Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు

లబ్బీపేటకు చెందిన లకుమా రాణి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రోజూ బస్సుమీద పట్నం వెళ్ళి వస్తుంది. అదే పేటకు చెందిన నల్లగా బొద్దుగా ఉండే తిమ్మరాజు, బక్కపల్చగా తుమ్మితే ఎగిరిపోయేటట్టు ఉండే పోతురాజు అనే యువకులు కొంతకాలంగా లకుమా రాణి వెంటపడుతున్నారు.

లకుమా మనసులో స్థానం సంపాదిస్తే కావలసినవన్నీ కొనుక్కుని తినొచ్చని తిమ్మరాజు ఆశ. కష్టపడక్కరలేకుండా హాయిగా బ్రతకొచ్చునని పోతురాజు ఆలోచన. ఇలా ఎవరి ఆలోచనలో వారున్నారు.

ఒకరోజు ఉదయం తొమ్మిది గంటల సమయం. లకుమా రాణి రాక కోసం లబ్బీపేట బస్ స్టాప్ వద్ద తిమ్మరాజు, పోతురాజు ఎదురుచూస్తున్నారు. రోజులాగే లకుమా రాణి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి బస్ కోసం నిలబడింది.

చాలా రోజులుగా తిమ్మరాజు, పోతురాజు లకుమా రాణి కి ఐ లవ్ యూ చెప్పాలని తహతహ లాడుతున్నారు. కానీ చెప్పడానికి భయపడుతున్నారు.

ఎలాగైతేనేమి ఓరోజు తిమ్మరాజు సాహసం చేసి “లకుమా బాగున్నావా?” అని అడిగాడు.

“ఎందుకు నీకా సందేహం వచ్చింది” అని ఓర కంట చూస్తూ అడిగింది లకుమా రాణి.

“ఎవరినైనా పలకరించే టప్పుడు ముందుగా బాగున్నారా? అని అడగాలని మా బామ్మ చెప్పింది అందుకే అలా అడిగాను. నువ్వంటే నాకు…నాకు …చాలా ఇష్టం. ఈ విషయం చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను కానీ…కానీ…” మెలికలు తిరిగాడు నల్లగా, బొద్దుగా ఉన్న తిమ్మరాజు.

“ఏమైంది చెప్పు…” అంది లకుమా.

తిమ్మరాజు మౌనం…

“కనీసం నీ పేరైనా చెప్పు” అని అడిగింది లకుమా.

“వాడిపేరు తిమ్మరాజు, నాపేరు పోతురాజు మిమ్మల్ని ప్రేమించడం లో నేనే సీనియర్ని సిన్సియర్ గా నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్నాను. మీరు ఒకే అంటే పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను” అంటూ ఒక పువ్వు అందించబోయాడు పక్కనే బక్క పల్చగా ఉన్న పోతురాజు. సున్నితంగా తిరస్కరించింది లకుమా.

“కష్టపడటానికి ఇష్టపడని మీలాంటి వారు ఉండబట్టే తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అనే సామెత పుట్టింది” అని కోపంగా అంది.

“లకుమా ఎందుకు అలా అంటారో చెప్పవా?” అని అడిగాడు పోతురాజు.

“తిమ్మరాజు దేవుడు అతనికి ప్రసాదాలకు లోటు ఉండదు. అందుకు తిని కూర్చునే వారిని తిమ్మరాజుతో పోలుస్తారు. ఇక పోతురాజు గ్రామదేవతలకు అన్నదమ్ముడు. ఏ పనీ పాటు ఉండదు అమ్మవారి ఎదురుగా ఉంటాడు. పనీపాటా లేని వారిని పోతురాజుతో పోలుస్తారు.

కష్టపడే మగాళ్లనే ఆడవాళ్ళు ఇష్టపడతారు. బలాదూర్ గా తిరిగే మీవంటి వాళ్ళని ఏ ఆడది పెళ్ళిచేసుకోదు. ఇప్పటికైనా మారండి.” అని చెప్పి బస్సెక్కింది లకుమా రాణి.

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in September 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *