ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి స్మృత్యంజలి ప్రత్యేక శీర్షిక
ల.నా. అనే కలం పేరుతో తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ, వృత్తి రీత్యా అత్యున్నత పీఠాన్ని అధిరోహించి తన శిష్యరికంలో ఎంతో మందికి అనేకవిధాలుగా చేయూతనందించి, విశ్రాంత జీవనాన్ని కూడా మరింత శోభాయమానంగా మలుచుకుని సాహిత్య కళామతల్లికి మరింత సేవచేయాలనే సంకల్పంతో ‘సిరికోన’ అనే సమూహాన్ని ఏర్పరిచి, ఎంతోమంది నిష్ఠాగరిష్ఠులు, పండితోత్తములు, పటిమ గలిగిన సాహితీ పురంధరులందరినీ ఆ గొడుగు క్రిందికి చేర్చి, కర్త, కర్మ, క్రియ అంతా తానై, సంజీవినిగా నిలిచి ఆ అంతర్జాల సమూహ వేదికను నిత్య జీవంగా నిలిచేవిధంగా, నూతనత్వంతో సదా సాహిత్య సిరులను పండించే రీతిలో అవిరళ కృషిని సల్పిన ఆచార్య గంగిశెట్టి గారికి ఇదే మా అశ్రు నివాళి.
గంగిశెట్టి గారితో నాకు పరిచయం ఏర్పడి దశాబ్దం పైనే అయింది. అప్పటినుండి వారిని స్వయంగా పలుమార్లు కలిసి ముచ్చటించడం కూడా చేశాను. వారిని ‘గురువు’ గారు అని సంబోధిస్తే, తనను అలా పిలవద్దని మనందరం భావితరాలను తీర్చిదిద్దే గురువులమని, కనుక అందరం సమానమే అని తన నిరాడంబరతను చాటుకొన్నారు. సిరిమల్లె అంతర్జాల మాస పత్రికలో సాహితీ సిరికోన కవితలకు, గల్పికలకు ఒక శీర్షిక పెట్టేందుకు, అది సజావుగా నేటికీ కొనసాగేందుకు గంగిశెట్టి వారు సల్పిన కృషి సదా స్మరణీయము. సిరిమల్లె పదివసంతాల వార్షిక సంచికకు తన మనసుపెట్టి వ్రాసిన అభినందన అక్షరమాలను నాకు అందించి తను నిష్క్రమించారు.
వారు నిర్మించిన ‘సాహితీ సిరికోన’ పీఠం ఇలాగే మరింత పటుత్వంతో నిత్య సాహిత్య విరులతో కొనసాగాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
భార హృదయ అశ్రునయనాల తో ..మధు బుడమగుంట (sirimalle.com).
గంగిశెట్టి గారు ఈ మధ్యనే వ్రాసిన ఈ అతిథి (లనానీయం) చదివినప్పుడు ఎందుకో నాకు తనకు తానే వీడ్కోలు చెప్పుకుంటున్నట్లు అనిపించింది. ఆ భావుకతను ముందుగా మీతో పంచుకుంటూ ఆ తరువాత వరుసగా మీరు (సిరికోన సభ్యులు) సిరికోనలో పెట్టిన అశ్రునివాళి ని అందిస్తున్నాము. ఓం శాంతి...
అతిథి -- గంగిశెట్టి ల.నా.
అతిథీ!..రా!రా! భయంలేదు
నువ్వు కొల్లగొట్టడానికి ఖాళీతనమే తప్ప
నావద్ద మరేమీ లేదు
ఒకప్పుడు సకల విషయమగ్నతే జీవితమనుకొన్న వాణ్ణి
ఇప్పుడు సకల భావనగ్నతతో సిద్ధంగా ఉన్నాను
ఎందుకిక భయం నాకైనా, నీకైనా!
మిత్రులారా! నా ప్రియబాంధవుల్లారా!
అతిథి హడావిడిలో,
మీకు వీడ్కోలు చెప్పలేకున్నాను
మీ వీడ్కోలూ పొందలేకున్నాను!!
ఎలా కలిశామో, ఎందుకు కలిశామో
అందరం ఒకరికొకరు పూరణలమయ్యాం
అసంపూర్ణ జీవితాలకు నిండుతనం వెదుక్కొన్నాం
ఆ వెదుకులాటలో శేష ప్రశ్నలుగా మారిపోయాం
ఏ మాట కామాటే!
పూరణలుగా మారి పొందిన తృప్తి కంటే
ప్రశ్నలుగా రగుల్చుకొన్న అనిర్వాచ్య భావోద్దీప్తి గొప్పది..
ఆ దీప్తినే ఒకరికొకరు వెలుగుగా పంచుకున్నాం
జన్మాంతర బంధాలనుకొన్నవాళ్ళం
జన్మలే హుళిక్కనే దివ్యజ్ఞానానికి చేరుకున్నాం ...
అందుకే ఇక ఎక్కడికీ ఎగిరిపోవాలని లేదు
ఇక్కడే, ఈ మట్టి పరిమళంలోనే పరవశిస్తూ ఉన్నాను
గాలిలో తేమగా కాదు, వెచ్చదనమై వాహ్యాళి సలుపుతున్నాను
మీ మధ్యనే, మీరు మిగిల్చిన ఖాళీలో షికార్లు చేస్తున్నాను
పరస్పరం పంచుకున్న వెలుగునుండి చీకట్లలోకి ప్రస్థానించి
రహస్తీరాల్లో నిర్గుణంగా పడిఉండలేక
మోహామోహాలకతీతంగా
మీకే తెలియని మీ ఆంతర్యపు సంధ్యారాగం ఆలకిస్తూ
అప్పుడప్పుడు శ్రుతి కలిపి నిశ్శబ్దంగా ఆలపిస్తూ
మిమ్ము చూసి, మీలో మిగలని నన్ను చూసి
గాలితరగలుగా, మంచు పొరలుగా నవ్వుకొంటున్నాను
ఓ అనుపమ ఆత్మజ్ఞాన ప్రదాతల్లారా! ఆప్త బంధు సఖుల్లారా!
ఆక్టోపస్ బంధన బాంధవ్య రహస్యం
ఈడిపస్ ముద్దుతో కదా తెలిసేది
ఈడిపస్ బయటెక్కడో లేడు
మనలోనే ఉన్నాడు, ఇప్పుడు బయట పడుతున్నాడు
రండి!రండి! ఏ నిర్వేదమూ లేకుండా రండి..
అందరం ప్రియమైన ముద్దులు పంచుకుందాం
ఒకరినుంచి ఒకరు విముక్తులమౌతుందాం
.... లనా.గంగిశెట్టి, 18/5/25
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారికి జ్ఞాపకసుమాంజలి -- అయ్యగారి సూర్యనారాయణమూర్తి
సీ. లయబద్ధపఠనం బలందు సువాసన నశ్వధాటీసువర్ణాళి కనుచు, రసగుళిక లటంచు రచనాసుమంబుల మధువు నాస్వాదించు మధుప మగుచు, ఇంజనీరయ్యగా రెట్లబ్బె నోజోగు ణప్రకాశము రచనలకు? ననుచు, అద్భుతశయ్య, శబ్దార్థాలలోఁ గ్రొత్త సొంపులు, బిగువును సులలితమగు నార్ద్రత, ప్రౌఢిమ, లసమప్రసన్నమై గాంభీర్యమునుఁ జూపు కైతరీతి, చక్కని శ్లేషకు సరిక్రొత్తచిరునామ, శ్లేషకే భూష విశిష్టకవిత, పద్యాల మంగళాస్పదలయవిన్యాస మే ప్రాణశక్తియై యెపుడు నడుపు, నాదసౌందర్యమునకు నిలయంబగు స్వాదుమనోహరపద్యధార, తెనుఁగునఁ బుట్టింటితనమైన సులలిత సంగీతబద్ధమై జాలువారు పద్యాలు, సంతతవైశిష్ట్యయుక్తశి ల్పప్రయోగంబుల లాక్షణికక విత్వచంద్రుఁ డటంచు బిరుద మిచ్చినరీతి నాత్మీయ గౌరవ మందఁజేసితే.గీ. నాదు కవితల నతిప్రీతి నాదరించి యెంత పులకించి పఠియించెఁ? జెంతలేని చింతఁ బాపఁగ దివిజుల చెంత సంత తాంతరంగికప్రాజ్ఞుఁడై యలరుఁగాదె?[ఆచార్య లక్ష్మీనారాయణగారికి సమర్పించిన పై సీసమాలిక లోని ఏకాదశ సీసపాదాలపదజాలము దాదాపు వారి స్వీయప్రయోగములే]
గలనా గలనా! -- విశ్వర్షి వాసిలి
కాలరేఖపైన
ఒకచోట ఒకరం ఇంకోచోట ఒకరం నేలను తాకాం
రాయలసీమలో ఒకరం గోదావరిలో ఒకరంగా
తొలి శ్వాస తీసుకున్నాం
వేరువేరు కాలాలలో
తమిళనాట తెలుగు సాహిత్యం చదివాం
ఉస్మానియాలో తెలుగులో
పరిశోధన కోసం ఒకేసారి మళ్లీ పుట్టాం
హైదరాబాధంతా మనల్ని కుదిపేసింది
సాక్షిసంతకం అవసరంలేని
నా అస్తిత్వాన్ని నాకు అందించింది
నీ సంస్కృతిని నీకు అందించింది
నువ్వు నాన్న పేరుతో తెలుగు రాతలు రాసావు
నేను నాన్న నీడలో తెలుగు పథాలు తొక్కాను
మనమిద్దరమూ మళ్లీ ఒక్కటిగా పుట్టి
అప్పుడే నలభై అయిదేళ్లు
ఏడాదిగా ఈ జీవితానికి ఈ ముచ్చట్లు చాలనుకున్నావు
ముచ్చటగానే వీడ్కోలు పలుకుతున్నానన్నావు
ఏడాదిగా ప్రతి పలకరింపులోనూ
ఈ చరమగీత పలవరింతే
మళ్లీ చూసుకోగలమా అన్న కౌగిలింత
నాలుగు కళ్లలోనూ నలుగుతున్న దూరం
మన దగ్గిరతనం శూన్యంగా ప్రిదిలిపోతూ
దేహాలేగా వీడ్కోలు పలుక్కుంటున్నాయి
అసలైన యాత్ర సజావుగానే సాగుతుంది కదా
ఒకటి భూమి మీద ఇంకొకటి ఆకాశానికి ఆవల
***
నాకు తెలుసు నువ్వెప్పటికీ ఇక్కడకు రావని
నీకూ తెలుసు నేనే ఎప్పటికైనా అక్కడికి వస్తానని
అందుకే మనమిద్దరం వీడ్కోలు చెప్పుకోం
నిర్వేదంగాను నిర్లిప్తంగాను అనిమేషంగాను
దేహాతీతంగా కాలాతీతంగా
ప్రకృతి మన అస్తిత్వాన్ని ప్రకృష్టంగా ఉంచేతీరుతుంది
గలనాకు తెలిసిన విశ్వర్షీ
విశ్వర్షికి తెలిసిన గలనా
ఆ అస్తిత్వానికి బొమ్మాబొరుసులే
బొమ్మ పడింది కాబట్టి ఆడి నిష్క్రమించావు
బొరుసు పడింది కాబట్టి ఆడుతూ ఆడుతూ ఉన్నాను
ఆట గదరా గలనా! నా ఆట చూడరా గలనా!
(03.08.2025)
వేలిముద్ర -- విశ్వర్షి వాసిలి
తెల్లకాగితం అబద్ధం చెప్పదు
నీ నవ్వుకూ మాయ తెలియదు
నల్లసిరా మరోరంగులో మసలదు
నీ సంతకానికి హంగు ఉండదు
***
రంగులేయటం రాని తనానికి
అక్షరాలన్నీ మార్గదర్శకాలే
మరలటం తెలీని తత్వానికి
మనసారా మాటలమూటలే
మనసు నొచ్చుకుంటుందని
మాటలాపటం తెలీని గలనా
గమనం తెలిసిన మనిషివి నువ్వు
గమ్యం చేరిన మనీషివి నువ్వు
నీ సిరికోన లాక్షణికులం మేము
***
అవును, నువ్వు అక్షర నారాయణుడివి
అచ్చుల్నీ హల్లుల్నీ ప్రేమించినట్టుగా
నిన్నూ నన్నూ ప్రేమించేస్తుంటావు
నీ నా తప్పుల్నీ ఒప్పుల్నీ ప్రేమించేస్తావు
తప్పుని వేలెత్తి చూపిస్తావు
ఒప్పుని గుండెపైకి ఎక్కించుకుంటావు
నిన్నూ నన్నూ నీలోకి ఒంపుకుంటావు
అలా ఒంపుకోవటం తెలీకనే అలుగుతాం
ఎదగలేనితనంతో అరిగిపోతుంటాం
అయినా నువ్వు మారని జతగాడివే
మా అక్షర అక్షరానికి ముందరక్షరానివే
***
కవిత రాసినా కథ చెప్పినా మాట పలికినా
మనసు మెచ్చాలంటావు హృదయం పొంగాలంటావు
అక్షరాలను పేర్చుకుంటూ మురిసిపోతుంటే
మురికికూపంలోనే బతుకు అంటావు
అక్షరాన్ని మథించటం తెలీకపోతే
కలం పరుగు ఎందుకంటావు
అడుగులో అడుగు వెయ్యటం కాదు నడక
చేతికి చెయ్యి అందించటం కాదు నడత
నడకకైనా నడతకైనా మరోసంతకం ఉండకూడదంటావు
పక్కింటిని పొరుగింటిని కావాలనుకుంటే
అక్షరాన్ని అనువాద బాట పట్టించమంటావు
***
అక్షరసూరీడు కమ్మనటం
బాలభానుడిలా ఉదయించటానికి కాదు
నెత్తిమీద సూరీడులా మరిగించటానికి
అందుకే, గలనా!
నువ్వంటే నాకిష్టం నీ చూపంటే నాకిష్టం
నీ చూపుడు వేలంటే మరీమరీ ఇష్టం.
వెళ్లిపోయానని నువ్వనుకుంటున్నావేమో
నీతో తరలిరాని నీ అక్షరముద్ర
మాతోనే మాలోనే ఉండిపోయింది మిత్రమా!
(05.08.2025)
మరణమా నీవెక్కడ? -- చక్రవర్తి
ఇక్కడ జరిగే ప్రతి చర్చలో
ఆ గుండె ధ్వనిస్తూ ఉంటుంది..
ఇక్కడ మెరిసే ప్రతి కవితలో
ఆ శ్వాసే అక్షరమౌతుంది.
ఇక్కడ కనిపించే ప్రతి గుర్తులోనూ
ఆ గుర్తులే నడచివస్తూఉంటాయి.
వాదానికి దిగడమే కాదు
మోదానికి ముగించడమూ
ఆ జ్ఞానానికి తెలుసు.
ఆ పలకరింపు,
ప్రేమ చిలకరింపు
ఎప్పటికైనా మరచిపో"గలనా?"
సిరికోనను అక్షరసిరికోనగా
ముత్యాలముగ్గులేసిన
కళాత్మను స్మృతిలో మాపుకో"గలనా"?
సాహితీ అకాడమీని
కవిత్వపు అనాటమీగా
తీర్చిదిద్దిన ఆ చాకచక్యాన్ని
హృదయంలో చెరుపుకో "గలనా?"
ఇక్కడ మరణం ఓడింది.
మృత్యువు మరణించింది.
అక్షర పరబ్రహ్మ యోగి! -- శ్రీ చరణ్
తే|| ఎంతపని జేసితివి మామ! ఇంతలోన
మాట పూర్తి చేయక ఇట్లు మధ్యలోన
ఆపితో దాట వేసితో కోపమేల
అలుక మాని అల్లునితోడ పలుకుమయ్య ||
ఆ|| అళియరాయ యంచు అల్లుడా యనుచుండు
ఆర్ద్ర గాత్రమునకు అలుపు గలద
పాలడుగుల కడలి బలుకు చేడియ మామ
పేర భరత శబ్ద వేద వేద్య ||
సీ|| మామవై మురిపించి మరలిరాని పథాల
నే మలి తీరాని కేగి నావు
తుది ఊపిరుల దాక మది పెదవులపైన
పలుకు తావుల తేనె లొలికి నావు
నమ్మిక వీడక సమ్మతీతరుల వీ
డక నెమ్మి నొలయు వేడుకవు నీవు
ద్రవిడ భాషా తరళ క్షీర సింధు ల
క్ష్మీప నారాయణు జేరి నావు
తే|| గంగ పుట్టిన పదముండు గంగిశెట్టి
యైన తండ్రి యొడిన్ లయమందినావు
కాన ఇంకదీ సిరికోన కైతల ఝరి
ఇంకదీ సిరికోన కొలంకుల తడి
వందనంబులక్షర పరబ్రహ్మ యోగి! |
ఎంతటి భాషాశాస్త్ర ప్రభుత్వం!? -- ఆచార్య రాణి సదాశివ మూర్తి
ఎంతటి భాషాశాస్త్ర ప్రభుత్వం!?
ఎంతటి విమర్శకౌశలం!?
ఎంతటి భావుకత్వ పటిమ!?
ఎంతటి సునిశిత పరిశీలనా దృష్టి!?
ఎంతటి సాహిత్య లక్షణాధికారము!?
ఎంతటి రసాస్వాదనాభిరుచి!?
ఎంతటి రచనా శిల్పవిశ్లేషణ చాతుర్యం!?
ఎంతటి కావ్య ప్రక్రియా వైవిధ్యావగాహనం!?
ఎంతటి పరేంగితజ్ఞత!?
ఎంతటి చర్చా నిర్వహణ సామర్ధ్యం!?
ఎంతటి నైష్పాక్షిక న్యాయనిర్ణేతృ మూర్తిమత్వం !?
ఎంతటి సమాధానోచితజ్ఞత!?
ఎంతటి సహృదయ ప్రీతి!?
ఎంతటి సామాజిక స్పృహ!?
ఎంతటి వక్తృత్వ చతురత!?
ఎంతటి కవితా శక్తి!?
ఎంతటి శ్రోతృ సహన శీలత !?
ఎంతటి సృహృజ్జన బాంధవ్యం !?
ఎంతటి గాత్ర మాధుర్యం !?
ఎంతటి లలిత కళాభిజ్ఞత !?
ఎంతటి అపూర్వ మార్గదర్శకత్వం!?
ఎంతటి నవకవి ప్రోత్సాహమర్మజ్ఞత!?
ఎంతటి హృదయవైశాల్యం!?
ఎంతటి విద్వద్గౌరవం!?
ఎంతటి ప్రతిభా ప్రభాభాసురత!?
ఇన్ని సల్లక్షణ సులక్షణులు ఆచార్య శబ్ద జంగమాకృతి శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ వర్యులు మనతో ఇకలేరు అన్న ఆలోచన మనోనేత్రాలలో కూడా అశ్రుపాతాల సుడిగుండాలను సృష్టిస్తున్నది.
ఇప్పటికీ గుండె నిభాయించుకోలేకపోతున్నది.
కాలాహి దష్టులై
కాలుని సీమకు పయనించారంటే
ఓదార్పు లభించడం లేదు.
ఆ కాలపురుషుడు వారికి వారి ఇష్ట దైవ సాయుజ్యాన్ని ఒనగూర్చు గాక
గళితా శ్రు వు -- బులుసు వెంకటేశ్వరరావు
ఒక సౌజన్యము, ఒక్కనిర్మలత, ఒక్కు త్సాహమున్,ఒక్క భా
వుక హృత్పీఠము, ఒక్క ప్రేమమయభవ్యోదార రాజ్యమ్ము, ఒం
డొక లోజూపు,, మరొక్క వాగ్మయ తరంగౌధ్దత్యమున్ మొత్తమై సకలమ్మున్ వెలిగించు శక్తి "గలనా " స్వర్గస్థ మయ్యెo గదా!
విద్యా వివాదాల భేద భావంబున్న
మర్యాద విడబోని మంచి గుణము
మంచి పద్యంబన్న మనసిచ్చి మెచ్చెడు
నిర్మల హృదయ వాణీ స్వరమ్ము
బహుళ భాషా కుటుంబ పరి వే్తృత్వంబు
జాతికందించు నిష్కామ పరత
పెద్దల లో పెద్ద పిన్నల లో పిన్న
గా మెలంగిన లౌకికతల మెరుపు
శిష్ట సిరికోన పెంచి పోసిన జలమ్ము
లమృతధారలై కవుల దాహమ్ము తీర్చె
కనగ మారాజువయ్య శ్రీ గంగిశెట్టి
లక్ష్మి నారాయణాచార్య... లక్ష నతులు!!
ఒక భాషా లలితాంగి కంటి తుదలన్ ఒయ్యారముల్ చూచు తె
ల్వికి జన్మంబొకడున్ ప్రయత్నముల చాలీ చాలదండ్రెట్లు తా
వక బుద్ధిన్ తెలుగాంగ్ల కన్నడ తమిళ్ భాషా సతీ స్వచ్ఛ మా
ర్మిక హృత్సీమ జయించితో? పురుష బ్రాహ్మీ రూప! విద్వన్మణీ!
నీలమోహన కావ్యమ్ము నియతి మెచ్చి
కోనలో వ్యాఖ్యలన్ వ్రాసి గూ ఢ తత్వ
సత్వ రేఖలు జూపె మీ సహృదయమ్ము
మరచిపోలేని స్మృతి యిద్ది... మానసమున!!
(5-8- 2025)
*****
కరగిపోవని యట్టి కర్పూర ఖండమ్ము
వట్టిపోవని జలపాతధార
శృతులుతప్పనిజగన్నుత సుధా గానమ్ము
నవ్యవసంత వన ప్రియమ్ము
జంట తంత్రులు మ్రోయు షడ్జమ నాదమ్ము
సామేను కంటె విశ్వాసగరిమ
కష్టసుఖములలో గనవచ్చు దైవమ్ము
హితకా0క్ష చూపు సౌహిత్య జలధి
మధుర మధురాతి మధుసుహృన్మానసాబ్జ
నవవికాసము.నిస్వార్థ నాయక మణి
కృష్ణపక్షమ్ము కూడ వె ల్గించు ఱేడు
అనుగుచెలికాడు కోటిపుణ్యాల ఫలము!!
అశ్రునివాళి -- డా.కోడూరు ప్రభాకరరెడ్డి
ఆచార్యులవారు నాకు ఫోన్ చేసిన ప్రతిసారీ వారి ఆరోగ్య విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు (నడుము, వీపు నొప్పి తగ్గటం లేదు డాక్టర్ గారూ అన్నప్పుడల్లా) "మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి సర్, ఎక్కువగా స్ట్రైన్ తీసుకోకండి, మీ విజ్ఞానం తెలుగు భాషకు, సమాజానికి ఎంతో అవసరం" అనేవాడిని. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. వారి దివ్య స్మృతికి...
******
*గుండెలోపల గుండెగా కుదురుకొనుచు*
*మనసులోపల మనసుగా మసలుకొనుచు*
*ఇంతకాలము మము నడిపించినావు*
*చిక్కు సాహితీసంశీతి చిక్కినపుడు*
*ప్రజ్ఞ వెలయించి మమ్ము కాపాడినావు!*
*అన్నదమ్ములవోలె సఖ్యతగ మెలగ*
*మమత లుప్పొంగ హాయిగా మసలుచుండ*
*ఉల్లమే లేని దుర్విధి యోర్వలేక*
*ఆకట! మా కనుగప్పి నిన్నపహరించె!*
*మాయదైవమా! యెంత కసాయివీవు?*
*చావుకోసము కాళ్ళను చాచియున్న*
*వ్యర్థజీవుల నందర వదలినావు*
*అనఘు యాచార్యు నసువుల నార్పినావు!*
*పచ్చగా పది కాలాలు బ్రతికి నీవు*
*దిటవు తోడుత సిరికోన దీప్తి పెంచ*
*కనికరములేని దుర్విధి కన్నుకుట్టి*
*ఇంతలోననే నిన్ను రప్పించుకొనెను!*
*మాటి మాటికీ నినుదల్చి మరువలేక*
*బాష్పములు రాల్చు మిత్రుల బాధ మాన్ప*
*"నేను లేనని మీరు చింతించ వలదు*
*నేనె దివినుండి తోడుగా నిల్తు" ననుము!*
అశ్రుతప్త నయనాలతో...
*****
*ఎవ్వాని వదనమ్ము మవ్వంపు జిగితోడ*
*వెన్నెల వెలుగులు వెల్లి విరియు!*
*ఎవ్వాని దృక్కులు హిమపాత సన్నిభ*
*శీతల పవనాలు చిమ్ముచుండు!*
*ఎవ్వాని ముంజేయి హితకోటి కనిశమ్ము*
*నుపకార మొనరింప నుత్సహించు!*
*ఎవ్వాని నామమ్ము ఎదలోన మెదలిన*
*సిరికోన వాక్స్థలి మురిసిపోవు!*
*అతడు గంగిశెట్టి కుల దుగ్ధాంబురాశి*
*ధీర లక్ష్మీనారాయణ ధీవరుండు*
*మమ్ము వీడిపోయెను మాదు మార్గదర్శి*
*ఇంక ముందుకు మము నడిపింతు రెవరు?*
మా మాష్టారు *ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ* గారి మృతికి బాధాతప్త హృదయంతో నివాళి!
వేంకట రమణా -- వజ్జల రంగాచార్య
లీలగ నాడింతువు మా
గాలి పటము నీ కరాన
కాదన గలనా
జాలము వేంకట రమణుడ
చాలించెదవాట,వాయు
చలనము నీదే.
అక్షరముల నమ్ముకొనిన
శిక్షకులను గూడ మాయ
జేతువు కద నీ
రక్షణ యింకెవరికి మా
పక్షము వేంకటరమణుడ
భద్రమునీవే.
భద్రమును -ఈవే.
రక్షించిన శిక్షించిన
భక్షించిన లీలయనుచు
భాగ్యమ్మని మా
పక్షమ్మిదియే దక్కెను
భైక్షమ్ముగ దయ నొసంగు
వేంకటరమణా.
మట్టిలోఁ గలసె -- సుప్రభ
విధి చర్యకు క్రుంగి పోయిన మనస్సుతో, యేమీ చేయలేని నిస్సహాయతకు బాధతో, సద్గురుకృపతో వారి పరిచయము కలిగి, స్నేహము చవిచూచి కొలదికాలమైన ఆనందించగలిగిన భాగ్యమునకు దైవమునకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ…
ఎన్నటికీ. మరువలేని మరువరాని మహా మనీషికి, మనస్వికి, మధురవాగ్మికి, భాషాతపస్వికి భారతాంబ మెచ్చిన తెలుగుబిడ్డకు శ్రీ లక్ష్మీనారాయణులకు సాదర ప్రణామములతో..
భారమైన హృదయముతో, ౙాలువారు కన్నీటితో … పద్యకుసుమాంజలి
మట్టిలోఁ గలసె
===========
ద్విపద
*
మట్టిలోఁ గలసెను మాణిక్య మొకటి
పిట్ట యెగిరిపోయె వృక్షమ్ము వీడి
*
తే.గీ
*
ఎంతొ యలసిన యెడఁద విశ్రాంతి కోరె
కాంతి రహితము లాయెను గన్నుదోయి
శాంతి కాముకుఁడందెను స్వర్గసీమ
స్వాంతరంగాల హితులకు ధ్వాంతమెలయ
*
మోహ మేమియు లేదంచు భోగములకు
సోహమన్నది భావమే శోభయనుచు
నీహ లన్నియుఁ దెగటార్చి హృదయమందు
దేహి వీడెను దేహమ్ము దిగులు లేక
*
చెలిమి మీఱఁగ నిత్యమ్ము పలుకు వాఁడు
చెలుల యున్నతి నీక్షించి యలరు వాఁడు
వలయుసాయము నందించు చెలిమికాఁడు
కలలఁ దేలించు సిరికోన మలచినాఁడు
*
ద్విపద
*
భారతీ కృపతోడ బ్రజ్ఞతో వరలె
గారవమ్ములనెన్నొ క్షరను దాఁ బడసె
*
చారు హాసమునొప్పు సహృదయుఁడాయె
పేరిమి నీధాత్రి ప్రీతినే పంచె
*
తే. గీ
*
వేయి గుండెల గుహలలో వెలుఁగు వాఁడు
చేయఁ దలఁచిన పనులను జేసినాఁడు
వ్రాయవలసిన కృతులెన్నొ వ్రాసినాఁడు
కాయ వెన్నెల స్వర్గానఁ గదలినాఁడు
*
చిరము కీర్తి కాయము తోడ ధరను బొలుచు
మరువఁ జాలని మనీషిగ మదుల నిలుచు
వరలుఁ గావుత నిత్యమ్ము పరమ గతిని
హరికృపా గరిమము నాత్మశాంతిమెయి
దుఃఖం -- లలితాచండి
ఏదో నిర్వేదం క్షణక్షణం
మనుసుని కలచివేస్తూ
అంతుచిక్కని వేదన
అంతరాంతరాలను తొలచివేస్తూ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది
కార్యకారణాలు తెలియదు
కాలానికి అందదు
ఆశ నిరాశలు అన్నీ ఆవిరిగా మారి
ఉప్పిరిగొన్న భావాలకు
ఊతమిచ్చి ఉత్సాహ పరిచే శక్తి లేక
ఆ ఒడ్డు ఈఒడ్డు నడుమ
వేదన వాగుగా మారింది
జ్ఞాపకాల చిరుతెప్పలెన్నో
మెల్లమెల్లగా సాగుతున్నాయి
మరెన్నో కొట్టుకు వస్తున్నాయి
చిరుమువ్వల నాదంతో ఎన్నెన్నో స్మృతులు యెద లోతులను తడుముతూ తట్టి లేపుతున్నాయి
తెరలు తెరలుగా దుఃఖం
పొంగి పొరలుతోంది
చదివినదంతా చెదపట్టి నట్లు
సాధించిన పట్టాలన్నీ
లుంగ చుట్టుకుపోతూ
కాసంతైనా ప్రశాంతత లేక
మరచిపోలేక మనసు నిలకడలేక
కంటిపై కునుకే రాక...
ఇదెక్కడి జన్మాంతర అక్షర సేతు బంధం
పేగును నులి పెట్టి తిప్పేస్తోంది
కనిపించని మనోవేదన
శత్రువై సంహరిస్తోంది ...
ఆ నారయణుడే ఆకాశమంతగా ఎదిగి అణువంతై అంతరంగుడై అలవాటుగా
చెంతే వున్నాడని తెలియక
కన్నీరే కొలనై పారుతోంది.
ఆచార్య గంగిశెట్టి లక్ష్మినారాయణ గారికి అశ్రు నివాళి అర్పిస్తూ
-- లలితా చండి
2-8-2025
ఒంటి స్తంభం మేడ -- రాజేశ్వరి దివాకర్ల
విస్మయం ఆతని వ్యక్తిత్వం.
ఒంటి స్తంభం మేడలో
సారస్వత వ్యవహారాల
సంపుటాలను తెరచాడు.
డయస్ఫోరా ఆధునికం లో
సంప్రదాయ చర్చల విలువను పెంచాడు.
సాహిత్య సంపదల స్థాపనాచార్యుడు.
భాషా విమర్శల పట్ట భద్రుడు.
పండిత మండలి గౌరవాధ్యక్షుడు.
తులనాత్మక సాంగత్యాల అధ్యాపకుడు.
అనువాద పర్వాల అధినాయకుడు.
సఖీ సాంగత్యాల తాత్విక చింతనా భరుడు.
లలనా సౌందర్యాలను కను గొన గలనా భావుకుడు
రసికతా కాంక్షల
నిత్య యౌవనుడు.
లక్ష్మీ నారాయణుడు.
స్నేహం తో అద్దిన మరకలను
తుడుచుకునేందుకు
తడి ఆరని తీగెల దండెం మీద
మెత్తని నూలు పోగుల తువ్వాలును
దులిపి తెచ్చి చేతికి అందించగలడు.
మరణ రహస్యం ముందుగా తెలిసిన వాడు.
జీవన రణ రంగాన గెలిచాడు.
గాయాలను కనబడ నీయడు
కాలానికి గాలం వేసి
వలలో చిక్కిన ఆనందాల
పండుగలను ఆచరించిన వాడు.
సిరికోన లో జింక
మైలు రాయిని దాటాడు
పునాది శిలను
అకాడమీ స్థాయికి పెంచి
వాగ్జాల తంత్రంతో మంత్ర దండం మహిమ చేసి
కను రెప్పల తెరల చాటుకు మటు మాయ మయ్యాడు.
ఆకస్మిక మరణానికి
గుండె లోతుల దుఖాన్ని కరగించి వెళ్ళాడు
చిరునవ్వు జ్ఞాపకాల దస్తరాన్ని
తెరచి తోడి తెచ్చిన స్నేహాన్ని
బ్రతుకు గుండిగలలో నింపి
అఖండమైన సంస్మృతిలో
ఛాయా దీపమై నిలిచాడు. .........రాజేశ్వరి దివాకర్ల.
అక్షరాలు అంజలి ఘటిస్తున్నాయి…. -- లలిత అయలుర్ (Lalitha Ayalur)
తెలుగంటే అభిమానం. నా మాతృభాష తెలుగు కాదు, అయినా తెలుగుమీద ఉన్న తీపితో పట్టుబట్టి నేర్చుకున్నాను అంతే ఆచార్య అని అంటే……
“చక్కగా మాట్లాడటం వచ్చు కదా రాయడం వచ్చు కదా,
అలాగైతే రాయడం మొదలు పెట్టు.”
సహృదయ స్పందన గుండె సవ్వడిలో ఉంటుంది. అక్షరాల్లోకి అన్నీ తర్జుమాలు కాలేవు..
అందుకే అక్షరాలను లెక్కించుకొంటూ నీ అక్షరాలను కుదించుకోకు...
తెల్ల కాగితం పైకెక్కేవి రాలిపడ్డ ఈకలే
శ్వేత గగనాంచలాల్లో ఉంటాయి చూడు, అక్షరాంతర అనంత లోకాలే!!!
రాయడం మొదలు పెట్టు
రాస్తుంటేనే రాత మెరుగుపడేది.
రాయ గలనా అని సందేహించే నన్ను గలవు గలవు అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించి నాచే కవితలు రాయించిన ఆ మహా సాహితీ సృష్టకు ఈ క్రింద పెట్టిన చిన్ని కవితతో భాష్పాంజలి ఘటిస్తున్నాను
అక్షరాలు అంజలి ఘటిస్తున్నాయి….
మబ్బుల్లో ఘనీభవించిన
తెల్లని మంచి ముత్యాలు
గుండె గుడిలో వెచ్చని
అనుభూతిగా
ప్రాణం పోసుకున్న
పచ్చని అక్షరాలు….
ఉక్కిరిబిక్కిరి చేసే
భావ పరంపరగా
చిన్ని చిన్ని మొలకలుగా
చిక్కని చిగురింతగా
ఏ అదృశ్య హస్తానికో
తెల్లటి తివాచీ పరచి
పచ్చని కవితలు రాయమని…
అంజలి ఘటిస్తున్నాయి….
ఊహలను ఆపోశన పట్టి
ఊహించని పరిమళాలద్ది
వివిధ వర్ణాల విరిజల్లులుగా
నిస్వార్థంగా ప్రపంచానికి పంచమని
వెన్నుతట్టి ప్రోత్సహించిన
నిత్య కృషీవలునికి
చేతులెత్తి నమస్కరిస్తున్నాయి….
తరాలు మారినా
అంతరాలు లేని కావ్యాలై
నాగరికతకు సాక్షిభూతమై
తమని పుట్టించిన *ఆది* కవికి
తమ సృష్టి కర్తకి…..
తమని తరింప చేయటానికి
కురిపించిన స్వరామృత వృష్టికి...
ఋణపడి పోయి
జన్మ సార్థకత పొంది
అంజలి ఘటిస్తున్నాయి
అవ్యక్త భావాంజలి ఘటిస్తున్నాయి
అక్షరాలు అంజలి ఘటిస్తున్నాయి….
నీర(కన్నీటి)నీరాజనం -- అరవిందా రావు(యు.కె)
చిరు గుట్టల మీద పెను కొండల మీద
కుందిలి మీద కుంజరము మీద
కసవు మీద కుజముల మీద
కాశ్యపేయుని కిరణములు తాకిన రీతి
గుడిసె మీద గుడిగోపురము మీద
పసివాడి మీద పండు ముసలి మీద
రేరాజు చల్లని వెన్నెల పరిచిన రీతి
చోరుని కైనా ఛత్రపతి కైనా
కలవానికైనా కూటిపేదకైనా
నీడ నిచ్చు తరువు రీతి
గోరంత కవితలను గణపాదబద్ధములను
గంభీర నాదములను కోకిల స్వరములను
పదముల అల్లికలను గరిమ పద్యాలను
గజలు...గేయ..గీతములను
సమీక్షలను సకల రచనలను
సమతులిత భావముతో ఆదరించిన
....అభిమానించిన...ఆప్యాయతతో అక్కున చేర్చుకున్న
అపార అద్భుత సాహితీవేత్త
ఆచార్య గంగిశెట్టి లక్ష్మినారాయణగారికి
ఇదియే నా అశ్రు నివాళి……..పాదాభివందనములు
05/08/2025
చావుపుట్టుకల కలనేత -- స్వాతి శ్రీపాద
ఒక మెత్తని శ్వాస లేత గుండెలను సుతారంగా తట్టి
అలవోక జీవితానికి కలనేత రాగం సమకూరుస్తుంది
మరణం ఒడిలో విచ్చుకున్న నునులేత మొగ్గ
గాలిసోకితే కందిపోయే సౌకుమార్యపు నునుపులో
చటుక్కున ఒక మెరుపు తళుక్కున మెరుస్తుంది
ఒక ఆత్మ ఒదిగి ఒదిగి జీవితాన్ని పొదుగుతుంది.
మెరుపు కలల ఉలిపిరి దారం మీద మోళీ కట్టి ఆడేందుకు
వెచ్చ వెచ్చగా వెలుగు కిరణాల ఊయల్లో వేసి
చుట్టూ ప్రపంచం సరిగంగ స్నానాలు చేయించగానే
ప్రతిక్షణం చెవిలో ఉపదేశిస్తుంది " ఈ క్షణమే నీది "
పక్కనే అదృశ్యంగా కవల పిల్లలా మృత్యువు
రుతువులు గిరాగిరా తిరుగుతూనే ఉంటాయి
లోనా బయటా సునామీల్లా నదీ నదాలు
హృదయం ఒక కాలుతున్న రావణా కాష్టం
అయినా స్వప్నాల నేత కొనసాగుతుంది
రోజురోజూ కొత్త రెక్కలు తగిలించుకు
ఆశలు ఆకాశ విహారం చేస్తూనే ఉంటాయి
ఆగని కూనిరాగం లా జీవితం కొనసాగుతుంది
అదృశ్యంగా పెరుగుతున్న చీకటి నీడలు చిక్కబడి
నిశాచరిని తట్టి లేపుతాయి
ఒళ్ళు విరుచుకున్న కాలాన్ని ఊపిరి కొసకు తగిలించి
అజేయమైన శక్తి ఎదకు హత్తుకు ఊపిరాడనివ్వదు
స్వాతంత్ర సమరంలో అలసిన ఆత్మకు
విముక్తినిస్తూ
అరచేతుల్లో నడిపించుకు పోతుంది
మరో రాజ సౌధంలోకి ’
మరో జీవన వలయం లోకి
జ్ఞాపకాలు కరిగి కన్నీటి బొట్లై
దుఃఖానికి ఓదార్పై
పడుగుపేకల కలనేత వస్త్రం
పంచుకున్న సుఖ దుఃఖాలను పరిమళిస్తుంది
నాటుకున్న ఆనందాలకు నవ్వులు పూయిస్తుంది
ఇచ్చిపుచ్చుకోడం ఆనవాయితీ కదా
తెచ్చుకున్న సమయం ముగిసాక’మౌనంగా ఇచ్చెయ్యడమే
నువ్వూ నేనూ మనం
రెపరెపలాడే దీపాలమే
మిగిలిపోయేది అక్షర లోకం -అక్షయ లోకం
శ్రీ గంగిశెట్టి వారికి అశ్రుసించిత అక్షర తర్పణం -- సముద్రాల హరికృష్ణ
వారి మాటలో ఒక మేల్కొలుపు
వారి కంఠంలో ఒక సాధికారత
వారి వివేచనలో ఒక సమదర్శనం
వారి విమర్శలో ఒక సహేతుకత
వారి తర్కంలో ఒక అసి ధార!
వారి నైజంలో ఒక స్నేహశీలత
వారి దృష్టిలో ఒక గుణ పక్షపాతం
వారి శాంతంలో ఒక సహిష్ణుత
వారి వినయంలో ఒక నైర్మల్యం
వారి ఆచరణలో ఒక నిబద్ధత!
వారు భాషాధ్యయన కోవిదులు
వారు భావుక సుకుమారులు
వారు వ్యాకరణవిద్యా చణులు
వారు పదప్రయోగ సరసులు
వారు సాహితీవన ప్రియులు!
వారె సిరికోన స్థాపనాచార్యులు
మరువగ రాని అక్షరారాధకులు
వాగర్థ క్షేత్ర నిత్యవ్యవసాయులు
గంగిశెట్టి లక్ష్మీనారాయణాఖ్యులు
సహృదయ సౌగంధిక ధనదులు!
శ్రద్ధాంజలి -- వరలక్ష్మి
అవని పులకించు రీతి
మెండుగా చేసిరి రచనలు
కావ్యమును, సాహితీ
రచనలు పదులు గా చేసి
జ్ఞానము, విజ్ఞానం పంచి
అందరి హృదయమున
సరస్వతీ రూపు గా నిల్చిన
సాహిత్య మేరువు నీవు!!
ఆచార్య,
భౌతికగా మృతి చెంది
అక్షర లక్షల ఆస్తిని
మాకు మిగిల్చి
అమర రూపమై
వాయు లీనం అయినారు.
మీ స్పర్శ ఉచ్ఛ్వాసంగా
నిశ్వాసంగా
అందరి ఊపిరిని తాకి
అజరా అమరమవును !!
ఉప్పలూరి ఆత్రేయ శర్మ
ఆచార్యవర్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు దివంగతులయారని నాకు ఇప్పుడే తెలిసింది. అంగీకరించలేని, జీర్ణం చేసుకోలేని వార్త. జ్ఞానానికి, సౌహార్ద్రతకు, సౌశీల్యానికి, ఆత్మీయ స్నేహ పరిమళానికి, ముఖ్యంగా వినయ సంపదకు ప్రతీక గంగిశెట్టి వారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోవడం ఓ పెద్ద లోటే!
***
ఈ జీవిత నాటక రంగంలో ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ—నిష్క్రమణ జరుగుతుందో—నిగూఢం! ఎందరెందరో మహానుభావులు —ప్రతి ఒక్కరూ ఎంత సాధించినా, ఎంత మంచితనాన్ని సంపాదించుకున్నా అంతరించవలసిందే! కాకపోతే, తరతరాల వారికి స్ఫూర్తిని ప్రసాదించి కనుమరుగు అవుతారు! ఏదీ మన చేతులలో ఉండదు.
***
ఏది ఏమైనా, పరిపూర్ఞ జీవితాన్ని అనుభవించారు గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు. వారి కుటుంబానికి, బంధు మిత్ర పరివారానికి నా ప్రగాఢ సంతాప వీచికలు. గంగిశెట్టి వారు నిజంగా కీర్తి శేషులే! వారికి సద్గతి కలగాలని దైవాన్ని ప్రార్థిస్తూ…వారి మహాభిమాని… ఉప్పలూరి ఆత్రేయ శర్మ.
స్మృత్యంజలి -- సర్వ మంగళ గౌరీ (యం)
నేను సిరికోనలో వచ్చి రానీ కవితలు రాస్తున్నప్పుడు, గల్పికలు రాయండి చక్కగా రాణిస్తారు అని ప్రోత్సహించడమే కాకుండా నేను కూడా ఒక 'రచయిత్రిని' అని అనిపించుకోగలిగిన ధైర్యాన్ని ఇచ్చిన మహానుభావులు ఆచార్య లక్ష్మీనారాయణ గారు. వారి నవ్వు ముఖ కవళికలు మాత్రమే ఎంతటి ప్రోత్సాహాన్ని ఇస్తాయో!!! ఆచార్య రాణి సదాశివ మూర్తి గారి కవిత సంకలనం లో ఒక కవితని నేను సమీక్షిస్తున్నప్పుడు వారి మెచ్చు కోలు చూపు నా ఉత్సాహాన్ని. రెట్టింపు చేసింది. మనం తరచూ చేసే పొరపాట్లను కూడా నవ్వుతూ హెచ్చరించే మృదు స్వభావి. ‘గౌరీయం’ అందుకు చక్కటి ఉదాహరణ. అందరికీ ఒక మంచి లాంటి హెచ్చరిక, హెచ్చరిక లాంటి మంచి మాట.
* ఇకమీదట నేను సిరికోన లో ఏది పెట్టినా కనీసం ఒక్క గౌరీయం ఉండేటట్లు చూసుకుంటాను
* మాస్టారు గారి మధుర స్మృతిలో ..
ఎక్కడికీ వెళ్ళలేదు -- అరుణ నారదభట్ల
చూడండీ
ఇదిగో మిమ్మల్నే...
మరీ ఇంతలా శోకసముద్రమా?
నాకసలే ఇదంతా పడదు సరిపడదు!
ఎప్పుడూ
సరదాగా నవ్వడమిష్టం
మాటల్లో విరుపులిష్టం
అక్షరాల సొబగులిష్టం
గంభీర విమర్శలిష్టం
సాహిత్య విమర్శలిష్టం
సొంపైన సంగీతమిష్టం
గాత్ర గంధర్వమిష్టం
పద్యాల పరుగులిష్టం
కవిత్వపు పలకరింపులిష్టం
పాండిత్య పరమార్థమిష్టం
పలుకుపలుకున మెలిపడు భావమిష్టం!
నిండుగోదారంటి రచనలిష్టం
తాత్విక పరిమళాల సాహిత్యమిష్టం
వచ్చీరాని రచనల
సవరింతలిష్టం
భావగంభీరాల మెచ్చుకోలులిష్టం
భాషాసారాల బంధుత్వమిష్టం
జ్ఞానతృష్ణల సహవాసమిష్టం
పద్యగీతాల రాగాలవిష్టం
వన్నెలొలుకు మాటల వాత్సల్యమిష్టం
ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో...
ఆనంద రాగాల భావాలు ఇష్టం!
అటుగా ఉన్న సాహిత్య
తాత్విక ధోరణుల జాడలవైపు తెలుసుకునే
రోజొకటిలా వచ్చింది
మీ భావధారలు సరే...
ఈ గలనా సంగతో మరి?!
ఈ ప్రయాణం తప్పనిది
కాస్త అటు ఇటుగా!
ఇది ఊహకందని రహస్య వీణ!
లోపలి తీగెలెలా స్పందిస్తాయో
ఏ కాలానికి ఎలా మీటుతాయో!
తప్పని పోకడ మరి!
ఇక్కడున్న అక్షరాలన్నీ ఇలా ప్రవహించనీయండి
దుఃఖ సంద్రాన్ని వదిలి
సెలయేటి గలగలలు వినిపించండి
తొలి చినుకుల సుగంధం వెదజల్లనివ్వండి
పూల పరిమళాల అక్షర వాకిళ్ళు దిద్దండి
సాహిత్యం పది దిక్కులా వర్ధిల్లనివ్వండి
నవ్వండి కాసింత కళ్ళు తుడుచుకోండి
ఒకింత ఉత్సాహాన్ని పులుముకొని నడవండి
లేవండి లేవండి...
గలనాకు ఆనందం కలిగించండి!
ప్రశాంతంగా నడవనీయండి!
జ్ఞాపకాల అశ్రునివాళి ! -- వెంపటి హేమ
జ్ఞాన సింధు, స్నేహబంధు, వినయశీలి, విజ్ఞానఖని - ఇలా ఎన్ని పదాలు వాడినా ఆ మహనీయుని కొనియాడడానికి సరిపోవు అనిపిస్తోంది నాకు.
ఈ సందర్భంలో నాకు, మహాభారతంలో శ్రీకృష్ణ నిర్యాణాన్ని గురించి చెప్పడానికి అర్జునుడు వాడిన పదాలు గుర్తువస్తున్నాయి. మన సచివుడు మన బాంధవుడు, మన ఆప్తమిత్రుడు మనకింక లేడు - అన్నది తట్టుకోడం చాలా కష్టంగా ఉంది. సిరికోనీయులందరిని తనవారే అనుకుని, సాహిత్యగరిమలోని హెచ్చు తక్కువలు పట్టించుకోకుండా అందరిని ప్రేమగా పలుకరిస్తూ, ప్రోత్సహిస్తూ, ఎక్కడైనా ఒక తప్పుకనిపిస్తే మృదువుగా, ఎవరి మనసు నొవ్వకుండా సరిదిద్దుతూ, ఎక్కడా తన ఆధిక్యం చూపించకుండా ఉండేవారు ఆయన. ఆయన మరెవరోకారు, సిరికోనకు అత్యంత సన్నిహితులైన ఆచార్య శ్రీ గంగిసెట్టి లక్ష్మీ నారాయణగారు. ఆయన మనందరిని దు:ఖాంబుధిలో ముంచి కీర్తిశేషులయ్యారు - అన్నది తలపుకివస్తే భరించలేనంత హృదయవేదన కలుగుతోంది. విధి బలీయము!
సుమారుగా ఒకటిన్నర సంవత్సరాలకు ముందు ఆయనెనరో నాకు తెలియదు. ఒకరోజు నా స్నేహితురాలు నాకు ఫోను చేసి, "హేమా! నువ్వు సిరికోన వాక్స్థలిలో జేరకూడదా" అంటూ నాకు JSR గారి ఫోన్ నంబర్ ఇచ్చింది. నేను JSR గారికి ఫోనుచేస్తే ఆయన సిరికోన "ఎడ్మిన్" ఐన GLN గారికి తెలియజేశారు. వెంటనే నాకు ఫోనుచేసి సి. కో. లోకి ఆహ్వానించారు లక్ష్మీనారాయణగారు.
పంచుకుంటూ పెంచుకుందాం - అన్న సి. కో. ఆదర్శవాక్కుకి నిలువెత్తు నిదర్శనం నేనే! సిరికోన వాక్స్థలిలో ప్రవేశించాక ఇదివరకు తెలియని ఎన్నో విషయాలు ఇప్పుడు నేను తెలుసుకున్నాను.
నిజానికి నేనొక అతిసామాన్య రచయిత్రిని. చిన్నా పెద్దా - సుమారుగా వంద కథలు రాశాను నేను. ఏవేవో కవితలూ అల్లాను అరవై వరకు.. నాలుగే నాలుగు నవలలు కూడా రాశాను. ఐనా - నిజం ఒప్పుకోవాలి కదా! సిరికోనీయుల్లో నేను వయసులో మాత్రమే పెద్దని! ప్రజ్ఞలో పసిపిల్లని. మహామహులైన కవులు, పండితులు విహరిస్తున్న ఈ సిరికోనలో సాధారణ రచయిత్రినైన నేను రాణించగలనా అన్న నా సంకోచాన్ని గలనా గారికి చెప్పగానే, "గలవు" అంటూ ఆయన నా భయాన్ని పారదోలి, సిరికోనలో ధైర్యంగా మసలగల త్రాణను భరోసాను యిచ్చిన గురువు ఆయన. ఎప్పుడైనా సి. కో. లో కనిపించడం ఆలస్యమైతే, "దొడ్డమ్మా ఏమైపోయావు? సిరికోనలో కనిపించడంలేదేమి" అని అడిగేవారు.
నేను జబ్బుపడి నెలన్నర ఆసుపత్రిలో. మరో మూడు నెలలు అశక్తతతో మంచాన పడి ఉన్నప్పుడు ఎంతో ఆత్మీయంగా పలుకరిస్తూ, "దొడ్డమ్మా! మీరు బాగుండాలి, నిండు నూరేళ్ళు మీరు క్షేమంగా ఉండాలని నేను మనసారా దైవాన్ని ప్రార్ధిస్తున్నాను" అని పోస్టు పెట్టే వారు. కాని ఆయన, తనకోసం నేనలా ప్రార్ధన చేసే అవకాశం నాకు ఇవ్వకుండానే అకస్మాత్తుగా అమరులయ్యారు. ఆయన మరణ వార్త ముందు, ఆయనకు వచ్చిన అనారోగ్య మేమిటో తర్వాత తెలిశాయి.
మృత్యువుకు వయో భేదం లేదు - అన్నది మరోసారి ఋజువయింది! ఏమిటో తెలియని మాయరోగంతో నెలన్నరకు పైగా ఆసుపత్రిలో పడివున్న, వ్యర్థజీవినైన నేను క్షేమంగా ఉన్నాను. తన అసాధారణ వ్యక్తిత్వంతో అందరికీ స్నేహపాత్రుడైన ఆ మహనీయుడు చిటికలో అదృశ్యమైనారు. విథి ఆడే వింత నాటకాలలో ఇది ఒకటి!
ల. నా. గారు వయసులో నాకంటే 15 ఏళ్లు చిన్నవారు. ఆత్మీయతలో ఆయనకు ఎవరూ సాటి కారు. ఆయన నన్ను దోస్తు అనీ దొడ్డమ్మ అనీ సంబోధించేవారు. దొడ్డమ్మ అన్న ఆ పిలుపును నేను ఆయన నాకు ఆత్మీయంగా బహూకరించిన బిరుదుగా భావిస్తున్నాను.
ఒక సారి ఏదో సందర్భంలో నాది eventful life అన్నాను. "ఐతే మీ ‘ఆత్మ కథ’ రాయకూడదా" అన్నారు.
దానికి జవాబుగా, "నేనూ ఏదైనా రాయాలనే అనుకుంటున్నాను. కాని ఆత్మకథగా కాదు, Fiction ! అందులో కొన్ని జీవితానుభవాలను పొందుపరచటం జరగవచ్చు. అంతేకాని ఆత్మకథగా మాత్రం కాదు. ఇప్పటివరకు నేను 4 నవలలను మాత్రమే రాశాను. ఆ అంకె 5 ఐతే బాగుంటుంది కదా - అని నాకు మనసులో ఒక కోరిక ఉంది" అంటూ ఆయనకు Theme టూకిగా చెప్పాను.
ఆయన అంతా విని క్షణం ఆలోచించి ఒక అమూల్య మైన సలహా చెప్పారు, "మీ నవలకు "వగపేటికి చల్ల చిందినన్ ..." అన్న పేరు సరిగా నప్పుతుంది" అన్నారు. అదే పేరుపెట్టి నవల రాయడం మొదలుపెట్టాను ఆ వెంటనే.
ఒకసారి నేను "సాహస పుత్రులు" నవల గురించి మాటాడుతున్నప్పుడు, "ఈ నవలకు మరో మంచి పేరు ఏదైనా చెప్పరాదా" అని అడిగాను. "అంత మంచిపేరు పెట్టి ఇంకా నన్నడుగుతారెందుకు" అంటూ ఆయన నన్ను సున్నితంగా మందలించారు. సరేమరి! ఇప్పుడు నేను రాస్తున్న నవలకు ఆయన పెట్టిన పేరే ఉంచి, తదనుగుణంగానే కథను మలచాలనీ దాన్ని ఆయనకే అంకితమివ్వాలనీ అనుకుంటున్నాను. అది కీర్తిశేషులైన గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారి దివ్యస్మృతికి నేనిచ్చే హృదయపూర్వక శ్రద్ధాంజలి!
ఇవి నా జ్ఞాపకాల్లో కొన్ని మాత్రమే! మరి ఇంకా ఎన్నెన్నో మరపురాని జ్ఞాపకాలు, ఆపై కన్నీళ్లు! GLNగారు ఇక లేరన్నది తలుచుకుంటూంటే దు:ఖం వెల్లువౌతోంది. ఏదైనా సాహిత్యంలో సందేహం వస్తే ఇంక నేనెవరిని అడగాలి? కష్ట సుఖాలను వెళ్ళబోసుకుంటే మంచి మాటలతో నన్ను ఓదార్చేవారెవరు ఇంక! ఆయనలా చిరునవ్వుతో "దొడ్డమ్మా"అని ఆప్యారయంగా పలుకరించి, క్షేమమడిగి మనలో ఆత్మ స్తైర్యాన్ని పెంచేవారెవరు?
ఎంతకీ మరపు రాని మహామనీషి ఆచార్య శ్రీ గంగిసెట్టి లక్ష్మీనారాయణ గారు - ఆయనకు ఆయనే సాటి! "సుకృతీ గతాయు:!" అంటారు విజ్ఞులు. అదే జరిగింది. ఆయనకు పుణ్యలోకావాసం అక్షయం కావాలని కోరుతూ ఆయనకు నా అశ్రుపూరిత అక్షర నివాళి సమర్పిస్తున్నాను.
ఓం శాంతి:, శాంతి:, శాంతి: !
మధుగారూ ఈ సిరిమల్లె సంచిక మీ అందమైన హృదయాన్ని ఆవిష్కరించింది. అభినందనలు. అత్తలూరి విజయలక్ష్మి
దన్యవాదాలండీ 🙏🙏