అమృత వాక్కులు -- శ్రీపాద సుబ్రహ్మణ్యం
1.ఆటవెలది
ఈర్ష్య యేను మనకు నిసుమంత తగదుర
మనిషి మొత్తమునకు మసిని బూయు
కాన వచ్చె నేని కంపర మేనుగ
ఆలకించు మయ్య అమృత వాక్కు
2.ఆటవెలది
కృషిని సలుపు మెపుడు ఋషిని బోలి నరుడ
వళ్ళు వంచ కున్న ముళ్ళ బాట
తెలివి జూపి నీవు తెగువ జేయు మెపుడు
ఆలకించు మయ్య అమృత వాక్కు
3. ఆటవెలది.
మనసు నందు మనకు మార్గము లుండురా
తెలివి తోడ నీవు తెమ్ము గెలుపు
చింత యున్న నీకు చీకాకు కలిగించు
ఆలకించు మయ్య అమృత వాక్కు.
4. ఆటవెలది
చెరుకు నెపుడు గాని చేదు రసము రాదు
నోటి దోష మేను నొక్కి జెప్ప
తప్పు మనల దేను తప్పని సరిగాను
ఆలకించు మయ్య అమృత వాక్కు.
5. ఆటవెలది
సాహసమ్ము జేయు సాదరముగ నెపుడు
ధైర్య మేను వచ్చు ధరణి యందు
గుండె ధైర్య మున్న కూర్మి లాభము లుండు
ఆలకించు మయ్య అమృత వాక్కు.
కలల కోసం -- పద్మావతి రాంభక్త
పసితనపు పసిడి కల
తీయగా ఇప్పటికీ ఊరిస్తుంటుంది
యవ్వనపు అక్షరాల కల
అందని ద్రాక్షై
దూరమవుతూ ఉంటుంది
నడివయసు ఆకుపచ్చని కల
ఆకులు రాల్చేసుకుని
లోపల కొలిమి రాజేస్తూ ఉంటుంది
చిట్టచివరి చిగురు కల
చిరుగులు పడి
హృదయాన్ని కత్తిరిస్తూ ఉంటుంది
ప్రతి మనసు
ఏవో కలల కోసం కలవరిస్తునే ఉంటుంది
కొన్ని మాత్రమే ఫలాలై
అరచేతికి అందుబాటులో
వేళ్ళాడుతాయి
ఎన్నో కాలపు ఇనుపకౌగిలిలో నలిగి
అదృశ్యమవుతాయి
కానీ కలల కింద పడి
జీవితం మాత్రం చితికిపోకూదడు
కొత్త కలల రంగులను అన్వేషిస్తూ
అందమైనని మొలకెత్తిస్తూ
సాగిపోవాలి
నవ్యోత్సాహాన్ని చేదుకుంటూ
నింగికి గురి పెట్టి
ఎగిరిపోవాలి
ఆదివారము -- లలితా భాస్కర దేవ్
వారములకు ఆది(అధి)పతియై
అంతటా వెలుగైన ఆదిత్యుడిని
ఆత్మకారకుడంటూ ఆదిత్య హృదయంతో పారాయణం చేస్తూ ఆరోగ్యప్రదాతవంటూ
సూర్యనమస్కరాలు చేస్తూ
కొలిచేటి ఓనాటి ఆదివారాలు మారి..
ఆట విడుపులకు నెలవై
వారానికి *ఆదినో* లేక *తుదో*
తెలియక, నిద్రాదేవికి చేరువై,
బడలికలు తీరుటకు మేలై,
అమ్మలకు అలుపై,హోటళ్ళకు వెలుగై,
షాపింగ్ కు అనువై,మీటింగ్ లకు వీలై
కలిమి లేములు ఎరుగక ,
అందరికి విందై, కళకళ లాడుతూ నేడు గడిచే
ఆదివారం ఆనందం పంచేది
అమ్మలకు తప్ప,అందరికి సెలవిచ్చేది
పిల్లలు తమపుస్తకాలను నిద్రపుచ్చేది
ఆటలకు.. పోటీలను పెంచేది
ఇల్లు అంతా సద్దేసేది
అతిధులను ఆదరించేది
రోజు వారి పనులకు స్వస్తి పలికేది
వారంమంతా ఆగిన.. ఇంటింటి
పనులను పూర్తి చేసే ఆదివారం
అంటే అందరికీ ఇష్టంమేగా!
మాట విలువ -- వెగ్గలం ఉషఃశ్రీ
మాట మనసును హత్తుకుంటే
అభిమానం మొలకెత్తు
మనసెరిగి మాట్లాడితే
అనుబంధాలు వికసించు
ముందో మాట వెనకో మాటైతే
మోస స్వభావం అంకురించినట్లే...
మాటా మాటా పెరిగితే
నేనేం తక్కువనే అహంకారం
మాటల గుణపాలను విసురు
గతితప్పిన పలుకులు
అవాకుచెవాకు శరాలై చెలరేగు
దిగజారుడుతనం అక్కడే సాదృశ్యమగు...
పెరిగిన వాదం
విచక్షణను మరిపించి
పరుషపదజాలాన్ని అస్త్రశస్త్రాలుగా చేసిన
హృదయాలయాలలో విధ్వంసమే...
గుండె బాధామయ సంద్రాన్ని తలపించు
బంధాలకు బీటలుపడితే
ఇద్దరి చూపులు నేల వైపే
కళ్ళల్లోకి చూడలేని దోషభావన
ఎప్పుడో ఒకనాడు తప్పక కలిగితీరు
అపరాధం కడగేసుకోవడం అంత సులువేం కాదు!
వాక్కు... వాడికత్తి కన్నా పదును
మాటల అస్త్రాలను వదిలితే ఉపసంహరణ అసాధ్యం!
మాట మాట పెరిగితే
రెండు మనసులకూ గాయాలే
మరుపే ఔషధమైనా...
అదంత సులువుగా లభించే అంగడి సరుకు కాదు!
సంయమనం, సహనం అవసరం
ఒక్కోసారి మౌనం కూడా వేలమాటల సమమే
మాట విలువను గ్రహించి
ఆచితూచి ప్రయోగిస్తేనే
మనకు విలువ!!