ్ కి.
ధృతి అత్త కజిన్ కొడుకు అని తెలియగానే కాస్త థ్రిల్ ఫీల్ అయ్యాడు.
వసంత్ చాలా సరదా మనిషి. ఎక్కడ లేని కబుర్లూ పోగేస్తాడు.
శ్రావణ్ తన ఇంటర్ అయిపోవచ్చింది కాబట్టి తానూ డిగ్రీ చేసే ముందు టిప్స్ కనుక్కోవచ్చని కబుర్లు మొదలెట్టాడు. హాస్టల్లో తను వార్డెన్ ని ఎలా హడలెత్తించిందీ చెప్పడం మొదలు పెట్టి నవ్వించాడు. తను ఎలా లెక్కలు అడక్కుండా ఖర్చు చేస్తాడో చూసి స్నేహితులంతా కళ్ళప్పగించి గొప్పవాడిని చూస్తున్నట్టు చూస్తారో గర్వంగా చెప్పుకొచ్చాడు.
అరగంట లో అర్ధం అయిపోయాడు శ్రావణ్ వసంత్ కి.
గాలివాటుగా ఉన్నాడని పేరెంట్స్ కూడా అదుపాజ్ఞలలో పెట్టడం లేదని అర్ధం అయింది.
కొన్నాళ్లుగా ప్రతి సాయంత్రం ఒక చిన్న మీటింగ్ లా అందరూ ఇంటిలోపలి ప్లే గ్రౌండ్ లో కలవడం, వసంత్ చెప్పే కథలూ, కబుర్లు వినడం అలవాటుగా మారింది.
ఆ రోజు జాజి, సౌమిత్ షటిల్ ఆడుకుంటున్నారు.
అప్పుడే ధృతి వచ్చి కూర్చుంది.
అప్పటి దాకా జరిగిన సంభాషణ ఏమిటో గానీ శ్రావణ్ ఆవేశంగా అంటున్నాడు.
“మీరు చెప్పింది వింటే నాకు వింతగా ఉంది. మాకు అసలు పని చేయాల్సిన అవసరమే లేదు. సుందరం మామయ్య ఉన్నదాన్ని ఇంతకు ఇంతా చేద్దామని బిజినెస్ చేస్తున్నాడు గానీ ఉన్నదేదో హాయిగా తింటూ కాలు మీద కాలు వేసుకుని బతకవచ్చు.
లోకంలో ఏమి జరుగుతోందో తెలుసుకోవడం కోసం గానీ లేకపోతే నాకీ చదువు ఉత్త టైం వేస్ట్ అనిపిస్తుంది. ఒకటే వెంట పడతాడు వార్డెన్. ఫస్ట్ వచ్చిన కుర్రాళ్ళ వైపు ప్రశంసలు కురిపిస్తూ మెరిసే కళ్ళతో చూస్తుంటే ఈర్ష్యాసూయలు రావా? అందుకే వాళ్లని డబ్బు తో మేనేజ్ చేస్తా. మీవంటి వాళ్ళు చదువుకుంటున్నారంటే పైకి ఎదగడానికి. మాకేం ఖర్మ అండి?"అన్నాడు నిర్లక్ష్య ధోరణిలో.
“శభాష్! ఎందుకు యువత పాడయిపోయి ఆల్కహాల్ తాగుతూ, తూలుతూ ఉన్నారా? అనుకున్న. ఇటువంటి ఆలోచనలే అని ఇప్పుడు తెలుస్తోంది. పెద్దలు పిల్లల ఆలోచనల్ని తెలుసుకుని కూడా సవ్యదిశ లో సరిదిద్దడం మానేశారు. బతికేస్తున్నారు అంతే!" అన్నాడు బాధగా వసంత్.
"రేయ్! నా కొడుకు దగ్గర పెద్దలు అంటున్నావు అంటే నువ్వు వాడి తల్లి తండ్రుల్ని ఎత్తి చూపిస్తున్నావ్. నువ్వు నన్నుఅనేంతటి వాడివారా?" గయ్ మని లేచింది అనసూయ.
ఆ మాటలకి-
ఒక్కసారిగా చివ్వున పౌరుషంగా లేచి కాలర్ ఎత్తి ఒక్కఅడుగు ముందుకి వేసాడు శ్రావణ్.
“పేనుకి పెత్తనం ఇస్తే బుర్ర అంతా కొరికిపెట్టిందిట!" అంది అనులేఖ అదే అదనుగా.
అనులేఖ కి వాదోపవాదాలు, రగడ అంటే ఎంతో ఇష్టం. వాదించుకునే వారు రెండు పార్టీ లుగా విడిపోయి రెచ్చిపోతూ ఉంటే ఎవరు గెలుస్తారా? అని చూడడం భలే మజా! అంటుంది.
మంట ఎగదోసి కూర్చుంటే అదే రాజుకుంటుంది అనుకున్న అనులేఖ వసంత్ మాటలు విని విస్తుపోయింది.
“వెరీ సారీ శ్రావణ్. నా ఉద్దేశ్యం అది కానే కాదు. నేను చెప్పేందుకు ఇంకొక్క అవకాశం ఇస్తానంటే నాకు తెలిసింది చెప్తాను. మనం బంధువులం. ఒకరికి ఒకరం. ఏవో చిన్న చిన్న వాదనలు వస్తూ ఉంటాయి. ఒకరు తగ్గి ఆలోచిస్తే ఎదుటి వారికి అపార్ధం రాదు. అనసూయ అత్తా! మిమ్మల్ని అనేపాటి వాడినా నేను?" అన్నాడు.
సావిత్రి చూడ ముచ్చటగా చూసింది వసంత్ వైపు.
ఆ చక్కని మాటలకి శ్రావణ్ తగ్గి కూర్చున్నాడు.
"మన సినిమాల్లో తాగుడు కామన్ అని చూపిస్తున్నారు. కొడుకు ప్రేమలో పడి ఫెయిల్ అయితే తండ్రి స్వయంగా 'అలా ఉండొద్దురా! దా తాగుదాం!' అంటున్నాడు. ఆ కొడుకు తాగుతూ అవాకులు, చెవాకులు పేలుతాడు, తండ్రి ఓదారుస్తూ ఉంటాడు. ఎంత దారుణం? అసలు కాలేజీలో ప్రేమలో పడడం, ఆ పిల్ల కాదంటే వీడు ఏడవడం, తండ్రి తాగుడు దానికి విరుగుడు అని చెప్పడం మనం చూసినన్ని రోజులూ యువతని పెడత్రోవకి తోయడమే. వినోదం అంటే అదా?
అసలు ప్రేమ అంటే ఏమిటి? యవ్వనంలో మోహపడుతుంటే అది ప్రేమ కాదనీ, మోహం యవ్వనంలో వచ్చే ఒక రుగ్మత అని పెద్దలు దగ్గర ఉండి దానిలోనుంచి బయట పడెయ్యడం మానేశారు. వారికి పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయం మీద అవగాహన లేక, రాక, పిల్లలకు ఎంత ప్రేమని అందించాలి? ఎంత మనసులోనే దాచి ఉంచుకోవాలి అని తెలియక సరిఅయిన దారి చూపించడం చేతగాని అమ్మలూ...నాన్నల్ని చూసి నిజానికి మనకి కోపం రావాలి.
నేను కామన్ గా చెప్తున్న. చదువుకోవాల్సిన వయసులో వారి వెంట తోడై, నీడై ఉండాల్సిన తల్లితండ్రుల మీద మనకి కోపం వచ్చి నిలదియ్యాలి. ఇంకొక్క విషయం చెప్తాను. విను.
ప్రతి మనిషి తన జీవనానికి తానొక వ్యాపారమో, ఉద్యోగమో చేయాలి. తాతల, తండ్రుల ఆర్జనతో బతకడం గౌరవప్రదం కాదు. ఏ మనిషీ పరాన్నభుక్తులుగా ఉండకూడదు. ఎవరిది వారే సంపాదించుకుంటే వచ్చే తృప్తి అమూల్యం. చదివి, ఉద్యోగం చేసి చూడు. డబ్బు అందరూ సంపాదించాలి. దానికో విలువ ఉంది కాబట్టి!" అన్నాడు.
శ్రావణ్ జాగ్రత్త గా కుదురుగా వినడం గ్రహించాడు వసంత్.
★★★
గోవా!
డాబోలియం ఎయిర్ పోర్ట్!
పది మంది స్నేహితులతో గోవాలో అడుగుపెట్టాడు ప్రాంజల్. ఇంటిని, ఇల్లాలిని, పిల్లల్ని, సమస్త పరివారాన్ని, ఆ గుర్తుల్ని మూటగట్టి వచ్చేటప్పుడే అటక మీద విసిరేసాడు. నిలవ పచ్చళ్ళని తలుచుకోకుండా లేటెస్ట్ గరమ్ మసాలాలు వేపు దృష్టి పెట్టాడు.
అతనికి ఇష్టమైన "వదనం మధురం నయనం మధురం మధురాధిపతే" అనే సంగీతాన్ని వెనక్కి తోసేసాడు.
ఆంధ్ర గోంగూర పచ్చడి దానిలోకి నంచుకునే చిన్నుల్లిపాయ రుచిని తుంగ లోకి తొక్కేసాడు. గొప్ప ఫాస్ట్ గా ప్రజెంట్ మూమెంట్ లోకి సరాసరి ఎంటర్ అయిపోయాడు.
ఇప్పటి ప్రాంజల్ ఒక డైనమిక్ హీరో. దూసుకు పోవడమే తప్ప ఆగి చూస్తే సమయం చేతి వేళ్ళ మధ్య నీరులా జారిపోతుంది. పది మంది కలిసి వచ్చినా ఎవడి ఇష్టా రాజ్యం వాడిది అన్నాడు సందీప్.
'ఎవడి అనుభవం వాడిదే!' అన్నాడు సాగర్.
అంతే!!
ఒక కారుని మాట్లాడుకుని వాస్కో వైపు పోనిమ్మన్నాడు.
కార్ లో కొంకణీపాటలు గజిబిజిగా వినపడుతున్నాయి జింగిరి బింగిరి గా ఉన్న కొత్త భాష కి ఫిదా అయిపోయాడు. ఇండియాలో ఉండే అతి చిన్న రాష్ట్రం గోవా!!
అయితేనేం… జిగేల్ జిగేల్ మంటూ పొట్టి బట్టల జనాలు. గుభేల్ గుభేల్ మంటూ గుండెల్లో చప్పుళ్ళు.
అసలెందుకు ఎందుకు భగవంతుడిచ్చిన అందాలు దాచుకోవడం? కంటికి ఇంపైన ఒంపుసొంపుల్ని కళ్ళారా చూస్తూ విందు చేసుకోని బతుకెందుకు?
అవును. ఇదొక ప్రత్యేక రాష్ట్రం!
ఎక్కడ చూసినా ఫారినర్స్!
లేటెస్ట్ డ్రెస్ లు.
నోరు వెళ్ళబెట్టే కల్చర్!
మొహమాటం లేని ఆటవిడుపు.
కారు చవకైన ఆల్కహాల్!
మత్తు మత్తు! గమ్మత్తు!! ఆ మత్తులో ఆకాశంలో పక్షుల్లా ఎగిరి పోతూ మనసు. ఊయలలూగే వయసు.
ప్రాంజల్ కి చూడాలనుకున్నవి దాచుకోలేని ఒంపు సొంపులు.
ఆ ఆకర్షణా శక్తుల్ని హాయిగా వదిలేసి కొంతే ముడికట్టి తిరిగే ఆ ఆడ లేడీస్ పరువాలు.
ఆ సగం కప్పుకున్న వాటికి 'పరువాల కాపు' అని డంగై పోతూ పేరు పెట్టుకున్నాడు ప్రాంజల్.
ఫ్రెండ్స్ అందరూ ఎవరికి కావలసిన చోటికి వాళ్లు స్వేచ్ఛగా ఎగిరిపోయాక వాస్కో లో హోటల్ 'ఫ్లోరా గ్రాండ్' లో దిగాడు. ఆ వీధుల్లో తెగ తిరిగాడు. హోటల్ లో దిగాక ధృతిని టీజ్ చేస్తున్నట్టు ఒక సెల్ఫీ వీడియో తీసి తను మనసులో ఏమనుకున్నాడో దాన్ని రికార్డ్ చేసి పంపేసాడు.
'ధృతి ఏ పురాతన కాలంలో ఉందో తెలుసుకుని తీరాలి. తన కోరిక ఎంత సమంజసం అయినదో గుర్తించి తీరాలి!' అన్నాడు. అనుకున్నాడు. మొదటి వీడియో ధాత్రిని చేరింది.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
|