ఉపాధి ఉద్యమం
కొందరి కూలీల కన్నీళ్ళని తాకాను
పనుల కొరత గాధలై వినిపించాయి.
ఇళ్ళ నిర్మాణాలు మూలుగుతూ
అమ్మకాలు వణుకుతూ
పనుల కోసం కూలీలు
దిక్కులు చూస్తున్నారు.
ఇప్పుడు బతుకంటే యుద్ధమైంది.
ప్రాంతమేదైనా
పోరాటం అనివార్యమైంది.
ఇటుక మోసే ఆడోళ్ళు సైతం
ఇళ్ళను చెక్కే తాపీ జీవితాలు సైతం
దీన గాధలు వినిపిస్తున్నాయి.
కలల సౌధాలు నిర్మించే
కార్మికుల కన్నీటి వ్యధలేన్నో
ఎదురవుతుంటాయి.
పనులు కరువై
వలసలు ఊపందుకున్నాయి.
రాజ్యమా
పనులు కల్పించు
పరిశ్రమలు వెలిగించు
చీకటి బతుకులకి
గుప్పెడు మెతుకులు
దొరికే దారి చూపించు.
ఇక వ్యవస్థ మారాలి
పన్నులు ప్రజా సంక్షేమాన్ని నడపాలి.
స్వయం శక్తి వెలిగే లా
సంస్కరణల దిద్దుబాటు జరగాలి.
కడుపు మండే
కూలీల గొంతు
ఉపాధి ఉద్యమమై మోగాలి.