వీక్షణం సాహితీ గవాక్షం కాలిఫోర్నియా 158వ ప్రపంచ సాహితీ సమావేశం అక్టోబర్10, 2025 న ఆసాంతం ఉత్తేజ భరితంగా జరిగింది. త్రయోదశ వర్షాలకు పైగా ప్రతి నెల ప్రపంచ సాహితీ సమావేశాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ వీక్షణం సాహితీ గవాక్షం. వీక్షణం వ్యవస్థాపక, కార్యవర్గ అధ్యక్షురాలు డా. గీతామాధవి గారి స్వాగత వచనాలతో ఈనాటి సమావేశం ప్రారంభమైనది.
ఇవేళ్టి ముఖ్య అతిథి డా. ఆచార్య ఫణీంద్రగారిని వేదికపై ఆహ్వానించి వారిని సభకు పరిచయం చేశారు.
డా. ఆచార్య ఫణీంద్ర గారు పన్నెండేళ్ళ పసి వయసులోనే కందపద్యాన్ని రచించారు. ప్రముఖ తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. ఆచార్య ఫణీంద్ర ఆయన కలం పేరు. అసలు పేరు గోవర్ధనం వేంకట ఫణీంద్ర శయనాచార్య. ఆచార్య ఫణీంద్ర నిజామాబాదు పట్టణంలో గోవర్ధనం దేశికాచార్య, ఇందిరాదేవి దంపతులకు జన్మించారు. ఆచార్య ఫణీంద్ర మాతామహులు ఆచి వేంకట నృసింహాచార్యులు, పితామహులు గోవర్థనం నారాయణాచార్యులు .. ఇరువురూ సంస్కృతాంధ్ర పండితులు, కవులు. తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాప రెడ్డి గారి "గోల్కొండ కవుల సంచిక"లో ఫణీంద్ర బాల్యం, పాఠశాల విద్య నిజామాబాదులోనే గడిచాయి. హైదరాబాదులో ఉన్నత విద్యాభ్యాసం చేసారు. ఆయన తొలుత మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తరువాత సాహిత్యం పట్ల తనకున్న ఆసక్తి మేరకు తెలుగులో ఎం.ఏ. డిగ్రీతోబాటు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి "19వ శతాబ్దం తెలుగు కవిత్వంలో నవ్యత" అనే విషయంపై పి.హెచ్.డి. పరిశోధన చేసి, డాక్టరేట్ డిగ్రీని సాధించారు. ఇటీవలే అది “క్షీణయుగం కాదు .. ఉషోదయ యుగం” అన్న పేరిట గ్రంథంగా ముద్రించబడి, పలువురి ప్రశంసలకు పాత్రమైంది. ఆచార్య ఫణీంద్ర - ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం, మౌక్తికం, శ్రీ సీతారామ కథోత్సాహ తారావళి - వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు.
వృత్తిరీత్యా - 38 ఏళ్ళ పాటు భారత ప్రభుత్వ “అణు ఇంధన సంస్థ”లో - సర్వీసు పూర్తి చేసుకొని 2021 ఆగస్ట్ మాసంలో సీనియర్ శాస్త్రవేత్తగా (డైరెక్టర్ లెవల్ లో) పదవీ విరమణ చేసారు.
మూడు దశాబ్దాలకు పైగా భారత అణు రియాక్టర్లకు అందించబడే అణు ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే అనేక యంత్రాల ఎరక్షన్ అండ్ కమీషనింగ్ తోబాటు మేంటెనెన్స్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించారు. ఉద్యోగపరంగా అనేక సదస్సులలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం దిగుమతి చేసుకొన్న అణు ఇంధనాన్ని తనిఖీ చేయడానికి రష్యాకు పంపిన శాస్త్రవేత్తల బృందంలో ఈయన కూడా ఒకరు. 2001 లో వృత్తిరీత్యా అణు ఇంధన శాస్త్రవేత్తగా - భారత ప్రభుత్వ ప్రతినిధిగా రష్యాలోని మాస్కో నగరంలో పర్యటించిన అనుభవంతో - తెలుగు సాహిత్యంలో "మాస్కో స్మృతులు" పేరిట 'తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా'న్ని రచించారు. వచన కవిత్వంలో - కార్గిల్ యుద్ధంపై "విజయ విక్రాంతి" పేరిట దీర్ఘ కవితను రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో "ఏక వాక్య కవితల" ప్రక్రియకు ఆచార్య ఫణీంద్ర ఆద్యులు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం "వాక్యం రసాత్మకం" - "Single Sentence Delights" పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది. అది గాక, ఆచార్య ఫణీంద్ర రచించిన పలు కవితలు ఇంగ్లిష్ లోకి, హిందీ లోకి, కన్నడం లోకి అనువదించబడి వివిధ పత్రికలలో, అనువాద కవితల సంకలనాలలో ప్రచురించబడ్డాయి.
మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో రచించిన తన కవితల నన్నిటినీ సంపుటీకరించి, "తెలంగాణ మహోదయం" కావ్యంగా అందించారు. "సాహితీ సల్లాపాలు" పేరిట కవి, పండితుల ఛలోక్తుల సంపుటిని వెలువరించారు. 2024 లో డా. ఫణీంద్ర ఉత్సాహ వృత్తాలలో సంపూర్ణ రామాయణ ఇతివృత్తంతో రచించిన లఘుకృతి “శ్రీ రామాయణ తారావళి”ని ఇటీవలే చక్కని సంగీత నేపథ్యంతో గానం చేయించి, “ఆదిత్య మ్యూజిక్” ద్వారా యూట్యూబ్ లో ఆవిష్కరించారు. ఈ వీడియో మొదటి రెండు నెలలలోనే 23 వేలకు పైగా వ్యూస్ సాధించి, విజయపథంలో ముందుకు సాగిపోతూ ఉంది. డా. ఆచార్య ఫణీంద్ర "తెలంగాణ సాహిత్య అకాడమీ" ప్రచురించిన, ప్రాచీన కాలం నుండి నేటి వరకు గల తెలంగాణ కవుల పరిచయంతో రూపొందించిన "పరంపర" గ్రంథంలో మరియు తెలంగాణ ప్రభుత్వ "భాషా సాంస్కృతిక శాఖ" ప్రచురించిన "తెలంగాణ కవులు - కావ్యాలు" గ్రంథంలో స్థానం సంపాదించుకొన్నారు. తెలుగు సాహిత్యంలో పద్య, గేయ, వచన కవిత్వాలతో బాటు పరిశోధన, విమర్శ రంగాలలో విశేషంగా కృషి చేసిన ఆయన అనేక సాహిత్య వ్యాసాలను కూడ రచించారు.
ఆయన అందుకొన్న గౌరవాలలో ప్రధానంగా - శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన 'శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం' నుండి 'మహాకవి దాశరథి కృష్ణమాచార్య' సాహితీ పురస్కారం, 80 సంవత్సరాలపై చరిత్ర కలిగిన 'తెలంగాణ సారస్వత పరిషత్తు' నుండి మరియు 'వానమామలై వరదాచార్య' శతజయంతి ఉత్సవ సంఘం నుండి ‘వానమామలై వరదాచార్య స్మారక పురస్కారాలు', 'దివాకర్ల ట్రస్ట్' నుండి 'దివాకర్ల వేంకటావధాని' స్మారక పురస్కారం, ‘మహాకవి సినారె కళాపీఠం’ నుండి ‘సినారె సాహిత్య పురస్కారం’, ఏలూరు 'నవ్య సాహిత్య మండలి' నుండి 'పైడిపాటి సుబ్బరామశాస్త్రి' స్మారక పురస్కారం, 'తేజ ఆర్ట్ క్రియేషన్స్, భువనగిరి' నుండి 'ఆచార్య తిరుమల' స్మారక పురస్కారం, ఇంకా .. 'తెలుగు భాషా సంరక్షణ సంఘం, జగిత్యాల' నుండి 'బోయినపల్లి వేంకట రామారావు' స్మారక పురస్కారం, 'రంజని సాహితీ సమితి' నుండి "రంజని - విశ్వనాథ" పురస్కారం, 'సిలికానాంధ్ర, యూ.ఎస్.ఏ.' నుండి 'సిలికానాంధ్ర' గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ 'ఎక్స్ రే' సంస్థ సాహిత్య పురస్కారాలు, 'కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్' నుండి "వైజ్ఞానిక రత్న" పురస్కారం, పలుమార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'ఉగాది' సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలో, అట్లాంటాలో జరిగిన "నాటా" తెలుగు సభలలోనూ ఆహ్వానం అందుకొని, ప్రాతినిధ్యం వహించి, సత్కారాలతో గౌరవింపబడ్డారు.
ఇక శ్రీ ఫణీంద్రగారు తమ ఉపన్యాసానికి వస్తే, ఇవేళ్టి వేదికపై అయన "ఏక వాక్య కవితలు - మినీ కవితా ప్రక్రియ" అనే అంశంమీద ఉపన్యసించారు. కొండంత భావాన్ని పిపీలికమంత వాక్యంలో ఇమడ్చడం ఓ గొప్ప ప్రక్రియ అన్నారు. వారు వ్రాసిన ఏకవాక్య కవితా గ్రంథాలలోని కొన్ని కవితలు చదివి వినిపించారు. ఆయన ఉపన్యాసాన్ని శ్రోతలు మంత్రముగ్ధులై విన్నారు. ఉదాహరణకు రెండు మూడు కవితలు ప్రస్తావిస్తాను.
"అక్షరాలు సంగమించి అర్థాన్ని ప్రసవిస్తాయి"
"నలుగురి సాక్షిగా మూడుముళ్లతో ఇద్దరు ఏకమౌతారు"
"రాళ్ళలో ఏముంది? రాపిడిలో నిప్పుంది "
"జీవితం కాలిపోతున్నా జీవనాల్ని వెలిగించు!"
ఇలా అందమైన కవితలెన్నో.....
వారి ఉపన్యాసంపై శ్రీయుతులు మనోహర్ రెడ్డి గారు, సాధనాల వెంకటస్వామి నాయుడు గారు, గీత గారు, వీక్షణం భారతీయ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు స్పందించారు.
అనంతరం శ్రీ రాజేంద్ర ప్రసాద్, డా. రాధాకుసుమగార్ల సంయుక్త ఆధ్వర్యంలో కవిసమ్మేళనం ప్రారంభమైంది.
తొలిగా డా.గీతామాదవి గారు "జాబిల్లి చేవ్రాలు" అనే శీర్షికతో వారి సహజమైన సరళ భాషతో, కొండంత భావుకతతో, అందమైన వర్ణనలను గుప్పించిన కవిత చాలా హాయిగా ఉండినది. తరువాత శ్రీ నాళేశ్వరం శంకరం గారు పాల్కురికి సోమనాధునిపై కవిత చదివి అందరినీ అలరించారు..శ్రీ సాధనాల వెంకట స్వామి నాయుడు గారు కొన్ని అందమైన లఘు కవితలు చదివారు. శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు "ఇరవైలో అరవై" అనే వారి కవితలో పెడదారి పడుతున్న యువతపై చదివిన కవిత అద్భుతం. శ్రీ కొండ్రెడ్డి నాగిరెడ్డిగారు "రహదారులపై విన్యాసం, రమ్మని పిలిచే కైలాసం" అంటూ చదివిన ఏకవాక్య కవితలు చాలా బాగున్నాయి. శ్రీ జీ. మల్లికార్జున్ గారు వారి అక్షర సత్యం అనే కవితలో గొప్ప తాత్వికతను చొప్పించారు. శ్రీ మనోహర్ రెడ్డిగారు తన ఘంటారావంలో "దేవుడికి దణ్ణం పెట్టు దరిద్రునికి అన్నం పెట్టు" అంటూ చదివిన ఏక వాక్య కవితలు చాలా బావున్నాయి. శ్రీరామకృష్ణ చంద్రమౌళి గారు చదివిన మినీ కవిత కూడా అందంగా ఉంది.
ప్రసాదరావు రామాయణం అనే నేను "మాట్లాడుకోవాలి మనం" అనే శీర్షికతో మాటలు మనిషికీ మనిషికీ నడుమ కరువైతున్నాయి.అనేక సామాజిక సమస్యలపై మనం మాట్లాడుకోక పోతే ఎలా అంటూ సుదీర్ఘ కవితను చదివాను. బలుసాని వనజ గారు స్వాతంత్ర్య ఫలాలు అందలేదంటూ శ్రావ్యమైన గళంతో పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. డా.కొదాటి అరుణ గారు కొన్ని అందమైన మినీ కవితలు చదివారు. డా. రాధాకుసుమ గారు " గుడిమెట్లూ", అనే కవిత మధుర ఫల రసం త్రాగినట్టుంది. ఆచార్య ఫణీంద్ర గారు కొన్ని అద్భుతమైన ఛందోబద్ధ పద్యాలు చదివారు.
శ్రీమన్నారాయణగారు అసమంజసం అనే కవిత చదువగా, బృందగారు తపాలా దినోత్సవ సందర్భాన చక్కని, కమ్మని పాట వినిపించారు.ఆ పాటలో వారు" హ" అనే విరుపు ఓ చమక్కు.
శ్రీమతి నెల్లూరి ఇందిర గారు "నాన్న లేకపోతే" కవిత ఆర్ద్రంగా ఉన్నది. శ్రీ చిత్తాబత్తిన రాఘవులు గారు కొన్ని మినీ కవితలు చదివారు. పవిత్రగారి చిట్టి కవిత చాలా బావుంది.
శ్రీ కందుకూరి శ్రీరాములు గారు ప్లస్ అనే మినీ కవితనూ మరికొన్ని కవితలను చదివారు. పొదిలి శ్రావణి గారు ఓ మినీ కవితనూ,బుక్కపట్నం రమాదేవిగారుకూడా మినీ కవితలు చదివారు. శ్రీమతి పరాంకుశం కృష్ణ వేణి గారు " నేనో కవిత్వమై పోతాను" అంటూ బండెడంత భావుకత్వం నిండిన కవిత ప్రశంసనీయం. నెల్లూరు శశికళ గారు కొన్ని అందమైన నానీలు చదివి వినిపించారు. మేడిశెట్టి యోగేశ్వరరావు మినీ కవితలు అందరినీ అలరించాయి. శ్రీ ఉమామహేశ్వరరావుగారు అక్షరం మన ఆయుధం అంటూ చదవగా ఉప్పలపాటి వెంకట రత్నం గారు కొన్ని సప్తపదులు చదివారు. శ్రీమతి చీదెళ్ల సీతాలక్ష్మి గారు ఛందోబద్ధ పద్యాలు వినిపించారు. శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు అబ్దుల్ కలాం గుణగణాలను ప్రశంసిస్తూ చదివిన కవిత బావుంది. కవి సమ్మేళన సామ్రాట్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు తన సహజమైన శైలిలో, గంభీరమైన కంఠంతో చదివిన కవితకు హాట్స్ ఆఫ్. డా.రాధాకుమగారు, రాజేంద్ర ప్రసాద్ గార్ల వందన సమర్పణతో సభ ముగిసింది.
అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.