Menu Close
తెలుగు పద్య రత్నాలు 51
-- ఆర్. శర్మ దంతుర్తి --

మానవ జీవితానికేమిటి పరమావధి అనేదానికి, మనిషిని బట్టి సమాధానం మారినా ఒకటి మాత్రం నిజం. మన జీవితం కష్టాలతో నిండి ఉంది. సుఖం మాత్రమే ఉన్న జీవితం ఎవరికీ లేదు. డబ్బులేక కొంతమందికి కష్టం, అదే డబ్బు ఎక్కువగా ఉండి మరికొంతమందికి కష్టం. దాన్ని ఎలా దాచిపెట్టాలో దానితో ఏం చేయాలో తెలియక మరికొంతమందికి ఏడుపు. రోగాలు వస్తూ పోతూ ఉంటాయి. రోజూవారీ దెబ్బలాటలూ స్నేహాలూ ఎంతకాలం ఉంటాయో, అసలు మన మటుక్కి మనం ఎంతకాలం బతుకుతామో కూడా ఎవరూ చెప్పలేరు. అయితే ప్రతీ ఒక్కరికీ అత్యంత సుఖంగా జరిగే రోజులకోసం ఆశ చావదు. ఆ సుఖం ఎలా వస్తుంది? హిందూ మతం ప్రకారం, అటువంటి సుఖం రావాలంటే ఆత్మ సాక్షాత్కారం ఒక్కటే దారి. అయితే దాని చేరుకోవడానికి దారి మాత్రం అత్యంత కష్టమైనది. ‘ఆత్మార్ధే పృధ్వీం త్యజేత్’ అని కదా? ప్రపంచాన్ని విడనాడడానికి సిద్ధమైనపుడు మాత్రమే – అన్నీ సన్యసించినపుడు మాత్రమే, అది దొరికేది. ఇందులో మరో మెలిక ఏమిటంటే, “నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి” అనే కోరిక కూడా (మోక్ష సన్యాసం) కూడా పోయినపుడే అది దొరికుతుందిట; అదీ భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే.

అన్నీ సంపాదించుకుందాం ముందు, తర్వాత భగవంతుడి గురించి ఆలోచించవచ్చు, అంటూ మొదలుపెడితే ఆ సంపాదన అనే దానికీ, ఆ సంపద రక్షించుకోవడానికీ సమయం అంతా గడిచిపోయి చావు దగ్గిరకి వచ్చినపుడు ‘అరే నేను జీవితం అంతా పాడు చేసుకున్నానే’ అనిపించడం సహజమే కదా? దీనికి కారణం మనకి ముక్కుకన్నా దగ్గిర్లో మనలోనే ఉన్న ఆత్మని విస్మరించి మనసుని దాని ఇష్టం వచ్చినట్టూ పరుగులు తీయనివ్వడం. శ్రీ రామకృష్ణులు చెప్పినట్టూ ఈ సాక్షాత్కారం అనేది మనం కష్టపడినా దొరకదు భగవంతుడి అనుగ్రహం లేకపోతే. అందువల్ల మన ప్రయత్నం మనం చేస్తూ భగవంతుడి శరణు పొందాలి.  ఫేస్ బుక్ స్నేహితులలో ఒకరైన బాణగిరి కృష్ణప్రసాద్ అనే వారు రాసిన ఉత్పలమాలలో ఈ విషయమే చెప్తూ భగవంతుణ్ణి వేడుకుంటూ రాసినదే ఈ నెల తెలుగు పద్యం.

ఉ.
జీవిత లక్ష్యమేమిటను చింత జనించదు మానసంబునన్,
కావలెనన్ని సౌఖ్యములు, కన్నులవిందగు నింద్ర భోగముల్,
యావ నశింపదెన్నడు ప్రయాణ ముహూర్తము చేరువైననూ,
త్రోవను దప్పినాడ, బహుదూరము గమ్యము చేరుటెట్టులో,
కావుమ బిడ్డతప్పుల, విఘాతమొనర్చుమ జన్మబంధముల్.

జీవితాంతం మనసులో నా జీవితానికేమిటి లక్ష్యం? నేను ఏమి సాధించాను అనే విషయాలు మనసులోకి రావు (చింత జనించదు మానసంబునన్). ఎందుకంటే మన కోతి మనసుకి అనేక విషయాలు కావాలి. అది అలా ఇష్టం వచ్చినట్టూ తిరుగుతూనే ఉంటుంది. శరీరం శుష్కించి పోయి చచ్చిపోయే స్థితిలో కూడా మనసు నిత్య యవ్వనంలో ఉంటుందని విన్నదే కదా? వీటికన్నింటికీ ఏమిటి కారణం? కావాల్సినన్ని సౌఖ్యాలు, కొత్త కొత్తవైన ఇంద్ర భోగాలు (కావలెనన్ని సౌఖ్యములు, కన్నులవిందగు నింద్ర భోగముల్). అయితే ఇవన్నీ అనుభవిస్తే కోరిక తీరుతుందా? అగ్నిలో నేయి వేస్తూంటే అలాగే వెలుగుతూ ఉంటుంది కానీ ఆరదు కదా? ఆ కోరిక నశించేది కల్ల (యావ నశింపదెన్నడు), జీవిత చరమాంకంలో కూడా, అంటే చావుకి ప్రయాణం ముహుర్తం దగ్గిరైనా సరే (ప్రయాణ ముహూర్తము చేరువైననూ). ఇదంతా గుర్తు వచ్చినప్పుడు కలిగే వైరాగ్యం నాలుగో పాదంలో చెప్తున్నారు – దారి తప్పిపోయాను భగవంతుడివైన నిన్ను తెలుసుకోకుండా (త్రోవను దప్పినాడ); అయితే బ్రహ్మ జ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారానికి ఇంకా అనేక లక్షల లేదా కోట్ల జన్మల దూరంలో ఉన్నాను అని తెల్సింది (బహుదూరము గమ్యము). అది చేరడం ఎలా? (చేరుటెట్టులో). ఇదంతా ఆలోచించడానిక్కూడా సమయం లేదు. అయితే దీనికో చిన్న ఉపాయం ఉంది. భగవంతుడు కరుణామయుడు కదా, అందువల్ల నా తప్పులు క్షమించేసి (కావుమ బిడ్డతప్పుల), నా జన్మ బంధాలు పోగొట్టేయి (విఘాతమొనర్చుమ జన్మబంధముల్; విఘాతము = ధ్వంసము, జీర్ణము) అంటున్నారు.

ఈ క్షమించడం గురించి చిన్న సరదా విషయం చెప్పుకుందాం, స్వామి సత్యానంద సరస్వతి గారు చెప్పినది. భగవంతుడితో పందెం ఇలా వేయాలిట. “భగవంతుడా మన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓపిక ఉందో చూడ్డానికి పందెం కాద్దాం. నేను నీ గుమ్మంలో నువ్వు కరుణించేదాకా వేచి చూడగలను. మరి నీకు అంత ఓపిక ఉందా?” భక్తులని ‘అలా చూస్తూ కూర్చో నేను ఏమీ చేయను’ అనే ధైర్యం భగవంతుడికి లేదుట, ఆయన కరుణామయుడు కాబట్టి (కంచెర్ల గోపన్న చెప్పినట్టు ఆయన దాశరధీ కరుణాపయోనిధీ). ఎన్ని తప్పులు చేసినా ‘పోనీలే మరోసారి ప్రయత్నం చేయి’ అంటూ మరో జన్మా, మరో జన్మా కల్పిస్తూ పాత జన్మలో చేసిన పుణ్యం తోడిచ్చి మరికాస్త ముందుకి తోస్తూ ఉంటాడు మనని భగవంతుడు. ఇదే భగవద్గీతలో చెప్పిన ‘పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే … శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభి జాయతే’ (శ్రీమద్భగవద్గీత ధ్యానయోగం, 6-40, 41) అనే విషయం.

****సశేషం****

Posted in September 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *