Menu Close
Radhika Nori
రాధికారుచిరం
రాధిక నోరి

మళ్ళీ పెళ్ళి

రెండు మూడేళ్ళ క్రితం అనుకుంటాను, నేను రాసిన ఒక కథకి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికావారి ఉగాది కథల పోటీలో బహుమతి వచ్చింది. చాలామందికి ఆ కథ చాలా నచ్చింది, కానీ కొంతమందికి అస్సలు ఏమాత్రం నచ్చలేదు. నచ్చినవాళ్లు చాలా పొగిడారు, అలాగే నచ్చనివాళ్ళు ఘాటుగా విమర్శించాలన్న కోరికని అణుచుకుంటూ మొహమాటంగా పైకి మౌనం వహించారు, లేకపోతే మర్యాదగా ఈ కధాంశంతో నేను ఏకీభవించను అని మాత్రం అన్నారు. ఆ కథ పేరు 'మరోమారు'. ఆ కథ ఒక వృద్ధ పునర్వివాహం గురించి. అంటే ఇద్దరు వ్యక్తులు తమ వృద్ధాప్యంలో తమ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు అందరూ చూస్తూవుండగా, వారందరి సమ్మతితో పునర్వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత సుఖంగా వుంటారు కూడా. అయితే ఈ కథ కొందరికి నచ్చని కారణం, వారికి పునర్వివాహాలంటే వ్యతిరేకత వుండి కాదు, వృద్ధాప్యంలో పెళ్ళి చేసుకోవటం వారికి నచ్చకపోవడం మాత్రమే! అంటే వృద్ధాప్యంలో రామ, కృష్ణ అనుకోకుండా మళ్ళీ పెళ్ళికి సిద్ధమయ్యారేమిటి అని వారికి కొంచెం విడ్డురంగా అనిపించింది కాబోలు. సరే, క్లుప్తంగా చెప్పేది ఏమిటంటే, వాళ్ళకి కథ నచ్చలేదు. అందుకు నేనేమాత్రమూ నొచ్చుకోలేదు. ఎందుకంటే మనం రాసినదంతా అందరికీ నచ్చాలని ఏముంది? ఎవరిష్టం వారిది కదా! నచ్చకపోవటానికి వారి కారణాలు వారికి వున్నాయి. వాటితో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ వారి హక్కు వారు చూపించుకుంటున్నారు. దాంట్లో ఏమి తప్పు లేదు. అవునా?

అసలు ఎవరైనా మళ్ళీ పెళ్ళి చేసుకోవటం, చేసుకోకపోవటం అన్నది పూర్తిగా వారి వ్యక్తిగతమైన విషయం. దీనికి వయసుతో సంబంధం లేదు. ఎవరి కారణాలు వారికి వుంటాయి. ఎవరి పరిస్థితులు వారికుంటాయి. ఒకరితో ఒకరిని పోల్చలేము. అందరికీ సరిపోయే బంగారు సూత్రమంటూ ఏదీ వుండదు. అయినా పూర్వకాలంలో పునర్వివాహాలంటే సమాజంలో కొంత వ్యతిరేకత వుండేదనుకుంటాను. ముఖ్యంగా ఆడవాళ్ళ పునర్వివాహాలకి, సమాజం, ముఖ్యంగా పురుష ప్రపంచం చాలా వ్యతిరేకతను చూపించేది. ఆడవాళ్ళు, ఎంత చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్నా సరే, జీవితాంతం వారు ఆ వైధవ్యంలో మునిగి వుండాలనే ఆ స్వార్ధ సమాజం ఆశించేది. అందుకు విరుద్ధంగా ఎవరైనా కోరుకుంటే వారి మీద బరితెగించినవారిలా, తిరుగుబాటుదారులుగా ముద్రను వేసేసి, వారిని సమాజ బహిష్కరణ చేసేసేది. కానీ మగవారికి ఆ నియమం వర్తించేది కాదు. వారు ఏ వయసులో వున్నా పునర్వివాహానికి అర్హులే! అప్పుడే మన కందుకూరి వీరేశలింగంగారి లాంటి గొప్ప సమాజ సంస్కర్తలు వితంతువివాహాలంటూ ఆ కుళ్ళిపోయిన సమాజ రీతిరివాజులను మార్చటానికి పూనుకున్నారు. వితంతువులను వుద్ధరించారు. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే!

క్రమంగా రోజులు మారాయి. ప్రజల ఆలోచనా విధానంలో మెల్లగా మార్పు రావడం మొదలైంది. పునర్వివాహాలంటే సంఘంలో వున్న వ్యతిరేకత కొంచెం కొంచెంగా మెల్లగా తగ్గటం మొదలైంది. ఇప్పుడు పునర్వివాహాలని ఇంచుమించుగా సాధారణ వివాహాల లాగానే చూస్తున్నారు చాలామంది. ఆ చేసుకునేవారికి అవి సాధారణ వివాహాలుగా అనిపించకపోవచ్చు, వాటి విజయం కోసం కొంచెం ఎక్కువ పని చేయాల్సిన అవసరం అనిపించవచ్చు. కానీ బయటివారు అవేమీ పట్టించుకోవడంలేదు. కాని ఇక్కడ మళ్ళీ కొంచెం తేడా వుంది. వయసులో వున్నవారు పునర్వివాహం చేసుకుంటే ఫరవాలేదు, కానీ అదే మళ్ళీ వయసుడిగినవారు చేసుకుంటే పరిస్థితి ఇంకోలాగా వుంటుంది. జీవితంలోని ఈ చరమాంకంలో హాయిగా భగవన్నామ సంకీర్తన చేసుకోకుండా, మనవల పెళ్ళిళ్ళు చేయాల్సిన వయసులో వీరికిదేం వింత బుద్ధి అని సమాజం వేలెత్తి చూపించవచ్చు. కోపంతో ఆడిపోసుకోవచ్చు. అంటే అందరూ అలా వుంటారని కాదు. కానీ కొంతమంది అలాగే ఆలోచిస్తారేమో! అలాంటప్పుడు ఆ సమాజం వారికిచ్చే ప్రతిస్పందన కూడా ఇంకోలాగా వుండవచ్చు. నా కధకి అదే జరిగింది.

వయసులో వున్నా, వయసుడిగినా పునర్వివాహానికి నా దృష్టిలో ముఖ్యమైన కారణం ఒంటరితనం. తోడు కోసం మనిషి పునః పెళ్ళాడాలనుకోవడం చాలా సహజం. దాంట్లో తప్పేముంది? వయసులో వున్నవారికి అది తప్పు కానప్పుడు, మరి వయసు మళ్ళినవారికి తప్పేలా అవుతుంది? తోడు ఎవరికైనా అవసరమే కదా! అసలు ఆమాటకొస్తే ముసలితనంలోనే తోడు అవసరం ఎక్కువ వుంటుంది. వారి కుటుంబ సమ్మతి దొరికితే, వారి ఆరోగ్యం సమ్మతిస్తే, ఇంక అడ్డు చెప్పటానికి సమాజానికి ఏం వంక దొరుకుతుంది? ఆరోగ్యం బాగుండి, తగినవారు తారసపడి, కుటుంబ సభ్యులు ఆమోదిస్తే ఇంక ఆ ఒంటరి జీవితానికి స్వస్తి పలకాలనుకోవటం కేవలం వయసు కారణం వలన తప్పెలా అవుతుంది? విదేశాలలో వయసుతో సంబంధం లేకుండా ఈ పునర్వివాహాలు చేసుకోవడం చాలా తరచుగా జరుగుతూ వుంటుంది. అక్కడ ఎవ్వరూ ఇలాంటివాటిని అంతగా పట్టించుకోరు. అందుకే విదేశీయులే కాక, మన భారతీయ జనాభాలో కూడా అన్ని వయసులవారికి ఇలాంటి పునర్వివాహాలు విదేశాలలో ఎక్కువగానే జరుగుతూ వుంటాయి. వాటికి తోటివారి సమ్మతి కూడా తేలికగానే లభిస్తుంది.

ఇవన్నీ జీవిత భాగస్వామిని పోగొట్టుకున్నవారి వుదాహరణాలు. దీనికి విరుద్ధంగా అప్పుడప్పుడు ఒకరితో ఇంకొకరికి పొంతన కుదరక దంపతులు వారి యవ్వన కాలంలోనే విడిపోవటం జరుగుతుంది. అలాంటప్పుడు వారు తిరిగి పెళ్ళి చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఇంకో రకమైన క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే దీంట్లో సాధారణంగా చిన్న పిల్లలు కూడా చిక్కుబడి వుంటారు. ఈ తల్లితండ్రుల విడాకులలో, పాపం, ఆ చిన్న పిల్లలు నలిగిపోతూ వుంటారు. ఒకటి, తమ సొంత తల్లిదండ్రులు విడిపోవటం స్వయంగా చూడటం, రెండోది, వారు తిరిగి పెళ్ళి చేసుకుంటే, ఆ కొత్తవారికి ఆ స్థానాన్ని ఇవ్వటం. ఈ రెండు ఆ చిన్న ప్రాణాలకి కష్టమైన విషయాలే! అలాగే వారితోపాటు ఆ కొత్త భాగస్వాములకు కూడా వీరితో adjust కావటం, పాపం, తేలికైన విషయం ఏమీ కాదు. ఇలా రెండు వైపుల నుండి ఈ సద్దుకుపోవటం అన్నది అవసరమవుతుంది. ఇది అనుకున్నంత తేలిక కాదు. చాలా కష్టమైన పని. చాలా సహనం కావాల్సిన పని. పునర్వివాహాలలో ఇది ఒక పెద్ద సమస్య. అందుకే పిల్లలతో వున్నవారు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఆ పునర్వివాహాలు మళ్ళీ ఇంకోసారి విడాకుల వైపు మొగ్గడానికి కూడా ఇది ఒక పెద్ద కారణం అని మానసిక శాస్త్రజ్ఞులు అన్నారు.

చిన్నపిల్లలుగా వున్నప్పుడేమో, ఈ సద్దుకుపోవడాల సమస్యలు. మరి పెద్ద పిల్లలైతేనేమో ఇంకో రకమైన సమస్యలు. ఆస్తుల పంపకాల సమస్యలు వీటిల్లో చెప్పుకోతగ్గవి. రెండు విడివిడి కుటుంబాలు కలిసినప్పుడు, మరి వారిద్దరి ఆస్తుల కలయికలో కూడా చిన్నవో, పెద్దవో, సమస్యలు వచ్చే అవకాశం చాలా వుంది. ఇంకోటి, ఒకరి  పిల్లల స్వభావం వేరొకరి పిల్లలకి నచ్చకపోవచ్చు. వారు నా సొంత మనుషులు కారు అన్న భావన మనసులో చోటు చేసుకున్నప్పుడు వారితో నేనెందుకు కలిసి ఉండాలి, అలా కలిసి వుండటానికి నేనెందుకు ప్రయత్నం చెయ్యాలి, అసలు వారితో ఎందుకు సహనంగా వుండాలి అన్న పట్టుదల, మొండితనం వారిలో చోటు చేసుకునే అవకాశం కూడా చాలా వుంది. మళ్ళీ విడాకులవైపు వారిని ప్రోత్సహించడానికి ఇది ఒక కారణం కావచ్చు.

ఇన్ని సమస్యలు, చిక్కులు వున్నా మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని కోరుకోవడంలో తప్పు లేదు. నేను ఇదివరకే చెప్పినట్లు ఇప్పుడు రోజులు మారాయి కాబట్టి సమాజం అంగీకారం కూడా తేలికగానే లభిస్తోంది కాబట్టి ఈ కోరిక మరింత బలపడుతోంది. దీంట్లో కూడా ఏమీ తప్పు లేదు. సంఘంలో లభించే సాంఘిక రక్షణల లోభం కూడా ఇంకో కారణం. జీవిత సమస్యలను పరిష్కరించుకోవటానికి ఒకరికి ఇద్దరు వున్నారు, ఒకరికొకరి సహాయం, సపోర్టు దొరుకుతుంది అన్న ఆశ ఇంకో కారణం. ఒకరి వలన ఇంకొకరి ఆర్ధిక స్థాయి, అంటే financial status, సాంఘిక స్థాయి, అంటే social status పెరుగుతుంది అన్న ఆశ కూడా ఇంకో కారణం.  జీవితంలో అన్ని విధాలా కోరుకున్న నిలకడ ఏర్పడి, రకరకాల మానసికమైన ఒత్తిడులు, ఆదుర్దాలు తగ్గి, ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. చిన్నపిల్లలతో ఒంటరివారైన ఆడవారికి, మగవారికి కూడా, మంచి తోడు, అన్ని రకాలైన సహాయ సహకారాలు అందుతాయి. వీటన్నిటిని మించిన సంతృప్తి జీవితంలో లభిస్తుంది. ఈ కారణాలన్నిటి వలన విడాకులు తీసుకున్నవారిలో ఎక్కువమంది మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. పైగా ఇంకో కారణం కూడా వుంది. విడాకులు తీసుకున్నప్పుడు, భార్య, భర్త, ఎవరికి వారే వారిదేమి తప్పు లేదు, అవతలివారిదే తప్పంతా అని వారి భాగస్వామిని తప్పు పడతారు కానీ, ఒకవేళ వారి ప్రవర్తనలో ఏమన్నా తప్పులు, లోపాలు వున్నా కూడా వాటిని ఒప్పుకోరు. అందుకే మళ్ళీ వివాహానికి ముందుకు రావటానికి వారికి ఏమీ guilty గా అనిపించదని మానసిక వైద్యులు చెప్పారు. అంతేకాదు, జాగ్రత్తగా లేకపోతే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పునఃవివాహంలో కూడా అహంభావంతో మళ్ళీ అవే తప్పులు చేసే అవకాశం చాలా వుంది అని హెచ్చరించారు కూడా.

ఏ విషయాలు మళ్ళీ పెళ్ళికి ప్రోత్సాహం ఇస్తాయో, అవే విషయాలు ఒకొక్కసారి ఆ పెళ్ళిని విచ్చిన్నం కూడా చేసే అవకాశం వుంది. ఏ పిల్లల పెంపకంలో సహాయ సహకారాలు అందుతాయని గాఢంగా ఆశించి మళ్ళీ వివాహానికి సిద్ధం అయ్యారో ఆ పిల్లలే అన్నిటికీ మించిన సమస్యలు తీసుకొచ్చే అవకాశం చాలా వుంది. ఎందుకంటే పునర్వివాహాలలో 'నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు' అన్న తేడా భావాలు రాకూడదు. అందరూ కలిసిపోయి ఒకరి పిల్లలతో ఇంకొకరు ప్రేమగా వున్నప్పుడే రెండు కుటుంబాల కలయిక తేలిక అవుతుంది. ఏ కుటుంబ మద్దతు, అండ లభిస్తుందని ఆశిస్తారో అదే కుటుంబం ఆ భార్యాభర్తల మధ్య రకరకాల అడ్డుగోడలు నిలబెట్టవచ్చును. ఏ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశ పెట్టుకుంటారో అవే ఆర్ధిక విషయాలు వారి మధ్య దూరాలని ఇంకా ఎక్కువ చెయ్యచ్చు. పూర్వ వివాహాల సమస్యలు, ఇష్టం లేని మనుషులు, లేదా వారి కుటుంబ సభ్యులు ఈ కొత్తజీవితంలోకి తొంగిచూసి వారికి మనఃశాంతిని దూరం చెయ్యచ్చు. వారి సుఖ సంసారపు తోటలో విషపు మొలకలు నాటవచ్చు. పూర్వపు వివాహాలకు సంబంధించిన మనుషులను, చిహ్నాలను సంపూర్తిగా మనసులోంచి తీసేయమని ఎవరూ అనరు. ఎందుకంటే అది చాలా కష్టం. కానీ ఆ పూర్వ జ్ఞాపకాలు ప్రస్తుత జీవితాన్ని కలతపరచకూడదు, మలినపరచకూడదు. అలా జరుగుతుందేమో అన్న అనుమానం వుంటే కూడా పునర్వివాహానానికి తొందరపడకూడదు. ఎందుకంటే అప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలాగా, లేక, అటు ఇటు కాని త్రిశంకు స్వర్గంలాగా అయిపోతుంది బతుకు. అసలు ఇవేవీ కాకుండా లోపం ఆ దంపతుల మధ్యే వుండచ్చు. సరైన అవగాహన లేకుండా వారు మళ్ళీ పెళ్ళికి తొందరపడి వుండవచ్చు. అదీ కాకపొతే  ఒకరిమీద ఒకరు శక్తికి మించిన ఆశలు, హేతుబద్ధం కాని, అంటే unreasonable అయిన అంచనాలు, పెట్టుకుని వుండవచ్చు. మరి అలాంటి పరిస్థితులలో తగాదాలు తప్పవు కదా! అలాంటప్పుడు పెళ్ళిళ్ళెలా నిలుస్తాయి?

అందుకే మానసిక వైద్యులు పునర్వివాహాలను వద్దని అనలేదు కానీ తొందరపడద్దని మాత్రం చాలా గట్టిగా చెప్పారు. అలాగే పూర్వ వివాహం మళ్ళీ మెరుగయి, వారితో మళ్ళీ కలిసే అవకాశం వుందని మనసులో ఏమూలో లేశమన్నా ఆశ మిగిలివుంటే అది కూడా పునర్వివాహానానికి మంచి సూచన కాదని వారు అన్నారు. అలాగే పూర్వ భాగస్వామి మీద, వారి బంధువుల మీద కోపం, కక్షలు మిగిలివున్నా, ప్రస్తుత భాగస్వామి దగ్గర నిజాయితీగా వుండలేమేమో అని ఏమాత్రం అనుమానం వున్నా, వారి వ్యక్తిత్వాన్ని కానీ, వారి విలువలని కానీ ఏమాత్రం గౌరవించలేకపోయినా అది కూడా మళ్ళీపెళ్ళికి ఒక పెద్ద అవరోధమే అని వారు అన్నారు. అన్నిటికంటే ముందు రెండు విషయాలు బాగా గుర్తు పెట్టుకోమన్నారు. ఒకటి మీ ఆరోగ్యం. మీ ఆరోగ్యం ఏమాత్రం బాగా లేకపోయినా ఈ పునర్వివాహా తలపు మీమనసులోకి రానీయకూడదన్నారు. ఎందుకంటే మనతోపాటు ఇంకో అమాయక ప్రాణిని అనారోగ్య వలయాలలో నిర్దయగా తోసేసే హక్కు ఎవరికీ వుండదు. అలాగే మీ పునర్వివాహానికి  కుటుంబంలో అందరి సమ్మతితో పాటు మీ పిల్లల ఆమోదం కూడా అదనంగా అత్యవసరం. లేకపోతే మీ కొత్త వివాహ జీవితం అల్లకల్లోలంగా మారే ప్రమాదం వుంది అని వారు అన్నారు.

అయితే వీటన్నిటికీ విరుగుడు కూడా వారే చెప్పారు. సంకట పరిస్థితుల్లో మీ అభద్రతలను, అంటే insecurities ను, ఈర్ష్యాద్వేషాలను పక్కన పెట్టేసి, మనసుతో కాక మెదడుతో ఆలోచించమన్నారు. పరిస్థితులు మారినప్పుడు మనుషుల ఆలోచనా విధానం కూడా మారాలి, గతంలోంచి ప్రస్తుతంలోకి, మూఢాచారాలలోంచి అభ్యుదయంలోకి, కధనంలోంచి కర్మలోకి వారి పయనం సాగాలి అన్నారు. పునర్వివాహాలు, సవతికుటుంబాలు సరైన పంధాలో నిర్వహించడం అన్నది వుత్త మాటలు కాదు, చాలా తెలివిగా, చతురతతో నిర్వహించాల్సిన కష్టతరమైన గొప్ప సవాలు అని అన్నారు. అనుక్షణం సకారాత్మకత, సహనం, సంయమనాన్ని మన తోడుగా పక్కనే వుంచుకోవాలి అని అన్నారు. కష్టకాలంలో ఒకరి చేతిని ఒకరు వదలకండి అని గట్టిగా హెచ్చరించారు. ఆనందకరమైన సంసార జీవిత వాతావరణం లో పెరిగిన పిల్లలు భవిష్యత్తులో వారి వివాహజీవితాన్ని కూడా ఎంతో అన్యోన్యతతో నింపుకోవడానికి చాలా అవకాశం వుందని, మీ సంతానానికి ఇది మీరు ఇచ్చే అతి విలువైన ఆస్తి అని వారు సలహా ఇచ్చారు. జీవితంలో భగవంతుడు ఇచ్చిన ఈ రెండవ అవకాశాన్ని తెలివిగా చాకచక్యంతో వుపయోగించుకోండి, తొందరపాటుతో, అసహనంతో చేజార్చుకోకండి అని హెచ్చరించారు. వయసు, అందం, మంచి సంపాదన, మంచి వ్యక్తిత్వం ఆకర్షణని పెంచుతాయి, మళ్ళీపెళ్ళికి, మంచి అర్హతని ఇస్తాయి కానీ వీటన్నిటికంటే కూడా ఆ పెళ్ళిని విజయవంతం చేసుకోవాలి, ఏవన్నా అనుకోని ఇబ్బందులు ఎదురైనా కూడా కలిసి ఎదుర్కొని వాటిని ఓడించాలి అన్న పట్టుదల, క్రమశిక్షణ వుంటే పునర్వివాహాలు తప్పకుండా విజయవంతమవుతాయని వారు మరీ మరీ నొక్కి వక్కాణించారు.

భగవంతుడు స్త్రీ పురుషులిద్దరినీ కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడునీడగా వుండటానికి, ఒకరికొకరికి సహాయసహకారాలు అందివ్వటానికి సృష్టించాడు. ఏదైనా కారణాల వలన ఆ తోడు దూరం అయితే ఇంకో సరైన తోడు వెదకడంలో ఏం తప్పు? ఏ తోడులేని ఒంటరి జీవితం ఒక ఘోరమైన శాపం వంటిది కదా! అసలయినా వివాహం అంటేనే ఇద్దరు కలిసి, కష్టపడి దాని విజయం కోసం అనుక్షణం పరిశ్రమ చెయ్యాల్సిన క్లిష్టమైన బంధం. అందులోను ఇంక పునర్వివాహాలంటే కష్టపడాల్సిన అవసరం ఇంకా రెట్టింపు వుంటుందన్నమాట. అయినాసరే, ఆ దారిలో అడుగు వేసి ఆనందంగా తమ జీవిత పయనాన్ని కొనసాగిస్తున్న జంటలు నాకు తెలిసిన నా చిన్న ప్రపంచంలోనే కనీసం ఒక డజను పైగా నాకు తెలుసు. వారిలో అన్ని వయసులవారు వున్నారు. చిన్నపిల్లలు, పెద్దపిల్లలు, ఆఖరికి పెళ్ళైన పిల్లలున్నవారు కూడా వున్నారు. వారందరు ఎంతో సంతోషంగా వున్నారు. దీన్నిబట్టి నాకేమనిపిస్తుందంటే ప్రేమ, సహనం, పట్టుదల వుంటే ఎంత కష్టమైనదాన్నయినా సరే, సాధించవచ్చును.

ఏ కుటుంబంలోనన్నా సుఖశాంతులు విలసిల్లాలంటే ఆడ, మగ ఇద్దరి సఖ్యత వుండాలి. వారి పిల్లలందరూ సౌభ్రాతృత్వంతో కలసిమెలసి మెలగాలి. దీన్ని సాధించటం కోసం మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తప్పా? మీరే ఆలోచించండి.

ఇంక ఇప్పుడు నాకు సెలవు ఇవ్వండి. మళ్ళీ వచ్చే నెల ఇంకొన్ని కొత్త కబుర్లతో మీ ముందుకు వస్తాను. అంతదాకా సెలవు.

********

Posted in September 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *