Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
కొలిమి (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

"ఇందాకే చెప్పాను నాది ప్రైవేటు ఉద్యోగం. సెలవులు ఇవ్వరు. కాదు కూడదు మీరే వచ్చి తీసుకెళ్లాలి అంటే... నేను వచ్చి తీసుకెళ్లే వరకు మీరు వెయిట్ చేయాలి. అది సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు. ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి తీసుకెళ్తాను," అన్నాడు జంబేష్.

"ఈ టైం లో పంతాలెందుకు? కాలం గడిస్తే మనసు మారవచ్చు. అంతకుముందు కూడా మీరే దించేవారు కదా! ఇప్పుడు ఎందుకు అతను వచ్చి, తీసుకొని వెళతాడని ఆశపడటం. వాళ్లు రాలేమంటున్నారు కదా! వదిలేయండి. వాళ్లు చెప్పినా! వినే రకాలులా లేరు. మీరే తీసుకెళ్ళి దించేయండి. అమ్మాయి సంతోషంగా ఉండాలిగానీ, ఇవన్నీ ముఖ్యంకాదు," అంటూ... మూర్తితో ఎవరూ వినకుండా చెప్పాడు సర్పంచ్.

"సరే" అంటూ తల ఊపాడు మూర్తి.

మూర్తి తీసుకెళ్ళి దించడానికి, ఒప్పుకున్నాడు. జంపేసి వేరే కాపురం పెడతానని, ఇంకెప్పుడూ నేను తనను ఏమీ అనను, బాగా చూసుకుంటాను, అనే ఒప్పందాలు కుదరడంతో. జంబేష్, రాజన్ లు వెళ్లిపోయారు.

ఎస్సై కి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి, ప్రణవిని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు మూర్తి.

సర్పంచ్ కూడా కృతజ్ఞతలు తెలియజేసి బయటపడ్డాడు.

*****

"ఎందుకన్నా అలా చెప్పించావ్?

ఎంతో కొంత ఇచ్చి దాన్ని, దాని పిల్లల్ని... వదుల్చుకుంటే సరిపోయేది కదా! నిన్ను, వదినని అన్న మనిషితో నేను ఎలా కాపురం చేస్తాను?" అంటూ అన్న రాజన్ తో బాధగా అన్నాడు జంబేష్.

"మనం ఇప్పటికి... ఇలాగే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడితే... లేనిపోని చిక్కుల్లో పడతాం. మనం కష్టపడి సంపాదించుకున్నది, దానికి దారాదత్తం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అందరి దృష్టి దాన్ని కాపురానికి పంపించే దానిమీదే ఉంటుంది కానీ, ఆస్తి పంపకాలు మీద ఉండదు. అయినా ముందు ఇక్కడి నుంచి బయటపడితే, తర్వాత సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చు," అన్నాడు రాజన్.

"పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా! తర్వాత మనం ఏం చేసినా... జైలుకి వెళ్లాల్సి వస్తుంది." అన్నాడు జంబేష్.

"ఊరికే భయపడకు, అంతదాకా రాదు. నేనున్నాను కదా! నేను చూసుకుంటాను. అది వచ్చాక అయినా దాని దగ్గర ఏ విషయాలు చెప్పకు. ఏమి అడిగినా ఏమో తెలియదు అని చెప్పు. నన్ను వచ్చి ఏమి అడగలేదు. ఒకవేళ అడిగినా నాకు సంబంధం లేదు అని చెబుతా! ఇప్పుడు అవన్నీ ఎందుకు? తర్వాత ఇంటిదగ్గర మాట్లాడుకోవచ్చు." అని చెప్పాడు రాజన్.

ఇంటికి వెళ్లారు. పోలీస్ స్టేషన్ లో జరిగిన ఒప్పందాన్ని చెప్పారు.

"అది మనకు వద్దురా... దాన్ని చూస్తే నాకు కచ్చ... మన అందరి మీద కేసు పెట్టింది. మన మీద పెడితే పెట్టింది, పాపం రాణి! ఏ పాపం ఎరుగదు. దాని మీద కూడా పెట్టింది. దాని మొహం చూడాలంటేనే నాకు అసహ్యం." అంది సుందరి.

"లేదు అత్తా అలా అనకు. ఏది ఎలా ఉన్నా మనకు తప్పదు. మనం దాంతో మాట్లాడాల్సిందే!" అంది రాణి.

"నీ మంచి మనసుని అది అర్థం చేసుకోలేదు. నిన్ను కేసులో ఇరికించిందని, నాకు చాలా బాధగా ఉంది." అంది సుందరి.

"అమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు పెట్టుకుంటేనే గొడవలు వస్తాయి. అందువల్ల నువ్వు ఆ అమ్మాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది." అన్నాడు రాజన్.

*****

తలనిండా పూలు పెట్టుకుని పాలగ్లాసుతో గదిలోకి వచ్చిన రాణి... తలుపు గడియ వేసి, పాల గ్లాసు టీపాయ్ మీద పెట్టి, వచ్చి మంచం మీద, రాజన్ పక్కన కూర్చొంది.

"ఏంటి రాణి గారు జిగేల్ మంటూ మెరిసిపోతున్నారు... ఏంటి విశేషం?" అంటూ కన్ను గీటుతూ అడిగాడు రాజన్.

"మాకు ఏం విశేషాలు ఉంటాయి? వెళ్లి మళ్లీ దాన్ని తగిలించుకొని వచ్చారు కదా!" నిష్టూరంగా అంది రాణి.

'పిచ్చిదానిలా మాట్లాడకు. అదంతా డ్రామా... అలా చెప్పకపోతే...మనమీద కేసు ఫైల్ అయ్యి అందరం జైలులో ఉంటాము. ఆ ఉపద్రవం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికే ఈ ఎత్తుగడ," చెప్పాడు రాజన్.

"అయితే అది రాదా?"

"వచ్చే ఛాన్స్ ఇవ్వను."

"అది కుదరదులే బావ... పోలీసుల సమక్షంలో జరిగిన ఒప్పందం కదా!" అంది రాణి.

"ఎవరి సమక్షంలో జరిగితే ఏమి? వాళ్ళు నన్నేం చేస్తారు? ఎవర్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు," అన్నాడు.

"అలాగనుకొనే... దారిలో పోయే కంపను కదిలించావు. అది పీకకు చుట్టుకుంది" అంది కోపంగా.

"కామ్ గా ఉంది కదా అని వదిలేస్తే... ఎలా పేలుతుందో దాని సత్తా ఏంటో తెలియదు. దాని పవర్ తెలుసుకోవాలంటే నిప్పు పెట్టాలి," అన్నాడు రాజన్.

"నువ్వు ఎన్ని అయినా చెప్పు, నువ్వు చేసింది తప్పే! ఇన్నేళ్ళు తనపాటికి తాను గన్ పవర్ లేని బాంబులా కామ్ గా ఉంది. నువ్వే దాంట్లో పౌడర్ నింపి, వత్తువెలిగించావు. ఇప్పుడు మళ్ళీ వచ్చి కూర్చుంటుంది."  ఆవేశంగా అంది రాణి.

"దిగులు పడకు. తగిన కారణం చెప్పి, ప్రయాణం వాయిదా వేస్తా..." అన్నాడు రాజన్.

"ఎన్నాళ్ళు వేయగలవు? ఎన్నిసార్లు వేయగలవు? ఇది అయ్యే పని కాదు," అంది.

"........"

"అది వస్తే... కష్టపడి నిలువు కాళ్ళ మీద సంపాదించుకున్న డబ్బు, ఆస్తుల్లో దానికి వాటా ఇవ్వాలిగా?" తన మనసులో ఉన్న భయాన్ని వెళ్ళగక్కింది రాణి.

***సశేషం***

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in November 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *