ధృతి పిల్లలకి చెప్పే ప్రతి మాట తను కూడా శ్రద్ధగా వింటూ పనులు అయ్యాక తానూ చదవడం మొదలు పెట్టింది సంపంగి. పిల్లలతో ఎక్కువ సమయం గడిపి స్కూల్లో నేర్పిన పాఠాలు వినడం సందేహాలు తీర్చుకోవడంతో పిల్లలకి, ధృతికీ బాగా దగ్గర అయింది. పిల్లలని దింపి వెనక్కి వస్తుంటే గేటు దగ్గరే కాసేసాడు సింహాద్రి సంపంగిని.
"ఏంటి లోనకి ఎల్ల నీయవా? వంటింట్ల అపర్ణ అమ్మ గారు నా కోసం ఎదురు చూస్తారు. ఇంత సంసారానికి ఆవిడొక్కత్తే వండేటప్పటికీ బతుకు తెల్లారిపోద్ది. పాపం ఆ అమ్మ అన్నీ చేసుకోలేదు రా. నన్ను ఒగ్గి రాదా?” అంది వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ.
వాడు వదిలేయడం దానికీ ఇష్టం లేదు.
"ఒగ్గేత్తా. వచ్చిన దగ్గర్నుంచి నిన్ను చూస్తానే ఉన్న. చూపు కలపవు. మాట కలపవు. కొత్తగా వచ్చిన వాడిని కదా? ఇక్కడి కవుర్లు సెప్పరాదా? ఎవులితో ఎలాగుండాలో తెలుత్తాది.
సుందరమూర్తి బాబు మా ఊరి పెద్ద తో మంచి తోటమాలి కావాలన్నాడంట. మా ఊరు విజినగరం కాసే. 'జామి' అనే చిన్న పల్లెటూరు.
పట్నం అంటే మోజు నాకు. అందుకే ఎగురుకుంటూ వచ్చేసిన. నాకేటి తెలుసు... ఆ భగవంతుడు ఇక్కడ ఆ విశాపట్నంలో నాకు జత పెడతాడని. నువ్వు మా బాగా నచ్చినవే.
మా అయ్య తో చెప్పి మీ అయ్య తో మాట్లాడమందునా? ఓలే! అప్పటిదాకా మనం పేమించుకుందాం!” అని తనలో ఉన్న ప్రేమని బయట పెట్టేసాడు సింహాద్రి.
"ఎదవ్వేషాలు ఎయ్యకుండా ముక్కుసూటిగా నీ మనసులో మాట చెప్పి మనువాడతానని సెప్పినందుకు ముందు నీకు 50 మార్కులు!” అంది సంపంగి. గొప్ప ధీమా వచ్చేసింది సింహాద్రికి.
"నూటికి నూరు ఎత్తవులే గాని ఈ సావిత్రమ్మ సంగతే నాకర్థమైత లేదు. సుందరమూర్తి సారూ సంగతి నాకు ఎరికే. మా ఊరి పెద్ద బలరాం సార్ మా గొప్పగా చెపుతాడు ఈయనగారి గురించి.
హోల్సేల్ వ్యాపారం అంట. బల్కీ గా కొనడంలో, అమ్మడంలో ఒడుపు తెలిసినోడని ఎందరో ఈయన ఎనకమాల తిరుగుతుంటారు. గొప్ప కిటుకులు తెలిసిన వాడని, కబుర్లతోనే సరుకు ఇంచి కూడా మిగలకుండా అమ్మి నాలుగు చేతుల డబ్బు గడిస్తాడని మా చుట్టుపక్కల అందరూ అనుకుంటారు. డబ్బుకు ఏమి లోటు లేదు కదా? అడిగినంత ఇస్తాడంట గా చెల్లెళ్లకి, తమ్ముళ్ళకి?
మరి ఈ సావిత్రమ్మ ఎందుకు ఎప్పుడు మొగుడితో తగువాడతా ఈడనే ఉంటది. ఎందుకు?” తన సందేహం బయట పెట్టాడు.
సంపంగి నడుం మీద చేతులెట్టుకుని వాడిని ఎగాదిగా చూసింది.
పంజాబీ డ్రెస్ లో చున్నీ నడుం కి చుట్టి చేతులు నడుం మీద పెడితే ఈ అమ్మి అందం సూస్తా కూచోవచ్చు!” అనుకున్నాడు సింహాద్రి.
"ఉరే! పెద్దింటి ఊసులు ఎందుకురానీకు?” అడిగింది సంపంగి.
"అల్లదే ఒళ్ళు మండుద్ది. ఊసులు గీసులు నాకెందుకు? నాను పెరటేపు పని చేసుకుంటానా? ఈ అమ్మ అక్కడి బాల్కనీలోకి వచ్చి మొగుడితో పొద్దున్నే ఓ రెండు గంటలు, పొద్దు పోయాక ఓ రెండు గంటలు మాట్లాడతా ఏడుస్తా ఉంటది. మాంచి జోరు కవుర్లు సెప్పుకుంటే నాకు సంబరమేకదా?
మొగుడు పెళ్ళాల కబుర్లుచాంతాడంత. ఆగవు. తెగవు. కానీ, ఈ అమ్మ ఎప్పుడు చూడు ఏడటమే. ఇంటి ఆడపిల్ల పద్దాక అలగే ఉంటే ఇంటి మహాలక్ష్మి ఉండదట. సుందర మూర్తి అడిగినంత డబ్బు ఇవ్వడా ఏంటి? నాకు ఇదేం బాగాలేదు సంపంగి!” అన్నాడు సింహాద్రి.
"అందరి ఇళ్ళల్లో కష్ట సుఖాలు ఉంటాయి. మనం ఆరు దయతో పనిలో పెట్టుకుంటే ఇక్కడ ఉన్నోళ్ళం. చూసి చూడనట్టు పోవాలి. 'అదే సంస్కారం' అని ధృతి అమ్మ చెప్పింది. పోయి పని చూసుకో!” అంది సంపంగి.
"పాపం! ఆయమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలిస్తే బాగుండు!” గొణుక్కుంటూ తోటలో తనకు కేటాయించిన రెండు గదుల ఇంటి వైపు వెళ్ళిపోయాడు.
ధృతి ముందు బాల్కనీలో నిలబడి సంపంగి మాటలు విన్నాక సంపంగి మీద ముందుగా ఉన్న మంచి అభిప్రాయమే కాకుండా అభిమానం కూడా పెరిగింది.
సంపంగి తమ సొంత ఊర్లో ఉన్న పొలంలో పని చేసిన వీరయ్య కూతురు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడం బంధువులు ఎవరూ ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో సుందరమూర్తి ఆ పిల్లని ఇంటికి తీసుకు వచ్చి ఆదరించడం మామూలు విషయం కాదు. ఆ పిల్లని ముద్దుగా చూస్తాడు. ఇంట్లో ఎక్కడికెళ్ళడానికి అయినా ఆ పిల్లకి చనువు ఇచ్చాడు. హాయిగా ఉండమని అపర్ణ అమ్మ లాంటిదని చెప్పాడు. సంపంగి హాయికి, ఉత్సాహంగా ఉండడానికి కారణం ఆ భరోసాయే!
అయితే సింహాద్రి అంటే ఈ పిల్ల కి ఇష్టమేనన్న మాట. ఆలోచిద్దాం అనుకుంది.
★★★
ఆ రోజు సంపంగి మొక్క తెచ్చుకున్నాడు సింహాద్రి. దాన్ని ప్రేమగా నాటి హాయిగా ఓ పాట అందుకున్నాడు. కళ్ళముందు సంపంగి మెదుల్తోంది.
పచ్చిమిరపకాయలు అయిపోయాయని కోసేందుకు వచ్చిన సంపంగి అతడి పాట విని కిసుక్కుమంటే ఆ మొక్క చూపించి మురిసిపోయాడు. ఆ పిల్ల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటే హుషారెక్కిపోయాడు.
"సరే గానీ ఈ ఇంటి మనుషులతో ఎలా గుండాలో చెబుదూ? ఈరోజు ఈ బాల్కనీ లో పొద్దుటి నుంచి సావిత్రమ్మ అయిపు లేదు!" అన్నాడు మాటల్లోకి దించుతూ.
"సావిత్రమ్మ పెనిమిటి కరుణాకరన్ బాబు వచ్చిండు. కొడుకుని చూసి పోవడానికి వస్తా పోతా ఉంటాడులే!” అంది.
"ఓయబ్బో ఇదో వంక!” అన్నాడు సింహాద్రి.
సంపంగి నవ్వింది.
"సరేగాని కాబోయే పెళ్ళానివేగా? మనిద్దరం ఇక్కడే ఉంటాం కదా? నాకు నువ్వు తోడు, నీకు నేను జోడు. మనలో మనకి రహస్యాలేంటి?” అన్నాడు.
గొప్ప సిగ్గేసింది సంపంగి కి. వాడి మాటల్లో మాయా మర్మంలేదనిపించింది. అందుకే-
"నువ్వేటి సదువుకున్నావో, నన్ను ఎలా పోషిస్తావో ఎలా చూసుకుంటావో చెప్పు. ఆలోచిస్తా!" అంది.
"మా ఊరు నుంచి విజయనగరం వచ్చి టెన్త్ దాకా చదివా. ఇంగ్లీష్ రాక పరీక్ష తప్పాను. ఇంక చదవను అంటే నాన్న బాధ పడేవాడు.
‘చదువే మంచి దారి చూపిస్తుందిరా అయ్యా... ట్యూషన్ పెట్టిస్తా చదువు!’ అన్నాడు.
అయ్య మాట ఇనుకోలే. నాకు మా వైపు యాస తో మాట్టాడుతూ దోస్తులతో తిరుగుతుంటే బాగనిపించి తిరుగుతూ పోయా. నాన్న పోయాక తెలిసింది చదువు విలువ కూడా. మాకు ముందూ, వెనకా ఏమిలేదని.
ఇక్కడికొచ్చి పడ్డా.
నిన్ను చూస్తే చదవ బుద్దేస్తంది. నిన్ను బాగా చూసుకోవాలనే ఉంది. ఇప్పుడు కూడా మించిపోలేదని సుందరం సార్ పుస్తకాలు కొని ఇచ్చిండు. ఇవిగో!" అని చిన్న టేబుల్ మీద ఉన్న బుక్స్ చూపించాడు.
కరిగిపోయింది సంపంగి.
'పర్లేదు. వీడు ఇప్పటి యువత లా రాంగ్ రూట్ లో లేడు. జీవితంమీద మంచి చూపు ఉంది. తనూ చదువుతోంది కదా ఇప్పుడు. నెమ్మదిగా మెట్లు ఎక్కేయ్యొచ్చు'అనుకుంది.
నవ్వు దాచుకుంటూ గొంతు సద్దుకుని-
"సర్లే సెప్తా. ఇను. సుందరమూర్తి పెద్దాయన కదా? ఆరి పెద్ద తమ్ముడు శంకర్ బాబు. అన్న సంపాదిస్తే డబ్బుని హాయిగా అనుభవిస్తూ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు.
పెద్ద చదువుకోలే. అందుకే ఇంటి పనులు బయట పనులు చేస్తూ అందిన కాడికి కొట్టేసి జల్సాగా తిరుగుతా ఉంటాడు.
ఆరి భార్య సురేఖ అమ్మ. పొద్దు గల్ల నీ మొహం మీద ఇంతకాఫీ పోసి పొమ్మందికదా ఆవిడే!” అంది.
"పంచదార ఎయ్యలా. పైగా సిరాగ్గా ఉంది. రేపటి కాడ్నుంచి నువ్వు ఈయ రాదా? పొద్దు పొద్దున్న నీ మొహం చూడొచ్చు!” అన్నాడు.
"ఉరే నువ్వే టీ కాసుకోలేవా ఇక్కడ?” అంది.
"నువ్ వచ్చినంక చేసుకుందాం గానీ చెప్పు చెప్పు!” అన్నాడు.
"ఓయబ్బో! సురేఖమ్మ కి ఏం సినిమాల పిచ్చి తెలుసా? మొగుడి జేబులో నుంచి డబ్బు కొట్టేసి ఆడోళ్ళని పోగేసి క్లబ్ పెట్టింది. ఈవిడే ప్రెసిడెంట్. మన కాలనీ ఆడోళ్ళందరూ ఈమె చుట్టూ తిరుగుతా ఉంటారు. వాళ్ళకి పనిపాట ఉండదు. టైము రైములేకుండా ఇల్లు, వాకిలి గాలికొదిలేసి ఈవిడ సుట్టూ సేరి ఉన్నయి, లేనియి సెప్పుకుంటారు.
అందరూ మెంబర్ షిప్పు పేరుతో డబ్బులు కడతారు. వాళ్ళకి పని పాటాలేదు. పండగా, పబ్బము లేదు.
సురేఖమ్మ ఎవరినో పిలిచి డబ్బులు ఇచ్చి పేపర్ లో ఫోటోలు ఏఇస్తది. ఆ ఫోటో కోసం ఎగబడతారు ఈ గ్యాంగ్.
ఇక చూస్కో. వాళ్ళకి మొగుళ్ళతో మాట్టాడే తీరిక ఉండదు, క్లబ్ లో పనీ ఉండదు. ఎక్కడికక్కడే రాజకీయాలు. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటా కాలం గడిపేస్తారు. ఏది ఏమైనా సురేఖమ్మ మాగొప్ప తెలివైందిలే. తన చేతికి మట్టి అంటుకోకుండా కుర్చీ మీన కూర్చుండిపోయింది.
పొద్దుట మాత్రమే సుందరమూర్తి బాబు ఉన్నప్పుడు ఇంటి మీద, భర్త మీద ఎంత శ్రద్దో అనుకోవాలని శంకరం బాబుకి టిఫిను, కాఫీ అందించి మంచిగా ఉంటుంది.
అది చూసి పెద్దయ్య 'అమ్మయ్య తమ్ముణ్ణి బాగా సూసుకుంటుంది!' అనుకుంటాడు.
ఆయనటు వెళ్ళగానే శంకరం బాబు ని పొగిడి మంచి మాటలాడి ఉబ్బించి డబ్బు గుంజుకుంటుంది.
గొప్ప నగల పిచ్చి. ఈ కాలనీ ఆడ మందనేసుకుని కొత్త చీరలు చూడ్డం కోసం బజార్లమ్మట తిరుగుతూ ఉంటుంది.
డబ్బులు మా బాగా తగలేస్తుంది. ఒక్కడే కొడుకు. కృష్ణాష్టమినాడు పుట్టాడని గిరిధారి అని పేరేట్టుకున్నారు.
పదమూడేళ్ళు ఇప్పుడు. అబ్బో…ఏం దొంగ ఏషాలు ఏస్తాడనుకున్నావ్? స్కూల్లో చెప్పిన పాఠం రాలేదు. చదువుకోవాలి!’ అని తలుపేసుకుని ఫోన్ లో వీడియో గేమ్ లు ఆడతాడు. నేను సూత్తూనే ఉంటా. ఊకె ఊడుద్దామని చీపురు అట్టుకెళ్తా. చీపురుని కాళ్ళతో తంతూ 'అడ్డు రాకు' అని గయ్ మంటూ అరుస్తాడు.
సురేఖమ్మ రోడ్లట్టుకు తిరిగినా శంకరం బాబు ఇంట్లోనే ఉంటాడు కదా? 'పిల్లాడిని చదువుకోని' అని అరుత్తాడు.
ఆ పిల్లగాడికి నేను వేలు చూపించి బెదిరిస్తా ఉంటా. లెక్క చెయ్యడు. స్కూల్లో టీచర్ల గోల పడలేక ఓ గంట చదువుతాడు. పాస్ కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి గనక నడిచిపోతుంది గాని ఏదో ఒక రోజు దెబ్బతినేస్తాడు.
ఆడికి తోడు సావిత్రమ్మ, కారుణకరం బాబుల కొడుకు. ఆడికి పద్నాలుగేళ్ళు. తొమ్మిది చదువుతున్నాడు.
ఆడి పేరు త్రిలోక్. వాడో తైతక్క. మూడు లోకాలనీ నేనే పాలిస్తున్న. శాపం పెట్టానంటే లోకాలన్నీ గిర్రున తిరగాల్సిందే!” అంటాడు.
వీడు గిరిధారి కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివాడు. ఎవరి మాటా వినడు, చదవడు, చదివినట్టు నటిస్తాడు. ఏవో పబ్జి ఆటలంట. అయి ఆడుతూనే ఉంటాడు. ఎందుకైనా నెట్ ఆగితే పిచ్చెక్కినట్టు అరుస్తాడు. సావిత్రమ్మకి, కారుణాకరం బాబుకి వీడే గొప్ప తలకాయనొప్పి.
ఇంక లాస్ట్ ప్రాంజల్ బాబు. పద్ధతి గా ఉంటాడు. పెద్దన్న కి గొప్ప తోడు. ఇంక ధృతమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు. బంగారం, వెన్న పూస, చదువుల తల్లి, సంపంగి మొగ్గ!” అంది.
గుడ్లప్పగించి చూశాడు సింహాద్రి.
"ఏటా చూపు?" అడిగింది.
"సంపంగి మొగ్గ అంటే చూస్తున్న. ధృతి అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా?” అడిగాడు.
"మరి? అపర్ణ అమ్మ అన్నపూర్ణ అయితే ధృతి అమ్మ సరస్వతమ్మ!" అంది సంపంగి.
ఒక్కసారిగా మొహం మాడిపోయింది సంపంగి కి.
" ఏటయ్యింది?" ఉన్నట్టుండి అలగయిపోయావ్?" అడిగాడు సింహాద్రి.
"మూడు రోజులుగా చూస్తున్న. ధృతి అమ్మ నవ్వడమే మానేసింది. ప్రాంజల్ బాబు ఇంగ్లీష్ లో ఏదో చెప్తున్నాడు. ఆ యమ్మ తల అడ్డంగా తిప్పడం, ప్రాంజల్ బాబు నేలని కాలితో గట్టిగా తన్నడం చూసా. వాళ్ళిద్దరిది ఒకరికొకరుగా ప్రాణంగా ఉంటారు. ఇద్దరూ ఎడమొఖం, పెడ మొఖంగా ఉంటున్నారు. నా మనసేమీ బాలేదు. రేపు చెప్తాలే మావా!" అంది సంపంగి.
"ఏటని పిలిచావ్? ఏం కాదే... అంతా బాగుంటది!" అన్నాడు ఓదార్పుగా.
అలా విచారంగా నడుచుకుంటూ ఎల్తుంటే బాధేసింది సింహాద్రికి.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
|