12
'గుడ్-విల్ ఫిలిమ్స్' వారి 'ఆనందో బ్రహ్మ' సినిమా ప్రకటన వచ్చాక కాకినాడలోని పారూ అభిమానుల నుండి, హైదరాబాదులోని బంధువర్గం నుండి అందుతున్న అభినందనల వెల్లువ ఆమెకి ఉత్సాహాన్ని కలిగించాయి.
రామ్ దంపతులు ఫ్లాట్ బిల్డర్ ని కలిసారు. తాము ఒప్పందం కుదుర్చుకున్న దానికన్నా పెద్దది, మరిన్ని సదుపాయాలు, రూఫ్-టాప్ గార్డెన్ కూడా ఉన్న ఫ్లాట్ కొనుగోలుకి సిద్ధపడ్డారు. త్వరలోనే రెడీ అవుతుందని అంచనా వేశాడు బిల్డర్.
మరో నెలకి పరీక్షలు ముగిసాక, 'ఆనందో బ్రహ్మ' సినిమా పాటల రికార్డింగ్ నిమిత్తం పారూతో కలిసి హైదరాబాద్ వెళ్లిన సీతమ్మ రామనాధం ఇంటనే బసచేశారు. పాటల ప్రాక్టీస్, రికార్డింగుతో ఊపిరాడకుండా గడిచింది. రికార్డింగ్ బాగా వచ్చిందని ధ్రువపరచుకున్నాక, రామనాధం పరివారానికి ధన్యవాదాలు తెలిపి ఇంటి దారి పట్టారు ఆ గాయనీమణులు.
**
కొత్త ఫ్లాట్ 'గృహప్రవేశం' ముహూర్తం ఖరారయింది. నెల రోజుల్లో జరగనున్న తమ నూతన గృహప్రవేశ వేడుకకి రామనాధం గారి కుటుంబంతో పాటుగా శ్రీనివాస్ గారి కుటుంబాన్ని కూడా ఆహ్వానించారు రామ్‌కుమార్ దంపతులు.
సన్నిహితులు, పిల్లల స్నేహితులతో కలుపుకుని వంద మంది పూజకి, అదే రోజు సాయంత్రం తమ నివాసంలో పారూ ఇరవయ్యవ పుట్టినరోజు వేడుకకి యాభై మంది వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేయసాగారు.
**
గృహప్రవేశానికి ఓ రోజు ముందే రమ్మని కిరణ్ని పారూ కోరినప్పడు, సరేనంటూ “నీ పుట్టినరోజుకి నీకో సప్రైజ్ న్యూస్ చెబుతాను.” అన్నాడు.
“నో బావగారు! అంతవరకూ ఆగలేను. ఇప్పుడే చెప్పాలి." అంది ఆదుర్దాగా పారూ.
"నో పారూ గారు. వెయిట్ చేయాల్సిందే. అదలా ఉంచితే ఈ మధ్య క్లబ్ కి వెళ్లి, మ్యూజిక్ బ్యాండ్ తో ప్రాక్టీస్ చేస్తున్నా. ఎందుకో మనసు పెట్టలేకపోతున్నా. ఓ మంచి మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసి నీవు నాతో కలిసి పాడితేనన్నా నా పాటకి మళ్ళీ ప్రాణం వస్తుందేమో! ఏమంటావ్?" అడిగాడు కిరణ్.
ఏమనాలో తోచక కాసేపు మౌనంగా ఉండిపోయిన పారూ "బావా! నీతో కలిసి పాడమంటే పాడనా? అంతకన్నానా? నీవెప్పుడంటే అప్పుడే చెప్పు. నా ప్రోగ్రామ్స్ పక్కన పెట్టి నీతో కలిసి పాడేందుకు సాధన చేసి నీ ముందుకు వచ్చేస్తా. పెద్దవాళ్ళు కూడా పాడమనే అంటారు." అంటూ భరోసా ఇచ్చేసింది పారు.
“ధన్యవాదాలు మరదలా! ఆ మాట చాలు. కలిసి మంచి డ్యూయెట్స్ ప్రాక్టీస్ చేద్దాం” అన్నాడు నవ్వేస్తూ.
"బావా! మరో హ్యాపీ న్యూస్. నేను మంచి మార్కులతో ఆర్ట్స్ డిగ్రీతో పాటు సంగీతంలోనూ బి.ఏ డిగ్రీ పూర్తి చేసాను. పునీత్ కూడా వడ్రంగి, శిల్ప కళల్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. జననీ హైస్కూల్ కి వచ్చింది. సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు అందరూ. అమ్మావాళ్ళు డిన్నర్ తయారు చేస్తున్నారు. మాలిని పిన్నీ వాళ్ళు వస్తున్నారు. నేను ఇల్లు శుభ్రం చేయాలి. మరి వెళతాను." అని ఫోన్ పెట్టింది.
**
మరునాడు శాంతా, పారూలు ఇంటి వెనుక తోటలో మొక్కలకి నీళ్లు పెడుతుండగా, గేట్ బయట కారు ఆగిన చప్పుడు. మరో నిముషంలో "ఎవరండీ లోపల? ఇంట్లో ఉన్నారా ఎవరైనా?" అంటూ తలుపును గట్టిగా కొడుతున్న చప్పుడు వినవచ్చింది.
వెళ్లి తలుపు తెరిచిన శాంత గుమ్మం బయట నిలుచునున్న ముగ్గురు పోలీసులని చూసి నివ్వెరపోయింది. స్కూల్లో జరిగిన ఓ స్కూటర్ దొంగతనం కేసులో పునీత్ కుమార్ ని ప్రశ్నించేందుకు తీసుకువెళ్ళాలంటున్న పోలీసుల మాటలకి వణికిపోయింది.
వీలయినంత త్వరగా పిల్లవాడి తండ్రిని స్టేషన్ కి పంపమంటూ లోనికొచ్చి, హాల్లో ఉన్న పునీత్ చేయి పట్టుకుని తమతో తీసుకెళ్లారు.
**
విషయం తెలుసుకున్న రామ్, జోసెఫ్ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తారు.
స్కూల్లో ఓ టీచర్ కి చెందిన బజాజ్ స్కూటర్‌ని పర్మిషన్ లేకుండా బయటికి తీసుకెళ్లి యాక్సిడెంట్ చేసాడన్నది ఆరోపణ. నిజమేనని అంగీకరించాడు పునీత్.
స్టేషన్ కి రామ్‌కుమార్ తో పాటు వచ్చిన కమ్యూనిటీ చర్చి డైరెక్టర్ జోసెఫ్ గారి పరపతి ఎరిగున్నవాడే సర్కిల్-ఇన్స్పెక్టర్ రంగనాథ్. అంతే కాక, పునీత్ చిన్నవాడవడంతో సున్నితంగానే వ్యహరిస్తున్నాడు.
జరిగిన తప్పిదానికి క్షమార్పణ కోరుతూ పునీత్, తండ్రి రామ్‌కుమార్ కూడా లిఖిత పూర్వక అభ్యర్ధనని పోలీస్ వారికి సమర్పించాక, పద్నాలుగేళ్ళ పునీత్ కి శిక్ష ఉండదని, నలభై గంటల సమాజ సేవ చేయాలని తెలియజేసి వదిలేసాడు రంగనాథ్. స్కూటర్ బాగు చేయించి స్టేషన్ లో అప్పజెప్పమని రామ్ కి ఆదేశాలిచ్చాడు.
**
పునీత్ తో పోలీస్ స్టేషన్ నుంచి ఇల్లు చేరాక, ఇంట్లో భరించలేని నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
నిశ్శబ్దాన్ని భగ్నం చేయాలన్న ఉద్దేశంతో "పునీత్, అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్పు. ఆ స్కూటర్ నడిపిన నీకు పెద్దగా దెబ్బలేమీ తగల్లేదే? అదెలా సాధ్యమయిందో చెప్పు" అడిగింది మాలిని.
"పిన్నీ! చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. స్కూటర్ నడపడం నా స్నేహితులు నేర్పించారు. విక్టర్ సూచనల ప్రకారమే ఉదయం అసెంబ్లీ అయిపోయాక మేము స్కూల్ నుంచి స్కూటర్లు తీసుకువెళ్ళాం. స్కూలుకి దగ్గరలోనే అనుకోకుండా నాకు ఈ ఆక్సిడెంట్ అయింది." అన్నాడు పునీత్ బాధపడుతూ.
ఇంకా ఏం చెబుతాడోనని రామ్, మాలిని ఓపికగా వినడానికి సిద్ధంగా ఉన్నారు.
"చాలా నెమ్మదిగా నడుపుతున్నాను కనుక బాలెన్స్ కోల్పోయి, నేను జారిపడినా స్కూటర్ మాత్రం అదే స్పీడులో ముందుకెళ్ళి అక్కడున్న చెట్టుకు గుద్దుకుంది. అందుకే నాకు పెద్దగా దెబ్బలు తగల్లేదు. అందరం కలిసి స్కూటర్ నెమ్మదిగా మళ్ళీ దాని స్థానంలో ఉంచాము." అంటూ ఆపి మాలిని కేసి, తండ్రి కేసి చూసాడు పునీత్.
అప్పటివరకూ కోపాన్ని ఆపుకున్న రామ్ ఇక తట్టుకోలేకపోయాడు. "నీ కన్నా పెద్దవాళ్ళతో స్నేహం చేయవద్దని నీకెన్ని సార్లు చెప్పినా నువ్వు వినడం లేదు. అందుకే ఈ అనర్ధాలు." అంటూ పునీత్ కాలర్ పట్టుకుని సోఫా నుండి పైకి లేపి కొట్టేందుకు చెయ్యెత్తబోయాడు.
మాలిని పరుగున వెళ్లి రామ్‌కి, పునీత్‌కి మధ్య నిలబడింది. పునీత్ కళ్ళ నిండా నీళ్ళతో వణికిపోతూ మాలిని వెనుకకి జరిగాడు.
"సారీ నాన్నా... సారీ నాన్నా..." అంటూనే ఉన్నాడు.
**
పునీత్ సంఘటన శాంతని మరీ క్షోభ పెట్టింది. సీతమ్మ గారు ఎంత సర్ది చెప్పినా ఆమె వ్యధ దూరమవడంలేదు.
శాంత ఉదాసీనత గమనించిన సీతమ్మ"మగపిల్లలు ఇలాటి పనులు చేయడం వింటూనే ఉంటాము. మరీ అలా డీలా పడితే ఎలా? ఏదో పెద్ద ఉపద్రవంలా అనుకోకు. వాడు కాస్త తెగింపు ఎక్కువున్న పిండం. కాస్త ఎదిగాక అన్నీ అర్ధం చేసుకుంటాడు. నువ్వీ సమయంలో ఇలా ఉంటే ఒంటికీ, ఇంటికీ కూడా మంచిది కాదు తల్లీ.
వారం రోజుల్లో గృహప్రవేశం ఉంది. అట్టహాసంగా జరగాలని ఆశపడ్డావు. ఇక లేచి ఉషారుగా పనులు మొదలు పెట్టు. మన పారూ పుట్టినరోజు పండుగ కూడా జరిపించాలి. మనకి కావాల్సిన బంధువులు వస్తున్నారు. మన ఆశలు, ఆశయాలు నెరవేరాలి." అంటూ శాంతని ప్రోత్సహించింది ఆమె.
**
గృహాప్రేవేశ వేడుక ఊహించిన దానికన్నా కనులపండువగా ఉంది. ఇంటిల్లిపాదీ పట్టు వస్త్రాలు ధరించి కళకళలాడుతున్నారు. బంధు, మిత్ర సమేతంగా వేడుక సందడిగా ఉంది. గృహప్రవేశ పూజ తరువాత అతిధుల సరదా కబుర్లు, ఆత్మీయ సంభాషణలతో ఆహ్లాదంగా గడిచింది సమయం.
తానే అధికారిక ఫోటోగ్రాఫర్ నంటూ అందరినీ నవ్విస్తూ, ఫోటోలు తీసాడు కిరణ్.
భోజనానికి యువత అంతా ఓ పంక్తిలో కూచున్నారు. ధరించిన ఖరీదైన ఎంబ్రాయిడరీ లెహెంగాతో పంక్తి భోజనంకి కూర్చోడానికి ఇబ్బంది పడుతూ ఎలాగోలా కిరణ్ పక్కనే కూర్చుంది మీనాక్షి.
"మీ అమ్మ చెప్పినట్టు, పూజకి పట్టుబట్టలు వేసుకొనుంటే బాగుండేది కదా! నీకు, నిన్ను చూసేవాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంది. వెళ్లి డైనింగ్ టేబిల్ వద్ద కూర్చుని తిను." అన్నాడు స్వరం తగ్గించి మీనాక్షితో కిరణ్.
అప్పటికే కోపంగా ఉన్న మీనాక్షి కళ్ళనిండా నీరు నిండింది. గబక్కున కళ్ళు తుడుచుకుని అతికష్టం మీద ఏదో కాస్త తిని అక్కడినుంచి లేచిపోయింది.
**
సాయంత్రం ఏడింటికి రామ్‌కుమార్ శాంతల ఇంట పారూ ఇరవైయ్యవ పుట్టినరోజు వేడుక కూడా అంతే ఆనందంగా మొదలయింది. సీతమ్మగారు ప్రత్యేకంగా తెప్పించిన కంచిపట్టు చీరకట్టులో అజంతా శిల్పంలా అందంగా అలంకరించుకున్న పారూ నుండి కళ్ళు తిప్పుకోలేకపోయారు అతిధులు.
కేక్ కోసి, అందరి ఆశీస్సులు అందుకుని పేరుపేరునా వారికి కృతఙ్ఞతలు తెలిపింది పారూ.
**
తోటలోని జాలీ గదిలో యువత సమావేశమైంది. పెద్దలంతా మధ్య హాల్లో కూర్చున్నారు.
"పారూ, మొన్నామధ్య సినిమాకి మ్యూజిక్ రికార్డింగ్ అయింది కదా! వాటిల్లో నుండి నీకు బాగా నచ్చిన పాట పాడుతావా? పుట్టినరోజు కానుక అందుకోవాలంటే నాకు ముందు ఓ పాట వినిపించు." అన్నాడు కిరణ్.
నవ్వింది పారూ. “ఆ పాటలు కాదు గానీ నాకు పాడాలనిపించే పాట పాడుతాను.” అంది.
"అమ్మ బాబోయ్! పాటలు వినీ వినీ విసిగిపోయాను. మీనాక్షక్కా! పద ముందు మనం స్నాక్ తిని అందరికీ సర్వ్ చేద్దాం. నాకు ఆ పని అప్పగించింది మా అమ్మ. హెల్ప్ చేయవా ప్లీజ్!" అంటూ మీనాక్షిని పిలిచాడు పునీత్.
"సరే పద" అంటూ వాడితో కలిసి బయటికి నడిచింది మీనాక్షి. వెనుకనుండి పారూ గొంతు శ్రావ్యంగా వినబడసాగింది.
||పాడనా తెనుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట
కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మూపులపైన మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట మధురామృతాల తేట ఒక పాట ||| పాడనా ||
వళ్ళంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడెటి
తెలుగుతల్లి పెట్టని కోట తెనుగును నాటె ప్రతిచోట
ఒక పాట || పాడనా పాడనా తెనుగు పాట…||
పరవశాన పాడుతున్న పారూని పరవశంగా చూస్తూ.. ఆమె గానాన్ని ఆలకిస్తున్నాడు కిరణ్. పాట మొదలవగానే హాల్లో నుండి వాకిలి ద్వారంలోకి వచ్చిన వారు కూడా తన్మయత్వంతో విన్నారు.
అతిథుల చప్పట్లతో ఇల్లు మారుమ్రోగింది.
తన ప్రియమిత్రుడైన కిరణ్ అలా పారూ వెంటే ఉండడం, మెచ్చుకోడం, ఫోటోలు తీయడం, పాడమని అడగడం సహించలేకపోతున్న మీనాక్షి మనసు అసూయతో రగిలిపోయింది. మనిషి కోపంతో ఉడికిపోయింది.
పారూని కలిసినప్పటి నుండి ఆమె గురించి అప్పుడప్పుడు మీనాకి చెప్పాడు కిరణ్. కాకినాడకు రెండుమార్లు వచ్చి వెళ్ళినప్పటినుండి పారూ గానం గురించి, ఆమె మంచి నడవడి గురించి కొనియాడినప్పుడు మాత్రం తట్టుకోలేకపోయింది. ఇక ఈ తడవ కిరణ్ కి పారూ పట్ల ఉన్న అభిమానం, కళ్ళల్లో ఆరాధనా భావం చూసి... కిరణ్ని పారూనుండి దూరం పెట్టాలన్న ఆలోచన ఆమెని కమ్మేసింది. అసహనంతో రగిలిపోతున్న మీనాక్షి ముఖం కందగడ్డలా అయింది..
“పద మీనాక్షక్కా! ఆ ట్రే అందుకో” అన్న పునీత్ మాటలకి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి ట్రే అందుకుంది. అతిధుల్లోని ప్రతిఒక్కరూ పారూ పాటని మెచ్చుకుని, అభినందించారు.
**
ఇంటి వెనుకనున్నతోటంతా మందారాలు, గులాబీలు, సన్నజాజులు విరబూసి ఉంది..
"ఇప్పుడే చూస్తున్నా. మీ గార్డెన్ చాలా బావుంది శాంత ఆంటీ. అంటూ తోటలోకి నడిచిన కిరణ్ వెంటే నడిచారు శాంతతో పాటు కొందరు.
కూరగాయ మొక్కలు, పందిళ్లు, జామచెట్లు దిశగా పెద్దవాళ్ళు వెళితే… గులాబీలు, మందారాలు, చేమంతులు, రంగురంగుల పూదోట వైపు నడిచారు యువత.
"ఇక్కడ ఈ ఉయ్యాల బాగుందే!" కాసేపు ఇక్కడ కూచుందాం. నీకు గిఫ్ట్ ఇవ్వకుండా వెళితే ఎలా?" అంటూ.. అనుసరిస్తున్న పారూని ఉయ్యాల వైవుకి నడవమని సూచించాడు కిరణ్.
షర్ట్ జేబు నుండి ఎరుపు రంగు బాక్స్ తీసి, దానిలోని హార్ట్ ఆకారంలో ఉన్న కెంపులు పొదిగిన చిన్న లాకెట్ వెలికి తీసాడు. "చాలా వెతికిన తరువాత ఇది నచ్చి తీసుకున్నాను. నీ గానం నాకెంత ఇష్టమో, నీ నడత, నిరాడంబరత, నీవూ కూడా నాకంతే ఇష్టం పారూ. నిన్ను ఇష్టపడని వారెవరుంటారు చెప్పు. అందుకే అభిమానంతో నీకు ఈ ప్రత్యేక కానుక. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ పారూ." అంటూ ఆ బాక్స్ ని పారూ చేతిలో పెట్టాడు కిరణ్.
ఒకింత దూరంనుండి గమినిస్తున్న మీనాక్షి మరోమారు అసహనానికి గురయింది. మరికాస్త దూరం నుండి ఇదంతా చూసిన జననీ పరుగున వచ్చి అక్క చేతిలోని ఆ గిఫ్ట్ చూసి "చాలా బావుంది బావా. అక్క లక్కీ. మరి నా పుట్టినరోజుకి కూడా ఇలాటిదే ఇవ్వాలి." అంది సంతోషంగా..
"తప్పకుండా. ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఇస్తాను జానీ!" అంటూ గులాబీలు కోసుకుని తమ వైపుగా వస్తున్న మీనాక్షిని చూసి "మీనా, ఎక్కడికెళ్ళావు? ఇందాకటి నుండీ కనబడలేదు? చీకటి పడుతుంది. అందరూ పదండి. డిన్నర్ టైం కదా!" అంటూ అక్కడినుండి కదిలాడు కిరణ్.
"నాకు లాగానే నీకెప్పుడూ ఆకలి బావా. హంగ్రీ మాన్?" అంటూ బిగ్గరగా నవ్వుతూ కిరణ్ చేతిని అందుకుంది జనని.
**
షడ్రుచుల విందు అయ్యాక అతిధులు సెలవు తీసుకున్నారు. బంధువులు మిగిలారు. పారూ మాత్రం కిరణ్ నుండి బహుమానం అందుకున్నప్పటి నుండి మరో ప్రపంచంలో విహరించసాగింది. తానంటే ఇష్టమని చెప్పడమే బావ చెబుతానన్న సప్రయిజ్ న్యూస్ అనుకోవచ్చా? అనుకుంటూ మధుర భావనలతో గగనాల్లో విహరించసాగింది పారూ మనసు.
పారూని గమనించిన సీతమ్మగారు "మనమరాలా అలిసిపోయావా? అలా మౌనంగా ఉన్నావే? సరేగానీ వచ్చే వారం నుండి నీవు మ్యూజిక్ లో మాస్టర్స్ డిగ్రీ కొనసాగించేందుకు ఫీజు కట్టేసాను. అదే నేను నీకిచ్చే పుట్టినరోజు బహుమతి తల్లీ!" అన్న అమ్మమ్మకి పాదనమస్కారం చేసింది పారూ.
"పెద్దమ్మగారు! నిత్యం పిల్లల అభివృద్ధిని గురించే కదా మీ ఆలోచన." అన్నది మాలిని.
మరో మారు రామ్ కి అభినందనలు తెలిపి సెలవు తీసుకున్నారు జోసెఫ్ దంపతులు. రామనాధం గారి పరివారమంతా కూడా శుభాకాంక్షలు చెప్పి బయలుదేరిపోయారు.
****సశేషం****
రచయిత్రి పరిచయం ....
‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత
కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.
1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.
బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.
సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.
సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.
అమెరికా లోని వివిధ (25) దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.
ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.
రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.
ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.
నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.
విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్
nicely going 👏🏻👏🏻👏🏻
Thank you Suma garu