Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
కొలిమి (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

జంబేష్ రిజిస్టర్ పోస్టు లో వచ్చిన కోర్టు నోటీసు ను తీసుకోవడానికి నిరాకరించాడు.

రాజన్ "అది తిప్పి పంపకు. తీసుకో. తీసుకోకపోతే లేనిపోని ఇబ్బందుల్లో పడతాం," అంటూ చెప్పడంతో సంతకం పెట్టి దాన్ని తీసుకున్నాడు.

అందులో అందరిమీద కేస్ ఫైల్ అయి ఉండటంతో... ముందు కొంచెం భయపడ్డారు.

'నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నా. నా మాటలు పెడుచెవిన పెట్టారు. ఇప్పుడు చూడండి అందరి మీద కేసు పెట్టింది," అన్నాడు జంబేష్ తండ్రి సీతయ్య.

"పెడితే పెట్టనీ! మన వెంట్రుక కూడా పీక లేదు. ఊరికనే చప్పిడి మంత్రాలు చదవబోక. దాని బాబు లాంటోళ్ళ తలలే వంచాము. ఇదెంత! మహాసముద్రంలో మట్టి గడ్డంత," అన్నాడు రాజన్.

"పిచ్చి నాయనలారా అందర్నీ మంచి వాళ్లు అనుకుంటారు... ఇప్పటికైనా అర్థమైందా దాని అసలు రంగు..." అంది చేతులు తిప్పుతూ సుందరి.

"నువ్వు ఉండత్త. ఇప్పుడు ఏం చేద్దాం బావా!?! అందరం ఆ ఊరు వెళ్లాలా?" అడిగింది రాణి.

"ఆ పనికిమాలిన దాని కోసం వెళ్ళడం దేనికి? ఏం వెళ్లక్కర్లేదు. గమ్మునుంటే సరిపోతుంది," అన్నాడు జంబేష్.

"వెళ్లకపోతేనే పెద్ద తలకాయ నొప్పి. వెళదాం," అన్నాడు రాజన్.

"వెళితే అందర్నీ కొడతారు పోలీసులు," అన్నాడు సీతయ్య.

"ఆడవాళ్ళని ఏం చేయరు!" అంది రాణి.

"మీరంతా ఎందుకు రావటం...మీరు ఎవరు రావద్దు నేను ఒక్కడినే వెళ్తాను," అన్నాడు జంబేష్.

"ఒక్కడినే ఎలా పంపిస్తాం!?! నీ కూడా నేను వస్తాను. అక్కడ ఎలా మాట్లాడాలో చెప్తాను అలా మాట్లాడు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు," చెప్పాడు రాజన్.

"నువ్వెందుకు అన్నయ్య... ఒకవేళ వాళ్ళు అరెస్టు చేసి జైల్లో పెడితే ఇక్కడ ఒదినా వాళ్ళు ఇబ్బంది పడతారు. వద్దు నేనొక్కడినే వెళ్తాను." అన్నాడు జంబేష్.

"అవన్నీ నేను చూసుకుంటా లే... ఎప్పటి లోపల వాళ్ళను కలవాలన్నారు ?" అడిగాడు.

జంబేష్ నోటీస్ చూపించాడు.

"ఓకే మన ఇద్దరము రెండు రోజులు ముందే ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వెళ్దాం. కార్లో వెళదాం. ఎక్కడికి వెళ్లాలన్నా చేతులో వెహికల్ ఉంటుంది. మనం ముందుగా వెళుతున్నట్టు ఎవరికీ తెలియనివ్వద్దు. అమ్మా!... రాణి మీరు కూడా ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఇరుగుపొరుగు వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. నాన్నా నువ్వు కూడా... బంధువులకి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పబోక... ఇక ఈ టాపిక్ మేము అక్కడి నుంచి వచ్చే వరకు ఇంట్లో కూడా మాట్లాడకండి. అందరూ ప్రశాంతంగా ఉండండి," అని చెప్పి, అక్కడినుంచి తన గదికి వెళ్ళిపోయాడు రాజన్.

ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాడు.

*****

"ఏరా మూర్తి! వెళ్లిన పని ఏమైంది?" అడిగింది గిరిజ.

"కేసు ఫైల్ చేసామమ్మా. వాళ్లకి నోటీస్ పంపించారు. ఈ దెబ్బతో దిగి వస్తారులే!" చెప్పాడు మూర్తి.

"ఏమోరా! ఏదన్న తేడా పాడాలు వస్తే దీన్ని తట్టుకోవడం కష్టం," అంది గిరిజ.

"తప్పు చేసిన వాళ్ళు ఏ టెన్షన్ లేకుండా దర్జాగా ఉన్నారు. మనకే ఈ టెన్షన్స్," అంటూ పొడిగించడం ఇష్టం లేక, పని ఉన్నట్టు లోపలి వెళ్ళిపోయాడు మూర్తి.

'ఏం చేస్తాం! ఈ కాలం పిల్లలకి, నీతి మార్గంతో పాటు అవినీతిపరులను ఎదుర్కొనే సాహసాన్ని ఆత్మస్థైర్యాన్ని కూడా నేర్పాలి,' అనుకుంది గిరిజ.

*****

"అమ్మా! వాళ్ళు అమృతవరం పోలీస్ స్టేషన్ కు వచ్చారుట. అక్కని, పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి," అంటూ హడావిడిగా వచ్చాడు మూర్తి.

"అందరూ వచ్చారా?"

"లేదు. అన్నదమ్ములు ఇద్దరూ వచ్చారుట,"

"ఎలా ఉన్నారు? కోపంగా ఏమన్నా ఉన్నారా?" అంటూ అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణవి.

"లేదు బానే ఉన్నారుట. తొందరగా నువ్వు, పిల్లలు రెడీ అవ్వండి. లేట్ చేయకూడదు. మనం ఆ ఊర్లో ఉన్నట్టుగా కంప్లైంట్ లో రాసాం. పెద్దగా ముస్తాబు ఏమి అవ్వకు. నార్మల్ గా రా." అన్నాడు.

"సరే" అంటూ లోపలికి వెళ్ళింది ప్రణవి,

"ఆటో తీసుకొచ్చావా?" అడిగింది గిరిజ.

"లేదమ్మా! ఆటో అయితే అనుమానం వస్తుందని, బాబాయ్ సతీష్ కి బైక్ ఇచ్చి పంపించాడు. నా బైక్ మీద, వాడి బైక్ మీద, అక్క నీ పిల్లల్ని తీసుకుని వెళ్తాం," చెప్పాడు మూర్తి.

"అయ్యో! వాడు బయటే ఉన్నాడా? పిలు లోపలికి," అంది.

"లేదమ్మా లోపలికి వస్తే కాఫీలు, టీలు అంటూ, ఆలస్యం చేస్తారని, అక్కడే ఉన్నాడు," చెప్పాడు.

ఈ లోపు ప్రణవి, పిల్లలు తయారై వచ్చేసారు. వారిని బైక్ మీద ఎక్కించుకుని బయలుదేరారు మూర్తి, సతీష్ లిరువురు.

***సశేషం***

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in September 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *