Menu Close
లేఖిని - కథా లోగిలి
సేకరణ, కూర్పు - అత్తలూరి విజయలక్ష్మి
ఆకాశమంత మనసు
- డా. బండారి సుజాత -

తెలతెలవారుతోంది. పక్షుల కిలకిలారావాలతో ప్రకృతి పసందుగా పరవశిస్తోంది. ఉషోదయపు వెలుగులన్నీ ధరణిపై మెల్లమెల్లగా పరుచుకుంటున్నాయి. ఇంటి ముందు కావుకావుమంటూ కాకుల అరుపులు. అబ్బా! ఇంటి చుట్టూ చెట్లు పెట్టుకోవడం తప్పైపోయింది. కాసేపు పడుకుందామన్నా పడుకోనివ్వవు కదా! ‘ఇంకా పడుకుంటావా? లే లెమ్మం’టూ రమణీయ పలకరింతలనుకుంటూ లేచింది వసుంధర.

పడకగది కిటికీలు తెరవగానే కనిపించిన పచ్చని ప్రకృతికి మనసంతా హాయిగా నవ్వింది. రాత్రి వర్షానికి చెట్లన్నీ ముదురాకు పచ్చ చీరకట్టి మురిసిపోతున్నాయి. ‘అబ్బా ఎంత బాగుందో...’ అనుకుంటూ తలుపులు తెరుచుకొని బయటకు రాగానే చల్లని గాలి రివ్వుమని ముఖానికి తాకగానే నవ్వుకుంది వసుంధర. బయటకు రాగానే నిన్నటి గులాబీ మొగ్గ కొంచెం విచ్చుకోవడం చూసి మురిసిపోయింది. రేపో ఎల్లుండో పూర్తిగా విచ్చుకుంటుందనుకొని, అటువైపు చూడగానే ప్రహరిగోడకు కట్టిన కవర్లో రాలిన పారిజాత పుష్పాలను చూడగానే మనసు ఆనందంతో గంతులు వేసింది. ‘అబ్బా ఎన్ని పువ్వులో... ఈరోజు అమ్మవారికి పెద్ద దండకట్టి వేయాల’నుకుంటూ గేటు తాళం తీస్తుంటే, కేర్‌మంటూ పసిపాప ఏడుపు. బయటకు వెళ్ళిచూస్తే, వేపచెట్టు కింద కొత్తబట్టలతో పొత్తిళ్లలో పడుకోబెట్టిన పసిపాప.

తనకు తెలియకుండానే, “ఏమండీ!” అంటూ గావుకేక పెట్టింది వసుంధర. భార్య పెట్టిన కేకకు భయపడి వదలని నిద్రమత్తులో పరుగెత్తుకు వచ్చాడు రఘుపతి. ఏమైంది అంతలా అరిచావంటూ... ఆమె చూపిన వైపు చూశాడు రఘు.

పొత్తిళ్ళలో బంగారుబొమ్మలా ఉంది పాప. ఆ చుట్టుపక్కల ఇండ్లు కొంచెం దూర దూరంగా ఉంటాయి. అందరూ డబ్బున్నవాళ్లే... ఎవరిని ఎవరూ పట్టించుకోరు. అంతలా అరచిన వసుంధర కేక విని కనీసం ఒక్క మనిషి కూడా బయటకు రాలేదు. అయినా చాలామంది సూర్యోదయాన్ని, అస్తమయాన్ని చూడటం ఎప్పుడో మర్చిపోయారు.

‘చేతిలో సెల్లు, ఇంటిలో టీవీ... అన్నీ అమర్చిపెట్టే ఒక సంపాదనాపరుడు. కాలు కింద పెట్టనీయకుండా పయనింప చేసే పడవ కార్లు. ఝామ్మంటూ పరిగెత్తే మోటార్ బైకులు. ఇంకా వేరే ఆలోచన ఎందుకు ఉంటుంది?’ అనుకున్నది వసుంధర. ఆ పాపను చేతిలోకి తీసుకుంది వసుంధర.

ఆ చుట్టుపక్కల ఎవరైనా కనబడతారేమోనని చూసివచ్చాడు రఘు. ఇంత పొద్దున్నే ఎవరూ లేవరనుకొని వచ్చాడు రఘు.

ఇంట్లోకి పాపను తీసుకొని వచ్చారిద్దరూ. ముద్దులు మూటకట్టినట్లున్న పాపను చూస్తూ ఎవరో మంచి కుటుంబానికి చెందినదై ఉంటుందనుకున్నది వసుంధర.

"ఏం చేద్దామండీ?" అన్నది వసుంధర.

"ముందు పాపకు పాలుపట్టు. ఏదైనా బట్టలషాపు తెరిచుంటే చూసి పాపకు బట్టలు తెస్తాను" అన్నాడు రఘుపతి.

"పసిపిల్లండీ... ఏ కన్నతల్లి పారేసుకుందో, అయినా జాగ్రత్తగా తీసుకొచ్చి మన గేటు దగ్గర పడుకోబెట్టడం ఏమిటో నాకు అర్థమైత లేదు” అన్నది వసుంధర. పాపను ఎత్తుకోగానే పాల కోసం తడుముకుంటున్న పాపను చూసి, నవ్వుకుంటూ, పాపను సోఫాలో పడుకోబెట్టి కొన్ని పాలు వేడి చేసుకొచ్చి నీళ్లు కలిపి దూదితో ముంచి పెదవులు కానించింది వసుంధర. పాప పాలు చప్పరిస్తుంటే సంతోషంతో మునిగిపోయారిద్దరూ.

“చూడు! వసూ, పిల్లలిద్దరూ పెద్దోళ్ళైపోయారు. కాలేజీ చదువులకొచ్చారు. నీకు కాలక్షేపం లేదని తెలిసినవాళ్ళే ఈ పని చేశారనుకుంటున్నాను” అన్నాడు రఘు.

“చుట్టుపక్కల ఇన్ని ఇండ్లుండగా, మన ఇంట్లోనే వదిలిపెట్టారంటే మీరు అన్నది నిజం కావచ్చు” అన్నది వసుంధర. “మా, మీ చుట్టాల్లో ఎవరైనా తప్పటడుగులు వేశారంటావా?” అన్నాడు రఘు.

“అయితే మాత్రం మనకు తెలియకుండా ఉంటుందా! అయినా మనకి ఇట్లాంటి ఆలోచనలెందుకండి?” అన్నది వసుంధర.

వసుంధర, రఘుపతిలది అందమైన కుటుంబం. ఇద్దరూ కవలపిల్లలు. పాప దీప్తి. బాబు ధీరజ్. ఇద్దరూ ఇంటర్మీడియట్‌కు వచ్చారు. ఇద్దరినీ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. చూడాలనిపిస్తే ఇద్దరూ వెళ్లి చూసి వస్తారు. సెలవులు వచ్చాయంటే పిల్లలకు ఇష్టమైన ప్రదేశాలను తీసుకెళ్తుంటారు. రఘు వ్యాపారం చేస్తూ, వ్యవసాయం చూసుకుంటాడు. వసుంధర చదువుకుంది. కానీ, సామాజిక సేవకే అంకితమైంది. అనాథ శరణాయాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్తూ వాళ్ళ బాగోగులు చూసుకుంటుంది. అందుకేనేమో పాపని తీసుకొచ్చి తన ఇంటిముందు వదిలిపెట్టారనుకున్నది వసుంధర.

“ఇదంతా అనవసరం కానీ, ముందు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెప్పి రండి. తర్వాత లేని కష్టాలు వస్తాయి” అన్నది వసుంధర.

“మరేం చేద్దామంటావు పాపను?” అన్నాడు రఘు.

“ముందు వెళ్ళండి తర్వాత ఆలోచిద్దాం. ఈ విషయం అందరికీ తెలియాలి కదా! లేకపోతే మనమే ఎక్కడినుండో పట్టుకొచ్చామని, లేనిపోని మాటలు పడాల్సి వస్తుంది” అన్నది వసుంధర.

పనిమనుషులు, పాలవాళ్ళ కలకలంతో విషయం ప్రతి ఇంటికీ చేరిపోయింది. ఒక్కొక్కరూ వస్తూ పాపను చూస్తున్నారు. పాపను చూస్తూ, “పాప బావుంది. ఆ తల్లికి మనసెట్ల ఒప్పిందో. తప్పులు చేయడం తలలు వంచుకోవడం. పిల్లలను కని అనాథలను చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది” అని ఒకరు. “ఇట్లాంటి పనులు చేయడం ఎందుకు? ఇలా పారేయడమెందుకు?” అని ఒకరు... ఇలా రకరకాల మాటలంటూ జనమంతా గుమికూడి ముచ్చట్లలో పడ్డారు.

ఉదయం పదిగంటల వరకూ ఆ ఇల్లంతా రకరకాల వ్యక్తులతో నిండిపోయింది. పోలీసులు చుట్టుపక్కల ఎంక్వయిరీ చేసి వచ్చారు. ఆసుపత్రుల్లో ఈ రెండు మూడు రోజుల్లో పుట్టిన పిల్లల వివరాలు తీసుకొస్తామన్నారు పోలీసులు. డాక్టర్ వచ్చి చెక్ చేసి పుట్టి నాలుగైదు రోజులైందని చెప్పి, పాప ఆరోగ్యంగా ఉందన్నాడు.

తను ఆర్థికసహాయమందించే వివిధ ఆశ్రమాల నిర్వాహకులు వచ్చారు. ఆమె సహాయం అందుకున్న వాళ్ళందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పాపకు మీరైతేనే దారి చూపుతారని మీ ఇంటి ముందు వదిలేసినట్లు ఉన్నారని, మీకు బాగా తెలిసిన వాళ్ళే కావచ్చని ఒకరు. ఒక్కొక్కరూ ఒక్కోమాట అంటున్నారు. రఘు బట్టలు తీసుకురాగానే పనిమనిషి పాపకు స్నానం చేయించుకోవడానికి ఎత్తుకుంది. పాపకు వేసిన బట్టలు కొత్తవే. అందరూ గమనిస్తూనే ఉన్నారు. పాపను పడుకోబెట్టిన చీరమడతలలో 'నన్ను క్షమించండి' అని రాసిన చీటీ కింద పడింది. దాంతో అందరి అనుమానాలు దృఢమైనవి. ‘ఎవరో మీకు కావాల్సిన వాళ్లే’ అని అన్నారందరూ.

‘పాపం. పాపను ఏ పరిస్థితులలో వదిలివేసిందో ఆ కన్నతల్లి, వదిలేటప్పుడు ఎంత బాధపడిందో...’ అనుకున్నారు రఘు, వసుంధరలు.

పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు పోలీసులు. “పాపను ఎక్కడ చేరుస్తారు?” అని అడిగిన వాళ్ళందరితో, “ఇప్పుడు నేనేమీ చెప్పలేను. ఇది రోజుల పాప. పాప బాగోగులు ఈ రెండు మూడు నెలలు నేను చూసుకుంటాను. పాపకు ఒక ఆయమ్మను పెడతాను. ఈ లోపల ఎవరైనా మనసు మార్చుకొని మా పాపేనంటూ తీసుకువెళ్తే అన్ని ఆధారాలు తీసుకొని మీ అందరి సమక్షంలో వాళ్ళకు అప్పగిస్తాను. లేదా, నన్నే నమ్మి మా ఇంటి ముందు వదిలిన పాపను నేనే తల్లినై పెంచుతాను” అన్నది వసుంధర.

ఆ మాటలకు రఘు కూడా సంతోషించాడు. అందరూ ఆమె చేసే పనులను ముచ్చటించుకుంటూ, ఆమె మనసు ఆకాశమంత విశాలమైనదని, అందుకే ఎందరెందరికి సేవ చేస్తున్నా, అదనపు భారాన్ని మోయడానికి వెనుకాడని మనసున్న ఆమె గుణగణాలు ఆకాశమంత ఎత్తైనవని, ఆమె అనాథలకు అమ్మ అంటూ, అందరూ ఆమెను ప్రశంసించారు.

అక్కడే ఉన్న నాయకులు, శిశు సంరక్షక ఆఫీసర్లు, వివిధ సంఘాల సంరక్షకులు రఘు, వసుంధర దంపతుల సేవను కొనియాడుతూ, వారిలా పరులకు సేవచేయటంలో ముందుండాలన్నారు.

ఉన్నంతలో ఉపకారం చేయడమే జీవితానికొక సార్థకత అనుకొని అడుగులు వేసిన వసుంధరకు తోడై నిలిచాడు రఘు.

"ప్రార్థించే పెదవులకన్నా సాయంచేసే చేతులు మిన్న" అన్న మదర్ థెరిస్సా బాటలో నడుస్తున్నఆ దంపతులు సమాజానికే ఆదర్శమన్నారందరూ.

********

Posted in November 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *