Menu Close
Uma-Bharathi-HG-02
హృదయగానం (ధారావాహిక)
నేడే విడుదల
కోసూరి ఉమాభారతి

14

hrudayagaanam-14-police

చీర, పరికిణీ వోణీ ఏ స్టయిల్లో అయినా తాను ధరిస్తానని, అంతకన్నా ఆధునాతనం వద్దని పారూ తేల్చిచెప్పడంతో ఆమె ఇష్టానుసారమే ఓ పది పట్టు చీరలు, పది డిజైనర్ పావడా డ్రెస్సుల నమూనాలు ఎంపిక చేసి కొలతలు ఇచ్చింది పారూ.

ఎంత వద్దన్నా, వాదించినా నానమ్మగారిని కూడా కాదని అడ్వాన్స్ ఐదు లక్షల రూపాయల వరకు తానే చెల్లించాడు కిరణ్. తతిమ్మా బాలన్స్ పారూ ఇస్తుందని నవ్వేసాడు.

ఇదంతా గమనిస్తున్న మీనాక్షికి ఒళ్ళు మండింది. "బావా! అసలేమిటి? మరి నన్నెందుకు రమ్మన్నావు? ఈ పాత చింతకాయ పచ్చడికి... నా బోటి వాళ్ళ ఎంపిక ఏముంటుంది?" అని కిరణ్ తో అని, పారూ వంక చూసింది.

"అయినా ఇలా డ్రెస్ చేసుకుంటే అక్కడ ప్రోగ్రాములకి జనం వస్తారా? నిర్వాహకులు భారీ ఎత్తున నష్టపోతారేమో. దీనికోసం బావని పిలవడం ఎందుకు? మాకు టైం వేస్ట్. నాకు తలనొప్పి." అంటూ విసుగ్గా అక్కడి నుండి లేచింది మీనాక్షి.

"ఇక చాలు మీనా. పారూ ఇలా డ్రెస్ చేసుకుని, అలా పాడుతుందనే... ఆమెకి ఇంత పేరు, విదేశీ పర్యటనల అవకాశాలు వచ్చాయని నీకు తెలీడంలేదా? నీక్కూడ మంచి అభిరుచి ఉందని, స్నేహంగా సలహాలిస్తావని రమ్మన్నాను. నీకు తలనొప్పి అన్నావుగా. పద అందరం లంచ్ కి వెళదాము. పక్కనే మంచి బఫెట్ ప్లేస్ ఉంది." అన్నాడు కిరణ్ ఓపిగ్గానే.

"లేదు నేను రాను. అక్కడ నీ 'స్వీట్ నథింగ్స్’ ప్రవర్తనతో నాకు జ్వరమే వస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను." అంటూ విసురుగా బయటికి నడిచింది మీనాక్షి.

నిముషం పాటు మిగతా అందరూ ఆ అమ్మాయి వాక్కులకి నివ్వెరపోయారు. మీనా అలా తన అక్కసుని, అయిష్టతని వెరపు లేకుండా వెళ్లగక్కడాన్ని కిరణ్ కూడా జీర్ణించుకోలేక పోయాడు.

తేరుకుని, "పదండి నానమ్మగారు, నాకు ఆకలిగా ఉంది. మనం లంచ్ తినాలి. ఆ పిచ్చితల్లి మీనాక్షిని క్షమించండి. అలాగే మాట్లాడుతుంది. తొందరపాటు ఎక్కువ." అనడంతో కిరణ్ని అనుసరించారు పారూ, శాంత కూడా.

తనని అన్ని మాటలు ముఖం మీదే అనేసిన మీనాక్షి పై కోపం కన్నా ఎక్కువగా అవమానపడింది పారూ. ‘నిజంగానే తన ఆలోచన తప్పా? బావని తను లాక్కొచ్చిందా? అసలు ఈ కాస్ట్యూమ్స్ అవసరమా? తనకి మంచి అభిరుచి లేదా?’ అనుకుంటూ అతిమెల్లగా నడుస్తున్న ఆమెని కిరణ్ త్వరగా నడవమంటూ చేయి పట్టి గబగబా ముందుకు తీసుకువెళ్లాడు.

***

అక్కడి వంటకాల రుచులు గురించి చెబుతూన్న కిరణ్ తో "నీవు కూడా కడుపునిండా తిను కిరణ్." అంది శాంత.

"సరే గాని బాబూ, ఎందుకు మీనాక్షికి అంత కోపం? మేమంటే సహించడంలేదా? లేక నిన్నేదో మేము వాళ్ళ నుండి లాక్కుంటున్నామని బాధా?" అంటూ కిరణ్ని నిలదీసింది సీతమ్మ గారు.

"నానమ్మగారూ! ఒకేసారి ఇన్ని ప్రశ్నలా? నేను వెళ్ళి, స్వీట్ తెచ్చుకుంటాను. మీకూ తెస్తాను." అంటూ లేచాడు కిరణ్. శాంత అనుసరించింది. మౌనంగా తల వంచుకుని తింటున్న పారూని చూసిన అమ్మమ్మ మనసు చివుక్కుమంది.

"పారూ, జీవితమన్నాక ఎన్నో అడ్డంకులుంటాయి. మనిషి తన మనసులోని భావాలకు, ప్రేమలకు మాత్రమే కట్టుబడి ఉండాలి. అడ్డంకుల్ని జాగ్రత్తగా తొలిగించవచ్చు. నీవు, కిరణ్ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారని మాకు తెలుసును. మీ నాన్న ఆశీర్వాదం కూడా నీకు ఉంది. అసలు మీనాక్షి విషయం తెలియాలి, కాక కిరణ్ మనసు కూడా తెలియాలి. నీవు నిశ్చింతగా నీ మనసు మాట విను." అంటూ భుజంపై చేయి వేసి మనమరాలి చెక్కిలిపై ముద్దు పెట్టుకుంది అమ్మమ్మ.

నీకో మంచో కొటేషన్ చెప్పి చాలా రోజులయింది కదూ...విను.

"జీవితపు నిస్పృహలలో నీలోని విజేతను నశించిపోనీయకు. నీవు ఆశించిన జీవితాన్ని పొందలేనని ఎన్నడూ అనుకోవద్దు. నీ కోరిక తీరుతుంది. నీదంటూ ఓ ప్రపంచం ఉంటుంది. దాని ఉనికి వాస్తవమే. అది సాధ్యమే. అది నీదే." అన్నాడు అట్లస్ ష్రగ్గ్‌డ్…” అన్నది సీతమ్మ.

విన్న పారూ ముఖాన ఓ చిరునవ్వు కనబడడంతో అమ్మమ్మకి తృప్తి కలిగింది.

ఇంతలో రెండు ప్లేట్లల్లో రకరకాల స్వీట్స్ తెచ్చి సీతమ్మ గారి ఎదుట ఉంచి,

"మీరు ముందు తీసుకోండి. మీ ప్రశ్నకు జవాబు చెబుతాను." అన్నాడు కిరణ్ నవ్వుతూ.

ముగ్గురినీ ఉద్దేశించే అయినా సీతమ్మ వంక చూస్తూ, "నానమ్మగారు, నిజానికి మీనాక్షి అమాయకురాలు. మనసు మంచిదే. కాస్త మొండి, కాస్త తిక్క. మా మామయ్యా వాళ్లకి మీనాక్షి దత్త పుత్రిక. అపురూపంగా, అతి గారాబంగా పెంచుకున్నారన్నమాట. అదే కాక, అందరూ తన ఇష్టానుసారం నడుచుకోవాలని, తన అదుపులో ఉండాలని అనుకునే మనస్తత్వం ఆమెది.

అత్తయ్యా, మామయ్య నన్ను సొంత బిడ్డలానే భావిస్తారు. నాకూ మా మామయ్య అంటే ప్రాణం. మీనాక్షి నాకో బాధ్యత. నా వేలు పుచ్చుకుని అడుగులు వేసింది. నావెంటే స్కూల్లో చేరింది. ఎన్నో మార్లు ఎన్నో చికాకుల నుండి తనని కాపాడాను. నిజం. తాను పెద్దవాళ్ళ పట్ల బాధ్యతగా ప్రవర్తించాలని ఆశించడం తప్ప ఏమీ లేదు.

నేను కలగజేసుకోకుంటే, వాళ్ళ అమ్మానాన్నలకు ప్రశాంతత ఉండదు. అందుకని కూడా నేను వారిని నా సొంత కుటుంబంలా బాధ్యతగా భావిస్తాను. మీరంతా కూడా ఇప్పుడు మా బంధువులని, పారూని మెచ్చుకుంటానని, పారూకి సలహాలిస్తానని ఉక్రోషం మీనాకి." అని వివరించాడు.

మిగతా స్వీట్స్ అందరితో తినిపించాకనే అక్కడి నుండి లేచాడు కిరణ్.

“సరైన సమయానికి ఇల్లు చేరుతాము నానమ్మగారు. మీరు తిరిగి వెళ్లే లోగా ఇవాళ సాయిబాబా గుడికి, రేపు మహాలక్ష్మి టెంపుల్ కి మిమ్మల్ని తీసుకెళ్లాలని అమ్మ ప్లాన్.” అంటూ కార్ స్టార్ట్ చేసాడు.

***

మరునాడు హైదరాబాదులోని పేరొందిన 'రామోజీ స్టూడియోస్ ని చూసుకుని, సికింద్రాబాద్‌లోని శ్రీ మహాలక్ష్మి దేవస్థానం సందర్శించుకుని ఇల్లు చేరారు మహిళలంతా. స్వయంగా చాయ్ చేసి వారికి అందించాడు కిరణ్. ఛాయ్ సేవించాక, అందర్నీ ట్రాక్ మీద నడవాల్సిందే అని బయలుదేరదీసాడు.

కిరణ్ తో పాటు అంతే వేగంగా నడవగలిగింది ఒక్క పారూ మాత్రమే.

"ఇంతకీ... మీనాక్షి ప్రవర్తనకి ఇంకేమైనా కారణం ఉంటే చెప్పు బావా." అని సూటిగా అడిగింది పారూ.

పక్కకి తిరిగి పారూని నిశితంగా చూసాడు కిరణ్. "ఇంత చెప్పాకైనా నీవో అంచనాకి రావాలిగా. సరే... విను.  మీనాక్షి స్నేహితుల ప్రభావానికి లోబడి నడుచుకుంటుంది. సాంప్రదాయాలకు విలువనిచ్చే తల్లితండ్రులకి విరుద్ధంగా నడుచుకోడం, ఫ్రెండ్స్ తో క్లబ్బులకి వెళ్లడం, పరీక్షలు ఎగ్గొట్టి మార్నింగ్ షోలకి తిరగడం లాంటి ఆమె చేష్టలని నేను ఎన్నో మార్లు అడ్డుకున్నాను.

మామయ్య వాళ్ళ కోసం నేను మీనాక్షితో స్నేహంగా ఉంటూ మంచి మాటలతో దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాను. నేను చిన్నప్పటి నుండి తనలాంటి అమ్మాయిలనే చూసాను. నాకు అటువంటి సంస్కృతి  నచ్చదు. నా ఆశలు, ఆశయాలు తప్ప ఇతరత్రా ఒత్తిళ్లకు లోనయి తలొగ్గే మనిషిని కాదు. నా ఆశ నీవే, నా ఆశయం నీవే పారూ." అంటూ ఆమె చేయందుకుని కాస్త దూరం వరకు వేగంగా పరిగెత్తించాడు.

***

ఇల్లు చేరి, ఫ్రెష్ అయి అందరూ భోజనానికి కూర్చున్నారు. కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తుండగా శ్రీనివాస్ గారి నుండి ఫోన్-కాల్ అందుకున్నాడు కిరణ్. ఆయన చెప్పేది వింటూ అటనుండి హాల్లోకి నడిచాడు.

మరి కాసేపటికి, హడావిడిగా తిరిగి వచ్చిన కిరణ్ బ్యాక్ ప్యాక్ అందుకున్నాడు.

"మామ్, డాడ్ నేను బయటికి వెళుతున్నాను. వచ్చాక వివరిస్తాను. ఒక అమ్మాయికి అర్జెంటుగా సాయం చేయాలి. త్వరగానే వస్తాను. ఇక నాకు తోడుగా పారూని తీసుకు వెళ్ళొచ్చా శాంతా ఆంటీ!” అని కిరణ్ అడగడం…

"టొయోటా కార్ తీసుకుని వెళ్ళు. త్వరగా వచ్చేయి.” అని శ్రీనాధం అనడం జరిగిపోయాయి. దాంతో శాంత ఏమనలేక పోయింది. పారూకి బయలుదేరక తప్పలేదు.

***

కారు మాదాపూర్ దాటుతుండగా, "ఏమిటలా మౌనంగా ఉన్నావు? మధ్యాహ్నం మీనాక్షి అలా మాట్లాడిందని బాధగా ఉంది కదూ. నీ మీద జెలసీతో రగిలిపోతుంది. నీకు మళ్ళీ చెపుతున్నాను. నేనేనాడు తన పట్ల ప్రేమగా గాని, ఆసక్తి ఉన్నట్టు గానీ ప్రవర్తించలేదు.

నాకు మీనాక్షి పట్ల అటువంటి అభిప్రాయం లేదని, సలహాలిస్తూ ఓ మంచి స్నేహితుడుగా తనకి అండగా మాత్రమే ఉంటాననీ... మొన్నా మధ్య వారందరికీ విఫులంగా చెప్పాను కూడా." అంటూ పారూ వంక చూసాడు.

ఆమె చెక్కిలి పై చిటికేసి... “నాకు నీ పట్ల మాత్రమే ఇష్టం పారూ. ఎప్పుడూ నీ ధ్యాసలోనే గడుపుతుంటాను. మరి నేనంటే నీకు ఎంత ఇష్టమో చెప్పవా?" అని కిరణ్ అడిగినా తల వంచుకుని మౌనంగానే ఉండిపోయింది పారూ.

"సరే, ఊరెళ్ళేలోగా జవాబు చెప్పు. ఇప్పుడు మాత్రం మనం మన మీనాక్షిని వెతికి పట్టుకుని ఇంటికి చేర్చాలి. మొన్నటి నుండీ ఇంటికి రాలేదంట. మామయ్య ఆ విషయం నాకిప్పుడు చెప్పారు. అమ్మానాన్నల మీదనో, లేదా నామీదనో కోపం వస్తే ఇలాగే మాయమైపోతుంది. దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు రంజిత్ అని. వాడి చెల్లెలు రాణి. తప్పుడు మార్గంలో నడిచేందుకు ఈమెకి ఆమె గురువు. రంజిత్ కూడా మంచివాడు కాదు. వాళ్ళింటికే వెళ్ళుంటుంది.

ఇక్కడ పక్కనే నళిని మేడమ్ ఉంటారు. మనకి బాగా కావాల్సిన వారు. రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి. ఇంతకు ముందు కూడా మనకి సాయం చేశారు. ఆమెని తీసుకుని రంజిత్ ఇంటికి వెళ్లి మీనాని తిరిగి వాళ్ళింటికి తీసుకెళ్ళాలి. అదీ విషయం." అన్నాడు కిరణ్.

వింటున్న పారూ ఆశ్చర్య పోయింది. "అయ్యో పాపం శ్రీనివాస్ అంకుల్, ఆంటీ ఎంత బాధ పడుతున్నారో! మీనాక్షి మరి క్షేమంగా ఉంటుందంటావా బావా?" అడిగింది పారు.

"చూద్దువుగాని పద." అని జవాబిచ్చాడు కిరణ్.

***

అనుకున్న విధంగానే మీనాక్షి రంజిత్ వాళ్లింట్లోనే ఉంది. నళిని మేడమ్ రంజిత్ తో మాట్లాడి ఐదు నిముషాల్లో మీనాక్షిని తీసుకువచ్చి కిరణ్ కారులో వెనుక సీట్ లో కూర్చోబెట్టింది.

కారు స్టార్ట్ అవగానే పక్కనే ఉన్న మీనాక్షితో, "ఏమ్ మీనా! నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. రంజిత్ నుండి దూరంగా ఉండమని. మీ నాన్న గారు ఈ ఊళ్ళో పేరున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త. రంజిత్ గాడు ఓ గుండా రాజ్యం యువరాజు. కనీసం మీ నాన్నగారి పైన గౌరవముంచి నీవు అనుగుణంగా నడుచుకోవాలి.

మీ బావ వల్ల నీవు ఇది నాలుగోసారి క్షేమంగా ఆ గొయ్యారం నుండి బయటకి నడిచావు. ఇలాగే సాగితే ఎప్పుడోసారి ఈ వలలో చిక్కుకుని నీ కుటుంబం పరువు తీసుకుంటావు. అలా జరిగితే, మీ నాన్నగారు గుండె ఆగిపోతుందని తెలుసుకో. మీ నాన్నగారి పట్ల నాకున్న గౌరవాభిమానాల వల్లనే నేను నీకోసం ప్రతిసారీ వస్తున్నాను. నీవేమీ చిన్న పిల్లవి కావు. మీ బావ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడు. ఇది ఇక ఫైనల్ అనుకో మీనాక్షి." అన్నారామె కటువుగా. మీనాక్షి అంతసేపూ ఏడుస్తూనే ఉంది.

***

నళిని మేడమ్ ని కూడా ఇంట దింపి, అక్కడి నుండి పారూని ఐస్-క్రీం పార్లర్ కి తీసుకుని వెళ్ళాడు కిరణ్.

ఐస్-క్రీం తింటూ మౌనంగా పరధ్యానంగా ఉన్న పారూతో "మరి నేనంటే ఇష్టమని చెప్పు, నాతో జీవితాంతం ఉంటానని చెప్పు పారూ!" అన్నాడు ఆదుర్దాగా కిరణ్.

నీళ్లు నిండిన కళ్ళతో కిరణ్ వంక చూసిన పారూ... “నీవేంటో, నీ వ్యక్తిత్వం ఏమిటో అర్ధం చేసుకున్నాను. నా వంటి ఓ మధ్య తరగతి అమ్మాయికి భాషా, నడవడి నేర్పి, ప్రేమని పంచిన నీవే ... నీ పట్ల నాకెంత ప్రేముందని అడుగుతున్నావు. ప్రేమో ఏమో తెలియదు కానీ మనసా వాచా కర్మేనా నేను నిన్ను ఆరాధించేదాన్నే. అదీ జీవితాంతం." అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పారూ.

"మరి జీవితాలనే మార్చేసే ఇంత మంచి సంగతి చెప్పి ఇలా కంట నీరెందుకు? ఐ లవ్ యు" అంటూ ఆమె కళ్ళు తుడవబోయాడు కిరణ్.

"ఐ టూ లవ్ యు... మనసు లోని మాట చెప్పేసాను. ఇప్పుడు మనం వెళ్ళాలి. రేపు పొద్దుటే మాకు ఫ్లైట్." అంది నవ్వుతూ పారూ.

***

హైదరాబాద్ నుండి కాకినాడలో ఫ్లైట్ దిగి ముగ్గురు ఆడవాళ్లు ఇల్లు చేరేప్పటికి ఇల్లు తాళం వేసుంది. పారూ తండ్రికి ఫోన్ చేస్తే జవాబు లేదు. జననీకి చేసినా లాభం లేకపోయింది.

"సరే, నేను తోటలోకి వెళ్లి జాలీ గదిలో కొక్కానికి పెట్టిన తాళంచెవి తెస్తాను. సమయం పట్టవచ్చు." అంటూ వెళ్ళింది పారూ.

అదే సమయానికి, రామ్ కారు కాంపౌండ్ లోకి వచ్చింది. కారులో నుండి దిగిన జననీ పరుగున వచ్చి తల్లిని వాటేసుకుని ఏడవసాగింది. రామ్ మాత్రం కారు దిగి నేరుగా ఇంట్లోకి దారితీసాడు. పిల్లని పొదవి పట్టుకునే అందరితో పాటు శాంత భర్తని అనుసరించింది.

రామ్ మౌనంగా తలపట్టుకుని హాల్లోని మధ్య సోఫాలో కూర్చునున్నాడు. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. శాంత వెళ్లి  రామ్ పక్కనే కూర్చుని "ఏమైంది? పునీత్ ఎక్కడ?" అనడిగింది ఆదుర్దాగా.

ఒక్కసారిగా భావోద్వేగానికి గురయిన భర్త భుజంపై చేయి వేసి “ఏమయిందో చెప్పండి.. పునీత్ బాగానే ఉన్నాడా?" అనడిగినా జవాబు వెంటనే రాకపోవడంతో "జననీ, పునీత్ ఎక్కడ? చెప్తారా లేదా?" అంది బిగ్గరగా.

జననీ గబక్కున వచ్చి తల్లిని కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ... "అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడమ్మా. మాట్లాడ్డం లేదు. అన్న దగ్గరికి ఎవ్వర్నీ వెళ్లనివ్వరట రేపటి వరకు." అంది.

తలెత్తి శాంత వంక చూసాడు రామ్. "సరోజ అనే అమ్మాయి ఇంట్లో పుట్టినరోజు పార్టీకి వెళ్ళాడట. పార్టీ అయ్యాక అతిధులందరూ వెళ్ళిపోయినా తాను మాత్రం అక్కడే ఉండిపోయాడట. సరోజా వాళ్ళ నాన్నకి తెలియకుండా ఆయన బార్ నుండి లిక్కర్ బాటిల్ అపహరించి వీళ్లిద్దరూ పూర్తిగా తాగేసారట. సరోజ తల్లి పొద్దున్నే నాలుగింటికి వెళ్లి చూస్తే ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉండడంతో ఎమర్జెన్సీలో అడ్మిట్ చేశారు.

ఇద్దరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. వీడి వల్లనే తమ పద్నాలుగేళ్ల అమ్మాయి మొదటిసారిగా ఈ పిచ్చి పని చేసిందని, ఆ అమ్మాయి కుటుంబం కూడా వీడి మీద కోపంగా ఉన్నారు. రేపటికి గాని వీళ్ళ పరిస్థితి తెలియదు." అని బాధపడుతూ ఏకరవు పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు రామ్. వింటున్నవారు అవాక్కయ్యారు.

***

ఆ ఇరువురికి ట్రీట్మెంట్ జరిగి, కడుపు ప్రక్షాళన జరిగాక, మరునాడు సాయంత్రానికి పిల్లలిద్దరూ తేరుకున్నారని తెలిసాకే ... శాంత నోట్లో మంచినీళ్లు పోసుకుంది. కొడుకు ఇంటికి వచ్చాక కూడా ఇంట్లో మౌనం రాజ్యమేలుతుంది. ఏదోలా యదావిధిగా రోజూవారీ జీవనం గడిచిపోతుంది.

రెండురోజులు గడిచాక కూడా శాంత మౌనం వీడలేదు. మానసికంగా బాగా కృంగిపోయింది. కొడుకు భవిష్యత్తు, వాడి ఆలోచన, నడవడిక ఎప్పుడు ఎలా తిరుక్కుంటుందో అన్న అయోమయంలో ఉండిపోయింది.

సీతమ్మ గారు కూడా మనవడి గురించి ఆందోళన చెందుతుంది. పారూకి కూడా అంతే బాధగా ఉన్నా తాను మాత్రమే పునీత్ తో ఇదివరలోలా మసులుకుంటున్నది. పునీత్ ఫ్రెండ్ సరోజకి ఫోన్ చేసి మాట్లాడింది.

****సశేషం****

రచయిత్రి పరిచయం ....

‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.

1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.

బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.

సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.

సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమెరికా లోని వివిధ (25)  దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.

రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట  ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.

ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.

నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన  ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.

విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్  సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్

Posted in November 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *