వృద్ధాప్యం
అంబర వాసుడనంతమూర్తి
ఆదిత్యునికే తప్పని తొలి మలి సంధ్యల స్వానుభవం.
తప్పుతుందా మనిషికి ఆ అనుభవం.
ఉషస్సు ఉయ్యాలై ఊహకందని
హాయినిస్తే కొంచెంపైకి ఎగబాకిన
సూర్యునిలోని చురుకుదనంలా మనిషిని
మరో లోకంలోకి మళ్ళిస్తుంది మాయదారి కాలం.
కాలం పరచిన దారిలో ముళ్ళను
దాటుకుంటూ ఆహ్లాద ఫలాల నందుకొంటూ
సుఖ దుఃఖాల లెక్కలు వేసుకొంటూ
మనిషీ తిన్నగా చేరుకొనే వృద్ధాప్యమే
మలిసంద్య..
మరొకరి ఆధార దారం
మలి సంధ్యలో ముఖ్య సాధనం.
అన్యుల అనురాగ దీపం
కొండెక్కినట్ల ఒంటరి తనం.
కోర్కెలు కుప్పలు. అవి తీరక తిప్పలు.
ఏదో చేజారినట్టు ఎప్పుడూ ఆవేదన.
వగైరాలు ఉండక పోవు
అందుకే సూర్యుని చూచి నేర్చుకొందాం
పొద్దంతా కష్టపడ్డ ఆదిత్యుడు
తన మలి సంద్యలో పుష్పోపశమునకై
అంబుధిలోమునుగు నని కాళిదాసు మాట.
మరి,
మనమూ మలిసంధ్య నందు
వేదనా నివారణకు మునుగుదమా?
అయోధ్య సీతా రామ నామాంబుధిలో!
*పుష్పము.- వేడి