టైం పదిన్నర.
అప్పుడు తెల్లారింది సావిత్రి కరుణాకరం ల గారాలపట్టి పదిహేడేళ్ళ సత్య భామకి.
భామ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అక్క అనసూయ కొడుకు, సావిత్రి కూతురు భామా మూడు నెలల తేడాతో పుట్టినా మగపిల్లాడు కాబట్టి హాస్టల్ లో వేసింది అనసూయ. సావిత్రికి ఆడపిల్ల కాబట్టి వెయ్యి కళ్ళ తో చూసుకోవడం తప్పదని ఇంట్లోనే ఉంచి అదే కరెక్ట్ అని వాదిస్తుంది సావిత్రి.
మూడేళ్ళ నుంచి చదువులకి ఆటంకాలే.
హఠాత్తుగా వైరస్ లు కమ్ముకు వచ్చేయడం వల్ల కాలేజీలు మూతలు పడి ఇంట్లో సిస్టమ్స్ లోనే చదువులు.
అయినా అనసూయ పిల్లాడిని ఇంటికి తీసుకు రాలేదు.
హాస్టల్ వార్డెన్, మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ గా జాగ్రత్తలు తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కో గది ఏర్పాటు చేసి విద్య నేర్పుతామని ప్రకటించాయి.
వార్డెన్ కి మరింత డబ్బు ముట్ట చెప్పి పిల్లాడికి స్పెషల్ కాపలా పెట్టి దీర్ఘంగా నిట్టూర్చింది అనసూయ.
ఇక్కడే ఉంటే చెవిలో జోరీగ అయి ప్రాణం కొరుక్కుతింటాడని హాస్టల్లో వార్డెన్ గట్టి బెత్తం పుచ్చుకుని కఠినంగా ఉంటే చదువుకి ఢోకా ఉండదని, బలాదూర్ గా తిరిగే కంటే ఎంతో కొంత చదువు ఒంట బడుతుందని కొడుకు చదువు విషయంలో మాత్రం డబ్బు ఖర్చుకి వెనుకాడలేదు.
తను అలా విశాలంగా ఆలోచించకుండా ఇంటికి తీసుకొచ్చేస్తే తన అక్షరమాల చదువుకి, శ్రీధర్ రావు ఏమాత్రం పట్టించుకోని తీరుకి ఎందుకూ కొరగానివాడయి పోతాడని వాడిని హాస్టల్లోనే ఉంచి ఇంత డబ్బు పడేయ్యడమే కరెక్ట్ అని అనసూయ అంటుంది.
ఆడపిల్ల విషయంలో అదంతా కుదరదని మొత్తం దేశంలోనే కొంగు చూస్తే చాలు... రేపులు జరిగిపోయి ఆ పైన చంపి విసిరేస్తుంటే బంగారం లాంటి పిల్ల ని ససేమిరా ఎక్కడికీ పంపనని అంటుంది సావిత్రి.
ఇవన్నీ వినేది ఇద్దరే ఇద్దరు. అపర్ణ, ధృతి.
ఆ ఇద్దరు ఆడపడచుల పోటీ ఎందులోనైనా పోటా పోటీ గా సాగుతూ ఉంటుంది.
దేన్నీ సమర్ధించకూడదు.ఇద్దరు చెప్పేవి వింటూ "డూ... డూ... బసవన్న...” అనాలి.
లేకపోతే ముంచుకొచ్చే ప్రమాదం ఇద్దరికి అనుభవమే.
మూడో ఆవిడ అనులేఖ. ఇటువంటి చిన్నా, చితకల్లో తల దూర్చదు. ఆవిడ విశ్వరూపమే వేరు.
విషయం ఏదైనా కారణం మాత్రం ఒక్కటే. లంకంత కొంప లో గంపెడంత ఆస్తిని ఎవడు ఎలా కొట్టుకుపోతారు అనే కాపలా. ఇలా రోజూ లైవ్ వార్తల్లోకి వచ్చినట్టు వచ్చి సింహాద్రికి చెప్పి పోతోంది సంపంగి. సంపంగి సౌందర్యాన్ని చూస్తే చాలనుకునే సింహాద్రి అన్నీ వింటూ ఉంటాడు.
ఇదంతా గమనించింది ధృతి. వాళ్ళిద్దరూ కలుసుకోడానికి, ఒకర్ని ఒకరు చూసుకోడానికి ఇంటి సంగతులు ఒకవంక. ఇదంతా కనిపెట్టిన ధృతి వాళ్ళిద్దరికి త్వరలో పెళ్ళి చేద్దామని సుందరమూర్తి తో చెప్పింది.
భారం తీరినట్టు హాయిగా నవ్వేశాడు సుందరమూర్తి. అందుకే కాస్త జాగ్రత్తలు చెప్పి సింహాద్రి తో మాట్లాడనిస్తుంది ధృతి.
మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని తెలిసాక వాళ్ళిద్దరి మాటల్లో కొంచెం చనువు వచ్చి చేరింది.
★★★
ఆరోజు భామ రూమ్ కి టిఫిను, కాఫీ సంపంగి తో పంపించింది అపర్ణ.
రూమ్ లోకి అడుగు పెట్టిన సంపంగి నోరెళ్ళబెట్టి చూస్తోంది.
భామ ఒళ్ళు విరుచుకుంటూ అద్దంలో చూసుకుంది. అటు తిరిగి ఇటు తిరిగి అందాలు చూసుకుంది. నిజానికి సావిత్రి లాగే గొప్ప అందగత్తె ఆ పిల్ల. ముద్దులొలికే మొహం. ఆ కళ్ళు ఇంతింత. వంపులు తిరిగిన నూగారు వెంట్రుకలు గాలికి రేగి రింగులు తిరిగి అక్కడక్కడే దోబూచులు ఆడుతూ ఉంటాయి. వాటికి తగ్గట్టు కళ్ళు రెపరెప లాడుతూ ఉంటాయి. దోరవయసుకి పొంగిన బుగ్గలమీద లేలేత సిగ్గులు కంది పోతుంటాయి.
తెల్లని కలువ ఆ పిల్ల. చూపు తిప్పుకోలేని నిగారింపు.
మధురోహలతో ఆపిన ఆగని పెదాల ఒంపులు. ఎడతెగని నాట్యమాడే బారెడు జడ. ఇంకా ఎన్నెన్నో.
ఊహకు అందనంత ఆనందంతో ఒంటి పులకరింపులు.
“ఎన్నున్నా... ఎన్నెన్ని ఉన్నా మావా!
జిహ్వ కో రుచి, పుర్రెకో బుద్ది లా ఆ పిల్ల తెగ పోజు కొట్టేది ఎవరికి?
పాన్ పరాగ్ లు, సిగరెట్లు, జరదా పాన్ లు అమ్ముకునే బడ్డీ కొట్టు రంగాకి.
పాపం. ఆ పిల్లని తేనెటీగ కాటేసింది.
ఆ కాటుకి పిల్లకి మత్తెక్కింది.
ఆ మత్తు దిగాలంటే ఒక మందు ఉంది.
అది పడే దాకా ఆ పిల్ల మాట వినదు.
మనకేదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కదా?
సొంత వైద్యాలు చేసుకుంటే మొదటికే మోసం.
డాక్టర్ రాసిన వాటిని చూస్తూ కూర్చుంటే సరిపోదు. మొత్తం లిస్ట్ ప్రకారం వేసుకోవాలి.
వేసుకుంటే సరిపోదు.
దానికి తగ్గ ఆహారం పడాలి.
పడితే సరిపోదు.
'జబ్బు తగ్గిపోతుంది' అని నమ్మకం పెంచుకోవాలి.
పెంచుకుంటే సరిపోదు.
ఎదవ్వేషాలు తగ్గించాలి!" ఆపకుండా చెప్పుకుపోతోంది సంపంగి.
"ఆపెహే!"అరిచాడు సింహాద్రి.
గంట నుంచి పొద్దుట చూసిందంతా రికార్డ్ చేసినట్టు చెప్తూనే ఉంది. వెక్కిరించి పారిపోయినట్టు చేసి బయటికెళ్ళి కిటికీ దగ్గర నుంచుని ఉంది సంపంగి.
సింహాద్రి సంపంగి చిలిపితనానికి ఒకటే నవ్వుకుంటున్నాడు. ఆ పిల్ల చదువు, మంచి తెలుగు భాషా బాగానే నేర్చింది. టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన సింహాద్రికే చదువుకోవాలని బుద్ది పుట్టింది.
అప్పుడు కిటికీలోనుంచి వినపడింది.
“అలా తెల్లారిన భామగారికి నిజమైన పిట్టల తీయని పాటలు, కోకిల కుహూ కుహూలు చస్తే నచ్చవు.
లేచీ లేవగానే పెద్ద ఎత్తున ఇంగ్లీష్ రాక్ మ్యూజిక్ పెట్టేసి బ్రష్ చేస్తూ ఒక గెంతు, స్నానం చేస్తూ నాలుగు గెంతులు గెంతితే గానీ రోజు మొదలవ్వదు.
ఎవరో ఒకరు వచ్చి తిట్టిపోస్తే తప్ప ఫుల్ వాల్యూమ్ పెట్టిన సౌండ్ లు తగ్గవు!" అంది.
పగలబడి నవ్వాడు సింహాద్రి.
★★★
ఆ రోజు ప్రాంజల్ ఏమి తినకుండా, తాగకుండా విసురుగా సూట్ కేస్ తో సహా వెళ్ళిపోయాడు. ధృతి అలా సైలెంట్ గా ఉండడం అతడికి ఏమి నచ్చలేదు. ఒక రెండు వారాలు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాను అన్నాడు. అంతే కదా?
ఆ మధ్యాహ్నమే అతడి గోవా ప్రయాణం. రెండు వారాలు వాళ్ళు కులాసాగా తిరుగుతారు. ఒక్కోసారి ఫోన్ కి దొరకక పోవచ్చని, ఫోన్ చేసి రాద్ధాంతం చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చేసాడు.
అందరూ ఒక దగ్గర కలుస్తారని రాత్రే చెప్పేసాడు. తన జీవితానికి ఇదొక్కటే దొరక్క దొరక్క దొరికే మంచి అవకాశం అనీ, కొద్దిగా నైనా అర్థం చేసుకోమని రెండు చేతులూ జోడించేసాడు.
హతశురాలైంది ధృతి. ఆమె చిరునవ్వుతో సాగనంపలేదనే ఆ కోపం యాక్సిలేటర్ మీద చూపించాడు.
తను వెళ్తున్నది ఆఫీస్ టూర్ అని సుందరమూర్తి, అపర్ణ లకి చెప్పాడు.
అప్పుడు టైం ఉదయం పది.
అనులేఖ రోజూ ఆ టైం కి రాజుగాడిని తీసుకుని బయటికి పోతోంది.
మనోహర్ కి అదే ఊళ్ళో బాంక్ ఉద్యోగం. బాంక్ అయ్యాక ఫ్రెండ్స్ తో యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. అతడికి ఏ బాదరా బందీ లేని ఈ లైఫ్ యమా బాగుంది. తన సంపాదన వివరాలు అనులేఖ అడగదు. ఖర్చులకు సుందరమూర్తి ఇస్తాడు. ఇలాంటి బలాదూర్ బతుకు ఎవడికొస్తుంది? అని మురిసిపోతాడు.
పెళ్ళాం రాత్రి పూట పక్కన ఉంటే చాలు. అందుకే ఎదురు చెప్పడు. మిగిలిన సమయాలన్నీ సినిమాలు, షికార్లు. పిల్లలు కావలనుకున్నప్పుడు వాళ్ళేపుట్టుకొస్తారని, దానికి ఇంకా టైం ఉందని అంటూ ఉంటాడు.
ఒక్కోసారి అమ్మగారింటికి పోతాడు. అక్కడ అంతా డిసిప్లిన్. చేతులు కట్టుకుని ఉండాల్సిందే. అక్కడే అనులేఖ కూడా స్థిరంగా ఉండి ఉంటే మనోహర్ పప్పులేం ఉడికేవి కావు. భార్య, తల్లి తండ్రులతో ఏం చెప్పిందో గానీ వాళ్ళు కోడలు పట్ల నమ్మకం, ఇష్టం. మనోహర్ కి భార్య వన్నె చిన్నెలు తెలుసు. సుఖంగా కాలం వెళ్ళ బుచ్చలేదు. ఆ రాజుగాడి తో కలిసి ఎవరెవరు ఏమేం చేస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో వినిరమ్మని గిల్లి కజ్జాలు పెట్టేసి, కయ్యాలు ఆడుకుంటూ ఉంటే ఏమి తెలియని నంగనాచి లా మొహం పెడుతుంది.
ఉన్న విషయం తేట తెల్లంగా ఉంటే నచ్చదు. రంగులు పూసి మసి పూసి మారేడుకాయ చేస్తుంది. ఇంత దేవకన్య లాంటి భార్యకి ఇటువంటి గుణం ఏమిటా అని తలపట్టుకుంటాడు.
బయటికి ఏమన్నా అంటే చచ్చే చావు. అందుకే బయట హాయిగా తిరిగెయ్యడం, వచ్చి పడుకోవడం చేస్తాడు.
దేనికీ ఎదురు చెప్పడు. ప్రాంజల్ వెళ్ళిం తర్వాత ధృతి పిల్లల గదిలోకి వెళ్ళింది.
జాజి వచ్చి తల్లి ఒడిలో కూర్చుంది.
"స్కూల్ కి మళ్ళీ శలవు అమ్మా!" అన్నాడు సౌమిత్.
"కొన్నాళ్ళే. వైరస్ మూలంగా. ఎప్పుడూ సిట్యుయేషన్స్ ఇలాగే ఉండవుగా?" అంది.
"వసంత్ మామయ్య ఎప్పుడు వస్తాడు?" అడిగాడు సౌమిత్.
వసంత్ ధృతి పెద్దమ్మ కూతురు మంజుల కొడుకు. వసంత్ పుట్టీ పుట్టగానే మంజుల చనిపోవడం తో అందరూ వాడిని అనరాని మాటలు అంటూ ఉంటే ధృతి తండ్రి భరద్వాజ వాడిని చేరదీసాడు.
ఇప్పుడు బిటెక్ చేసి క్యాంపస్ సెలెక్షన్స్ లో మంచి జాబ్ కి సెలెక్ట్ అయి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు.
"వస్తాడు త్వరలో!" అంది.
"మామయ్య చాలా సరదా గా మాట్లాడతాడు అమ్మా!" అన్నాడు మళ్ళీ.
సౌమిత్ కి ఈ రొటీన్ చిరాగ్గా ఉందని అర్ధం అయింది. కొన్ని రోజులుగా తానూ, ప్రాంజల్ సీరియస్ గా ఉండడం వాళ్ళకి అదోలా ఉందేమో?
వెంటనే వసంత్ కి ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నాడో కనుక్కుంది. అది విన్న సౌమిత్ ఆనందంగా గంతులు వేశాడు.
★★★
అనులేఖ రాజు ని తీసుకుని బయటికి వెళ్ళింది.
సుందర మూర్తి పొద్దున్నే వెళ్ళిపోయాడు. అనసూయ గదిలో భర్త తో సరదాగా కబుర్లు చెప్పుకుంటోంది.
సావిత్రి కరుణాకరం తో ఆ రోజు పొట్లాట లేనందుకు గుర్రు పెట్టి నిద్రపోతోంది.
శంకరం పొద్దున్నే బజారు పనులమీద పోతూ లేటవుతుందని కంగారు పడొద్దని సురేఖకి చెప్పిపోయాడు.
గిరిధారి కొత్త వీడియో గేమ్ వెతుక్కుంటున్నాడు.
అప్పుడు ఓ గట్టి కేక కెవ్వుమంటూ వినిపించింది. అందరూ అదిరిపోయారు. ఆ గొంతు సంపంగిది.
భవంతి కూడా ఒణికిపోయినట్టయింది ఆ అరుపుకి. అందరూ అరువు వినిపించిన దిక్కుకి పరుగెత్తుకు వచ్చారు. అది శంకరం, సురేఖల గది.
సంపంగి చేతుల్లోని సురేఖ వెళ్ళాడిపోతోంది. ఆమె ఆత్మహత్యకి పాల్పడింది. గిరిధారి తల్లిని అలా చూసి భయంతో వణికిపోతున్నాడు.
సావిత్రి కొడుకు త్రిలోక్ చేష్టలుడిగి నించున్నాడు. అపర్ణ కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. అందరికి భయం వేస్తోంది.
అక్కడ ముందుగా తేరుకున్నది ధృతి. ఫాస్ట్ గా కారు తీసి అందరి సాయంతో సురేఖని గట్టిగా పట్టుకోమని సంపంగితో చెప్పి కారుని స్పీడ్ గా పోనిచ్చింది.
చేయాల్సిన పనిని కాంసెంట్రేషన్ తో చేయడం ధృతి ని చూసి నేర్చుకోవాలి. సురేఖ చేత ఆమె తీసుకున్న పాయిజన్ కక్కించి కాపాడిన డాక్టర్లతో ఆమె మాట్లాడుతుంటే సంపంగి ఆశ్చర్యంగా చూస్తోంది.
ఆమె కి డ్రైవింగ్ వచ్చన్న సంగతి ఎవ్వరికి తెలియదు. విపత్కర పరిస్థితుల్లో అవసరం అయినప్పుడు పనికి వస్తుంది అనుకున్నప్పుడు మీన మేషాలు లెక్కపెట్టకుండా ఉండడం కోసం ఏ ఏ పనులని మనం నేర్చుకోవాలో ధృతి సంపంగి అడిగితేనే చెప్పింది.
తను సాయంత్రం వాకింగ్ కి వెళ్ళినప్పుడు డ్రైవింగ్ స్కూల్ కనపడితే ఎలా నేర్చుకున్నది చెప్తూ అదృష్టం బాగుండి పది రోజుల క్రితమే తనకి లైసెన్స్ వచ్చినట్టు అది సమయానికి ఉపయోగపడినట్టు చెప్పింది.
కానీ తెలివి వచ్చాక- సురేఖ తన ఆత్మహత్య కి కారణం చెప్తే విస్తుపోయారందరూ.
ఆమె ఏర్పరిచిన కాలనీ క్లబ్ లో ఆమే ప్రెసిడెంట్. కొంత మంది సభ్యులు చెప్పా పెట్టకుండా సురేఖని కుట్ర పన్ని తీసిపారేశారుట. ఆ షాక్ లో తనకి ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అనుకున్నానని చెప్పింది.
ఎంతో కష్టపడి ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి కాలనీ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా వెళ్తుంటే పూచిక పుల్లలా తీసి పారేశారు. అది తనకి ఎంత అవమానకరమో వెక్కి పడుతూ చెప్పింది.
'ఉంటే సభ్యురాలిగా ఉండండి. లేకపోతే లేదు.'అని కరుకుగా చెప్పిందిట ప్రస్తుతం పోటీ చేయబోతున్న కనకవల్లి. దాన్ని బలపరిచిందిట సెక్రటరీ చంద్రవంక. తన వెనుకే ఇప్పటి వరకు తిరిగి భజన చేసినవారు ఒక్కరూ తన వైపు మాట్లాడలేదు. జీవితం మీద విరక్తి కలిగింది అని చెప్పింది సురేఖ.
ఆమె మొహం పాలిపోయి ఉంది. అవమాన భారం బలవంతంగా మోస్తున్నట్టు ఉంది.
సురేఖకి నాలుగు గంటల తరువాత కాస్త శక్తి వచ్చాక ఆమెను ధృతి తనకు తెలిసినవారి ద్వారా పలుకుబడి ఉపయోగించి ఎటువంటి గొడవలూ తలెత్తకుండా ఇంటికి తీసుకు వచ్చేసింది.
అప్పుడు అందరూ సురేఖ గదిలో గుమిగూడారు.
"తన ప్రాణం నిలబెట్టినందుకు తనకి ఏమి సంతోషంగా లేదని, చనిపోయి ఉంటే ఇలా తల దించుకుని దోషిలా నిలబడాల్సి వచ్చేది కాదనీ ఈ కాలనీ లో ఇంక తలెత్తుకు తిరగలేనని, తనకి పదవి పోయాక బతికి ఉండడం అనవసరం' అనీ అంది సురేఖ.
ఎవ్వరూ ఏమి మాట్లాడలేదు.
పద్నాలుగు ఏళ్ళ త్రిలోక్ సురేఖ మాటలకి పట్టరాని కోపంతో-
"ఇటువంటి విచిత్రాలు ఇప్పుడిప్పుడే మాకు తెలుస్తున్నాయి.
మన కాలనీ లో రామారావు గారి అమ్మాయి టెన్త్ పోయిందని ఆత్మహత్య చేసుకుంది కదా? ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు ఆఖరిగా ఏమి చెప్పిందో మీకెవ్వరికి అక్కర్లేదు. కానీ మేము అదే వయసుతో ఉన్నాం గనుక మాకు కావాలి.
"ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యావా? మీ నాన్నకి ఎంత తలవంపు? ఎన్ని ట్యూషన్లు పెట్టించాడు? ఎవడితోనో తిరిగే ఉంటావులే. అందుకే పరీక్ష పోయింది అనే సూటిపోటి మాటలు భరించలేక ఈ పని చేసాను!" అంది.
పోనీ, ఏదో ఒక కారణం వల్ల ఫెయిల్ అయితే కాస్త అనునయించి, ఓదార్చి, ఈ సారి పాస్ అయిపోతావులే అని కదా ధైర్యం చెప్పాల్సింది? పరీక్ష పోతే చావే నా? బతికే ఛాన్స్ లేదా?
మళ్ళీ పరీక్ష రాసి పాస్ అవొచ్చని, మరేం పరవాలేదని ఒక్కరంటే ఒక్కరు చెప్పలేదట.
అసలు మా సమస్య ఏమిటో మీకు తెలుసా? ఎప్పుడైనా మా వెనుక మీరున్నారా?
మన ఇంటికి ఎవడో బంధువు వస్తాడు. రోజుల తరబడి తిష్ట వేసి మా గదుల్లోకి వచ్చి మాకు అక్కర్లేనివి, అవసరం లేనివి చెప్తుంటే మీరెప్పుడైన అడ్డుకున్నారా? అసలు మాకు ఫోన్ కొనివ్వడం ఏమిటి? ఎందుకు?
ఇప్పుడంటే ఆన్లైన్ క్లాసెస్. అయితేనేంటి? మీరు దగ్గరుండి స్కూల్ అయిపోయాక సిస్టమ్ ఆఫ్ చేసి పాఠం అర్ధంకాకపోతే చెప్పరా? ట్యూషన్ పెడతారు. ఆ ట్యూషన్ సరిగా జరుగుతోందా అని మీరు వచ్చి చూసారా?
ఏ రోజు ఏ ఏ సబ్జెక్ట్ లో ఏ పాఠం ఆవుతోందో మీకు తెలుసా?
నేను నా గదిలో వీడియో గేమ్ లు ఆడతాను. ఏం? బయట వైరస్ అతలాకుతలం గా ఉంటే మీరు మన ఇంటి గ్రౌండ్లో మాతో ఎందుకు ఆడరు? మా ఆరోగ్యం గురించి ఎందుకు పట్టించుకోరు?
మీకు ఎవ్వరికైనా తెలుసా? మీరందరూ మీ స్నేహితులకి, తెలిసిన వారికి మా గురించి గొప్పగా ఏం చెప్తారో తెలుసా? ‘మా త్రిలోక్, గిరిధారి వాళ్ళ గదుల్లో వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటారు. తెలుసా?' అని. ఇలా అందరికి చెప్పడం నేను ఎన్నోసార్లు విన్నాను.
కానీ నేను చదువుకోను. ఫోన్ లో వీడియో గేములు ఆడతాను. ఇదుగో మీ గిరిధారి కూడా ఆడతాడు. మేమిద్దరం తోడు దొంగల్లా మీకెవ్వరికి ఒకరి గురించి ఇంకొకరం మేమేం చేస్తున్నామో చెప్పం.
మమ్మల్ని కనిపెట్టింది ఇదుగో... ఈ సంపంగి అక్కే. ఎన్నోసార్లు తప్పని, పెద్దవాళ్లకు చెప్తానని బెదిరిస్తున్న సంపంగి అక్కకి పెద్ద వారికి కంప్లైంట్ ఇచ్చేటంత సీను లేదని, చెప్తే ఎవ్వరూ లేని అక్కని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో మేమిద్దరం ప్లాన్ వేసుకున్నాం. వీడియో గేముల కోసం అక్కని ఒక ఆట ఆడించాం.
ధృతి అత్త ఎన్నోసార్లు మేమేం చేస్తున్నామో చూసేందుకు వచ్చిపోతుంటుంది. గది తలుపు కొట్టి లోపలికి రావాలని, మేనర్స్ అదేనని. .మాకు మీరే మోడరన్ ట్రిక్స్ చెప్పారు. ధృతి అత్త లోపలికు వచ్చేసరికి మేము బుద్దిగా టెక్స్ట్ బుక్ పట్టుకుంటాం. కానీ ఈ రోజు నాకు ఎంతో తెలిసింది. బాగా అర్ధం అయింది!" అన్నాడు.
వాడి గొంతులో దుఃఖం ఆపుకుంటున్న జీర. అందరూ విస్తుబోయి వింటున్నారు.
సుందర మూర్తి, శంకరం కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అపర్ణ కొంగు నోటికి అడ్డం పెట్టుకుంది.
ఓ నిముషం తరువాత-
"సురేఖ అత్తా! నిన్ను క్లబ్ ప్రెసిడెంట్ గా తీసేసారని కదా సూసైడ్ చేసుకోబోయావ్. 'ఎందుకు బతికించారు? ఆ పదవి లేకపోతే తలవంపు, బతికించినందుకు సంతోషమే లేదు' అన్నావ్. ఆ ఒక్క మాట తో నువ్వు నన్ను బతికించావు. నీకు నీ కన్న కొడుకు గిరిధారి ఒక్క క్షణం గుర్తుకు రాలేదు.
"వాడి కోసం బతకాలి!" అనుకోలేదు.
మాకు ఆట వ్యామోహం. నీకు పదవి వ్యామోహం.
పెద్దదో, చిన్నదో నీకు కుర్చీ కావాలి. అంతే!
గిరిధారి కి అమ్మ ఉన్నా, లేకపోయినా ఒక్కటే అని నిరూపించావ్. రేప్పొద్దున్న నా గతీ ఇంతే ఇక్కడ.
అని సావిత్రి వైపు తిరిగి-
"ఇదుగో ... నాకింక ఈ ఫోన్ ఒద్దు!" అని అక్కడ పడేసి వెళ్ళిపోయాడు.
సావిత్రి కొడుకు మాటలకి స్థాణువు అయిపోయింది. అక్కడ అంతమంది ఉన్నా గదంతా నిశ్శబ్దంగా ఉంది.
ఒకరి మొహం ఒకరు చూసుకోవడం లేదు.
ఆ మాటలు సూటిగా సురేఖని బలంగా తాకాయి. కొడుకు వేపు చూసింది. గిరిధారి కూడా తల్లివైపు రెండు నిముషాలు కన్నార్పకుండా చూసి జీన్ ప్యాంటులో నుంచి తన ఫోన్ బయటికి పీకి, గోడకేసి లాగి విసిరి కొట్టి టక్కున వెళ్ళిపోయాడు.
ధృతి సైగతో సంపంగి వాడి వెనుకే వెళ్ళి ఆ అబ్బాయి చేతిని గట్టిగా పట్టుకుంది.
గిరిధారి చిత్రమైన నవ్వు నవ్వాడు.
"నేను ఇంక వీడియో గేమ్స్ ఆడనులే!" అన్నాడు సంపంగి చెయ్యి పట్టుకుని.
ఆ పిల్ల కి తట్టుకోలేని బాధ వచ్చింది.
"ఆడొద్దని కాదు గానీ ఎడిక్ట్ అయిపోతున్నావని నేను అన్నది. చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి. వ్యాయామం కోసం పొద్దున్నే... అంటుంటే ఆ మాటని వాడు వెంటనే అందుకుని -
"నడవాలి, సాయంత్రం ఒకగంట ఆడాలి. అంతే కానీ ఇరవై నాలుగు గంటలూ ఫోన్ లో వీడియో గేములా? కళ్ళు పాడయిపోయి, ఊబకాయం రావడానికా ఈ బతుకు బతికేది?" అన్నాడు అచ్చం సంపంగి ని ఇమిటేట్ చేస్తూ.
గది శుభ్రం చేసే వంకతో రోజూ తను అన్న మాటల్ని వాడు అప్ప చెప్తుంటే టక్కున వాడి మొహం లోకి చూసింది. వాడి పెదాల మీద అల్లరి నవ్వు.
"ఆకలిగా ఉంది అక్కా!" అన్నాడు గిరిధారి పొట్ట మీద చెయ్యి వేసుకుని జాలిగా మొహం పెట్టి.
ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది ఆ పిల్లకి.
"ఇప్పుడే ఏదో ఒకటి చేసి తెస్తా!" అంది.
వెనక్కి తిరిగితే ధృతి నిలబడి ఉంది.
ఆమె కళ్ళనిండా నీళ్ళు.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
|