బోడెద్దుకు పోట్లు మప్పడం
“ఛ ఛ ఈ ఇంట్లో ఎవరికీ చెప్పలేము! 'బోడెద్దుకు పోట్లు మప్పొద్దు' అంటే విన్నారు కాదు. ఇప్పుడు అనుకుని ఏం లాభం” అని గుడి నుంచి వస్తూనే రుస రుస లాడింది యమున.
“ఏమయ్యిందమ్మా అలా కోప్పడుతున్నావు?” అని వంటింట్లోంచి వస్తూ కోడలిని అడిగింది రాగిణి.
“ఏం చెప్పమంటారు. ఈ రోజు నా పుట్టినరోజు నేను, మీకొడుకు గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుని వద్దామని అనుకున్నాము. ఈలోగా మామగారు 'ఊరుకున్నదానికి ఉల్లి మిరియం పెట్టినట్లు' మనవరాలికి చెప్పారు. తను కూడా మాతో వస్తానని పేచీ పెట్టింది.” అని నిష్టూరమాడింది కోడలు.
“పోనీలే…దానిలో తప్పేముంది. మనపిల్లల్ని మనం తీసుకువెళ్లకపోతే పక్కింటి వాళ్ళో ఎదురింటి వాళ్ళో తీసుకువెళ్తారా. పిల్లలన్నాక తల్లి, తండ్రి తో బయటకు వెళ్ళడానికి సరదా పడతారు ఆ మాత్రం దానికే బోడెద్దు అని నానా మాటలు అనాలా?” అని గట్టిగా నిలదీసింది అత్తగారు.
“అయ్యో అత్తయ్యా! 'బోడెద్దుకు పోట్లు మప్పడం' అనేది ఒక సామెత. దూడ పెయ్య తల దగ్గర చేతులు పెట్టి సరదాగా ఊపితే అది కూడా సరదాగా ఊపుతుంది. పెద్దది అయ్యాక దానికి కొమ్ములు వస్తాయి. తల ఊపడం లేదా పొడవడం అలవాటుగా మారి మనం దగ్గరికి వెళ్ళేసరికి పొడుస్తుంది. ఎవరికైనా లేని అలవాటును చేసిన సందర్భంలో ఈ సామెత వాడుతున్నాం” అని వివరించింది కోడలు.
“నీ కూతురికి ఎవరు ఏమిటి నేర్పారు?” అని నిలదీసింది అత్తగారు.
“దారంట పోతున్న ఆవులకు అరటిపండు పెట్టమని మనవరాలికి చెప్పేవారు మామగారు. మీ మనరాలికి అది అలవాటుగా మారింది.” అంది కోడలు.
“అయితే ఏమయ్యింది. మూగ జీవాలకు పెట్టడం మంచిదే కదా!”
“గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నాము. పంతులుగారు ప్రసాదంగా అరటిపండు, కొబ్బరిచిప్ప ఇచ్చారు. 'నీవు నేర్పిన విద్యే నీరజాక్షి' అన్నట్లు మీ మనవరాలు అరటిపండు అవుకు తినిపించింది. కొబ్బరిచిప్ప గుడి దగ్గర ఉన్న బిచ్చగత్తెకి ఇచ్చింది.” అని చెప్పింది.
“ఆకలితో ఉన్న ఆమెకు ఇవ్వడం పుణ్యమే కదా!” అంది అత్తగారు.
“పుణ్యమా పాడా! ఆ కొబ్బరిచిప్ప తో పచ్చడి చేద్దామని అనుకున్నాను. 'తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు’ ఆ కొబ్బరిచిప్ప బిచ్చగత్తెకి ఇచ్చింది” అని వాపోయింది కోడలు.
“అయ్యో! రామ! ఏళ్లు ఎగసన్నం బుద్ధులు దిగసన్నం అంటే ఇదేనేమో. వయసుపెరిగింది కానీ నీ బుద్ధి మారలేదు” అంది కోడలివైపు చూస్తూ అత్తగారు.
పిల్లలకు లేదా పెద్దలకు లేని ఆలోచనలు కల్పించడం లేదా అలవాట్లు నేర్పించడం వల్ల ఇబ్బంది కలిగిన సందర్భంలోనూ, బాస్ లేదా పై అధికారి మెప్పు కోసం, గొప్పకోసం లొసుగులు, కిటుకులు తెలియచేసి బాస్ వల్ల ఇబ్బంది పడిన సందర్భంలోను వాడే సామెత ఇది.
రచయిత పరిచయం
నా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.