Menu Close
తెలుగు పద్య రత్నాలు 53
-- ఆర్. శర్మ దంతుర్తి --

వైకుంఠ ద్వారపాలకులైన జయ, విజయులకి మానవ జన్మ ఎత్తమని సనక సనందాదులు శాపం ఇచ్చినప్పుడు దాన్ని మూడు జన్మలు వైరంతో బతకడానికి మహావిష్ణువు మార్చాక మొదటి జన్మలో వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారని మనం భాగవతంలో చూస్తాం. హిరణ్యాక్షుణ్ణి విష్ణువు చంపాక, హిరణ్యకశిపుడు తపస్సు మొదలుపెట్టాడు బ్రహ్మ కోసం. ఎందుకంటే ఆయన ఏ వరం అడిగితే అది ఇవ్వగలడు. ఎందుకలా ఇస్తాడనేది చూద్దాం ముందు. ఎవరో రాక్షసుడు చేసే తపస్సు వల్ల లోకాలు దగ్ధమౌతాయేమో అని దేవతలందరూ కలిసి బ్రహ్మ దగ్గిరకి వెళ్ళి వాడి సంగతి చూడమనడం, ఆయన వచ్చి తప్పసుకి మెచ్చి వరం ఇవ్వడం ఇదీ పద్ధతి. అయితే వరం ఇచ్చాక ఆ అసురుడు చేసే పనులకి మరోసారి దేవతలకి ఇబ్బంది. దాంతో ఈ సారి విష్ణువు దగ్గిరకెళ్ళి శరణువేడడం. బ్రహ్మ దగ్గిరకే వెళ్ళొచ్చు కదా మరోసారి అంటే అందులో ఓ తిరకాసు. మొదటిసారి వెళ్ళి వరం ఇమ్మన్నది తామే కనక రెండోసారి వెళ్ళడానికి మొహమాటం, అదీగాక వరం ఇచ్చినాయన ఈ అసురుడికి గురువు కిందలెక్క. గురువెప్పుడూ తన శిష్యుణ్ణి చంపడు కదా? అందువల్ల ఈ సారి విష్ణువు దగ్గిరకి. ఇదీ వరస.

హిరణ్యాక్షుడు చచ్చి పోయాక, హిరణ్యకశిపుడు తన తమ్ముణ్ణి చంపినందుకి విష్ణువు మీద కోపం వచ్చి దారుణమైన తపస్సు మొదలుపెట్టాడు. కొన్నేళ్ళకి ఈ తపోబలం వల్ల ఎగిసే పొగ దేవతలని తాకి వాళ్ళు బ్రహ్మ దగ్గిరకి వెళ్ళారు. సరే నేను చూస్తాను అని విరించి వచ్చాడు ఈ హిరణ్యకశిపుడు తపస్సుచేసే చోటికి. ఆయన కంటికి కనిపించిన విషయం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అక్కడ హిరణ్యకశిపుడు అనేవాడు లేడు. దాదాపు నిర్జీవమైపోయి, పుట్టలో హిరణ్యకశిపుడు కొసప్రాణంతో అస్థిపంజరం తప్ప ఇంకేమీ లేనట్టు ఉన్నాడు. ఇది చూసిన బ్రహ్మ ఏమంటున్నాడో చెప్పేదే ఈ నెల పోతన రాసిన పద్యం.

శా.
దంశవ్రాతములుం బిపీలికలు మేదః క్రవ్య రక్తంబులన్
సంకీర్ణంబులు జేసి పట్టితినఁగా శల్యావశిష్టుండ వై
వంశచ్ఛన్నతృణావళీయుత మహావల్మీకమం దింద్రియ
భ్రంశం బింతయు లేక నీకు నిలువం బ్రాణంబు లెట్లుండెనో? [పోతన భాగవతం 7-82]

రోజుకోసారి భోజనం చేసేవాళ్ళని యోగులనీ, రెండుసార్లు చేసేవాళ్ళు భోగులనీ, మూడు సార్లు అంతకన్నా ఎక్కువసార్లు కానీ చేసేవాళ్ళు రోగులనీ సరదాగా అంటూ ఉంటారు. ఇక్కడ హిరణ్యకశిపుడికి భోజనం గాలి మాత్రమే. బ్రహ్మ అంటున్నాడు "ఈగలూ, చీమలు నీలో ఉండే కొవ్వూ, మాంసం అన్నీ తినేసినా అసలు ఇంద్రియాలు చెదరకుండా ఉండటం ఎలా కుదురుతుంది? నీ ప్రాణాలెలా నిలబడి ఉన్నాయి?" అడవి ఈగలు గుంపులు (దంశవ్రాతముల్), చీమలు (పిపీలికములు), నీ వంటిలో కొవ్వుని (మేద), మాంసాన్ని (క్రవ్య), రక్తాన్ని, చీల్చేసి (సంకీర్ణంబులు జేసి) తినేసాయి. ఎముకలు మాత్రం మిగిలినట్టు ఉన్న (శల్యావశిష్టుండ వై) శిధిలమైన అవస్థలో వెదురు పొదలలో (వంశచ్ఛన్న), గడ్డితో (తృణా) కప్పి ఉన్న పుట్టలో (మహావల్మీకం) అసలు ఇంద్రియాల గురించి స్పృహే లేకుండా (ఇంద్రియభ్రంశం బింతయు లేక) నీ ప్రాణాలు ఎలా నిలిచి ఉన్నాయో కదా (నిలువం బ్రాణంబు లెట్లుండెనో)?

బ్రహ్మ ఈ అసురుడు పట్టుదలతో చేసిన తపస్సుకి ఆశ్చర్యపోయాడు. ఈ తపస్సు అంతా ఎందుకయ్యా అంటే విష్ణువు మీద కోపం. తమోగుణంతో అవతల వారిని నాశనం చేయాలనే విపరీతమైన కోరిక. ఈ తపస్సు వల్ల కోరిక సిద్ధించినా చివరకి మోక్షం మాత్రం సాధ్యం కాదు ఎందుకంటే ఈ తపస్సు చేసేది ఏదో కోరుకుని తాను సాధించేది వేరే ఏదో ఉంది. ఆ కోరిక తీరినా తీరకపోయినా చివరకి దానివల్ల వచ్చేది కష్టమో బాధో మరోటో. ఏదీ అక్కరలేని మోక్షం కావాలంటే దారి వేరే. ఈ తపస్సు కూడా రావణుడు ఒక్కో తల అగ్నిలో వేలుస్తూ బ్రహ్మ కనిపించేవరకూ శరీరాన్ని అంతం చేసుకుంటూ పోయే తపస్సు వంటిదే. ఎక్కిరాల భరద్వాజ గారు చెప్పినట్టు విశ్వామిత్రుడు కూడా మొదట్లో తపస్సు మొదలుపెట్టింది వశిష్టుణ్ణి నాశనం చేయడానికే కానీ బ్రహ్మ విద్య కోసం కాదు. ఇటువంటి తపస్సు వల్ల చివరకి కలిగేది వినాశనమే. బ్రహ్మ రావణుడికి కనిపించినప్పుడు ‘నాకు మృత్యువు లేకుండా’ వరం ఇమ్మన్నాడు. అది కుదరదని చెప్పాక ‘మానవులనుంచి తప్ప’ మిగతావారినుంచి అపాయం, చావూ రాకూడదని అడిగాడు. అయితే విభీషణుడూ చేసాడు తపస్సు రావణుడితో పాటు. బ్రహ్మ కనిపించినపుడు ఆయన ఏం అడిగాడో గమనించండి – “ప్రీతేన యది దాతవ్యో వరమేశృణు సువ్రత, పరమాపద్గరిస్యాపి ధర్మే మమ మతిర్భవేత్.” నా తపస్సు నచ్చి వరం ఇయ్యదల్చుకుంటే విను, ‘ప్రాణాయాయమైన కష్టం వచ్చినా సరే నా మనస్సు ధర్మ మార్గంలోనే ఉండాలి.’ ధర్మో రక్షతి రక్షితః కనక అదీ అసలైన కోరుకోవడం అంటే. దీనికి మెచ్చిన బ్రహ్మ విభీషణుడికి చిరాయువు అవుతావని ఇచ్చాడు వరం. హిరణ్యకశిపుడూ, రావణుడూ తమోగుణంతో కోరిన కోరికలకీ విభీషణుడు సత్వ గుణంతో కోరిన కోరికకీ గమనించవల్సిన తేడా ఇదే.

****సశేషం****

Posted in November 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *