Menu Close
అద్వైతం
-- భావరాజు శ్రీనివాస్ --

జీవజగత్తులు (relativity) కార్యమై, ఈ కార్యం యొక్క సృష్టి, స్థితి, లయలకు ఈశ్వరుడు కారణమైతే ఈ కార్యకారణ సంబంధాన్ని, relativityని, కార్యం ముందా, కారణం ముందా? (చెట్టు ముందా, విత్తు ముందా?} అన్న తర్కాన్ని (reason) దాటి ఉన్నది ‘సత్యం’ (Reality). అది బ్రహ్మం. బ్రహ్మంలో కార్యకారణాల, నరనారాయణుల, జీవేశ్వరుల ఐక్యం ఉన్నది. కారణమైన ఈశ్వరుడే కార్యరూపం గా (జీవుడుగా, జగత్తుగా) అంటే సృష్టికర్తే, సృష్టిగా మారి కనిపిస్తున్నాడు. జ్ఞానం ఈ సత్యాన్ని, ఐక్యాన్ని బ్రహ్మాన్ని దర్శించడం కోసం కార్యకారణ సంబంధాన్ని (relativity) దాటి పోయినపుడు ఆ ‘జ్ఞానం’ కూడా బ్రహ్మమే అవుతున్నది. సత్యం, జ్ఞానం అయిన బ్రహ్మం కార్య కారణాలను (జీవజగదీశ్వరు లను) వ్యాపించి, వాటిని తనలో లయం చేసుకుని, నదులన్నిటినీ తనలో లయం చేసుకున్న సముద్రంలా ‘అనంతం’ అయింది. ‘సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ’. ‘అనంతం’ అంటే అంతం(మృతం)లేనిది’. మృతం కాని (మార్పు లేని) అనంతత్వమే సౌందర్యం, ఆనందం. అందువల్ల సౌందర్యం కోసం, ఆనందం కోసం ప్రయత్నం చేసే మనిషి జ్ఞానం అతణ్ణి సత్యం వైపు అనంతత్వం వైపు నడిపిస్తుంది. అనంతత్వానికి అంతం (మృతం) లేదు కాబట్టి సత్యం యొక్క సౌందర్యానికి, దాన్ని జ్ఞానం గుర్తించినపుడు వచ్చే ఆనందానికి మృతి లేదు. (A thing of beauty is a joy forever-అన్న కీట్స్ కవి మాటకు అర్ధం ఇదే) ‘సత్యం,జ్ఞానం,అనంతం’ అయిన బ్రహ్మమే ‘సత్యం,శివం సుందరం’ ; సత్ చిత్ ఆనందం (సచ్చిదానందం).

నదులన్నీ అనంతమైన సముద్రంలో కలిసి నదులుగా అంతమై సముద్రంగా అనంతత్వాన్ని పొందినట్టు, జీవజగదీశ్వరులు బ్రహ్మంలో లయమై జీవజగదీశ్వరులుగా అంతమై (మృతమై) బ్రహ్మంగా అనంతతత్వాన్ని, (అమృతత్వాన్ని) పొందుతున్నారు. ఇలా జీవుడుగా ఒక జన్మ, బ్రహ్మంగా మారి మరో జన్మ - ఇలా రెండు జన్మలు కలిగిన వాడు ద్విజుడు. జీవుడు బ్రహ్మంగా మారడమే, వామనుడు త్రివిక్రముడు కావడం.

భగవత్తత్వానికి, జ్ఞానానికి, బ్రహ్మానికి, (1)కి, ఆకారం,లింగం(+,-)లేదు. లింగాలు (జీవుడు, జగత్తు) లేకపోతే relativity (సంసారం) లేదు. సంసారం లేకపోతే దాన్నించి బయటపడేసే ఈశ్వరుడు (సన్యాసమూ) లేడు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు - ఈ త్రయమే, త్రిపుటి. త్రిపురాలు. ఈ త్రయం (తాప’త్రయం’) నుండి బయటపడడమే, త్రిపుటిని సంపుటిగా మార్చు కోవడమే, త్రిపురాలను అంతమొందించి త్రిపురాంతకుడు కావడమే మోక్షం. రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు, త్రిపురాల అస్తిత్వం, వాటి రహస్యం - త్రిపురా రహస్యం- అంతా బ్రహ్మంలో ఉంది. Relativity నుండి, ద్వంద్వాలనుండి విముక్తి(ముక్తం) అవడంతో బ్రహ్మం ‘శుద్ది’(శుద్ధం) అయ్యాడు. ఈ స్థితిని తన బుద్ధితో గుర్తించడంతో బ్రహ్మం ‘బుద్ధం’ కూడా అయ్యాడు. శుద్ధం, బుద్ధం, ముక్తం అయినపుడు కలిగే ఆనందమే బ్రహ్మం. ‘ఆనందో బ్రహ్మ’.

పోతనగారి గజేంద్రమోక్షం కథలో ప్రార్ధనా పద్యం “లోకంబులు లోకేశులు లోకస్థులుఁ దెగినతుది నలోకంబగు పెంజీఁకటి కవ్వలనెవ్వండేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్” ఇందులో లోకంబులు, లోకేశులు, లోకస్థులు(జగత్తు, ఈశ్వరుడు,జీవుడు)-ఈ మూడింటినీ, ఈ పెనుచీకటిని దాటి అవతల ఏకాకృతితో వెలుగొందుతున్న సత్యం, జ్ఞానం అనంతం అయిన బ్రహ్మాన్ని గజేంద్రుడు ప్రార్ధించాడు.

నేను నిద్రపోయి కంటున్న కలలో ఒక జగత్తు, ఒక జీవుడు. ఈ రెండింటి మధ్య జరిగే వ్యవహారాన్ని సాక్షిగా ఉండి చూస్తున్న ఈశ్వరుడు. ఈ మూడు పాత్రలు నాలోనుంచి వచ్చినవే. నేనే. మెళకువ తెచ్చుకుని (జ్ఞాననేత్రం తెరిచి) చూడగానే నేను బ్రహ్మం అని, జీవజగదీశ్వరుల్లో ఏదీ నేను కాదని గుర్తుకొస్తుంది. కల కరిగి, నేను కల్పించుకున్న పాత్రలు నాలోనే కలిసిపోయి, బ్రహ్మంగా నేను సత్యం, జీవజగదీశ్వరులుగా మిధ్య అని తెలుస్తుంది. కలలో, అజ్ఞానంలో జీవజగదీశ్వరులు సత్యమై, బ్రహ్మం మిధ్య అవుతుంది. పరోక్షంగా(absent) ఉండే బ్రహ్మం అపరోక్షం, ప్రత్యక్షం కావడమే ‘అపరోక్షానుభూతి’.

బ్రహ్మం‘ఏకం’. జీవజగదీశ్వరులు ‘అనేకం’. ఏకం-అనేకం- రెండులేవు. తెల్లని కాంతి ఏడురంగుల ఇంద్రధనస్సుగా మారినట్టు ఏకమే, అనేకంగా మారి కనబడుతోంది. వెలుగు రాగానే చీకటి వెలుగులో కలిసి పోయి అంతా వెలుగైపోయినట్టు ఏకం కనపడగానే, అనేకం ఏకంలో లయమై అంతా ఏకం అయిపోతుంది. అనేకాన్ని తనలో కలుపుకున్న ఏకమే పరిపూర్ణ మైన ఏకం. గాఢనిద్రలో జీవజగదీశ్వరుల ఉనికి, వాటి మధ్య భేదం ఉండదు. మెళకువలోని భేదబుద్ధి వాటికొక ఉనికిని, వాటిమధ్య భేదాన్ని కల్పిస్తుంది. మెళకువగా ఉంటూనే భేదబుద్ధిని వదులు కోగలిగితే అది యోగనిద్ర. గాఢనిద్రలో సుఖం, యోగనిద్రలో శాంతి లభిస్తాయి.

వేరు వేరుగా ఉండే జీవజగదీశ్వరులు కలిసినప్పుడు వచ్చేది ‘శబ్దం’. ఈ శబ్దానికి ‘అర్ధం’ బ్రహ్మం, మోక్షం. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మూడూ కలిపి ఒకటి (1)అని ‘అర్ధం’ కానంతవరకు, ‘శబ్దం’ చేస్తూ (విమర్శ, ప్రార్ధన, భజన చేస్తూ) వాటిని కలిపే ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే. జీవజగదీశ్వరుల్ని కలపవలసిన అవసరం లేదని, వారు కలిసే ఉన్నారని గుర్తించడమే మోక్షం. మోక్షం వచ్చేది( becoming) కాదు, ఉన్నదే (being). జీవజగదీశ్వరులు ఏకం(1)లో అంతం ఐనపుడు మిగిలేది ఏకాంతం, నిశ్శబ్దం. జీవుడిది ఒంటరితనం (lonelyness). ఈ ఒంటరితనం పోగొట్టుకోవడం కోసమే ఇటు జగత్తును, అటు ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తాడు. బ్రహ్మానిది ఏకాంతం (aloneness). అన్నింటినీ తనలో కలుపుకుని ఏకాకిగా, ఏకాంతంగా నిశ్శబ్దంగా ఉంటాడు.

గణితంలో, జవాబే ప్రశ్నాపత్రంలో ప్రశ్నగా కల్పన (సృష్టి) చేయబడుతుంది. చీకట్లో తాడును చూసి పాముగా భ్రాంతి చెందడం జరుగుతుంది. అలాగే అజ్ఞానంలో బ్రహ్మాన్నే జీవజగదీశ్వరులుగా మోక్షాన్నే బంధంగా ‘సృష్టి’ చెయ్యడం జరిగింది. సత్యాన్ని, బ్రహ్మాన్ని (reality) గుర్తించనంత వరకు వాటి ‘స్థితి’(appearence) కొనసాగుతుంది. బ్రహ్మజ్ఞానం కలగగానే ఆ మూడూ తిరిగి జ్ఞానంలో ‘లయం’ చెంది జ్ఞానం ఒకటే ఉంటుంది. మూడింటికీ ఉన్న సృష్టి, స్థితి, లయాలు, జననమరణాలు బ్రహ్మానికి లేవు. ఉన్న బ్రహ్మం, మోక్షం ఎపుడూ ఉంది. అందువల్ల అది సత్యం. నిత్యం. ఈ సత్యాన్ని గుర్తించి కల్పన నుండి, కల్పించుకున్న బంధాలనుండి బయటపడడమే మోక్షం.

****సశేషం****

Posted in November 2025, ఆధ్యాత్మికము

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *