Menu Close
అద్వైతం
-- భావరాజు శ్రీనివాస్ --

1.నేనెవరు?

నేనెవరు?- ఈ ప్రశ్నకు సమాధానం సామాజికంగా, వ్యావహారికంగా సులువుగా, readymade గా లభిస్తుంది. కానీ వ్యక్తిగతంగా, పారమార్థికంగా ‘నేనెవరు?’ అని ప్రశ్నించుకుంటే, ఎవరికి వారు సమాధానం కోసం అన్వేషించవలసి ఉంటుంది.

advaitham-eeswarudu

ఈశ్వరుడు:

చూసేవాడు జీవుడు, ద్రష్ట. జీవుడి చేత చూడబడేది జగత్తు, దృశ్యం. పై ఫొటోలోని అద్వైత సమీకరణం ప్రకారం జీవుడూ జగత్తు(ద్రష్ట, దృశ్యం) రెండూ ఈశ్వరుడే. రెండూ ఆయనవే. రెండింటి అంతరాత్మ ఈశ్వరుడే. కాబట్టి జీవజగత్తులు రెండూ నిమిత్తమాత్రంగా ఉంటూ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి నడుచుకోవాల్సి ఉంది. జంతువులు తమకు తెలియకుండానే అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరిస్తాయి. అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. శివుడాజ్ఞను పాటించడానికే కుట్టిన చీమకు కుట్టిన పాపం అంటదు. జంతువులు నిమిత్తమాత్రంగా జీవిస్తాయి. కానీ అర్జునుడు, నేను నిమిత్తమాత్రుణ్ణని అనుకోలేదు. యుద్ధంలో శత్రువులను చంపుతున్నది ‘నేను’ అనుకుని ఆ కార్యానికి కర్తృత్వం వహించాడు. దాంతో తన వాళ్ళను చంపిన పాపం తనను చుట్టుకుంటుందన్న భయం, బాధ అతణ్ణి యుద్ధానికి విముఖుణ్ణి చేసాయి. అంతరాత్మ ప్రభోధం(శ్రీకృష్ణుడే అంతరాత్మ,అయన ప్రబోధమే భగవద్గీత) విన్న తరువాత తాను నిమిత్తమాత్రుణ్ణని గుర్తించి, కర్తృత్వాన్ని (అహంకార మమకారాలను) విడిచిపెట్టి యుద్ధం చేస్తాడు.

ఎవరిమాటైనా వినాలంటే వారి మీద విశ్వాసం ఉండాలి. అంతరాత్మ ప్రబోధం వినాలంటే దాని మీద విశ్వాసం ఉండాలి. ఇదే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం లేని జీవుడు అంతరాత్మ గొంతు నొక్కేస్తాడు. ఆత్మవంచనకు పాల్పడతాడు. అంతరాత్మను విడిచిపెట్టి బాహ్యంగా ఉన్న జగత్తును -అర్ధకామాలను, పేరు ప్రఖ్యాతుల్ని, ఇతరుల సానుభూతిని- ఆశ్రయిస్తాడు. వాటిని అదేపనిగా అన్వేషిస్తూ వాటికోసం హత్యలు చేస్తాడు. లేదా ఆత్మహత్యకు పాల్పడతాడు.

అంతరాత్మను విడిచిపెట్టి బాహ్యజగత్తును ఆశ్రయించిన జీవుడు భంగపడి, జగత్తు కూడా నిమిత్తమాత్రమేనని గుర్తించి, తిరిగి అంతర్ముఖుడై అర్జునుడు కృష్ణుణ్ణి అశ్రయించినట్టు అంతరాత్మను ఆశ్రయిస్తాడు. ఆత్మవిశ్వాసాన్నిపెంచుకుంటాడు.

‘కర్త నేను కాదు ఈశ్వరుడు’ అని గుర్తిస్తే అహం పోతుంది. ‘జగత్తు నాది కాదు ఈశ్వరుడిది’ అని గుర్తిస్తే దాని మీద మమకారం, అధికారం ఉండవు. సహజంగా జీవించడం అప్పుడే సాధ్యం  అవుతుంది. అప్పుడిక ఏ పని చేసినా అంతరాత్మ ప్రబోధం(ఆత్మజ్ఞానం)తో, ఆత్మ విశ్వాసంతో చేస్తాం. అహంకార, మమకారాలతో కాదు.

'నేను నిమిత్తమాత్రుణ్ణి' అని గుర్తిస్తే బాథ్యతలుంటాయి. బరువులుండవు.

'జగత్తు నిమిత్తమాత్రమే' అని గుర్తిస్తే దానితో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. దాని మీద ఆధారపడడం ఉండదు.

గీతాకారుడంటాడు:

“శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్”

స్వధర్మం అంటే అంతరాత్మ ప్రభోదించే ధర్మం. పరధర్మం అంటే లౌకిక ధర్మం. రెండిట్లో స్వధర్మమే శ్రేయస్కరం అంటాడు. వెల్లువలో పూచికపుల్లకూ, ప్రవాహంలో చేపకు తేడా ఉంది. పూచికపుల్ల చేపగా మారడమే స్వధర్మాన్ని గుర్తెరగడం. 'To follow one's impulse is slavery, but to obey self-prescribed law is liberty' అంటాడు రూసో.ఆ 'self-prescribed law' యే అంతరాత్మ ప్రబోధించే ధర్మం, స్వధర్మం. జీవుడితో పాటూ జగత్తు కూడా అంతరాత్మదే కాబట్టి, అంతరాత్మ ప్రబోధించే ధర్మంలో వ్యక్తి శ్రేయస్సుతో పాటు, లోక శ్రేయస్సూ ఉంటుంది. జీవుడికీ, జగత్తుకీ రెండింటికీ ఆత్మతో (ఈశ్వరుడితో) ఉన్నసంబంధం కారణంగా, రెండింటి మధ్య ఉన్న సంబంధం అత్మీయమైనది.

“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన”

జీవజగత్తులు నిమిత్తమాత్రములు. కర్మమీద తప్ప ఫలితం మీద వాటికి అధికారం లేదు. కానీ, ‘కర్మణ్యేవాధికారస్తే…’కర్మ మీద ఉన్న అధికారంతో కర్మలను ఎంచుకునే స్వేఛ్చ జీవుడికి ఉంది.

“ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి”

ఈశ్వరుడు, జ్ఞానంగా సర్వభూతముల హృదయమందుండి వాటిని నడిపించుచున్నాడు.

****సశేషం****

Posted in September 2025, ఆధ్యాత్మికము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *