ఊహలనే మాలలుగా అల్లిందీ జవరాలే!
కోర్కెలనే తోరణాలు చేసిందీ జవరాలే!
చిలిపికనులు ఒలకబోసెనెన్నెన్నో సోయగాలు,
చిరునగవులు పెదవులపై చిలికిందీ జవరాలే!
వగలాడి సౌందర్యం బాపుబొమ్మ తలపించే,
సొగసులనే ఒలికిస్తూ నవ్విందీ జవరాలే!
మదిలోన కొలిచేటీ ప్రభునికేలె పూజలన్ని,
స్వామితోనె జీవితమని తలచిందీ జవరాలే!
సత్యమైన ప్రేమనింపి ద్రవ్యముగా పళ్ళెములో,
పూజసేయ రేపవలూ వేచిందీ జవరాలే!
అంత్యప్రాస
***
కొమ్మపైని చిలుకలగని మురిసిపోయె శ్యామామణి!
తీయనైన ఊహలలో తేలినదీ వనితామణి!
లోకమంత మరచిపోయి ఊసులాడె పక్షిజంట,
వలచినవాడు గురుతురాగ మైమరచే హేమామణి!
సోగకనుల సుందరాంగి సొంపుగాను కోకగట్టె,
కోకలోన అందాలను దాచినదీ భామామణి!
ప్రియునితలపు వచ్చినంత మైకమేదో కమ్మేనే,
మధురోహల గిలిగింతల కులికెనులే లలనామణి!
సత్యమైన ప్రేమమహిమ తెలుపుటకే సాధ్యమౌన!
ప్రియునికొరకు వేయికనుల యెదురుచూచె కాంతామణి!
***
హేమ , శ్యామ, లలన = స్త్రీ