Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
గౌరాబత్తిన కుమార్ బాబు
మునసబు నుండి రాష్ట్రపతి దాకా రాజకీయ ప్రస్థానం

సంజీవరెడ్డి గారి నుంచి బ్రహ్మానందరెడ్డి గారికి ముఖ్యమంత్రిత్వం దఖలు పడిన విధానం :-

సంజీవరెడ్డి గారి రాజీనామా ఆమోదింపబడిన తరువాత ఫిబ్రవరి 21, 1964న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా శ్రీ సంజీవరెడ్డి గారినే ఏకగ్రీవంగా ఎన్నుకునేట్లు, ఆయన నామినేట్ చేసే సభ్యుడు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఏకగ్రీవంగా నిర్ణయించబడింది. అనంతరం ఫిబ్రవరి 23, 1964న హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటర్ పార్టీ సమావేశమై శ్రీ సంజీవరెడ్డిగారిని నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. అదే సమయంలో తన స్థానే ముఖ్యమంత్రిగా శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి పేరును సంజీవరెడ్డిగారు ప్రతిపాదించి, మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆయనను ఆహ్వానించవలసిందిగా తాను గవర్నర్ ను కోరతానని తెలియజేశారు.

ఈ విధంగా శ్రీ సంజీవరెడ్డి తాను శాసన సభాపక్ష నాయకునిగా ఉంటూ శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వీలు కల్పించారు. ఆంధ్రలో ఆ విధంగా ద్వంద్వ నాయకత్వం ఏర్పడడం అది రెండవసారి. నూతనంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు పార్టీ నాయకుడిగా శ్రీ సంజీవరెడ్డి ఎన్నిక అయినారు. అప్పుడాయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసినదిగా శ్రీ ప్రకాశం పంతులును ఆహ్వానించవలసినదిగా గవర్నర్ ను కోరారు. అంతకు ముందు అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో జస్టిస్ పార్టీ నాయకుడు శ్రీ త్యాగరాజ చెట్టియార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా పానగల్ రాజా పేరును ప్రతిపాదించడం జరిగింది.

శ్రీ సంజీవరెడ్డి ఫిబ్రవరి 19, 1964న మద్రాసులో కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నాడార్ ను కలవడానికి వచ్చినపుడు ద్వంద్వ నాయకత్వం గురించి ఈ విధంగా స్పందించారు :-

"నేను పార్టీ నాయకుడిగా, కీ.శే ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎట్లాంటి విభేదాలు రాలేదు. యధార్ధమునకు వారు తప్పుకున్న తరువాత, నన్ను వారే ముఖ్యమంత్రిగా ప్రతిష్టించారు. నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఒకరే ఉండకపోతే కొన్ని చిక్కులు లేకపోలేదు."

కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నాడార్ కూడా:-

"నాయకుడిగా ఒకరు, ముఖ్యమంత్రిగా మరొకరు ఉన్నందు వల్ల తగువు వస్తుందని ఎందుకు అనుకోవాలి, వస్తే అప్పుడు చూసుకుందాం" అని అన్నారు.

బ్రహ్మానందరెడ్డి గారిని సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతిపాదించడంపై జలగం వెంగళరావు గారు తన స్వీయచరిత్రలో సంజీవరెడ్డి గారిని విమర్శిస్తూ ఈ విధంగా రాశారు:-

"ఈ సారి కూడా సంజీవరెడ్డిగారు తన తరువాత బ్రహ్మానందరెడ్డి గారినే ముఖ్యమంత్రి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తే ఆనం చెంచుసుబ్బారెడ్డి గారిని పోటీకి నిలపాలని మెజారిటీ సభ్యుల అభిప్రాయంగా కనిపించింది. ఈ పరిస్థితి నుండి మర్యాదగా బయటపడడానికి తాను శాసనసభాపక్ష నాయకుడిగా ఉంటూ, బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రి పదవీ స్వీకారం చేసే ఏర్పాటు చేయవలసిందిగా ఆయన గవర్నర్ ను కోరారు. ఫలితంగా బ్రహ్మానందరెడ్డి దొడ్డి దారిన ముఖ్యమంత్రయ్యే వీలు చిక్కింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సంజీవరెడ్డి గారి వంటి నీతులు చెప్పేటువంటి నాయకులు చేయాల్సిన పని ఇది కాదు."

హైదరాబాద్ లో పారిశ్రామిక బీజాలు నాటడంలో బ్రహ్మానందరెడ్డి గారు ప్రశంసనీయమైన కృషి చేసినప్పటికీ, ప్రజాస్వామ్యాన్ని కుల సౌమ్యంగా మార్చారని, రాజకీయాల్లో రిజర్వేషన్ అడిగిన బిసి నేతలను అవమానించి, బ్యాక్వర్డ్ అంటే ఆక్వర్డ్ అనే విధంగా మాట్లాడిన చరిత్ర బ్రహ్మానందరెడ్డికి ఉందని బిసి నేతలు విమర్శిస్తారు. జలగం వెంగళరావు గారు సహితం తన స్వీయచరిత్రలో బ్రహ్మానందరెడ్డి గారి హయం నుంచే రాష్ట్ర రాజకీయాలకు కలుషితమయ్యాయని, లంచగొండితనం పెరిగిందని విమర్శించారు.

పరిశీలకులు తొలుత శ్రీ సంజీవరెడ్డి రాజీనామా ఆంధ్రప్రదేశ్ కు అనూహితమైన, అవాంఛనీయమైన పరిణామమని, శ్రీ సంజీవరెడ్డికి సంబంధించినంత మటుకు అది మహోదాత్తమైన నిర్ణయమేనని, శ్రీ సంజీవరెడ్డి రాజీనామా సత్సంప్రదాయాల దృష్ట్యా ఎంత విశిష్టమైనదో, వ్యక్తిగత అభ్యున్నతి దృష్ట్యా కూడా అంత ప్రతిష్టాకరమైనదని, అయితే నష్టపోయేది మాత్రం ఆంధ్రదేశమేనని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలకు కారణమేమిటంటే :- సంజీవరెడ్డి గారి పరిపాలన నూటికి నూరుపాళ్లు శుద్ధమైనది కాకపోయినప్పటికీ వారి నాయకత్వం మటుకు సుప్రతిష్ఠమైనది, సమైక్యతాపూర్వకమైనది, ఎదురులేనిది, వారు నాయకత్వం వదులుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఏకనాయకత్వం పోయి బహు నాయకత్వం తలెత్తుతుందని, అలానే ప్రభుత్వంలో కూడా వారి బాగా పట్టు ఉండటం వల్ల ప్రణాళికా కార్యక్రమాలు గానీ, నిత్య పాలనా వ్యవహారాలు గానీ అవిచ్చిన్నంగా సాగిపోతున్నాయి,ఇప్పుడు వాటికి అంతరాయం కలగవచ్చునని, అలానే దక్షిణాది రాష్ట్రాల నాయకుల అభిమానం పొందినందువల్ల , కాంగ్రెస్ అధ్యక్ష పదవి నెరిపినందువల్ల, విశాల ఆంధ్రప్రదేశ్ కు ఏకైక నాయకుడని అనిపించుకున్నందువల్ల ఢిల్లీ లో వారి మాటకు విలువ ఉందని,వేరే కాంగ్రెస్ నాయకుడికి ఈ పలుకుబడి ఉండే అవకాశం లేదని, ఈ కారణాల వల్ల సంజీవరెడ్డి రాజీనామా వల్ల ఆంధ్రకు నష్టం జరుగుతుందని అనేకులు అభిప్రాయపడ్డారు.

శ్రీ నీలం సంజీవరెడ్డిఅయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చి, ప్రజల అభిమానానికి పాత్రులైన సంజీవరెడ్డి శాసనసభాపక్ష నాయకత్వం నిలుపుకోవడం వల్ల విమర్శలకు గురయ్యారు. ఈ ద్వంద్వ పద్ధతి దేశంలో మరెక్కడా లేదని, ఆనాడు కూడా ఏ రాష్ట్రంలో లేని ఉపముఖ్యమంత్రి హోదాను తగిలించున్నారని విమర్శలు వచ్చాయి. అప్పుడు కర్నూలులో పరిస్థితి వేరు, కాంగ్రెస్ కు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే బలం లేదు, ప్రకాశం పంతులు గారి సహకారం అనివార్యం, అందువల్ల వారికి ముఖ్యమంత్రి పదవి నిచ్చారు. మెజారిటీ పార్టీ నాయకుడిగా ప్రత్యేకతను నిలుపుకోవడం కోసం ఉపముఖ్యమంత్రిత్వాన్ని చేపట్టారు. అయితే సొంతంగా మెజారిటీ ఉన్న గోపాలరెడ్డి గారి మంత్రివర్గంలో కూడా వారు ఉపముఖ్యమంత్రిగానే ఉన్నారు. అయితే ఈనాడు హైదరాబాద్ లో కాంగ్రెస్ కు కావలసినంత మెజారిటీ ఉండి కూడా ఎందుకు ఈ ద్వంద్వ నాయకత్వం ఏర్పరిచారని విమర్శకులు ప్రశ్నించారు. కొందరు తనకు ఇష్టుడైన బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అడ్డు లేకుండా చేయడానికి ఇలా చేశారని, వారిని దొడ్డిదోవన ముఖ్యమంత్రిని చేశారని విమర్శిస్తే, మరికొందరు శ్రీ సంజీవరెడ్డి కేవలం వ్యక్తిగత ప్రతిష్ట కొరకు ఇలా ప్రత్యేక స్థానాలు కోరుతున్నారని, తన ముందు వేరొకరు తనంతవారు కావడం వారు సహించలేరని, తన పెద్దరికం కాపాడుకోవడమే వారి ఉద్దేశమని విమర్శించారు.

అయితే కొన్ని రోజులకే సంజీవరెడ్డి గారిని పార్టీ నాయకత్వానికి రాజీనామా ఇవ్వవలసిందిగా స్వయంగా ప్రధానమంత్రిగారే లేఖ రాసినట్లు అనధికారికంగా వార్తలు వచ్చినవి. ముఖ్యమంత్రిగా ఒకరు, లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా మరొకరు ఉండడం తగదని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించింది. ఢిల్లీలో జరిగే వర్కింగ్ కమిటీ మీటింగ్ లోగా సంజీవరెడ్డి గారొక నిర్ణయానికి రావాల్సి ఉండగా వారు తొలుత కామరాజ్ గారితో చర్చించారు, తరువాత వారు తన సన్నిహితులైన బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అతుల్య ఘోష్ గారిని సంప్రదించడానికి కలకత్తా వెళ్లారు. అయితే ఆ రోజుల్లో సంజీవరెడ్డి గారి సన్నిహితుల ద్వారా విలేఖరులు తెలుసుకున్నదేమిటంటే ఏనాటికైనా కేంద్రంలో ఉపప్రధానిగా, దేశీయ వ్యవహారాల చేరాలనేది వారి కోరికని.

దక్షిణాదిలో అగ్రనాయకులైన సంజీవరెడ్డిగారు,కామరాజ్ నాడార్ గారు,నిజలింగప్ప గారు పరస్పరం సహకారంతో మెలగాలని చాలా రోజుల క్రితమే నిర్ణయించుకోగా వారికి బెంగాల్ లో అతుల్య ఘోష్, ఒరిస్సాలో బిజూ పట్నాయక్, బొంబాయి నుండి యస్.కె.పాటిల్ జతకలిశారు. తరువాతి రోజుల్లో వీరే సిండికేట్ గా దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు.

****సశేషం****

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in November 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *