గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »
14. దేవులపల్లి దుర్గా ప్రసాద్
అంశం: కథ మొదలు మాది_ముగింపు మీది. శీర్షిక: మహావృక్షం
ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు. కానీ ఈ మధ్య కాలంలో... 'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసును ప్రశ్నించుకుంది.
అది...
'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయాయి. వీటితో పాటుగా అనారోగ్యం...శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది. కంటికొలకు ల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గల పైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.
****
పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.
"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏమొహం పొట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏచావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు.
పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటు లో టీచర్‌గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది.
ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.
*****
కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది.
తన నిర్ణయం కొడుకూ, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు.
కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది. చుట్టుపక్కల వాళ్ళు,
"ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు.
*********************
నా ముగింపు...
శ్యామల ఆలోచనలతో, తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో రూపుదిద్దుకుంది,
*శ్యామల కేర్ సెంటర్*.
ఆ కేంద్రంలో తను తన పిల్లల పట్ల చూపించిన శ్రద్ధకు మరింత ఎక్కువగా చూపి పసిపిల్లలను, ముసలివారిని సాకేది. సెంటర్ నడవడానికి వీలుగా కొంత రుసుము వసూలు చేసేది. ఉద్యోగాలతో, నేటి ఆధునిక వేగాలతో పోటీ పడుతున్న యువ దంపతులు తమ పిల్లలను పొద్దున్నే ఇక్కడ వదిలేసేవారు, సాయంత్రం తీసుకుని వెళ్ళేవారు.
అలాగే ఒంటరిగా ఉన్న ముసలివారికి, పిల్లలకి వీలు లేక తమ బాగోగులు చూసుకోలేని పెద్దవారికి కూడా ఆశ్రయం కల్పించింది శ్యామల కేర్ సెంటర్.
ఎవరైనా సాయంత్రానికి ఆ కేంద్రం ఖాళీ చేసేయాల్సిందే. అలాంటి వారినే చేర్చుకునేది. తనకి తోడుగా, తమ పనిమనిషి కొడుకును పనుల్లో సాయం కోసం ఆ సెంటర్లో ఉద్యోగమిచ్చి చేర్చుకుంది. ఆ యువకుడితో పాటు ఆయాగా ఒక నడివయస్సు మహిళకు కూడా ఉద్యోగం కల్పించింది.
సెంటర్లో ప్రతి చోటా సిసి టివి కెమేరాలు అమర్చింది. ఆ సిసి కెమేరా లింకుతో తమ వారి క్షేమసమాచారాన్ని తెలుసుకునేవారు, తల్లిదండ్రులు, పిల్లలు.
రాను రాను శ్యామల కేర్ సెంటర్ పై అందరికీ నమ్మకం కుదిరింది. ఆదరణ పెరిగింది. దాంతో సేవలందుకునే పిల్లలు, పెద్దల సంఖ్య పెరిగింది. మరికొంత మందికి ఉద్యోగాలు దొరికాయి అందులో.
సేవలందుకుంటున్న పెద్దవారితో హోమ్ పుఢ్సు తయారీ కూడా మొదలుపెట్టింది శ్యామల. దానిపై వచ్చే లాభాలు సగం ఆ తయారు చేసిన వారికిచ్చి సగం సెంటర్ కి మిగిల్చేది.
ఈ శ్యామల కేర్ సెంటర్ అందిస్తున్న సేవలు చూసి ప్రభావితులైన కొంతమంది దాతలు, తమకి కూడా భవిష్యత్తులో దాని అవసరం పడవచ్చుననేమో ఒక భవనాన్ని కూడా సమకూర్చారు.
ఇప్పుడు శ్యామల ఒంటరి కాదు. ఒక శక్తి. తనలాంటి ఎంతో మంది ఒంటరి జీవులకు ఆసరా కల్పించిన ఒక మహావృక్షం. భవిష్యత్తులో తాను లేకపోయినా ఈ సెంటర్ నిరాటంకంగా నడిచేలా వ్యవస్థ ఏర్పాటు చేసింది.
******
15. P.L.N. మంగా రత్నం
అంశం: కథ మొదలు మాది_ముగింపు మీది. శీర్షిక: నా పెళ్ళికి రండి
తల్లి మాట్లాడుతూ ఉండగానే ఫోన్ కట్ చెయ్యడం అంత మంచి పని కాకపోయినా అప్పటికి అలాగే చెయ్యాలనిపించింది. ముఖం మ్లానమయ్యింది. ఏమాత్రం ఉత్సాహం లేని దానిలా సోఫాలో కూర్చుండి పోయింది.
అక్కడే ఉండి పేపరు తిరగేస్తున్న భర్త రామాంజనేయులు విషయం ఏమిటో? తెలుసుకోవాలనుకున్నాడు.
“ఏమంటుందేం? మీ అమ్మ అంతసేపు మాట్లాడింది. నువ్వేమో! బెల్లం కొట్టిన రాయిలా ఉలుకూ లేకుండా పలుకూ లేకుండా ఉండిపోయావు. కొంపదీసి ఇంటికి రమ్మంటుంది గానా? అయినా, ఇప్పట్లో పండుగలూ గట్రా ఏమీ లేవు కదా! పిలిచిందని కదా! అని వెళ్ళిపోలేం. ఈ హైదరాబాదు నుంచి ఆ పల్లెటూరికి వెళ్ళడానికి చాలా ఖర్చు అవుతుంది” చెప్పాడు.
దానికి వెంటనే సమాధానం చెప్పలేదు ప్రహేళిక. మనసు చేదు మాత్ర మింగినట్లు ఉంది. అయినా విషయం తెలియాలి కాబట్టి, నెమ్మదిగా చెప్పింది.
అప్పటివరకూ నవ్వుతూ ఉన్న అతను ముఖం అంతలోనే రంగులు మారిపోయింది. వెటకారం కళ్ళలో చోటు చేసుకుంది.
“ఈ వయసులోనా? అంత అవసరమా? అది. చోద్యం కాకపోతేను. పిదప కాలం పిదప బుద్దులూను, మా వాళ్ళు వింటే నవ్విపోతారు. నా దగ్గర అంటే అన్నావు గానీ మరెక్కడా అనకు ఈ మాట. సిగ్గు కూడాను పరువు పోతుంది” అంటూ చిన్న హెచ్చరిక కూడా చేసాడు కాలజ్ఞానం చెప్పే గురువులా.
భర్త నుంచి అలాంటి స్పందనే వస్తుందని అనుకుంది. అలానే, వచ్చింది కూడా.
పెళ్ళికి ముందు తమ పరిస్తితి అంతా తెలిసి చేసుకున్నా .. భర్తకి తను అన్నా, తన కుటుంబం అన్నా చాలా చిన్నచూపు. ఎప్పుడూ ఏదో విధంగా తక్కువ చేసే మాట్లాడుతునే ఉంటాడు. పెట్టుపోతలు విషయం కూడా సరిపెట్టుకోలేడు. వంటరి మనిషి అంతకు మించి చెయ్యలేదు అని అనుకున్నా .. ఇంటి అల్లుడుగా అహంకారం చూపిస్తూ ఉంటాడు.
అప్పటివరకూ ..
అస్థిమితంగా ఉన్న ప్రహేళిక ఆలోచనలు భర్త మాటలతో ఒక్కసారిగా మేల్కొన్నట్టు అయ్యాయి.
అమ్మ ఆలోచనలో మాత్రం తప్పేముంది? ఉన్నది ఇద్దరం. వెళ్లి మగపిల్లాడి దగ్గర ఉండలేకపోతుంది. కూతురి దగ్గర ఎన్నాళ్ళో ఉండకూడదు అనుకుని వచ్చినా .. అలాగే, ఉండలేదు శ్యామలమ్మ. తల్లి ఉన్నన్ని రోజులూ తనకి ముళ్ళ మీద ఉన్నట్లే ఉంటుంది. దేనికోదానికి విసుక్కుంటూనే ఉంటాడు రామాంజనేయులు. అన్నిటికీ తగ్గి నోరు మూసుకుని ఉంటుంది.
తల్లి వెళితేనే తనకి సంతోషం. కాబట్టి, అవకాశం అంటూ వస్తే అందిపుచ్చుకోవడంలో తప్పేముంది? అనిపించింది ఆ నిమిషంలో. ఇప్పటికైనా తనకి ఒక తోడు దొరుకుతుందని సంతోషపడాలి. అలా అనుకోగానే ప్రహేళిక మనసు చాలా తేలిక పడినట్టు అయింది.
ఎంతసేపూ లోకం గురించే ఆలోచించింది గాని, అసలు సమస్య ఏమిటో? ఆలోచించలేదు. అన్నయ్య ఎలాగూ, నీ ఇష్టం అన్నాడట కదా! మరి తనకే ఏమిటి? అభ్యంతరం.
“మా వాళ్ళు అంటే మీకు బాగా లోకువ. ఇంటిని చూడాల్సిన నాన్న తన మానాన్న తను వెళ్లి పొతే, మమ్మల్ని అమ్మే కళ్ళలో పెట్టుకుని పెంచింది. వంటరిది అయిపోయిందని మనమా తీసుకొచ్చి, ఇంట్లో పెట్టుకోలేక పోతున్నాం కదా! అన్నయ్యకు కూడా తీసుకువెళ్లే ఆలోచన అంతగా లేదు. కాబట్టి, మా అమ్మ ఎంచుకున్న మార్గం తప్పుకాదని అనుకోవడం “
అ మాటకి రామాంజనేయులు నోటికి తాళం పడి, మనసు ఆలోచనలో పడింది.
ఇంతలో తల్లి నుంచి మెసేజ్. తను ఫోన్ అర్ధాంతరంగా పెట్టేసినందుకే కావచ్చు.
“అమ్మా! మీరందరూ ఈ విషయాన్ని అంతగా జీర్ణించుకోలేరని అనుకుంటూనే ఉన్నాను. ప్రస్తుతం నేను అనారోగ్యంతో ఒంటరిగా ఉండలేకపోతున్నాను. కొత్తగా బీ.పీ, సుగర్లు వచ్చాయి. నాకూ ఒక మనిషి తోడు ఉండాలని అనిపిస్తుంది. అతను, నేను ఉద్యోగానికి వెళ్ళిన కొత్తలో పరిచయము. పేరు శ్రీనివాసరావు. తరువాత అతనికి గవర్నమెంటు ఉద్యోగం రావడంతో వేరే ఊరు వెళ్ళిపోయారు.
మళ్ళీ ఈ మధ్యనే కనిపించారు. వాళ్ళ పిల్లలు ఇద్దరూ అమెరికాలోనే సెటిల్ అయిపోయారట. భార్య పోవడంతో, పిల్లల దగ్గరకు వెళ్లి ఉండలేక ఈ విధంగా ఆలోచించారు. కాబట్టి’ నేనూ ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని అనుకుంటున్నాను”
“ఈలోపు వాళ్ల పిల్లలు ఇద్దరికీ అతని ఆస్తులు రాసిచ్చేయమన్నాను. డబ్బు కోసమె నేను ఈ పెళ్లి చేసుకున్నానని ఎవ్వరూ అనుకోకూడదు. అతని పెన్షనుతోనే మా జీవనం. ‘పెళ్ళికి’ వాళ్ళ పిల్లలు కూడా అంగీకరించారు, అన్నయ్య తనకు ఏం అభ్యంతరమూ లేదన్నాడు. కాబట్టి నువ్వు కూడా మనసు మార్చుకుంటే సంతోషపడతాను. ఎవరేమనుకున్నా వచ్చే శ్రావణ శుక్రవారం మా పెళ్ళి.. మన ఊర్లో ఉన్న రామాలయంలోనే. వీలైతే రండి” అదీ మెసేజ్‌లో సారంశం.
***
వెంటనే ఫోన్ అందుకుంది ప్రహేళిక.
“అమ్మ నీ ఇష్టమే నా ఇష్టం. ఇన్నాళ్ళూ నీవు కోల్పోయిన జీవితం అనుకోకుండా తిరిగి వస్తుందంటే అందుకోవడం తప్పు కాదని నా ఉద్దేశం. వాళ్ళు పిల్లలే కాదు.. నేనూ, అన్నయ్యా మాట్లాడుకుని ఆ సమయానికి మేము కూడా వస్తాం మన ఊరు” అంటూ తన సంతోషాన్ని తెలియజేసింది ప్రహేళిక.
ఇక రామాంజనేయులుకి మాట్లాడే అవకాశం ఏమీ దొరకలేదు. అత్తగారికి పెళ్లికి వెళ్లాలి అన్నట్టు రైలు టిక్కెట్లు బుక్ చేసే పనిలో పడ్డాడు.
******