"మోహన్, మధు చెప్పిన వ్యాపారం ఏమిటో నాకు అర్ధం కాలేదు. ఆ రాఘవరావు ఏం వ్యాపారం చేస్తాడు అసలు? దానికి చదువుతో నిమిత్తం లేని యువకులు ఎలా సహాయపడతారు?" అడిగాడు ప్రభాకరరావు.
"ఏం వ్యాపారమో తెలీదు కానీ నాన్నా బహుశా వ్యాపార ప్రచారానికి ఉపయోగిస్తారేమో వారిని. ఏమో దిగితే కానీ తెలియదు కదా…" అన్నాడు మోహన్.
"సరే కొన్నాళ్ళు చూద్దాం.. సరేనని మధుతో చెప్పు. ఈ వ్యాపారం విషయం తెలియడం, నువ్వు తండ్రివి కాబోవడం… మనకు లాభం చేకూర్చే వ్యాపారమేనేమో…"
"అలాగే నాన్నా. ఇవాళే ఫోన్ చేస్తాను."
****
"గత నెలలో నగేష్ నుంచి ఫోన్ వచ్చింది. నసీర్ బృందం నాగాలాండ్ అడవుల్లో దిక్కులేని మరణం పాలయ్యారని. విజయన్ అన్వేషణ హఠాత్తుగా విరమించుకొని వ్యాపారం చేసుకుంటున్నాడు. నిన్న జేమ్స్ కి ఫోన్ చేసినా కలవలేదు. ఇంతవరకు దండకారణ్య ప్రాంతాన్ని వివిధ అవసరాల పేరు చెప్పి జల్లెడ పట్టి వదిలాడు తాను. అసలు నగేష్ చెప్పిన హారం అన్వేషణ నిజంగానే బలి కోరుతోందా? కొత్త వ్యాపారం పేరుతో వందల కొద్దీ యువకులను పురమాయించుకొని అన్వేషణ మరింత ముమ్మరం చేద్దామనుకుంటున్న ఈ తరుణంలో తన సహచరుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ముందుకు పోవడమా, మానడమా ఆలోచన సుడులు తిరుగుతోంది." ఏ విషయం నిర్ణయించుకోలేకపోతున్నాడు రాఘవరావు. మూడు రోజుల కిందట విజయవాడ వచ్చాడు రాఘవరావు. కొత్త వ్యాపారం పేరు చెప్పి, మధును సంప్రదించాడు. సహనం, శారీరక దారుఢ్యం కలిగిన కొత్త కుర్రాళ్ళు కావాలన్నాడు. వారిని నియమించుకోడానికి ముందుగా కొంతమంది మేనేజర్ స్థాయి ఉద్యోగులు కావాలని, వారికి ఒక ఆఫీస్ వగైరాలు సమకూర్చాలని చెప్పాడు. మధు తన స్నేహితులతో, నమ్మకమైన వారితో మాట్లాడతానని అన్నాడు. కానీ తన సహచరులకు పట్టిన గతి చూస్తుంటే రాఘవరావులో అంతర్మథనం మొదలైంది. నగేష్ చెప్పిన కథ ప్రకారం చూసుకున్నా, ఆ హారం కనబడిన ప్రతిసారి ఎవరో ఒకరు చేజిక్కించుకోడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం జరిగినపుడు విపరీతమైన రక్తపాతం జరుగుతోంది. ఇప్పటికే ఒక బృందం హత్య గావించబడింది. ఇంకో బృందం ఆచూకీ తెలియడం లేదు. తప్పుకున్న విజయన్ సురక్షితంగా ఉన్నాడు.
ఆ హారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి, చేజిక్కించుకోవడమా? మొండిగా ముందుకుపోవడమా? ఇప్పటివరకు దండకారణ్య పరిశోధన హారం విషయం బయటకు రాకుండానే జరిగింది. పర్యాటక ప్రదేశాల అభివృద్ధి పేరుతో నూతన పర్యాటక ప్రాంతాల అన్వేషణ గురించి కేంద్రప్రభుత్వం నుంచి లైసెన్స్ తెప్పించుకున్నాడు. ఆ ప్రకారంగా దండకారణ్య ప్రాంతం అంతా జల్లెడ పట్టేసాడు. కానీ ఫలితం లేకపోయింది. ఎక్కడా, ఏ దేవీ దేవత గుడిలోనూ మరకతమణి హారాన్ని పోలిన హారం కనబడలేదు. మరింత దూకుడుగా వెళ్ళడానికి కనబడుతున్న నిదర్శనాలు దృష్ట్యా ధైర్యం చాలడంలేదు.
రాఘవరావు లో అంతర్మథనం కొనసాగుతుండగానే మధు వచ్చాడు.
"రా మధు, కూర్చో.." ఆహ్వానించాడు రాఘవరావు. నమస్కారం చేసి కూర్చున్నాడు మధు.
"మీరు చెప్పినట్లే నా స్నేహితులు నలుగురికి వ్యాపారం విషయం చెప్పాను. ముగ్గురు వెంటనే ఒప్పుకున్నారు. మోహన్, మీరు విశాఖపట్నం బీచ్ లో చూసిన స్నేహితుడు మాత్రం కొంచెం సమయం అడిగాడు బాబాయ్" అన్నాడు మధు.
"విశాఖపట్నం లో మనం వ్యాపారం అనుకోలేదు కదా, నీ స్నేహితుడు ఎందుకు ఒప్పుకుంటాడు?" అడిగాడు రాఘవరావు.
"అప్పుడు విశాఖపట్నం లో ఉండేవాడు. వాళ్ళ నాన్న ఉండేది ఇక్కడే. వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, విశాఖపట్నం వెళ్ళిపోయాడు. మళ్ళీ వారం రోజుల కిందటే వాళ్ళింటికి సతీసమేతంగా తిరిగివచ్చాడు. ఇప్పుడు ఇక్కడే ఉంటాడు." చెప్పాడు మధు.
"అయితే సరే. ఆ ఐదుగురి వివరాలు నాకు ఇవ్వు. వాళ్ళని పరిశీలించాక, ఏం చెయ్యాలో ఎలా చేయాలో చెప్తాను" అన్నాడు రాఘవరావు.
"రెండు రోజుల్లో చెప్తాను బాబాయ్" అన్నాడు మధు.
******
స్వీట్స్, పళ్ళు చేతిలో పెట్టి, కూతుర్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది ఉమ. విజయ ప్రభాకరరావుల అనుమతితో సుధను, మోహన్ ను వాళ్ళింటికి తీసుకువెళ్లారు ఉమ, మహేశ్వరరావులు. వారం రోజులు అక్కడ గడిపి ఇంటికి వచ్చేశాడు మోహన్. సుధని కొద్దిరోజులు అక్కడే ఉంచమని కోరారు సుధ తల్లిదండ్రులు. వ్యాపారం విషయంమై మధుతో మాట్లాడాలని మోహన్ వచ్చేశాడు.
మధు, మోహన్, మరో నలుగురు తన మిత్రుల వివరాలు రాసి రాఘవరావుకు ఇచ్చాడు. రాఘవరావు ఆ వివరాలు చూసి, ఆ ఐదుగురిని మేనేజర్లు గా నియమిస్తున్నట్లు, వారు ఒక్కొక్కరు రెండువందల మందిని ఎంపిక చేసి, వారి ఎత్తు, బరువు, విద్యార్హతలు వగైరా వివరాలు రాసి తన దగ్గరకు పంపాలని చెప్పాడు. మోహన్ తదితర ఐదుగురితో చిన్న సమావేశం ఏర్పాటు చేశాడు రాఘవరావు. మధును కూడ ఆహ్వానించాడు. హైదరాబాద్, విజయవాడలలో తనకున్న వ్యాపారాలు వివరించి, కొందరిని ఆ వ్యాపార ప్రచారానికి ఊరూరు పంపిస్తానని, మరి కొందరిచే తయారైన వస్తువులను ఇంటింటికీ తిరిగి అమ్మిస్తానని చెప్పాడు. అంతవరకు మేనేజర్లుగా నియమించబడిన వారికి ఉన్న సందేహాలు తీరిపోయాయి.
మొదటివిడతగా ఒక్కొక్కరు యాభైమంది చొప్పున తక్కువ విద్యార్హతలు, దేహదారుడ్యం కలిగిన వ్యక్తులను ఎన్నుకొని, వారి వివరాలతో సహా రాఘవరావుకు ఇచ్చారు. వారందరి పుట్టుపూర్వోత్తరాలు కూడా పరిశీలించి, ఓ పాతికమందిని వేరుగా ఉంచాడు. తర్వాత మొదటే చెప్పినట్లు మిగిలిన వారందరినీ, తన వ్యాపారాలకు ప్రచార కర్తలుగా, అమ్మకందారులుగా నియమించాడు. కొందరికి ఈ పని కష్టమైనదిగా తోచింది. అలాంటి వారిని గొడవున్ దగ్గర కాపలాదారులుగా నియమించాడు.
తాము అనుకున్నట్లు రాఘవరావు అవినీతి పనులేమి చేయడం లేదని సమాధానపడ్డారు మధు, మోహన్ లు. అయితే రాఘవరావు చేస్తున్న తెరచాటు భాగోతం తెలీదు వారికి. ఇంటింటికి తిరిగి తమ ఉత్పత్తులు అమ్మే అమ్మకందారులుగా పనిచేస్తూనే, ఆయా ఇళ్లలో ఎవరెవరు ఉంటారు? బంగారం లేదా ఆస్తులు ఏమి ఉన్నాయి తదితర వివరాలు సేకరించడం వారి పని. తాను ఎంపిక చేసిన పాతిక మందికి వివిధ పోరాటాలలో శిక్షణ ఇప్పించాడు. శిక్షణ పూర్తి అయ్యాక ఒకరోజు అందరం కలిసి కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుందామన్నాడు రాఘవరావు.
చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. సుధకు సీమంతం చేసి, సూడిదలిచ్చి, గాజులు తొడిగించి, పువ్వులు ముడిచి పేరంటం చేసారు, పురిటికి పుట్టింటికి తీసుకువెళ్ళే ముందు అందరూ కలిసి ఉదయాన్నే దుర్గమ్మ దర్శనానికి బయలుదేరారు.
****
నగేష్ నుంచి ఫోన్ వచ్చింది రాఘవరావుకు. తాను విజయవాడ వచ్చానని, రాఘవరావు ఆఫీస్ కి వచ్చి రాఘవరావు చేస్తున్న ప్రయత్నాలు స్వయంగా చూడాలి అనుకుంటున్నట్లు చెప్పాడు. రాఘవరావుకు ఇష్టం లేకపోయినా సరేనన్నాడు. నగేష్ రాఘవరావు ఆఫీస్ కి వచ్చాడు. శిక్షణ పొందిన యువకులను పరిచయం చేసుకున్నాడు. వివిధ పోరాటాలలో వారి సామర్ధ్యాలను స్వయంగా పరిశీలించి, మెచ్చుకున్నాడు. యువకులను బయటకు పంపేసి, నగేష్, రాఘవరావు కూర్చున్నారు.
"రాఘవా నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. మరకత మణి హారం దొరికితే అందరం కలిసి పంచుకోవాలనుకున్నాం. కానీ నసీర్ ఆటవికుల బారిన పడి మృతి చెందాడు. విజయన్ పిచ్చివాడిలా ఈ ప్రాజెక్టునే వదులుకున్నాడు. ఇక జేమ్స్.. అన్నట్లు జేమ్స్ సంగతి నీకు తెలీదు కదా… జేమ్స్ విక్టర్, డేవిడ్ లతో కలిసి పెద్ద ప్లాన్ వేసాడు. ఆ హారం దొరికితే ఒక్కడే వెళ్లి అమ్ముకోవాలనుకున్నాడు. రాజస్థాన్ ఎడారులలో ఒక తండాలో భగవతి అమ్మవారి మెడలో ఉన్న హారాన్ని చూసి, అదే మరకతమణి హారం అనుకుని పొరబడ్డాడు. తన మిత్రులతో కలిసి ఆ హారం అపహరించడానికి ప్రణాళికలు వేసాడు. డేవిడ్, విక్టర్ అత్యుత్సాహంతో ఇద్దరు తండా యువతులను బలాత్కరించబోయారు. ఈ హారం విషయం తెలియగానే వారిని వదిలేసి వెళ్లారు. ఆ యువతులిద్దరూ తండాపెద్దని కలిసి, తమకు జరిగిన అవమానాన్ని, భగవతి అమ్మ హారం దోపిడీ గురించి చెప్పడంతో వాళ్లంతా తెలివిగా పథకం వేసి, ముగ్గురిని, మత్తులో ముంచి, ఒంటిమీద గుడ్డల్లేకుండా జీపులో కట్టి ఎడారిలోకి తోలేసారు.
తిండి నీళ్లు లేక ఆకలి దాహంతో అలమటించి, ఎండకు శరీరం బొబ్బలెక్కి దారుణమైన పరిస్థితిలో మరణించారు. ఎడారి నక్కలు అందనంత వరకు వారిని పీక్కుతిన్నాయి. వారిని నీడలా అనుసరిస్తూ వెళ్లిన నా అనుచరుల తలలు కోసి ఇసుకలో పాతేసారు. ఇవన్నీ నాకెలా తెలిశాయి అంటావా? ఆఖరుగా నా అనుచరుల ఆచూకీ తప్పిపోయిన చోటు వెతుకుతూ వెళ్తే ఈ తండా గురించి తెలిసింది. నేను వర్తకునిలా నా బృందంతో వెళ్లి, వారిలో ఒకరికి కాస్త విదేశీ మద్యం రుచి చూపించేసరికి మొత్తం విషయం బయటకు వచ్చింది. వాళ్ళకి అనుమానం రాకుండా గాలించి ఐదుగురికి అంత్యక్రియలు జరిపాను. ఇవన్నీ నిన్ను భయపెట్టడానికి చెప్పడం లేదు. ఇంక నువ్వే నా ఆశ. మొత్తం మనిద్దరిదే. నీ ప్రయత్నాలు నాకు నచ్చాయి. ఇంకా నీకు ఏ సహాయం కావాలో చెప్పు. ఎంత డబ్బు కావాలో అడుగు…" అన్నాడు నగేష్.
రాఘవరావు కి ఇక్కడ ఆ విషయాలన్నీ మాట్లాడటం ఇష్టం లేదు. సాయంత్రం ఈ విషయం గురించి మాట్లాడతానని చెప్పేడు.
తాను హోటల్ లో బస చేశానని, సాయంత్రం వచ్చి కలుసుకోమని చెప్పాడు నగేష్. అక్కడనుండి బయలుదేరి తాను బస చేసిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు నగేష్. రాఘవరావు ఆలోచన ఏదీ తోచనట్లు కూర్చుండిపోయాడు. బయట ఏదో అలికిడి అయ్యింది. వచ్చి చూసాడు కానీ ఏమీ కనబడలేదు.
*****
లక్ష్మి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మోహన్ కి. "ఉదయం రాఘవరావు ను కలుస్తానని మధు వెళ్లాడని, మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రాలేదని, ఫోన్ కూడా కలవడం లేదని" చెప్పింది. లక్ష్మిని ఆందోళన పడవద్దని, తాను వెళ్లి కనుక్కుంటానని ధైర్యం చెప్పాడు మోహన్. రాఘవరావుకు ఫోన్ చేసాడు మోహన్. మధుమూర్తి వచ్చాడేమో అని అడిగాడు. "రెండు రోజులుగా మధును కలవలేదని" చెప్పాడు రాఘవరావు. మధు ఎటు వెళ్లినట్లు?
రాఘవరావు ఆఫీస్ వైపు బయలుదేరి వెళ్లాడు మోహన్. బయట కూర్చున్న ఉద్యోగిని మధుమూర్తి గురించి అడిగాడు. ఉదయం వచ్చాడని, తర్వాత తాను టీ తాగడానికి బయటకు వెళ్లినందున ఎప్పుడు వెళ్లిపోయాడో చూడలేదని చెప్పాడు అతను. కానీ రాఘవరావు రాలేదని చెప్పాడు కాబట్టి ఏదో జరుగుతోందనుకున్నాడు మోహన్. రాఘవరావు గది బయట బల్ల మీద ఉన్న ఇత్తడి పూల కుండీ స్థానం మారి ఉంది. ఒక పక్క కాస్త లొట్ట పోయి ఉంది. మళ్ళీ వచ్చి "మధు వచ్చిన సమయంలో రాఘవరావు దగ్గరకు ఇంకెవరు వచ్చారు?" అని ప్రశ్నించాడు మోహన్. మధు రాకముందే అయ్యగారి స్నేహితుడు వచ్చారని చెప్పేడు ఆ ఉద్యోగి. ఆయన కూడా ఎప్పుడు వెళ్లిపోయాడో చూడలేదు అన్నాడు. మధుమూర్తి ఫోన్ పనిచేయడం లేదు.
మోహన్ కి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. రాఘవరావు స్నేహితుడు అంటే వ్యాపారస్తుడై ఉంటాడు. ఖరీదైన హోటళ్లలోనే దిగుతాడు. కాబట్టి హోటళ్లు వెతకాలి అనుకున్నాడు. తన తల్లి తండ్రి, మధుమూర్తి తల్లిదండ్రులు, లక్ష్మి, సుధ ఇలా ఎవరికి చెప్పినా కంగారు పడతారు. కాబట్టి తానొక్కడే తిరగాలి అనుకున్నాడు.
ఒక మోటార్ సైకిల్ కి చిన్న మైక్ అమర్చాడు. మధు పేరుతో ఉన్న పాటల పల్లవులు పాడి, రికార్డు చేసాడు. పెద్దపెద్ద హోటళ్లు ఉన్నచోట ఆ పాటలు వినిపిస్తూ, నెమ్మదిగా తిరగసాగాడు. "మధుమాస వేళలో… మరుమల్లె తోటలో…" "ఈ మధుమాసంలో… ఈ దరహాసం లో…" "మధువొలకబోసే నీ చిలిపి కళ్ళు…" "మానస వీణ మధుగీతం" "మధుమాసం… కుహు గానం…" "మధురమే సుధాగానం" ఇలా… నాలుగైదు మార్లు తిరిగిన ప్రదేశం లోనే మళ్ళీ మళ్ళీ తిరిగాడు. ఆ హోటళ్ల కిటికీల వైపు చూసేవాడు. ఐదోసారి కాంధారి హోటల్ పక్కనుంచి వెళ్తున్నప్పుడు మూడో అంతస్తు లోని ఒక కిటికీ నుంచి ఏదో పడటం చూసాడు. బండి నిలబెట్టి, అటు ఇటు చూసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. టాయిలెట్ పేపర్ ఉండలు చాలా పడి ఉన్నాయి. కాసేపు సందేహించినా, ఒక ఉండ తీసి చూసాడు. వంకాయ టింకర అక్షరాలతో మధు - మోహన్ అని మాత్రమే రాసి ఉంది. మధు అక్కడ ఉన్నాడని మోహన్ కు అర్ధమయ్యింది.
బండిని హోటల్ పార్కింగ్ లో పెట్టి, రిసెప్షన్ లో ఉన్న వ్యక్తిని చూసాడు. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పలకరించి చిన్న కథ వినిపించాడు. తనకు ఒక కలం స్నేహితుడు ఉన్నాడని, ఇవాళ కలుస్తానన్నాడని, 3 వ అంతస్తు లో ఉన్నాడని, రూమ్ నెంబర్ మరచిపోయానని, అనుమతిస్తే పాటలు పాడి కలుసుకుంటానని చెప్పాడు. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. విషయం ఆసక్తిగా ఉండటం తో మోహన్ వెంట వస్తానని చెప్పింది. రిసెప్షన్ లో డ్యూటీ వేరేవారికి అప్పగించి, మోహన్ వెంట నడిచింది. మోహన్ ప్రతి గది దగ్గర అవే పాటలు చిన్న గొంతుకతో పాడుతూ తిరగసాగాడు. ఒక గది దగ్గర ఆ పాటలు పాడగానే ఏవో చప్పుళ్ళు వినబడసాగాయి. "ఈ గదే" అన్నాడు మోహన్. రిసెప్షనిస్ట్ గది వైపు చూసింది. తాళం వేసి ఉంది. అదే మాట చెప్పింది మోహన్ కి. కానీ మోహన్ ఒప్పుకోలేదు. "తన స్నేహితుడు ఈ గదిలోనే ఉన్నాడు" అన్నాడు. ఆమె వెంటనే కిందకి ఫోన్ చేసి మాస్టర్ కీ తెప్పించింది. గది తలుపులు తెరిచి చూసేసరికి ఎవరూ లేరు. మళ్ళీ మరో పాట పాడాడు మోహన్. ఈసారి బాత్ రూమ్ నుంచి చప్పుడు వినిపించింది. గబగబా అటు వెళ్లారు ఇద్దరూ. బాత్ రూమ్ తలుపు తెరిచేసరికి అక్కడ కాళ్ళు చేతులు విడివిడిగా కట్టబడి, నోటికి ప్లాస్టర్ వేయబడిన మధు కనిపించాడు. రిసెప్షనిస్ట్ బిత్తరపోయింది.
****సశేషం****
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల... ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.
ముందుమాట:
"అనామిక" అనే ఈ నవల 90' లలో మొదలైన ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? అనామిక ఎవరు? ఆ ప్రేమ జంటకి అనామికకు సంబంధం ఏమిటి? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది.
దైవిక శక్తులతో ఆటలాడడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాంటి వారిని శిక్షించే పని భగవంతుడే వివిధ రూపాలలో పూర్తి చేస్తారు. అలా జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ నవల రూపు దిద్దుకుంది.
ఈ నవల మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ....మీ అభిప్రాయాలను, సూచనలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ.. "అనామిక" నవలను సీరియల్ గా ప్రచురిస్తున్న సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమప్రియ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ...
- నాగమంజరి గుమ్మా, శృంగవరపుకోట
మంచి రచనా శైలి మీది.