“రవి గాంచనిచో కవి గాంచునే కదా” అని తెనాలి రామకృష్ణ కవి సెలవిచ్చారు. కవి తన భావ సృజనాత్మక దృష్టితో ఎక్కడికైనను వెళ్ళగలడు, ఏ అంశాన్ని అయినను స్పృశించగల సమర్ధుడు. “కత్తి కంటే కలం గొప్పది” అని కూడా అంటారు. కత్తి వలన సమాజంలో భయాందోళనలు పెరిగి మానసిక ధైర్యం సన్నగిల్లుతుంది. అదే కలం వలన సమాజంలో ఎంతో చైతన్యం కలిగి విప్లవాత్మక మార్పులకు నాంది ప్రస్థానం జరుగుతుంది. అయితే సామాజిక స్పృహతో సృజనాత్మకతను జోడించి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ రచనలు చేయగలిగిన సత్తా, తెగువ, సామర్ధ్యం కొంతమంది రచయితలకు మాత్రమే సిద్ధిస్తుంది. ఎంతో విలువైన, సమగ్రమైన, సునిశిత అంశాలను తమ రచనలలో పొందుపరచి వాటిని సమాజంలోని మార్పులకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగించేవారు. అటువంటి గొప్ప గుణాలు, లేక ధర్మాలు కలిగిన అతి కొద్ది మంది రచయితలలో, సమాజ జీవన పరిస్థితులను నిర్మొహమాటంగా వివరిస్తూ, వాస్తవ చిత్రాలను తన అక్షర అస్త్రాలుగా రచనలు చేసిన మహోన్నత వ్యక్తి, మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, నేటి మన ఆదర్శమూర్తి.
విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఎంత వ్రాసిననూ వస్తూనే ఉంటుంది. ఎన్నో విధాలుగా ఆదర్శవంతమై, మంచి విలువలతో కూడిన ఆయన రచనల గురించి విశ్లేషిస్తూ వ్రాసుకుంటూ పోతే, సమయం, స్థలం కూడా సరిపోదు. ఆయన 125 జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ఆదర్శమూర్తిగా ఆయనను మరొక్కసారి స్మరించుకొంటూ ఈ సంచికలో ఆయన పాండిత్య పటిమ గురించి నాలుగు వాక్యాలు వ్రాయాలనిపించింది.
1895 సంవత్సరంలో సెప్టెంబర్ 10 వ తేదీన, నేటి కృష్ణా జిల్లాలోని గుడివాడ కు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందమూరు గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో మన విశ్వనాథ సత్యనారాయణ గారు జన్మించారు. విశ్వనాథ గారికి వారి తండ్రిగారైన శోభనాద్రి గారే ఆదర్శం. ఆయనలోని దాతృత్వము, భక్తి వంటి సుగుణాలు బాల్యం నుండే మన సత్యనారాయణ గారికి కూడా వచ్చాయి. ఆ విషయాన్ని విశ్వనాథ గారు తన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’ లో స్వయంగా తన తండ్రిగారి గురించి ప్రస్తావిస్తూ సెలవిచ్చారు. పుట్టుకైతే శ్రీమంతుల వంశం కానీ కాలక్రమేణ ఆస్తులన్నీ దాన ధర్మాలకు వెచ్చించి విశ్వనాథుల వారికి యుక్తవయస్సు వచ్చేసరికి తన కష్టార్జితంతోనే భుక్తి గడుపుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయనకు బాల్యంలోనే అబ్బిన కవితా జ్ఞానం ఆయనను కవి సామ్రాట్ ను చేసింది. ఆయన మొట్టమొదటి రచనా ప్రక్రియ 1916 లో ‘విశ్వేశ్వర శతకము’ తో మొదలై నాలుగేళ్ళలో తెలుగు భాషావేత్తల జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్నారు.
విశ్వనాథ సత్యనారాయణ గారు ఎప్పుడూ పాఠకుల స్థాయికి అనుగుణంగా రచనలు చేసి వారి మెప్పు పొందాలని తపన పడలేదు. పైపెచ్చు అసలైన సాహితీ విలువలను జొప్పించి, ప్రజలకు నిజమైన సాహితీ చైతన్యాన్ని రుచిచూపించాలని, కొంత వరకైనా భాషాసాహిత్యాన్ని ఉన్నత స్థితికి లాగాలని తపన పడ్డారు. కనుకనే ఆయన రచనలలో ఒక విశిష్టమైన శైలి కనిపిస్తుంది. ఎన్నో నవలలు, పద్యకావ్యాలు, నాటికలు, విమర్శనాత్మక గ్రంథాలు ఇలా చెప్పుకుంటూ వెళితే ఆ సంఖ్యల గురించి చర్చించడానికి సమయం సరిపోదు. సాహితీ సముద్రంలో విశ్వనాధునికి ముందు, విశ్వనాధుని తరువాత అనే విధంగా తన పాండిత్య పటిమతో సమాజంలో పెను సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టారు. ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’ విశ్వనాథ గారు తెలుగులో రచించిన మొట్ట మొదటి పద్యకావ్యం. ఎన్నో ఖండ కావ్యాలు, చిన్న కథలు, కిన్నెరసాని పాటలు ఇలా ఒకటేమిటి ఆయన చేయని ప్రయోగాలు లేవు. వ్రాయని సామాజిక అంశాలు లేవు. కనుకనే జ్ఞానపీఠ పురస్కారం అందుకొన్న మొట్టమొదటి తెలుగువాడిగా చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాదు పద్మభూషణ్ పురస్కారం మరియు గౌరవ డాక్టరేట్లు ఇలా ఒకటేమిటి లెక్కకు మించిన గౌరవాలు ఆయన శ్రేష్ఠ కావ్య ప్రతిభకు సరైన తార్కాణాలు.
విశ్వనాథ వారికి అత్యంత పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టినది “వేయి పడగలు”. అనుకోని కారణాల వల్ల ఆయన తాత్కాలికంగా చేస్తున్న ఉద్యోగం వదులుకొని, మరొక ఉద్యోగంలోకి మారే దశలో ఆ నవల వ్రాయబడింది. అది కూడా కేవలం నెల రోజుల్లో విశ్వనాథ గారు ఆశువుగా చెబుతుండగా అతని తమ్ముడు వేంకటేశ్వర్లు వ్రాశారు. ఒకవిధంగా ఆయన కష్టాలలో ఉన్న సమయంలోనే ఈ గ్రంథం వ్రాయబడింది. అయినను, నాటి సమకాలీన రచయితలందరి అంచనాలను మించి పాఠకులకు దగ్గరై ఎంతో గొప్ప పేరుప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. 36 అధ్యాయాలుగా వ్రాయబడి ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యతను సంతరించుకొన్న ఈ సాంఘీక నవల, నాటి సామాజిక స్థితిగతులను ప్రతిబింబిస్తూ సాగుతుంది. కనుకనే విమర్శకులు కొందరు ఈ నవలలో చెప్పబడిన ధార్మిక సాహిత్య వాద ప్రతివాదాలు విశ్వనాధ వారి నిజజీవిత సంఘటనలతో పోల్చి చూసుకొంటారు. నాటి తెలుగు సాహిత్యంలో ఉన్న ఉపమానాలు, అలంకారాలు, సాహితీ విలువలు ఒకటేమిటి అన్ని రకాలైన అంశాలు ఈ ఒక్క గ్రంథంలోనే చూడవచ్చు. మచ్చుకి “ఒక సంప్రదాయము చచ్చిపోవుచు, చావులో కూడ దాని లక్షణమైన మహౌదార్యశ్రీనే ప్రకటించును. మరియొక సంప్రదాయము తాను నూత్నాభ్యుదయము పొందుచు, అభ్యుదయములో కూడా దాని లక్షణమైన వెలతెలపోవుటయే ప్రకటించును. వేసగినాటి అస్తమయము కూడ తేజోవంతమే. దుర్దినములలోని యుదయము కూడ మేఘాచ్చాదితమే.” ఇలాంటి అపురూప భావప్రకటితాలు ఆయన రచనలన్నింటిలోనూ కనబడుతుంది. అందుకనే ఆయన ఎన్ని తరాలు మారినా కవి సామ్రాట్ గానే మన అందరి హృదయాలలో నిలిచారు.
ఆనాటి విశ్వనాథ సాహితీ పుంగవుడి గురించి ఈనాటి మరో సాహితీ దిగ్గజం, కౌముది పత్రిక సంపాదకుడు శ్రీ కిరణ్ ప్రభ గారు రేడియో టాక్ ద్వారా ప్రస్తుతించి అటువంటి మణిపూసను తన చరిత్రలో కలిగిన మన ఆంధ్రదేశం ఎంత గొప్పదో తెలియజెప్పి మరోసారి ఆ మహానుభావుణ్ణి మనందరికీ గుర్తు చేశారు. ఈ క్రింది లింక్ లో విశ్వనాథ వారి వేయిపడగలు మొదలు ఆయన రచనల మీద ఎన్నో విశ్లేషనాత్మక వివరణలు మీరు కనవచ్చు, వినవచ్చు మరియు అనుభూతిని కూడా పొందవచ్చు. https://www.youtube.com/watch?v=ZpJ4S59B1CA
తెలుగు సాహిత్య చరిత్రలో తన స్థానాన్ని పదిలపరచుకొని, పదితరాల వరకు కావలిసిన తెలుగు వాఙ్మయాన్ని, అభ్యదయ కవులకు, సంప్రదాయ కవి శ్రేష్ఠులకు ఎంతో స్ఫూర్తిని అందించిన ఈ మహనీయుడు అక్టోబరు 18, 1976 ఆయన భగవంతునిలో ఐక్యమయ్యారు.