బారిష్టర్-న్యాయవాదిగా గాంధీజీ ప్రహసనం
మోహన్ దాస్ మీద అతని పెద్దన్న లక్ష్మీదాస్ చాలా ఆశలు, నమ్మకం పెట్టుకున్నాడు. తన తమ్ముడు బారిష్టర్ గా సంపన్నుడయి, ఖ్యాతి గడించే వ్యక్తి కాగలడని ఆశించాడు. ఆయన హృదయం విశాలమైనది. అతి మంచి వ్యక్తి. అందువల్ల ఎంతో మంది వ్యక్తులు ఆయనకు చేరువయ్యి చిరకాల మిత్రులయ్యారు. వీరందరు తమ వ్యాజ్యాలను మోహన్ దాస్ కు ఇస్తారని నమ్మాడు. తమ్ముడు న్యాయవాదిగా రాణించటానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు.
మోహన్ దాస్ కు ఇంగ్లండ్ వెళ్లేముందు జరిగిన కుల, సంఘ బహిష్కరణ రాద్ధాంతం ఇంకా రాజుకుంటూనే ఉంది. ఒక వర్గం ఇతనిని తమ కులంలోకి చేర్చుకోవాలని, మరొక వర్గం శాశ్వత బహిష్కరణ చేయాలని పట్టుబట్టింది. మొదటి వర్గాన్ని మంచి చేసుకోటానికి పెద్దన్న బొంబాయిలో దిగిన మోహన్ దాస్ ను మొదట ‘నాసిక్’ కు తీసుకువెళ్లి పవిత్ర గోదావరిలో స్నానం చేయించి, పరిశుద్ధ కర్మలను కూడా పూర్తిచేయించి తరువాత రాజ్ కోట తీసుకువెళ్లాడు. వెంటనే ఈ వర్గం వారందరికీ విందు ఏర్పాటు చేశాడు. ఇది మోహన్ దాస్ కు నచ్చకపోయినా, అన్న మీద ఉన్న ప్రేమ, భక్తి, నమ్మకం వలన వ్యతిరేకించక ఈ కార్యక్రమాలను నిర్వర్తించాడు. అలా తన కులంలో అతనికి పునః ప్రవేశం సులభతరమైంది.
ఈ విషయం మీద గాంధీజీ వివరణ ఇలా ఉంది:
“నన్ను తిరస్కరించిన కుల వర్గానికి నన్ను తిరిగి చేర్చుకోమని నేను బ్రతిమాలలేదు. అలా అని ఆ పెద్దల మీద వ్యతిరేకభావం లేదు. కొత్త మంది నన్ను ఈసడించారు, అసహ్యించుకున్నారు. అయినా వారి భావ స్వేచ్ఛకు నేను భంగం కలిగించలేదు. కుల బహిష్కరణకు సంబంధించిన నిబంధనలను నేను గౌరవించాను. ఈ నిబంధనలవల్ల మా మామ గారు, అత్త గారు నా సోదరి, బావమరిది, ఇతర దగ్గర బంధువులు కూడా నన్ను తిరస్కరించారు. చివరకు వారి ఇళ్లల్లో మంచి నీరు కూడా లభించలేదు. వారిలో కొందరు నా బహిష్కరణను ఉల్లంఘించ ప్రయత్నించారు. బహిరంగంగా చేయలేని పని రహస్యంగా చేయటం నా వ్యక్తిత్వానికి సరిపడదు.”
నేను బహిష్కరించబడినా, సామాన్య జనంలో అత్యధికులు నన్ను సహృదయంతో స్వీకరించారు. చాలా మంది నా వృత్తిలో సహాయం కూడా చేశారు. నేను ఈ బహిష్కరణను తొలగించమని ప్రజాందోళన లేవదీస్తే మాకులం శాశ్వతంగా రెండుగా చీలిపోయేది. అలా జరిగి ఉంటే, వ్యతిరేక వర్గం నా మీద ప్రతీకారం తీర్చుకునేది. దీనివల్ల ఇంగ్లండ్ నుండి తిరిగివచ్చిన నేను మానసిక అశాంతి, ఆందోళన సుడిగుండంలో చిక్కుకునేవాడిని.”
మోహన్ దాస్ సంసారం, సంపాదన
మోహన్ దాస్ కు భార్య ‘కస్తూరిబాయి’ తో ఉన్న అనుబంధం ఆయన అనుకున్నట్లుగా సవ్యంగా జరగలేదు. ఇంగ్లండ్ లో తాను పొందిన అనుభవం కూడా భార్య యెడల అసూయ తొలగించలేకపోయింది. ప్రతి చిన్నవిషయానికి భార్యను అనుమానించేవాడు. తత్ఫలితంగా తాను పెంచుకున్న కోరికలు తీరేవి కావు. ఆమెకు చదవటం, వ్రాయటం నేర్పి, ఆమెను విద్యావంతురాలుగా చేయాలని నిర్ణయించుకున్నా, చివరకు కామమోహానికి దాసుడయ్యేవాడు. ఈయన తప్పిదాలు ఆమెకు బాధలు కలిగించేవి. ఒకసారి కస్తూరిబాయిని పుట్టింటికి పంపించి, ఆమె అమిత బాధకు లోనయినప్పుడే తీసుకురావాలనే దురాలోచన కూడా వచ్చింది. సమయానికి జ్ఞానోదయం కలిగి అది ఎంత తప్పుడు ఆలోచనో తెలుసుకుని సిగ్గుపడ్డాడు.
ఈ సంసార సాగరంలో తనకు ఎదురయిన అనుభవాలను గాంధీజీ ఇలా వివరించారు.
“ఆహార నియమాల విషయంలో నా కుటుంబంలో యూరోపియన్ ఆచారాలను ప్రవేశపెట్టాను. ఫలితంగా కాఫీ, టీ ఇంట్లో ప్రవేశించాయి. పింగాళీ, గాజు పాత్రలు ప్రత్యక్షమయ్యాయి. నా ఆహారంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. చెప్పులు స్థానంలో ‘బూట్స్’ (boots), ‘షూస్’ (shoes) వచ్చాయి. ఇవే గాక దేశీయ సాంప్రదాయ దుస్తుల స్థానంలో యూరోపియన్ దుస్తులు కూడా వచ్చాయి. అలా అని మా అన్న ఇంట్లో ఈ ఇంగ్లీష్ వాతావరణాన్ని ప్రవేశపెట్టమని సూచించలేదు.
ప్రతి రోజూ కొత్త వస్తువులు ఇంట్లోకి ప్రవేశించేవి. చివరకు ఇంటి ముందు ఒక పెద్ద ‘తెల్ల ఏనుగు’ (White Elephant) విగ్రహాన్ని నిలబెట్టాను. కొన్నాళ్ళకి ఈ అనవసర ఖర్చులకు సంపాదన ఎలా అనే ఆలోచన మొదలయింది. రాజ్ కోట లో న్యాయవాది వృత్తి ప్రారంభించటం ఎగతాళికి నాంది పలికినట్లయింది. ఈ వృత్తిలో అనుభవం లేక కక్షిదారుడు (Client) మామూలు రుసుం (Fees) కంటే 10 రెట్లు అధికం చెల్లిస్తాడని భావించాను. అంత నాకు ఇవ్వటానికి వాళ్ళు మూర్ఖులు కాదు. ఈ సమస్యల వలలో చిక్కుకున్నప్పుడు కొందరు మిత్రులు నన్ను బొంబాయి వెళ్లి High Court అనుభవం పొంది, ‘Indian Law’ క్షుణ్ణంగా అభ్యసించి, అక్కడే న్యాయవాది వృత్తిని కొనసాగించమని సలహా ఇచ్చారు. అప్పుడు నేను వెంటనే బొంబాయి వెళ్లాను.
బొంబాయి లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని వంట ప్రావీణ్యంలేని నాలాంటి వ్యక్తి ‘రవిశంకర్’ ను వంటచేయటానికి నియమించాను. అతనిని పనిమనిషిగా కాక ఒక కుటుంబ సభ్యుడుగానే చూశాను. బ్రాహ్మణుడైన అతని ఒంటిమీద నీళ్లు జల్లుకునేవాడు కాని స్నానం చేసేవాడు కాదు. ధోవతి, జంధ్యం మురికిగా ఉండేవి. వేదం పరిజ్ఞానం లేదు.
ఒకసారి రవిశంకర్ తో ‘నీకు వంట తెలియదు. కనీసం సంధ్యావందనం తెలిసిఉండాలి కదా’ అని అంటే అతను ‘సంధ్యావందనమా! నాకు నాగలి సంధ్యావందనం; ‘పార’ (spade) నా కర్మకాండ; నేను అటువంటి బ్రాహ్మణుడను. మీ దయతో బ్రతకవలసినవాడను. ఇది లేకపోతే నాకు వ్యవసాయమే ఆధారం’ అని సమాధానమిచ్చాడు.
నేను అప్పుడు రవిశంకర్ కి ఉపాధ్యాయుడనయ్యాను. నేను సగం వంట చేస్తూ అతనికి శాఖాహార వంటకాలను నేర్పసాగాను. కొద్దిరోజులకే రవిశంకర్ వంటలో ప్రావిణ్యం సంపాదించినా, అపరిశుభ్రత అతని చుట్టూ ఉండేది. ఖర్చులు పెరిగినంత వేగంగా ఆదాయం పెరగనందువల్ల 5, 6, నెలల కంటే ఎక్కువ బొంబాయిలో ఉండలేకపోయాను.”
బొంబాయిలో న్యాయవాది వృత్తిలో మోహన్ దాస్ పడిన పాట్లు
బొంబాయిలో ఉన్నప్పుడే మోహన్ దాస్ ‘Indian Law’ చదవనారంభించాడు. ఈ సమయంలో ‘Solici-tor’ పరీక్షకు చదివే ‘వీర్ చంద్’ (Veerchand) అనే వ్యక్తి పరిచయమయ్యి, స్నేహితుడయ్యాడు. అతని సలహా మీద ‘Evidence Act’ చదివాడు మోహన్ దాస్. మొదట కష్టమయినా, తరవాత చదవగా, చదవగా సులభతరమైంది. కాని సంపాదన లేదు, ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. వీర్ చంద్ ఒకసారి ఇలా అన్నాడు ‘బారిష్టర్’ గా నిలద్రొక్కుకోవటానికి 5 నుంచి 6 ఏళ్ళు పడుతుంది. అందువల్ల నీవు 3 ఏళ్లకే పైకి రాగలిగితే అదృష్టవంతుడవని భావించు.”
ఒకటి, రెండు కేసులు వచ్చినా మోహన్ దాస్ కు వాటిని న్యాయస్థానంలో వాదించటానికి ధైర్యం చాలలేదు. వాదించటానికి లేచి నిలబడినా, మాటలు పెదవి దాటలేదు. దానికి తోడు, క్రొత్త పెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్లినట్లుగా సిగ్గు కమ్మేసేది.
ఒకసారి ఒక ‘Small Case’ తీసుకున్నాడు. కేసు తీసుకువచ్చిన కక్షిదారుడు ఇచ్చే పారితోషకం (Commission) లో సగం తనకు ఇవ్వాలని మధ్యవర్తి (Middleman) షరతు పెట్టాడు. కాని దానిని మోహన్ దాస్ మొదట తిరస్కరించాడు. కాని చివరకు వాదించగా ఈయనకు వచ్చిన పారితోషకం రూ. 30. ఇది ఒక రోజు ఖర్చులకు సరిపోయింది.
ఈ కేసు గురించి గాంధీజీ తన స్వీయ చరిత్రలో ఇలా వ్రాసుకున్నారు.
“ఈ కేసే నా జీవితంలో మొదటిది. ప్రతివాది (Defendant) తరఫున వాదిని (Plaintiff) ప్రశ్నించటానికి లేచి నిలబడ్డాను. వెంటనే నా గుండె కాలి జోళ్ళలోకి వెళ్ళింది; తల తిరిగి కోర్టు చుట్టూ తిరగనారంభించింది. జడ్జి నవ్వాడు; తోటి వకీళ్లు పకాపకా నవ్వారు. చేసేదిలేక నా కుర్చీలో కూలబడి ప్రతివాదిని వేరే న్యాయవాదిని నియమించుకోమని సలహా ఇచ్చాను. అతను నియమించుకున్న న్యాయవాది వాదించి కేసును సునాయాసంగా గెలిచాడు. ప్రతిఫలంగా రూ. 51 సంపాదించాడు. ఈ నా పిరికితనం, ప్రవర్తన నా మీద నాకే సిగ్గు, కోపం, కలిగేటట్లు చేసింది.
ఇది జరిగిన కొన్నాళ్ళకు నేను మరో కేసు తీసుకున్నాను అది పోర్ బందర్ (Porbandar) కు చెందిన ఒక మహ్మదీయ వ్యక్తిది. అతను నన్ను ఈ కేసు వాదించమని కోరాడు. కాని ఈ వ్యక్తికి ఉన్న ఆధారాలను బట్టి నేను కేవలం పూర్వాపరాలతో ఒక చిత్తుప్రతి (draft) వ్రాసి, దానిని తోటి న్యాయవాదులు మెచ్చుకున్న తరువాత వారు నా తరఫున కేసును వాదించి, గెలిపించారు. ఈ పరోక్ష విజయం నాకు చాలా మానసిక ధైర్యం కలిగించింది. దీనిని బట్టి కేవలం చిత్తుప్రతులను వ్రాయటానికి పరిమితమైతేనే మంచిదనిపించింది.
నాకు ఇంగ్లిష్ లో అధిక ప్రావీణ్యం ఉంది కాబట్టి ఉపాధ్యాయవృత్తిలో బాగా రాణించగలననే ధైర్యం వచ్చి ‘మెట్రిక్యూలేషన్’ పిల్లలకు ఇంగ్లీష్ బోధించాలని నిర్ణయించాను. రోజూ ఒక గంట బోధనకు రూ. 75 ఇచ్చే ఒక ఉన్నత పాఠశాల (High School) లో ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్ళాను. కాని అచ్చటి ప్రధానోపాధ్యాయుడు నాకు డిగ్రీ లేదనే సాకుతో నేను అనర్హుడని చెప్పాడు. కాని ‘నేను లండన్ Matriculation పరీక్ష ఉత్తీర్ణుడయ్యాను' అని చెప్పగా ఆయన ‘నువ్వు గ్రాడ్యువేట్ కాదు గదా’ అని తిరస్కరించాడు.
దీనితో నేను బాగా నిస్పృహ, నిరాశ చెందాను. ఇక లాభం లేదని మా పెద్దన్న మూట, ముల్లె సర్దుకుని నన్ను రాజ్ కోట లో స్థిరపడమని సలహా ఇచ్చి ఇంటికి తీసుకువెళ్లాడు. అలా 6 నెలల తరువాత నా బొంబాయి జీవితం ముగిసింది.”
రాజ్ కోట లో బారిష్టర్ వృత్తి
రాజ్ కోట లో మోహన్ దాస్ కు బాగానే కలిసి వచ్చింది. కేసుల గురించిన దరఖాస్తులు (applications) చిత్తుప్రతులను వ్రాసి వాటిని వాది, ప్రతివాదులకు ఇచ్చేవాడు. వీటిని ఆధారంగా చేసుకుని పెద్ద బారిష్టర్ లు కేసులు వాదించేవారు. అలా నెలకు రూ. 300 కు తగ్గని ఆదాయం వచ్చేది. ఇందులో పెద్దన్న సహాయం ఎంతో ఉంది. అనేక సార్లు బీదవారికి ఉచితంగా సహాయ పడటం జరిగింది. కాని మధ్యవర్తులకు కొంత రుసుము ఇవ్వవలసి వచ్చేది. మోహన్ దాస్ మొదట ఈ పద్ధతిని వ్యతిరేకించినా పెద్దన్న వాదనకు తల ఒగ్గి అతను తన నియమాన్ని సడలించుకోవలసి వచ్చింది.
దీనిని గాంధీజీ మాటల్లో తెలుసుకుందాం.
“ఈ (Commission) పద్ధతి నాకు నచ్చదని, నా నియమావళికి విరుద్ధమని అన్నయ్యతో చెప్పాను. దీనికి ఆయన ఇలా అన్నారు: ‘చూడు, నాకు ఈ రాజ్ కోట లో ఒక పేరొందిన వకీళ్లతో భాగస్వామ్యం ఉంది. ఆయనకు వచ్చే కేసులలో నీకు తగినవి నీకు ఇచ్చే ఏర్పాటు చేశాను. ఇప్పుడు నీవు మధ్యవర్తికి ఇవ్వకూడ దంటే నన్ను ఇరుకున పెట్టి, అవమానం చేసినవాడవు అవుతావు. నీవు నిర్వహించిన ప్రతి కేసుకు నీకు కొంత పారితోషికం వస్తుంది. నీవు తిరస్కరిస్తే వేరొక బారిష్టర్ కు ఇచ్చి తనకు రావలసిన వాటా రాబట్టుకుంటాడు. చివరకు నష్టపోయేది ఉమ్మడిగా నీవు, నేనే. కాబట్టి దీర్ఘంగా ఆలోచించు. ఒకసారి నీవు నీ వృత్తిలో స్థిరపడితే నీవు స్వంతంగా చేసుకోవచ్చు.’
మా అన్నయ్య సలహా నాకు అయిష్టమయినా బారిష్టర్ గా స్థిరపడటానికి స్వీకరించక తప్ప లేదు. ఇది నా నైతిక నియమావళికి విరుద్ధమయినా రాజీ పడక తప్పలేదు. కాని ఈ కేసులు మినహా నాకు నేరుగా వచ్చిన కేసులలో నేను నియమభంగం కలుగనీయలేదు...... అలా నా న్యాయవాది వృత్తిలో కొంతవరకు నిలదొక్కుకోగలిగాను.
ఒక సారి అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఒకప్పుడు పోర్ బందర్ రాణా సాహెబ్ (Maha raja Rana Shri Vikramatji Khimojiraj) కు సలహాదారుగా ఉన్నప్పుడు మా అన్నయ్య పాలనా విషయంలో ఆయనకు ఒక తప్పుడు సలహా ఇచ్చాడని అప్పటి రాజప్రతినిధి (Political Agent) అన్నయ్య మీద అభియోగం మోపాడు. అదీగాక, మా అన్నయ్య అంటే అతనికి మొదటినుంచీ దురభిప్రాయం ఉండేది. నేను ఇంగ్లండ్ లో ఉన్నప్పుడు ఈ అధికారితో పరిచయముండేది. నాతో స్నేహపూర్వకంగా కూడా ఉండేవాడు. ఈ పరిచయాన్ని ఉపయోగించి తనను ఈ కేసు నుంచి తప్పించమని అన్నయ్య నన్ను కోరాడు. కాని నా పరిచయాన్ని ఇలా దుర్వినియోగం చేయటం నాకు నచ్చని పని. మా అన్నయ్య నిజంగా నిర్దోషి అయితే నా సిఫారస్ అనవసరం. తాను తప్పు చేయలేదని ఒక వినతి పత్రం (Petition) ఇచ్చినప్పుడు న్యాయం తన పక్షాన ఉంటే తాను భయపడనవసరం లేదు. ఈ అభిప్రాయం అన్నయ్యకు చెప్పితే అది ఆయనకు నచ్చలేదు.
‘నీవు ఇంకా ఈ ప్రపంచం గురించి తెలుసుకోవాలి. ఇచ్చట అధికారం, పలుకుబడే చెల్లుతాయి. నా తమ్ముడయిన నీవు నీకున్న బాధ్యతను విస్మరించక ఈ అధికారితో నీకున్న పరిచయాన్ని వినియోగించి, నా గురించి మంచి మాట చెప్పి ఈ కేసు నుంచి తప్పించు’ అని అన్నయ్య వాదించాడు.
ఆయన మాటను తిరస్కరించలేక ఈ అధికారి కార్యాలయానికి వెళ్ళితే ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేసి ఇంగ్లండ్ లో మాపరిచయాన్ని నెమరు వేసుకుని గంభీరంగా ఇలా అన్నాడు.
‘నీవు మన పరిచయాన్ని దుర్వినియోగం చేయటానికి రాలేదు అని భావిస్తాను. అవునా?’
నేను వెంటనే అన్నయ్య కేసు పూర్వాపరాలను వివరించాను. అది విని ‘నీకు తెలియదేమో, మీ అన్నయ్య కొన్ని రహస్య వ్యవహారాలు నడుపుతాడు. దీనిని గురించి నేను ఏమీ వినదలచుకోలేదు. నాకు నీతో మాట్లాడే సమయం ముగిసింది. మీ అన్నయ్య ఏదైనా చెప్పదలచుకుంటే సరి అయిన మార్గంలో దరఖాస్తు చేసుకోవచ్చు’ అని గట్టిగా చెప్పాడు.
నేను పట్టు వదలక మాట్లాడటం ప్రారంభిస్తే ఆయన ‘ఇక వెళ్ళవచ్చు’ అని ముగించాడు. నేను కోపంతో ఉగిపోతూ సమాధానం ఇచ్చే లోపల తన ప్యూను (Peon) ను పిలిచి నన్ను బయటకు గెంటేయమని ఆదేశించాడు. అతను నా భుజాలమీద చేతులువేసి బయటకు తీసుకువెళ్లాడు.
ఈ నా అవమానాన్ని భరించలేక అతనికి ఇలా వ్రాసి పంపించాను. నీవు నీ ప్యూన్ తో నామీద దౌర్జన్యం చేయించావు. నీవు నాకు క్షమాపణచెప్పి సరిదిద్దకపోతే నీ మీద న్యాయపరమైన చర్య తీసుకోవలసి వస్తుంది.
చివరకు దీనివల్ల నాకేమి లాభించలేదు. ఈ సంగతి విని అన్నయ్య తీవ్రవేదనకు లోనయ్యి కొందరు వకీళ్ళతో మాట్లాడాడు. వారికి బ్రిటిష్ అధికారిమీద చర్య ఎలా తీసుకోవాలో తెలియదు. బొంబాయిలో ఉన్న డా. ఫిరోష్ షా మెహతా రాజ్ కోట వచ్చినప్పుడు ఈ సంగతి విని ‘ఇంగ్లండ్ నుంచి వచ్చిన బారిష్టర్ లు ఉడుకు రక్తంతో తలబిరుసుగా ఉంటారు. బారిష్టర్ గా నిలద్రొక్కుకోవాలంటే ఇటువంటి ఆటు పోట్లను దిగమింగుకోవలసి వస్తుంది. ఈ అధికారి మీద చర్య తీసుకోవాలనుకోవటం మోహన్ దాస్ కే ఎక్కువ నష్టం కలుగజేస్తుంది’ అని నాకు పంపించాడు.
ఈ సలహా నాకు చేదు విషంగా తోచినా, దిగమింగక తప్పలేదు. కాని, ఈ అనుభవం ఒక గుణ పాఠం నేర్పింది. అది: ఇటువంటి సత్యదూరమైన కేసులో, విషయాలలో నా వ్యక్తిగత పరపతిని వినియోగించకూడదని. ఈ దెబ్బ నా జీవిత గమనాన్నే మార్చివేసింది. ఈ అధికారి గురించి కొన్ని వివరాలు సేకరించాను. శాంతం, క్షమ అనే మంచి గుణాలు ఆయనలో ఎప్పుడో వదలివేశాయి. తనను కలిసే వ్యక్తులను అవమానించటం అతనికి అలవాటు. బ్రిటిష్ అధికారినన్న అహం, పొగరుతో అందరితోనూ ప్రవర్తించటం అతని నైజం.”
గాంధీజీ దక్షిణ ఆఫ్రికా ప్రయాణం గురించి డిసెంబర్ 2025 సంచికలో తెలుసుకుందాము.