వినాయకవైభవము
సీ. లవణాబ్ధి పైన సేతువు నిల్ప ననువైన
తావు సూచించితే దాశరథికి?
వల్లీమనంబు సుబ్రహ్మణ్యు వరియింపఁ
జేసిన దీవెగా జ్యేష్ఠుఁడ వయి
భండాసురాహవపటిమను నిజయంత్ర
భేదనంబున మట్టుబెట్టి తీవె
సర్వోపకారంబె సర్వదా ధర్మమై
వెలుగొందు మూర్తివి విఘ్నరాజ!
తే.గీ. ఇంద్రియాశ్వాల పగ్గమె యీ మనంబు;
బుద్ధిసారథి చేపట్టి పధ్ధతిమెయి
జీవనరథంబు ధర్మంపు త్రోవ సాగఁ
జేయు మాదైవమా! నతుల్ చేకొనుమయ
సుగంధి
గణేశ! నీదురాక తోడఁ గర్మసాక్షి గన్పడన్
సృణి(1)ప్రభల్ గతించు రీతి నెల్ల దుఃఖముల్ చనున్
మనోఽంబరంబు తేజరిల్లు; మంచి కాలమే క్షరిన్(2)
ధ్వనించు మేఘ మట్లు వచ్చు భవ్యవృష్టి గల్గఁగన్
(1) చంద్రుడు (2) వర్షఋతువులో
కం. అడ్డంకులఁ దొలఁగించుచు
తెడ్డుగ జీవితపునౌక తీరముఁ జేరన్
గడ్డు సమస్యలఁ దునుముచు
బిడ్డల మముఁ గావరావె వేదండముఖా!
మ.కో. కోరి నిన్నె భజించువారము కోటిభానునిభప్రభా!
శ్రీరమాయుత! షోడశాకృతి! క్షిప్రసత్ఫలదాత! ష
డ్వైరివారణ! దీనతారణ! భద్రకారణ! స్వామి నీ
వారమయ్య కృపాపయోనిధి! భక్తమానసవాసనా!(1)
(1) వాసనమ్ = ఇల్లు