(Johannes V. Jensen కధ 'Lost forests’ కు స్వేచ్ఛానువాదం)
కొర్రా అనే ఒక పేరు మోసిన భూస్వామి ఉండేవాడు.. అతనికి వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ. రాత్రనక పగలనక సేద్యం చేస్తూ పంటలు బాగా పండించేవాడు. అతని కష్టం ఫలించి ఆదాయం కూడా బాగా వస్తుండేది. అలా తను కూడ బెట్టిన డబ్బుతో ఒక బానిసను కొనాలనే ఉద్దేశంతో, తన ఊరి నుంచి పట్టణానికి బయలు దేరాడు. మంచి పనిమంతుడైన వాడిని కొని తెచ్చుకొని తన వ్యవసాయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలను కుంటూ -"బానిసల ను అమ్మేకొట్టు"కు వెళ్ళాడు. దుకాణదారుడు ఏంటి కావాలి? అన్నట్టు చూశాడు. "ఏమోయ్ నీ దగ్గర మంచి బలవంతుడైన మనిషి అమ్మకానికి ఉంటే చూపించు- అన్నాడు కొర్రా.
"చూపిస్తాను ఉండండి" అని లోపలికి వెళ్ళి చాలా మంది బానిసయువకులను తీసుకువచ్చాడు నాకు వద్దు. వీళ్ళేనా! ఇంకా ఉన్నారా? అని అడిగాడు కొర్రా! "ఇంతమందిని చూపించినా నీకు నచ్చలేదా? బానిసలంటే ఇలాగే ఉంటారు” - అని కోపంగా అన్నాడు యజమాని. "నాకు కావలసిన వ్యక్తి ఇందులో లేడు. నేను వేరే దుకాణానికి వెళతాను” అని ముందుకు కదలబోయాడు కొర్రా..
అనరసరంగా బేరం పోగొట్టుకోవడానికి ఏ దుకాణదారుడు ఇష్టపడడు. అందుకే - కొర్రా వైపు తిరిగి - "ఆగండాగండి. కంగారు పడి వెళ్ళిపోకండి. లోపల కొంత మంది పడుకున్నారు. ఇది మధ్యాహ్నం వేళ కదా! వాళ్ళను లేపి తీసుకు వస్తాను ఉండండి” - అని లోపలికి వెళ్ళి, బానిసలకు వేసిన గొలుసులను పట్టుకొని గట్టిగా లాగాడు. ఆ దెబ్బకి నిద్రిస్తున్నవాళ్ళంతా ఒక్క ఉదుటున బయటకు పడ్డారు. కొర్రా వారందరినీ పరిశీలనగా చూస్తున్నాడు. ఈ లోగా ఆ గుంపులో నుండి ఒక బానిసను కొర్రా ముందు నిలబెట్టి "చూడు! ఇతను కండలు తిరిగిన పహిల్వాన్' లా ఎంత బలంగా ఉన్నాడో! ఇతని - నరాలు వయలిన తీగల లాగ దృఢంగా ఉన్నాయి. ఇతని పళ్ళు చూడు.! ఉక్కులా ఎంత గట్టిగా ఉన్నాయో! ఈ దంతాలతో ఇనుప మేకులను సైతం వెదురు బద్దల్లా రెండుగా చీల్చగలడు. ఇతనిని కొనుక్కుంటే నీకు గిట్టుబాటు అవుతుంది. ఎద్దులా పని చేస్తాడు మంచివాడు” అని గొప్పలు చెప్పాడు షాపువాడు.
"నీ మాట ప్రకారమే నీవు చెప్పిన బానిసను నేను కొనుగోలు చేస్తాను. నా దగ్గర సరిగా పని చేయకపోతే, వాపసు చేస్తా. అందుకు అంగీకారమేనా?” అన్నాడు కొర్రా. బేరం పోగొట్టు కోవడం ఇష్టం లేక కొర్రా షరతులకు అంగీకరించాడు దుకాణదారుడు.
అయిష్టం గానే బానిసను కొనుగోలు చేసి చేతికి ఉన్న గొలుసులు విప్పి బానిసను తనతో పాటు తీసుకు వెళ్ళాడు కొర్రా. ఈ లావాదేవీలు చూచినట్లైతే... ఊరూ పేరూ లేని బానిసకు, సంత లోని పశువుకూ పెద్దతేడా ఏమీలేదు అనిపిస్తుంది.
ఇంటికి చేరిన తర్వాత బానిసను పిలిచి "ఇదిగో అబ్బాయి! నీవు యువకుడివి. నీకు తిండికి, బట్టకు ఏమీ లోటు లేకుండా చూసుకుంటాను . నీవు మాత్రం బద్దకించకుండా చెప్పిన పని నమ్మకంగా చేయాలి తెలిసిందా?” అన్నాడు కొర్రా. "ఎంతయినా మావి బానిస బతుకులు కదా! చెప్పిన పని చేయక పోతే మీరు మమ్మల్ని బతకనిస్తారా? అని మనసు లోనే అనుకొని, పైకి మాత్రం - "అలాగేనయ్యా" అన్నట్టు తల ఊపాడు.
యజమానికి ఇచ్చిన మాట ప్రకారం పనితప్ప వేరే వ్యాపకం ఏమీ లేకుండా రాత్రనక, పగలనక గాడిద చాకిరీ చేస్తున్నాడు. విపరీతంగా కష్టపడడం వలన కొన్ని రోజులకు తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడు బానిస. అనారోగ్యంతో మంచంలో ఉన్నప్పుడు అతనికి తన పూర్వీకులు నివశించిన స్వచ్చమైన అటవీప్రాంతం, అక్కడి పచ్చని పొలాలు, కొండ గాలికి తలలూపుతున్న అందమైన పూల వనాలు, గలగల పారే సెలయేళ్ళు అందులో ఈదుతున్న చేప పిల్లలు, ఉషోదయాన్న వినిపించే పక్షుల కిలకిల రావాలు, పొదల నించి తొంగి చూస్తున్న తెల్లని కుందేళ్ళు, మైదానంలోనాట్యం చేసే రంగు రంగుల నెమళ్ళు, తనతో ఆటలాడుకున్న చిన్ననాటి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి, ఎలాగయినా ఒకసారి తన సొంత ఊరికి వెళ్ళాలనే బలమైన కోరిక కలిగింది. ఆనారోగ్యానికి, ఇంటి మీద బెంగ కూడా తోడవడంతో తన ప్రాంతాన్ని తలచుకొంటూ దిగాలుగా ఉన్నాడు బానిస. దానిని చూసిన కొర్రా, ఓదార్చడానికి ప్రయత్నిస్తూ.. -"నీవు బాధ పడకు. నీవు తప్పకుండా నీ ఊరికి వెళ్ళుదువుగాని. నేను నిన్ను పంపిస్తానని చెప్తున్నాను కదా! నిన్ను కొనుగోలు చేసినప్పటికినీ, నేను నిన్ను విడుదల చేస్తాను. నా మాట నమ్ము నీవు ఇంకా యౌవనస్థుడవే. ఇంకొక 5 సంవత్సరాలు నా దగ్గర పనిచేసావంటే, అప్పుడు నిన్ను నీ ప్రాంతానికి పంపిస్తాను. అక్కడికి వెళ్లి నీవు స్వేచ్ఛగా ఉండవచ్చు" అన్నాడు కొర్రా.
"ఏమి చేస్తాం? అమ్ముడు పోయిన బతుకులు కదా మావి! యజమాని మాటకు ఎదురు చెప్పకూడదు. చచ్చినట్టు వాళ్ళ మాటకు కట్టుబడి ఉండవలసిందే!" అని తనలోతాను అనుకొని, మరో 5 సంవత్సరాలు అక్కడే పని చేయడానికి ఒప్పుకున్నాడు.
‘ఒప్పుకున్నాక తప్పుతుందా?’ అన్న సామెతలా -ఎప్పటికైనా తన సొంత ఊరికి వెళ్ళి పోవాలన్న కోరికతో రాత్రనక పగలనక గొడ్డులా కష్టపడి పని చేస్తున్నాడు బానిస. గుమ్మంలో పడక కుర్చీ వేసుకుని కూర్చున్న కొర్రా పని చేస్తూ అటూ ఇటూ హుషారుగా తిరుగుతున్న బానిస వైపు ఆసక్తిగా చూస్తు - "తీసుకు వచ్చినప్పుడు ఇతనంటే పెద్దగా ఇష్టం లేదుగానీ, కాలక్రమంలో ఇతని లోని మంచితనం, నమ్మకత్వం, చెప్పిన పని తు.చ. తప్పకుండా చేసే గుణం, పని చేసేటప్పుడు బలిష్ఠమైన కండరాలు కదులు తున్న తీరు, నల్లగనిగనిగలాడుతున్న శరీరం మీద ముత్యాల్లా మెరుస్తున్న చెమట చుక్కలు, ఇలా బానిసకు సంబంధించిన అన్ని విషయాలలోనూ సంతృప్తి చెంది ఆనందించేవాడు. ఎప్పుడైనా ధనవంతుల ఆనందానికి మూలం కష్టజీవుల స్వేదమే!
ఈ 5 సంవత్సరాల కాలం బానిస యొక్క జీవితంలో అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ‘ఈ 5 సం॥ కాలం ఎప్పుడు పూర్తి ఆవుతుందో, ఎప్పుడు నేను ఈ బానిసత్వం నుండి విడుదల పొంది నా వాళ్ళ దగ్గరకు చేరతానా!’ అని రోజులు లెక్కపెట్కుంటూ, క్షణం ఒక యుగంలా గడిపాడు. కాలం గడుస్తున్న కొద్దీ అతని ఆలోచనలు అనంతంగా సాగుతున్నాయి. గానుగు ఎద్దు లాంటి ఈ జీవితం అతనికి విసుగు పుట్టిస్తోంది. ఇంకా ఎంత కాలం ఈ జైలు లాంటి చోట బతకాలి? వీటి నుండి బయట పడి స్వేచ్ఛగా బతికే రోజు ఎప్పుడు వస్తుంది? ఎన్నాళ్ళు .... ఇంకెన్నాళ్ళు ఈ ఎదురు చూపులు... అనుకుంటూ ప్రతి రోజూ, పడమర సూర్యుడు అస్తమించే దిశగా సుదూర ప్రాంతం లో కనిపిస్తున్న తన సొంత ఊరి వైపు ఆశగా ఎదురుచూస్తూ రోజు రోజుకీ అతని నమ్మకాన్నిబలపరచుకొంటూ ఆశగా ఎదురుచూస్తున్నాడు.
ఎట్టకేలకు ఎదురు చూసిన రోజు రానేవచ్చింది. ఎంతో ఆత్రుతగా కొర్రా వద్దకు వెళ్ళి –
'అయ్యా! నన్ను విడుదల చేస్తే, నేను మా ఊరు వెళ్ళిపోతాను.’ అన్నాడు బానిస. అందుకు కొర్రా ఆప్యాయంగా - భుజం తడుతూ--- “నీవు చాలా నమ్మకమైన మంచి పనివాడివి. నిన్ను వదులు కోవడం నాకు ఇష్టంలేదు. కానీ నీకు ఇచ్చిన మాట ప్రకారం నిన్ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను. నీవు ప్రతి సాయంకాలం సూర్యుడు అస్తమించే పశ్చిమ దిశగా ఆశగా ఎదురు చూడడం నేను చూస్తున్నాను. బహుశ: మీ ఊరు అటువైపు ఉండి ఉండవచ్చు" అన్నాడు. అవునన్నట్లు తల ఊపాడు బానిస.
"మరి నీ దగ్గర ప్రయాణ ఖర్చులకు డబ్బులున్నాయా? దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా! అన్నాడు కొర్రా. దానికి జనాబుగా --నేను వచ్చినప్పటి నుండీ మీ దగ్గరే పని చేస్తున్నాను. నాకు తిండి, బట్ట తప్ప నయాపైసా ఇవ్వడంలేదు మీరు. నా దగ్గర డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి? అని మనసులో అనుకొని, పైకి మాత్రం "లేవు" ఆన్నట్లుగా అడ్డంగా తల ఊపాడు. "అలా అయితే మరో 2,3 ఏళ్ళు నా దగ్గర పనిచెయ్యి. ఈ సారి నీ ప్రయాణానికి సరిపడా డబ్బులిస్తాను" అన్నాడు కొర్రా.
"సరేనయ్యా" అన్నట్టు తల ఊపి తిరిగి తన పనిలోకి సిద్దమయ్యాడు బానిస.
అయితే గతం లో లాగ తన మనసును పని మీద లగ్నం చేయలేక పోతున్నాడు. "తాను, తను సొంత ఊరికి వెళ్ళినట్టు, తన బంధువులందరూ ఎదురొచ్చి తనను ప్రేమగా ఇంటిలోనికి తీసుకు వెళ్లినట్టు, తను వారందరితో ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నట్టూ ,.ఇలా పదే పదే కలలు కంటూ తన చుట్టాల్ని గుర్తుతెచ్చుకొని దుఖిస్తూ.. తనలో తాను గొణుగుకుంటూ, మనసు పరి పరి విధాలుగా పోతుంటే ఎంతో ఆందోళన చెందుతూ మళ్ళీ అనారోగ్యం బారినపడ్డాడు బానిస. 'ఇతనికి ఈ మధ్య ఏమయ్యింది? వచ్చిన కొత్తలో ఎంతో హుషారుగా పని చేసేవాడు. రాను రాను ఏదో పోగొట్టు కున్నట్టు దిగులుగా ఉంటూ పని కూడా సరిగా చేయడం లేదు. పైగా ఆరోగ్యం కూడా బాగుండడం లేదు' - అనుకున్నాడు కొర్రా.
ఒకరోజు కొర్రా, బానిసను పరామర్శించడానికి వెళ్ళి అతని ప్రక్కన కూర్చుని అతనిని ఓదార్చుతూ---ఎన్నోవిషయాలపై చాలా సేపు గంభీరంగా మాట్లాడాడు... కొర్రా ఏమన్నాడంటే
"నేను ఇప్పుడు వృద్ధుడనై పోయాను - వయసులో ఉండగా, పశ్చిమ దిశగా ఉండే ఆ అందమైన అటవీప్రాంతం నా దృష్టిని ఎంతో ఆకర్షించింది. ఆ అందమైన ప్రాంతాల్ని చూడాలనే కోరిక నాకు బలంగా ఉండేది, గానీ నా దగ్గర ప్రయాణానికి కావలసిన డబ్బులు లేవు. ఇప్పుడు కావలసినన్ని డబ్బులు ఉన్నా... వృద్ధాప్యం కారణంగా వెళ్ళలేని పరిస్థితి. జీవితం అంటే ఇలాగే ఉంటుంది. అందుకే బహు:శ నేను బ్రతికి ఉండగా ఆ రంగురంగుల సుందర ప్రదేశాన్ని చూచే భాగ్యం నాకు ఉన్నట్టులేదు.”
కొర్రా ఇంకా మాట్లాడుతూ – “ప్రస్తుతం నీవు వయసులో ఉన్నప్పటికీ నీ ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళగలిగే అంత శక్తి ప్రస్తుతం నీ దగ్గర ఉన్నట్టు నాకు కనబడడం లేదు. బాగా నీరసంగా కనబడుతున్నావు. కనుక పెద్ద వాడినైన నా మాటలు విని మీ ఊరికి వెళ్ళాలనే నీ ఆలోచనను విరమించుకొని, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో " అన్నాడు.
కొర్రా మాటలు ఎంతో వివేకముతో కూడుకొని, అనుభవసారం రంగరించి చెప్పినట్లు ఉన్నాయి. ఆ మాటలు బానిస పై బాగానే పని చేసాయి. కాలక్రమంలో తన సొంత ఊరిని మర్చిపోయి, తన పనిలో మునిగిపోయాడు బానిస. పైకి బాగా చూచుకున్నట్టు కనబడినా యజమానులు, పని వాళ్ళ యెడల కఠినంగా వ్యవహరిస్తారు. ఒక్కొక్క సారి మానవత్వం మరచి ప్రవర్తిస్తారు. దానికి కొర్రా కూడా మినహాయింపు కాదు. ఈ మధ్య కాలంలో పని సరిగా చేయడం లేదని, మధ్య మధ్యలో నిద్రపోతున్నాడనీ కొరడాతో కొట్టేవాడు. దూషించేవాడు. దెబ్బలు తిన్నప్పుడల్లా తన పరిస్థితిని తలచుకొని ఏడ్చేవాడు. అలా మరో రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.
ఇంతకాలం ఎదురు చూచిన రోజు రానే వచ్చింది. ముందు అనుకున్న మాట ప్రకారం బానిసను విడుదల చేసి తన సొంత అటవీ ప్రాంతానికి పంపించాడు. కొర్రా తన వారిని చూడాలని కోటి యాశల తో సంతోషంగా బయలు దేరాడు బానిస. కొన్ని నెలల తర్వాత ఒక రోజు చాలా దయనీయ స్థితిలో కాళ్ళీడ్చుకుంటూ కొర్రా ఇంటికి తిరిగి వచ్చాడు బానిస.
"ఏం జరిగింది? ఎందుకు తిరిగివచ్చావు" అని అడిగాడు కొర్రా. దానికి జవాబుగా ---చాలా దిగాలుగా ఇలా చెప్పాడు. – “నేను వెళ్ళి పశ్సిమ దిశలోఉన్న ఈ ప్రాంత మంతా వెతికాను. ఆకాశాన్నంటే పొడవైన పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉండే మా నివాసప్రాంతాన్ని ఎవరో పొట్టన పెట్టుకున్నారు .. ఇప్పుడు నాకది స్మశానం లా అనిపించింది. అక్కడ నా వాళ్లెవరూ లేరని తెలిసి చాలా దుఃఖం వచ్చింది. అక్కడి ఒంటరి బతుకు కంటే మీ దగ్గర బానిసగా బ్రతకడమే మేలని మీ దగ్గరికి తిరిగి వచ్చాను" అని అన్నాడు.
కొర్రా అతనిని ఓదార్చుతూ --- ఈసారి సూర్యుడు. ఉదయిస్తున్న తూర్పు దిక్కునకు వెళ్ళు. అక్కడ మీవాళ్ళు నీకు కనబడవచ్చు అని అన్నాడు. కొర్రా మాటప్రకారం ఈ సారి తూర్పు దిశగా ప్రయాణం కొనసాగించాడు బానిస. వెతగ్గా, వెతగ్గా చివరకు అతని సొంత ప్రాంతానికైతే చేరుకున్నాడు గానీ అక్కడి పరిస్థితులూ అతనిని నిరాశ పరిచాయి. అక్కడి పరిసరాలు మారాయి కొత్తరకంగా ఉన్నాయి. తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు- అందరూ కొత్తవాళ్ళే. అక్కడ ఉండడం కష్టం అని భావించి, ఇక చేసేదేమీలేక తిరిగి తన యజమాని ఇంటికి చేరుకొని జరిగినది అంతా పూస గుచ్చినట్లు ఇలా వివరించాడు ... అక్కడ పెద్ద పెద్ద చెట్లు, చాలా క్రొత్తరకంగా ఉన్నాయి. కానీ అవేవీ మావి కావు అక్కడి మనుషులు కూడా మావాళ్ళు కారు. అందుకే నేను అక్కడ ఉండ లేక తిరిగి మీ దగ్గరకు వచ్చేశాను” అని అన్నాడు బానిస. దానికి కొర్రా - "సరేలే బాధపడకు. నేను బ్రతికినంత కాలం నిన్ను చూచుకుంటాను. నా తర్వాత నా కొడుకు నీ బాగోగులు చూసుకుంటాడు" అని అన్నాడు.
కాలక్రమం లో కొర్రా బాగా వృద్దుడైనాడు. తన దగ్గర వృద్ధాప్యం తప్ప మరేమీ లేని స్థితికి చేరుకున్నాడు ఐనప్పటికినీ తన బానిసకు మాత్రం ఏ లోటూ రాకుండా అన్నీ సమకూర్చి, బాగా చూసుకుంటున్నాడు. పనివాడు బాగుంటే ఇంట్లో పనులు కుంటు పడకుండా సజావుగా సాగుతాయని కొర్రాకు బాగా తెలుసు. ఎంతబాగా చూసుకున్నప్పటికినీ అప్పుడప్పుడూ తనలోని 'యజమాని' బయటకు వచ్చి కొరడా ఝళిపించి బానిసను బాగా దెబ్బలు కొట్టేవాడు. అలా చేయకపోతే బానిస తన దగ్గర కుక్కిన పేనులా పడి ఉండ కుండా, ఎదురు తిరుగుతాడేమోనన్న భయం తోపాటు ధనవంతులకు ఉండే సహజమైన అహంకారం కూడా! కనపడుతుండేది. రోజులు గడుస్తున్నాయి. బానిసలో స్వస్థలంపై మమకారం మాత్రం చావలేదు. కన్నతల్లన్నా, ఉన్న ఊరన్నా, ఎవరికైనా మక్కువ ఎక్కువే కదా! అందుకే ప్రతి ఆదివారం అక్కడికి దగ్గరలో ఉన్న ఒక కొండ మీద కెక్కి పశ్చిమ దిశవైపు కన్నార్పకుండా చూసేవాడు. ఎంతయినా "ఆశ" మనిషిని బ్రతికిస్తుంది.
తన దగ్గర ఉన్న బానిస ఒళ్ళు దాచుకోకుండా కష్టపడడం వలన కొర్రా పాలం బాగా పండింది. వ్యవసాయం లో మెళుకువలు అన్నీ తెలుసుకుని బానిస బాగా సేద్యం చేస్తున్నాడు. అన్నీ కలిసి వచ్చి కొర్రా బాగా ధనవంతుడైయ్యాడు.. ఈ బానిస శాశ్వతంగా తన దగ్గరే ఉంటె ఇంకా బాగుంటుందని అనుకొని- ఒక మహిళా బానిసను తీసుకువచ్చి తన పనివానికి ఇచ్చి వివాహం జరిపించినాడు.
కాల చక్రం గిర్రున తిరిగింది. ఉన్నబానిసకు విడుదల లేదు, పైగా అరడజను మంది బలవంతులైన చిన్న బానిసలు బోనస్ గా దొరికారు కొర్రాకు. పనినే దైవంగా భావించాలనే వాళ్ళ నాన్న మాటలకు కట్టుబడి, ఆ బానిస పిల్లలు వాళ్ళ తండ్రి కంటే ఎక్కువ శ్రద్దాశక్తులతో తమ యజమానికి సేవలు చేసి అతని అభివృద్ధికి మరింత పాటుపడ్డారు. అయితే వీలున్నప్పుడల్లా దగ్గరలో ఉన్న కొండ మీదికి తన పిల్లలను తీసుకు వెళ్ళి సూర్యుడు అస్తమిస్తున్న పశ్చిమ దిశ వైపు చూపించి తన సొంత ఊరిని గురించి తన పిల్లలకు చెబుతుండేవాడు బానిస. అలా చెబుతూ "మనం ఎప్పుడైతే అలసి పోయి పని చేయలేక పోతామో, అప్పుడు మన సొంత ఊరైన ఆ అందమైన అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుందాం." అని ఊరిస్తూ ఉండేవాడు. చివరకు కొర్రా వృద్ధాప్యం వల్ల బలహీన పడ్డాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు గాని అతను చెప్పుకోదగినంత బలవంతుడు కాదు. తండ్రి అంత తెలివైన వాడు కూడా కాదు.
ఐనప్పటికినీ తన కొడుకును గురించిన బెంగ అతనికి లేదు. ఎందు కంటే తన దగ్గర ఉన్న బానిసలు తన కొడుకుకు రక్షణ వలయంలా ఉండి ఏ కష్టం రాకుండా చూసుకోగల సమర్థులు. వాళ్ళు ఎంత బలవంతులంటే - ఎవరివైనా ఒక్కదుడ్డుకర్ర దెబ్బతో పడగొట్టగలరు. కాలం ప్రశాంతంగా సాగిపోతోంది.
ఆ బానిసబిడ్డలు అడవిలోని చెట్లను నరకడానికి తమగొడ్డళ్ళకు పదును పెట్టు కొని హుషారుగా బయలు దేరారు. కానీ వారికి తెలియని విషయమేమిటంటే.....తమ యజమానులను ధనవంతులుగా చేయగానికి తాము నరుకుతున్న "అడని లోని చెట్లు" తమతో పాటు అనేక ప్రాణులకూ నివాస స్థలమని, దానిని నాశనం చేయడం ద్వారా తమ నివాసాన్ని శాశ్వతంగా పోగొట్టుకొని తాము ఎప్పటికీ గూడు చెదరిన పక్షులుగా ఉండి, బానిసలు గానే బతుకుతామని ! ఈ 'అరణ్యరోదన’ ఆగేదెన్నడో!!
bagundi Aranya Rodana
very nice story