చెట్టులోపల ఆలయం, వాట్ బాంగ్ కుంగ్, థాయిలాండ్
Wat Bang Kung Thai name : วัดบางกุ้ง
ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్ననూ ప్రతి పురాతన కట్టడం ఒక చరిత్రను చెబుతుంది. అలాగే, ఎన్నో వందల సంవత్సరాలు బతికి, ఎకరాలకొలది విస్తరించే వృక్షాలు కూడా వందల ఏళ్ల నాటి సామాజిక స్థితిగతులను, పరిసరాల సారూప్యతను మనకు అందిస్తాయి. అయితే ఒక మఱ్ఱి చెట్టు వందల ఏళ్ల నాటి సంస్కృతిని, భక్తి భావాలను తనలోనే ఇముడ్చుకొని మనకు నేడు చూపిస్తుంటే, అది ఆశ్చర్యమే కదా! థాయిలాండ్ దేశంలో అటువంటి వృక్షంతో పూర్తిగా కప్పబడిన ఆలయం యొక్క విశేషాలే నేటి మన ఆలయసిరి.
థాయిలాండ్ దేశ మధ్యభాగం లో గల ఈ మఱ్ఱి చెట్టు, అందులోని గౌతమ బుద్ధుని ఆలయం, నేడు ‘చెట్టులో ఆలయం’ అని మనకు వింతగొలుపుతున్ననూ, 18 శతాబ్దంలో జరిగిన ఒక చారిత్రక త్యాగాలకు, వీరోచిత పోరాటాలకు చిహ్నంగా మిగిలి ఉంది.
నిజానికి, 18వ శతాబ్దంలో ఈ నేల స్థానిక ముఒయ్ (Muoy) యుద్ధవీరులకు, నాటి బర్మా దేశం నుండి దండెత్తి వచ్చిన ఆక్రమణదారులకు యుద్ధభూమి గా నిలిచింది. కనుకనే ఈ ఆలయం అమరవీరుల స్మారక చిహ్నంగా మరియు కోరిన వరాలు ఇస్తూ ఈ బుద్ధుడు సంతాన ప్రాప్తి కల్గిస్తాడని గొప్ప నమ్మకం ఇక్కడ ఉన్న ప్రజలలో బలంగా ఉంది.
బయటినుండి చూస్తే చెట్టు మాత్రమే కనపడుతుంది. కానీ ముందుగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు. ఆ తరువాత ఇక్కడ నాటిన ఈ మఱ్ఱిచెట్టు ఊడలు కాండము ఆలయాన్ని కప్పేశాయి. ఇది ఒక సంవత్సరమో, రెండు సంవత్సరాలలో జరిగిన ప్రక్రియ కాదు. వందల సంవత్సరాల చెట్టు ఎదుగుదల ఇక్కడ కనపడుతుంది. విశేషమేమిటంటే, సాధారణంగా ఇటువంటి చెట్టు ఎదుగుతున్నప్పుడు ఏదైనా కట్టడం అడ్డువస్తే అది ఆ కట్టడం లోనికి చొచ్చుకొని పోయి నెర్రెలు బారి కొన్ని సంవత్సరాలని కూలిపోతుంది. కానీ, ఈ చెట్టు కట్టడం చుట్టూ పాకుకుంటూ పోయి ఆ ఆలయాన్ని పరిరక్షిస్తూ ఎటుంటి వాతావరణ వత్తిడులకు, మార్పులకు లోనుకాకుండా కాపాడుతూ వస్తున్నది. ఒక విధంగా ఆ బుద్ధ దేవునికి అంగ రక్షకుడిగా ఈ మఱ్ఱి చెట్టు నిలిచివుంది.
ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు, యోగముద్రలో ఉన్న బుద్ధుణ్ణి బంగారు రేకులవంటి ఆకులతో పూజించి, వాటిని అక్కడే అతికించి తమ కోర్కెలను కోరుకుంటారు. అవి తప్పక నెరవేరుతాయని వారి ప్రగాఢ నమ్మకం. ఇది ఒక విధంగా మనం సాధారణంగా కట్టే ముడుపు వంటిదే. అలాగే ఈ దేవాలయంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఇక్కడ అన్నీ దేవాలయాలలో మాదిరి దేవుని చుట్టూ సవ్యదిశలో ప్రదక్షిణ చేయడం, చెప్పులు బయటనే వదిలి వెళ్ళడం, లోపల కూర్చుని ధ్యానం చేసుకోవడం వంటి అంశాలు మనకు గోచరిస్తాయి.
ఈ ఆలయ ప్రాంగణం లోనే మనకు నాటి యుద్ధ విద్యలో మెళుకువలు నేర్చుకొని అమరవీరులైన పోరాట యోధుల త్యాగాలకు చిహ్నంగా ఎంతో మంది యోధుల ప్రతిమలు గోచరిస్తాయి. నాటి యుద్ధవిద్యలను, వేషధారణను ప్రతిబింబించేలా మనిషి పరిమాణంలోనే ఈ ప్రతిమలు మనకు దర్శనమిస్తాయి. ఈ ప్రాంతాన్ని ఇక్కడి ప్రజలు ‘సాముట్ సాఖాన్’ అని కూడా అంటారట. దానర్థం సముద్ర యుద్ధం అని. ఈ ఆలయ పరిసరాల్లోనే ఒక చిన్న జూ పార్క్ ను కూడా మనం చూడవచ్చు.