సాహితీ ప్రక్రియ - గజల్...
గజల్ : 9 (ఖండ గతి)
***
సిగలోన సుమమాల తురిమింది వయ్యారి!
క్రీగంట ననుజూచి నవ్వింది వయ్యారి!
లేలేత నడుముపై వంపులే కవ్వించె,
అధరాల మధువులే చిలికింది వయ్యారి!
సుందరిని కౌగిలిలొ బంధింప మనసాయె,
ప్రేమగా దరిజేరి మురిసింది వయ్యారి!
అందాల అపరంజి బొమ్మయే తానులే,
నాహృదయ కుసుమమై విరిసింది వయ్యారి!
సత్యమౌ ప్రేమకూ భాష్యమే లేదులే,
తోడుగా నీడగా నిలిచింది వయ్యారి!
***
గజల్ : 10 (ఖండగతి)
***
కడలిలో అలలలా కదలవే నెచ్చెలీ!
ఒంటరినను భావనే వీడవే నెచ్చెలీ!
గగనాన్ని దాపుగా చూపేను సంద్రమే,
భ్రమలన్ని వదిలేసి బ్రతుకవే నెచ్చెలీ!
నింగిలో విహగాలు ఎగిరేను హాయిగా,
స్వేచ్ఛ నీ హక్కనీ ఎరుగవే నెచ్చెలీ!
తీరాన్ని చేరగా అలలన్ని పరుగిడే,
దీక్షతో లక్ష్యాన్ని చేరవే నెచ్చెలీ!
కష్టాలె తప్పవులె జీవితపు బాటలో,
నీగెలుపు సత్యమనీ నమ్మవే నెచ్చెలీ!
***