Menu Close
మహోన్నత మహిళాశక్తి 02
-- ఆదూరి హైమావతి --

తల్లి తప్పు

మార్కెట్లో పక్కనున్న పండ్లమ్ముకునే ఆమె తట్టలోని మామిడి పండు దొంగిలించగ తప్పని తల్లి చెప్పక పోవటాన, అతను పెద్దవాడు అయిన తరువాత గొప్ప దొంగై, హంతకుడై మరణ శిక్ష సమయంలో తల్లిని పిలిపించి ఆమె గొంతు పిసకను ప్రయత్నించి విఫలమౌతాడు. అప్పుడు పోలీసులకు చిన్నతనంలో దొంగతనం చేసినపుడు దండించి ఉంటే నేను దొంగను కాకపోదును అని తనకీ పరిస్థితిని కల్పించింది తన తల్లే అని అంటాడు.

అదే, బాల్యంలో మోహనదాస్ చిన్న అసత్యం చెప్పగా, తల్లి చెంప పగల గొట్టి 'ఛీ అసత్యవాది నా కుమారుడైనందుకు నేను సిగ్గు పడుతున్నాను’ అని దండించిన క్షణం నుంచి అతడు అసత్యం మానేసి సత్య వాదిగా, మహాత్ముడుగా మారిన గాంధీజీ కథ.

స్త్రీ సమాజంలో పోషించాల్సిన పాత్ర:

స్త్రీకి స్వతహాగా సహనం, కరుణ, దయ, ప్రేమ, మెండుగా వుంటాయి. అవసరాన్నీ, అవకాశాన్నీ బట్టి కొందరినైనా అర్ధికంగా ఆదుకోవటం, మంచి విషయాలు బోధించడం, జ్ఞానాన్ని పెంచడం నలుగురికి పంచటం, నలుగురితో స్నేహంగా మెలగడం, చుట్టూ వున్నవారితో సఖ్యతగా, వారి బాగోగులు చూడటం అలాంటివి చెయ్యాలి.

చట్టసభల్లో సైతం స్త్రీ శక్తి కనిపిస్తూనే ఉంది. స్త్రీ తన సహజమైన గుణాలు ప్రేమ, వాత్సల్యం, నిస్వార్ధం, సహనం, కార్య నిర్వహణ, చిత్తశుద్ధి, క్రమశిక్షణను వదిలి పెట్టకుండా తన సత్తా చాటుకుంటున్నది.

స్త్రీల వల్ల రాజ్యాలు కూలిపోయాయి కూడా. కైకమ్మ కోరికతో రాజు కావలసిన రాముడు అడవుల పాలయ్యాడు. స్త్రీలు రాజ్యాలు ఏలారు, నిలిపారూ, కూల్చారు కూడా.

స్త్రీలకు వున్న గొప్ప శక్తి, వారు అనుకున్నది జరిగేలాగా చేయడం.. అటువంటి గొప్ప శక్తివంతులు దేశాభివృద్ధికి, సేవాభావనకు, బాధ్యత వహిస్తుండటం ముదావహం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారు అనే నానుడి విన్నాం. స్త్రీ శక్తి, ఒక మహోన్నతమైన శక్తి. సమాజాన్ని, యువతను మేలు కొలిపే శక్తి స్త్రీలో వుంది. అమ్మతనాన్ని నింపుకుని, ఆదర్శంగా అందరి ముందూ నిల్చి కలలను సాకారం చేసుకోను స్త్రీ కృషిచేస్తూనే ఉంది.

త్రిగుణాత్మక శక్తి స్త్రీ శక్తి

స్త్రీ శక్తి లేనిదే హరిహర బ్రహ్మాదులు కూడా ఏమీ చేయలేరు. సృష్టికి మూలమైన పరాశక్తే ముగ్గురమ్మలుగా మారి త్రిమూర్తులకు శక్తినిచ్చింది. బ్రహ్మ సృష్టి చేయాలంటే శక్తి అవసరం. అవిద్య నుంచి విద్యా స్వరూపాన్ని ఇవ్వడానికి బ్రహ్మకు సరస్వతి సహకరిస్తుంది. స్థితి కల్పించే విష్ణువుకు సంపదగా లక్ష్మీదేవి సహకరిస్తుంది. సంహారం అంటే చంపడంకాదు. దుష్టగుణాల సంహారం అని అర్థం.

ప్రపంచాన్నంతా దగ్గరికి తీసుకోను రుద్రుడికి పార్వతీదేవి శక్తి స్వరూపిణిగా తోడ్పడింది. భగవంతుడు ఒక అవతారాన్ని దాల్చి భూమ్మీద అడుగుపెట్టినప్పుడు శక్తి స్వరూపం కూడా ఆయన వెంట కదలివస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ శక్తి లేనిదే అతనికి పూర్ణత్వం ఉండదు. ఆమె పక్కన ఉంటేనే ఆ అవతార ప్రయోజనం పూర్తవుతుంది. సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు ఇలా శక్తితో కూడి భగవంతుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆమె శక్తి మాత్రమే కాదు దయా శీలి, అపార కారుణ్యమూర్తి.

లక్ష్మీదేవి విష్ణుమూర్తిని గుండెల్లో స్థానం అడిగింది ఎందుకంటే, భక్తులు చేసే కర్మలకు ఫలితాన్నిచ్చేటప్పుడు, తన భర్తను హృదయంతో ఆలోచించి బిడ్డల తప్పులను మన్నించి ఉద్ధరించమని ఎప్పటి కప్పుడు గుర్తు చేసేందుకు.

శకుంతల తనను గోప్యంగ వివాహమాడి నీవెవరో నాకు తెలియదన్న దుష్యంతుడిని ‘అబద్ధాల కోరు’ అని విమర్శించిందే కానీ, తనను ఏలుకోమని, లేకపోతే అనాథను అయిపోతానని సాగిలపడలేదు.

భారతీయ స్త్రీ గొప్పదనాన్ని, ఆత్మగౌరవాన్నీ లోకానికి చాటిచెప్పింది. రాముడితోపాటు లక్ష్మణుడు అడవికి వెళ్తానంటే సుమిత్ర మనస్ఫూర్తిగా అంగీకరించింది.

కైకేయి తన కొడుకు భరతుడు పట్టాభిషిక్తుడు కావడానికి రాముణ్ని అడవికి పంపితే, సుమిత్ర లక్ష్మణుడిని రాముడి వెంట నడవమంది. త్యాగశీలతకు ఉదాహరణగా నిలిచిందామె.

భర్త అడవులకు అన్నతో వెళుతున్నప్పుడు అతని భార్య ఊర్మిళ లేశమంతైనా బాధపడలేదు. ఆ 14 సం. రాలూ తనను స్మరించవద్దనీ, రామసేవ చేసుకోమనీ కోరింది. అందుకే, రామాయణంలో సుమిత్ర, ఊర్మిళ  వంటి పాత్రలు లేవు, వారికి వారే సాటి..

‘తెల్లవారితే నీ భర్త మరణిస్తాడ’ని విన్న మహా ఇల్లాలు సుమతి తన పాతివ్రత్య మహిమతో సూర్యోదయాన్ని శాసించి నిలిపేసింది.

మహా భారతంలో గాంధారి సంతానాపేక్షతో చిన్నతనంలోనే శివుడి గురించి తపస్సు చేసి ఎక్కువమంది పిల్లలకు తల్లి కావాలనే వరాన్ని పొందింది. కురు వంశాన్ని నిలబెట్టే ఉద్దేశంతో భీష్ముడు గాంధారిని ధృతరాష్ట్రుకి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అదే విషయం గాంధారి పెద్దల దగ్గర ప్రస్తావిస్తాడు. ఆమె ఎంతో ఔదార్యంతో తనవల్ల కురువంశం నిలబడితే, అంధుడైనవాడు బిడ్డలను పొందానని సంతోషిస్తే అంతకన్నా జన్మకు సార్థకత మరేదీ లేదని ధృతరాష్ట్రుడితో పెండ్లికి అంగీకరించింది. అంతేకాదు, తన భర్త చూడలేని ప్రపంచం తనకూ అవసరం లేదని కండ్లకు వస్త్రం కట్టుకుంది----

ధృతరాష్ట్రుడు పుత్ర వాత్సల్యంతో ధర్మం తప్పి రాజ్యాన్ని తన కొడుకులకు ఇవ్వాలని భర్త అనుకున్నపుడు గాంధారి తిరస్కరించింది కానీ వ్యతిరేకించి ఆపలేకపోయింది. అందువల్లే అధర్మ వర్తనులైన కుమారులందరినీ కోల్పోయింది. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు దుర్యోధనుడు తల్లికి నమస్కరించి దీవించమనగా.. ‘ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. నీకు విజయం కలగాలంటే ధర్మాన్ని ఆశ్రయించమ’ని చెప్పింది. పరోక్షంగా అతని అపజయాన్ని చెప్పింది కానీ ఆపలేకపోయింది.

ఇక కుంతీదేవి జీవితాన్ని పరికిస్తే, ఆమె పడిన కష్టనష్టాలు, వాటిని ఓర్పుతో ఆమె అనుభవించిన తీరు. ఈ లక్షణాలన్నీ భారతీయ స్త్రీల కు పుట్టుకతోనే సంక్రమించాయా అనిపిస్తుంటుంది. ఇందరు పతివ్రతలను కలిగి ఉండటం మన జాతి గొప్పదనం. అలాంటి మహిళలకు వారసులైన స్త్రీ మూర్తులను సదా గౌరవించడం భారతీయుల బాధ్యత. ప్రకృతి మాతలోని దైవత్వాన్ని స్త్రీలో చూడగలిగినప్పుడు దేవతలు హర్షిస్తారు. మహిళలను గౌరవించడమే మానవజాతికి శ్రీరామరక్ష.

విక్ఠోరియా మహారాణి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏలింది. స్త్రీలు పురాణాల్లో పూర్వ గాథల్లో గృహ దేవతలుగా స్తుతింపబడ్డారు, నీతికి మార్గదర్శకులుగా భర్తకు సహధర్మచారిణులుగా, గృహమును దేదీప్యమానంగా వెలిగించే జ్యోతి అని గౌరవింపబడ్డారు. భారత దేశంలో మాతృమూర్తులు తమ పిల్లలను సత్యము, ధర్మము సోదర ప్రేమ, భూతదయ, అహింస మొదలైన అమూల్యమైన పాఠాలను ప్రేమతో నేర్పిస్తూ పెంచారు.

స్త్రీ శక్తికి ఉదాహరణ- పర స్త్రీ వ్యామోహంతో దొంగతనంగా మారువేషం లో సీతమ్మ తల్లిని తెచ్చి తన అశోకవనంలో పెట్టుకున్న రావణుడు ఆమెను బాధించిన పనికి సర్వనాశనమయ్యాడు. సీతమ్మ బాధకు పతనం అయిపోయాడు.

ఏ దేవుడు సంహరించలేని మహిషాసురుణ్ణి మహిషాసుర మర్దని కాళికా మాత రూపంలో సంహరించింది అంటే, స్త్రీ హృదయంలో ఏర్పడిన బాధ క్రోధం దేన్నైనా నాశనం చేయడం ఎంత గొప్ప వారి నైనా పతనం చేయగలదు .

ద్రౌపదిని అవమానపరిచిన కౌరవులు ఆ స్త్రీ హృదయంలో రగిలించిన వేదనకు వంశ నాశనమైపోయారు. కనుక స్త్రీ హృదయం స్త్రీ యొక్క తలంపులు స్త్రీ యొక్క పవిత్రత, స్త్రీ యొక్క మనోభావాలు దేన్నైనా మార్చగలవు, మాడ్చగలవు. ఏమార్చగలవు కూడా.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 నాడు.. వారి, వారి రంగాలలో చరిత్రను లిఖించిన 8 మంది భారతీయ మహిళ గురించి తెలుసుకుందాం.

దేశం గర్వించేలా చేసిన 8 మంది మహిళలు

1. అవని లేఖ
ఈమె పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన మొదటి మహిళ గా చరిత్ర సృష్టించింది. జైపూర్కు చెందిన అవని 11 సంవత్సరాల వయసులో ఓ ఘోరమైన ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె వీల్ చైర్కే పరిమితమైనది. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. ఆమె ఏ మాత్రం బెదరలేదు. పట్టుదలతో ఎయిర్ రైఫిల్లో, 2015 నుంచి శిక్షణ తీసుకుని 2020 పారాలింపిక్స్ లో పాల్గొని మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. పారా ఒలింపిక్స్‌ లో బంగారు పతకం సాధించిన మొదటి మహిళగా నిలిచింది.

2. పీవీ సింధు
పీవీ సింధు గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయురాలు.

3. అరుణిమా సిన్హా
అరుణిమా సిన్హా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళా దివ్యాంగురాలు. సమస్యను ధీటుగా ఎదుర్కొనే స్పూర్తి ఉంటే.. ఏ సవాళ్లూ పెద్దగా అనిపించవని నిరూపించారు అరుణిమా సిన్హా. ఓ రోజు ఓ దొంగల గుంపు అరుణిమను నడుస్తున్న రైలు నుంచి తోసేశారు. ఆ క్రమంలో ఆమె కాలు కోల్పోయింది. అయినప్పటికీ ఆమె తనలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. 2013లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళా దివ్యాంగురాలిగా చరిత్ర సృష్టించింది.

4. గీతా గోపీనాథ్
గీత గోపినాథ్ లాంటి స్త్రీలకు పరిచయం అక్కర్లేదు. 2018లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితులైన మొదటి భారతీయ మహిళగా గీత గుర్తింపు పొందింది. హార్వర్డ్‌లోని ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఆర్థికవేత్త అమర్త్యసేన్ తర్వాత శాశ్వత సభ్యత్వం పొందిన రెండవ భారతీయురాలు.

5. అవని చతుర్వేది
2018లో మిగ్-21లో ఒంటరిగా ప్రయాణించిన మొదటి భారతీయ మహిళా పైలట్ ఫైటర్ అవని చతుర్వేది. విమానాన్ని వేగంగా టేకాఫ్, ల్యాండింగ్ అత్యధికంగా చేసిన మహిళగా ఈమెకు గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ఆమె మిగ్-21లో ఒంటరిగా ప్రయాణించారు.

6. అరుణా రెడ్డి
జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో పతకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్ట్ గా అరుణా రెడ్డి నిలిచారు.

7. ఇందు మల్హోత్రా
1988లో ఆమె సుప్రీంకోర్టులో అడ్వకేట్-ఆన్-రికార్డ్‌గా అర్హత సాధించింది. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు ఎదిగిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. 2018లో ఆమె సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

8. సీమా రావు
కమాండో శిక్షణ ఆమె క్లోజ్ క్వార్టర్ యుద్ధంలో 15,000 మంది సైనికులకు శిక్షణ ఇచ్చింది. అంతేకాదు, ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు.

పురుషుల సహకారం తోనే మహిళా పురోగమనం సాగుతున్నదని మాత్రం మరువరాదు.. అంతా కలిసి మెలసి పరస్పర సహకారంతో సమాజ సేవచేసుకుంటూ, జీవితాలను మంచి మార్గంలో ధన్యపరచుకోవాలి.

****సమాప్తం****

Posted in November 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *