Menu Close
nirmalaadithya author
కథ వెనుక కథ
-- నిర్మలాదిత్య --

నేను వ్రాసిన అతి కొద్ది మినీ కథలలో ఇది ఒకటి. కానీ పెద్ద కథలకు కూడా రాని గుర్తింపు పొందిన కథ.

నాకు పాఠాలు చెప్పిన గురువుల జ్ఞాపకాల వెంబడి ఒకసారి నాలో, నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, మెదిలిన ప్రశ్నకు ఈ కథ ద్వారా జవాబు వెదుకున్నాను. దాదాపు ఇది అందరికీ జరిగిన అనుభవమే అయ్యి ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు ఉదయించి ఉంటాయని, నా లాగా అదే సమాధానం దొరికి ఉంటుందని నా అనుమానం. దానికి నిదర్శనం పాఠకుల స్పందననే. ఇంతకంటే ఎక్కువ వ్రాస్తే, కథ నిడివి కంటే నేపథ్య నిడివి ఎక్కువవ్వుతుందేమో. ఆలస్యం ఎందుకు, అట్టే సమయం తీసుకోని ఈ చిన్న కథ చదవండి.

గురువే నమః

guruve-namaha

ఎల్‌.కె.జి. ప్లస్‌ యు.కె.జి. ప్లస్‌ 10 ప్లస్‌ 2 ప్లస్‌ బి.ఎస్‌సి., ఎం.ఎస్‌సి. వెరసి 19 ఏండ్ల చదువు. సంవత్సరానికి సగటున ఐదు మంది టీచర్లున్నా దాదాపు వందమంది దాకా నన్నో బాధ్యతాయుత పౌరునిగా తీర్చడానికి కృషి చేశారు. ఇంత మంది గురువులలో నాకు చిరస్మరణీయులెవరు? నా చదువైపోయి చాలా ఏండ్లు అయ్యింది. ఇప్పుడు నా మనస్సులో నిలిచిపోయినవారు, బహుశా నా జీవితాంతం అలాగే నా జ్ఞాపకాలలో ఉండిపోతారేమో.

టీచర్‌ పేరు సువర్చలా? సుకన్యా? పేరు గుర్తులేదు. మూడో తరగతిలో హిందీకి వచ్చేది. వయస్సు ఇరవై ఐదులోపే ఉంటుందనుకుంటాను. చామన ఛాయ రంగు. సన్నగా ఉండేది. ముఖంలో ఎప్పుడూ చిరాకు. ఆవిడ దగ్గరున్న ఆయుధాలు రెండు. తెలంగాణా యాసలో తెలుగు ఉర్దూ కలిపి నోరు పారేసుకోవడం ఒకటి. ‘సువ్వర్‌’ లేక ‘సువ్వర్‌ కే బచ్చే’ ఆవిడ కిష్టమైన సంబోధనా విభక్తులు. ఈ సంబోధన పనిచేయని పక్షంలో, ఆవిడ పిల్లల్ని దగ్గరకు పిలిచి నోరు తెరవమని ఓ చాక్‌ పీసును పళ్ళ మధ్య నిలబెట్టేసేది. ఆ రోజు ఇక ఆ పిల్లాడు, ఆ క్లాసు తరువాత కూడా దవడ నొప్పితో ఏడ్వాల్సిందే. అందుకేనేమో నాకు ఆవిడంటే చచ్చేంత భయం. ఆవిడ క్లాసంటే మరీ భయం. హిందీ అంటే చెప్పలేని అయిష్టం.

ఈ టీచర్‌ పేరు నాకు బాగా జ్ఞాపకం. పద్మినీ టీచర్‌. సైన్సుకు వచ్చేవారు. నేనంటే చాలా ఇష్టం. దానికి కారణం, క్లాసులో అందరికంటే నేను చురుగ్గా ఉండటమే కావచ్చును. ఓ రోజు, ఆరో తరగతి చదివేటప్పుడు, ఆవిడ మాకు ఓరల్‌ టెస్టు పెట్టారు. ప్రశ్నలన్నీ అంతకుముందు రోజు పూర్తిచేసిన పాఠంలోనించే. అన్నిటికి నేనొక్కడినే చేతులెత్తాను. క్లాసులో ఎవ్వరూ జవాబివ్వని వాటికన్నిటికీ నేను జవాబివ్వటం మొదలెట్టాను. చివరకు టీచర్‌ నవ్వుతూ నన్ను దగ్గరికి పిలిచి, ‘‘చూడండి, ఎంత బాగా జవాబు లిస్తున్నాడో, అందరూ ఇలాగ చదివితే ఎంత బాగుంటుంది’, అని నన్ను దగ్గరికి తీసుకొని బుగ్గమీద ఓ ముద్దిచ్చారు. ఎంత సిగ్గు పడ్డాను. ఎంత సంతోష పడ్డాను. అప్పటి నుంచి నేను ఎమ్‌.ఎస్.సి. పూర్తి చేసే వరకు, నా క్లాసులో ఎవ్వరికీ నాకంటే సైన్సులో ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఇవ్వలేదు.

స్కూలును తనిఖీ చేయడానికి అధికార్లు వస్తున్నారంటే, స్కూల్లో కలిగే హడావిడిని గురించి చెప్పే అవసరం లేదనుకుంటాను. మనోరమ టీచర్‌, మామూలు టీచరే. ఇంగ్లీషుకు వచ్చేది. ఇన్స్‌సెక్షన్‌ అని మమ్మల్ని ముందే బాగా హెచ్చరించి, తను చెప్పబోయే పాఠం, అడగబోయే ప్రశ్నలు, దానికివ్వాల్సిన జవాబులు అన్నీ చెప్పింది. ఇన్‌స్పెక్టర్‌ గారు వచ్చి క్లాసు వెనుక కుర్చీలో కూర్చోగానే ఆవిడ తన పాఠం మొదలెట్టింది. అది ఇంగ్లీషులో పద్యం ‘హు హాజ్‌ సీన్‌ ది విండ్‌, నెయ్‌దర్‌ ఐ, నార్‌ యూ...’ (గాలిని ఎవరు చూశారు? నేనూ నీవూ ఎవ్వరూ చూడలేదు...) ఏదో అవస్థలు పడుతూ, చెమటలు కక్కుతూ పాఠం పూర్తి చేసి, మాచేత తనకు కావలసిన జవాబులు చెప్పించుకొని అధికారి మెప్పు కోసం ఆయన వైపు చూసింది. ఇన్‌స్పెక్టర్‌ అనుభవశాలి అనుకుంటాను. ఆయన తనకు తోచిన ప్రశ్నలను అడగ సాగారు. ఉన్నట్టుండి ఆయన, ‘గాలిలాగ మనం చూడని, కానీ ఉందని తెలిసిన వస్తువేదైనా ఉందా?’ అని క్లాసు నుద్దేశించి అడిగారు. వెంటనే నేను లేచి, ‘ఉందండీ దేవుడు! మనమెవ్వరం దేవుణ్ని చూడలేదు. కాని దేవుడున్నాడని మనకు తెలుసు’ అని జవాబిచ్చాను. ఇంక అటు తరువాత నన్నాయన అలానే మరి కొన్ని ప్రశ్నలేసి, పిరియడ్‌ ముగియడంతో వెళ్ళిపోయారు.

నేను ఘనకార్యం చేసిన వాడిలా సంతోషంగా మనోరమ టీచర్‌ వైపు తిరిగాను. ఆశ్చర్యం. ఆవిడ ముఖంలో నామీద కోపం, అసహ్యం.

‘ఏరా అధిక ప్రసంగీ నిన్నెవరు అలా పిచ్చి పిచ్చి జవాబు లివ్వమన్నారు?’’ అంటూ చెడామడా తిట్టి వేసింది. నేనేం చేసానని నాకీ తిట్లు, నాకు తోచిన విషయాలు బయటికి చెప్పకూడదా? ఒకటే కన్‌ఫ్యూజన్‌. ఓ వారం రోజుల తరువాత, మనోరమ టీచర్‌ను రొటీన్‌గా టీచ్‌ చేసినందుకు ఇన్‌స్పెక్టరుగారు మందలించారని, పిల్లలలో క్రియేటివిటీ, ఇమాజినేషన్‌ పెంపొందే విధంగా పాఠాలు చెప్పేందుకు ప్రయత్నించమని సలహా ఇచ్చారని, మా సోషల్‌ టీచర్‌, లెక్కల మాస్టర్‌తో చెప్పుతుండగా విన్నాను. నన్ను తిట్టిన టీచర్‌ను మందలించారంటే చెప్పొద్దూ, తెగ సంతోషమేసింది. కాని ఆవిడ తిట్టిన దెబ్బ, ఇప్పటికీ ఏదైనా మాట్లాడాలంటే కొంచెం జంకుతాను.

తెల్లటి పంచ, జుబ్బా ఎప్పుడూ నవ్వుతున్న ముఖం. అప్పటికే 50 ఏళ్ళ పైన వయస్సు, ఆయన వెంకటరెడ్డి సార్‌ పాఠం చెప్పడం ప్రత్యేకత. మనస్సుకు హత్తుకొని పోయే విధంగా చెప్పడంలో ఆయనకి ఆయనే సాటి. అలానే నాటకాల పిచ్చి ఉన్న అహ్మదు సార్‌. ఆయన క్లాసు రూంనే ఓ రంగస్థలంగా మార్చి మమ్మల్ని అందులో నటింపజేసే వారు. మార్టిన్‌ లూథర్‌, జూలియస్ సీజర్‌, గాంధీ తాత చరిత్రలోని వారందరినీ మేము క్లాసులోనే సృష్టించుకోగలిగాం. ఇంకెవ్వరబ్బా నా టీచర్లు?

ముఖాలు లీలగా గుర్తొస్తున్నాయి. కాని విశేషాలేమీ గుర్తుండటం లేదు. వారు కూడా నా మనో వికాసానికి తోడ్పడ్డారు. కాదనను. కానీ వారు నేనింత వరకు చెప్పిన టీచర్ల లాగ, నా మనస్సుకు హత్తుకుండే పనులేవీ చేయలేదు. అంటే సగటు టీచర్లు నా జ్ఞాపకాలకు నోచుకోలేదన్న మాటే. నా మనస్సుని గాయపరచిన టీచర్లు, నన్ను సంతోష పెట్టి, చదువంటే ఎంతో ఆసక్తి కలిగించిన టీచర్లతో బాటు నా మనస్సులో స్థానం ఏర్పరచుకోవడం ఆశ్చర్యకరమే. అంటే మెమొరిస్‌ కెన్‌ బి ఐదర్‌ సాడ్‌ ఆర్‌ హేప్పీ. జ్ఞాపకాలు దుఃఖాలు సుఖాలే! మధ్యలో వున్న సంఘటనలకు జ్ఞాపకాలలో తావు లేదు.

ఇంతకూ, ఇంతమంది టీచర్లలో ఎవ్వరు నా కిష్టం. నా నిర్ణయం ఎలాగూ నా టీచర్లకి తెలిసే ప్రసక్తి లేదు. కాబట్టి నిర్భయంగానే చెప్పొచ్చుననుకుంటాను. ఇంత వరకూ ఓపిగ్గా చదివిన మీరూ చెప్పొచ్చుననుకుంటాను. కానీ అదే తమాషా...

ప్రొద్దున్న ఆరున్నర అవుతున్నది. ఇంకా చలిగానే ఉంది. చంకలో ఓ పిల్లాడిని వేసుకొని, తన తల పిల్లవాడి తల తన కొంగుతో కప్పుకొని, బాయిలర్‌లో నిప్పులేసి రాజేయడానికి అవస్థ పడుతున్నదావిడ. ఎనిమిదిన్నర కంతా ముగ్గురు పిల్లలకు స్నానాలు చేయించి టిఫిన్లు కట్టించి స్కూలుకు పంపాలి. భర్తను తొమ్మిది కంతా ఆఫీసుకు పంపించాలి. ఊపిరాడనంత పని. ఓ ప్రక్క, బాయిలర్‌ అంటిస్తూనే మరో చేత్తో పుస్తకం పట్టుకొని, ‘‘ఊ, అప్పజెప్పు బాబూ’’, అంటూ ఓ మాట కూడా పొల్లు పోకుండా, ఎదురుగా నిలబడ్డ నాచేత అప్పచెప్పించుకునే మనిషి నా కళ్ళ ముందు మెదుల్తుంది.

అన్ని పనుల్లోనూ లైబ్రరీ నుంచి శరత్‌-చంద్ర పుస్తకాలను తెచ్చుకొని ఆవిడ చదువుకోవడం గుర్తుంది. ఆవిడ ఒడిలో కూర్చునే కదా, నేను సాహిత్య ఉద్యానవనంలోకి అడుగు పెట్టాను.

అవునండీ, ఆవిడే నాకభిమానమైన చిరస్మరణీయమైన టీచర్‌, ఎంతైనా ఆవిడ మా అమ్మే కదా!

(ఆంధ్రజ్యోతి, 1991)

********

Posted in November 2025, కథలు

2 Comments

  1. సత్యం మందపాటి

    చాల మంచి ఇతివృత్తంతో వ్రాసిన చక్కటి చిన్న కథ భాస్కర్. మీ రోజుల్లోనూ, అంతకుముందు మా రోజుల్లోనూ మనం ఒక మంచి వ్యక్తిగా పెరగటానికి మన గురువులు, పెద్దలు ఎంతో దోహదం చేసేవారు. బుద్ధుడు చెప్పినట్టు, ప్రతి మంచి గురువుల గొప్ప మాటలతో నేర్చుకునేది ఎంత వుంటుందో, అలాగే తమ స్వంత బాణీలో మనని తప్పు దారి పట్టించే వారి నుండి కూడా, కొన్ని ఎలా చేయకూడదో నేర్చుకునే అవకాశంవుంది. అది మనందరి అనుభావాల్లోనూ వుండకనే వుంటుంది. మంచి రచన. అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *