Menu Close
Paranandi-Aravindarao
మనసు విప్పిన మడతలు - 20
పారనంది అరవిందారావు

కళ్ళు తెరవకు

Kallu-Theravaku

కళ్ళు తెరవకు! ఒళ్ళు కదపకు!
కల కరిగి పోతుంది! కధ చెరిగిపోతుంది!
ఏమిటీ జీవితం! ఎందుకీ పరుగులు?
ఎండ తగిలిందనీ ఏరు పొంగిందనీ
బండ పగిలిందనీ బీటువారిందనీ
దేనికీ దిగులు! ఎందుకీ గుబులు?
కాస్సేపు కూర్చుని కథలు చెప్పుకుందాం!
మదిలో దాగిన కలలు విప్పుకుందాం
గడిచిపోతాయిలే దివారాత్రులు
మనం లేకుండా
జరిగిపోతాయిలే చావుబ్రతుకులు
గడువివ్వకుండా
నింగిపై నీలి మబ్బుని వలువగా చుట్టుకుందాం!
మెరిసే చుక్కల్ని మాలగా గుచ్చేద్దాం!
ఈ ప్రపంచం ఎక్కడికీ పారిపోదు
ఈ సమయం మళ్ళా మరి చిక్కదు
మరిచిపోయిన దారులు వెతుక్కుందాం!
మరువలేని స్మృతులు నెమరు వేసుకుందాం!
జీవిత రంగంలో జీర్ణించిన పాత్రలకి
రంగుపూసి రంగం మీదకి తోలేద్దాం!
కదిలి లేచామంటే కలవలేం మనం
కనులు తెరిచామంటే కరిగిపోతాం మనం
ఈ సంద్రానికెదురేగి దరిదాపుల దాగుంటే
జండా నీకై ఎగురవేస్తాలే నేస్తం

కన్నీరు కురిసిన రాత్రి!

Kanneeru-Kurisina-Rathri

చిక్కని అమావాస్య చీకటిఉసురు
జడివానగ మారిన జల్లుల ముసురు
రోదిస్తోంది! నిశికన్య రోదిస్తోంది!
నల్లటి చీరకట్టి ఎలుగెత్తి ఏడుస్తోంది

ఎవరో అనాధుడు ప్రాణాలొదిలాడని
ఏడడుగుల స్థలంలొ పాతిపెడుతున్నారని
బంకమన్నుతడితో రంగులతో మెరుస్తున్న
సమాధిని పెకలించి మరో జన్మ ఇవ్వాలని
రోదిస్తోంది! నిశికన్య రోదిస్తోంది

ఎవరో ధనికుడు దగాచేస్తూ చచ్చాడని
కాసులు సంచుల నిండా ఖజానాలో దాచాడని
మండుతున్న వాడి కాష్టాన్నిముంచివేయాలని
రోదిస్తోంది! నిశికన్య రోదిస్తోంది!

చెట్టుక్రింద చేరిన చిన్నదాని బతుకు
చీలికైన చీరలోంచి తొంగిచూసిన తనువు
తలదాచుకోలేదు తనువుదాచలేదని
తలుపుతీసి దాని పరువు కాపాడరేమని
రోదిస్తోంది! నిశికన్య రోదిస్తోంది!

మింగ మెతుకులేని పేద ముదుసలిది
పెళ్ళిభోజనపు ఆకులపై పడ్డది
తేరగతిని త్రేంచే పెళ్ళి పెద్దవారు
ఆకులో రెండు మెతుకులన్న వదలలేదని
రోదిస్తోంది! నిశికన్య రోదిస్తోంది!

ఆ రోదన తలుపులు తట్టింది
వీధులు ముంచేసింది
కాలువల్లో కలిసింది
విన్నదెవ్వరు? పలుకలేని ప్రకృతే!
చూసిందెవ్వరు? ఏమి చేయలేని ప్రకృతే!

*****

ముందుమాట

Paranandi-Aravindaraoనాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.

మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.

ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.

శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.

డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.

నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.

నమస్కారములతో – పారనంది అరవిందారావు

Posted in September 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *