Menu Close
Samudraala Harikrishna
వినవయ్యా దేవుడా!! (కథ)
-- సముద్రాల హరికృష్ణ --

చిన్న ఊరు, ఇంకా చిన్న గుడి!

ఎప్పుడూ ఆ గడప తొక్కని రంగయ్య గుడికెళ్ళాడు ఆ రోజు. కాస్త జనం పల్చగా ఉండే వేళ చూసి మరీ! ఏకాంతంలో దేవుడికి కొన్ని సంగతులూ, కొన్ని జాగ్రత్తలూ, చెవినేసి వద్దామని!

పూజారి కూడా ఇతను రాగానే,"ఇప్పుడే వస్తాను ఉంటావుగా"? అని అడిగి, వెనకాలే ఉన్న పూల చెట్ల దగ్గరికి వెళ్ళాడు. చిన్న ఊళ్ళలో అందరూ అందరికీ పరిచయస్థులేగా!

***
"ఏం సామీ నిమ్మకు నీరెత్తినట్టు కూచుంటావు, చీమ కుట్టినట్టైనా లేదా నీకు?!

నీ గురించి నానా యాగీ చేస్తున్నారే, ఏం చెప్పవూఁ నువ్వూ?!

ఒకడొచ్చి నీ ప్రసాదం కల్తీ అంటాడు, ఇంకోడొచ్చి అదేం లేదు, అది నా మనసంత స్వఛ్ఛమంటాడు. మూడో వాడు నీళ్ళతో కడిగించి శుభ్రపరుస్తానంటాడు!

తలపులోకి రావడానికి మనసుకూ, అనటానికి మాటకూ- ఇంతైనా హద్దూపద్దూ, శుధ్ధీగిధ్ధీ ఉండద్దా సామీ?! ఈ సోది వినీ వినీ చిరాకెత్తి నీతోనే సరాసరి చెపుదామని వచ్చాను!

మనుషులు బరితెగించి మాటలు పేలుతుంటే, ఎందుకయ్యా ఊరుకుంటావూ, నాలుగు అంటించి, బుధ్ధి చెప్పక?! మాటలేలే సామీ, నేనంటున్నది! ఏదో అనుకునేవు, కొంప తీసి!

ఎనిమిది చేతులో, అయిదు ఆయుధాలో- ఏవో చెప్తారుగా?! నాకు పెద్దగా తెలియవులే ఈ యిషయాలు, ఏదో నా పొలం పని తోటే సరిపోతుంది నాకు. ఇంకా ఇవన్నీ ఎక్కడ పడ్తయ్ ?!

మనసులోని అసలు యివరం, మెల్లిగా చెపుతా యినుకో!

నిన్నేవఁన్నా కూడా, నీ గురించి ఏం చెప్పినా నువ్వేమీ అనలేవని, అనవనీ సామీ, వీరందరి ధీమా! అదేంటయ్యా ప్రతివోడూ పెవచన కర్త యేష మేసుకుని బయలుదేరితే, వినే వోడు ఉండద్దా?!

ఒకడు ఆ చెట్టు చుట్టూ తిరుగు పున్నెమంటాడు. ఇంకోడు ఇది జపం చేస్తూ కూకో, అదే కూడు పెడ్తాది అంటాడు! అసలు నిజమేనా సామీ, ఈ మాటలు!

అబధ్ధాలాడుతూ, ఒకణ్ణొకడు మోసం చేస్తూ, నీ పూజలు చేస్తే నువ్వూరుకుంటావా సామీ?!
ఆ పూజలా నీకు కావాలి?! నువ్వా మూగనోము పట్టి కూకుంటావు, ఇంక మాకు నీ మనసు తెలిసేదెట్టా?!

చెట్లను నదులనూ ఎందుకు సామీ నువ్వు సృష్టించావ్. మేం తేరగా వాడుకుని పాడుచేయటానికా?! ఒక్కడికి ఆలోచన లేదే, అవి ఏ లాభం చూసుకోకుండా కాయలు, పళ్ళు, నీళ్ళు ధారాళంగా మనకిస్తున్నాయి. మనం కూడా ఆ ఇచ్చే బుధ్ధి ఓ కూసింతైనా అలవర్చుకుందామని?! అయిన కాడికి దోచుకోవడమే దాచుకోవడమే, ఛీఛీ! చెట్ల పాటి చేయని మనిషి ఎందుకు సామీ ఉండినా ఒకటే, ఊడినా ఒకటే!

హయ్యో రామ వీడొక వెర్రిబాగులోడు అని నవ్వుతున్నావు కదు సామీ, అవతల నరికేసి, కూల్చేస్తుంటే- వీడేదో పాఠం, నేర్చుకోవటం అంటూ ఛాదస్తం అని!

అవును సామీ రైతును! నాకు గాక చెట్ల యిలువా, నీళ్ళ యిలువ ఎవరికీ తెలిసేది?!
***
అది సరే సామీ, ఆ రోజంటే ఆ కృష్ణయ్యగా వచ్చినపుడు అధర్మం చేశారు గనుక అయినోళ్ళైనా పర్లేదు, వెయ్యి అర్జునా బాణం వెయ్యి, తప్పులేదు అన్నావ్!

సరే ఆ యుద్ధం ధర్మం కోసం సాగించావు. రధం కూడా నువ్వే కష్టపడి తోలుతా! ఇప్పుడు జరిగేవన్నీ అన్యాయపు యుధ్ధాలే కద సామీ. ఆపవేమయ్యా పెబో! వారి అంతు చూడవేఁ?!

చూడలేకపోతున్నాను సామీ, పసిపిల్లలు, ఆడకూతుళ్ళు, నడుములు వంగిన పెద్దోళ్ళు అందరూ కళ్ళలో పేనాలు పెట్టుకుని బతుకుతున్నారయ్యా! కాస్త జాలి చూపించి ఆ యుధ్ధాలు ఆపించు సామీ, నీకు పున్నెం ఉంటది!

అయినా నీకేమీ అంటదు ముట్టదు తాకదంటగా! ఏంటో అంతా అయోమయంగా ఉంటది. ఆలోచన పోయిన కొద్దీ, నీ యిషయం, మా బోటి మట్టి బుర్రలకు!

ఇది గాక,ఇంకొక్క విషయం అడిగే తీరాలి సామీ నిన్ను! ఇంకెప్పుడో తవఁరు తెల్ల‌గుర్రం మీద పట్టాకత్తి పట్టుకుని వచ్చి కల్కి అవతారంగా అందరినీ దునుమాడేదీ?!

ఇంకా పాపం పండలేదా నీ లెక్కలో?! నాకు ఆ మొన్న మా ఆవిడ పురాణంలో విని వచ్చి అన్నం తింటూంటే ఈ కథ చెప్పింది!
అట్లా తెలిసింది ఈ కల్కి విషయం కూడా, నాకు! ఆహాఁ ఒక ఉపాయం ఉందన్నమాట నీ కాడ కూడా అనుకున్నాను ఆ రోజు!

అదేదో తొందరగా చేసేయ్ సామీ అంతా ఒక్కసారే చేయాలంటే నీకు కూడా కష్టమైపోదూ, దఫదఫాలుగా పెట్టుకో రాదూ ఆ పనీ?! నీకు బోల్డు మహిమలున్నాయిగా. రహస్యంగా వచ్చి చేసి వెళ్ళిపో! ఆ భయంతో నైనా కొన్ని రోజులు నీతిగా ఉంటారేమో ఈ మనుషులు?!

నే చేసేదే సామీ నీతో చెప్తున్నా!

మా పొలంలో కలుపులు ఏరి పారేయటం ఎప్పటి కప్పుడే, ఊహూఁ, పేరబెట్టేదేలేదు! అదే, ఈ మనుషుల్లో కలుపులు ఏరిపారేయమని చెప్తున్నా!

ఏదో తెలియక చెప్తున్నాలే, తప్పైతే మన్నించయ్యా! మా ఊళ్ళల్లో వ్యాజ్యాలూ అంతే సామీ, తెమల్నే తెమలవు. అదే వరస నీ దగ్గరా ఐతే బాగుండదు కదూ, అందుకే బేగి న్యాయం చేసేయ్ అంటున్నా!
నువ్వూ, లోకానికే పెద్ద జడ్జీవంటగా అందుకూ! అంతటి వోడికీ, మామూలు జడ్జీలకీ తేడా ఉండొద్దూ మరి?!

***

తన ఆలోచనల్లో జరుగుతున్న దేవుడి సంభాషణ లోంచి ఒక్కసారి ఉలిక్కిపడి బయటకు వచ్చాడు రంగయ్య, ఎవరో భక్తుడు గంట కొట్టడంతో!

ఇంతలో పూజారి కూడా వచ్చాడు, ఉన్న ఇద్దరికీ తీర్థం ఇచ్చి శఠగోపం పెట్టాడు. ప్రసాదం ఇవ్వటానికి ఏ ఆదాయం, హుండీసొమ్ము లేని పేద గుడి అది.

అయినా ఉన్న చోట ప్రసాదాన్నే కల్తీ అని గగ్గోలు పెడుతూ ఉంటే, ఇక లేదని దిగులెందుకు?!

***

రంగయ్యకు పెద్దగా ఇష్టం లేక పోయినా పూజారి నొచ్చుకోకూడదని అతన్ని ఆపలేదు. మామూలుగా తీసుకున్నాడు, తీర్ధం. అట్లాగే శఠగోపం పెట్టించుకున్నాడు కూడా!

తన పని తాను చేసుకుంటూ, ప్రకృతికి ఏ అపకారం చేయకుండా జీవిస్తూ, అవతలి వాడి మనసుకి నొప్పి తగలకూడదు అనే ధ్యాస ఉన్న ఈ రంగయ్య కంటే గొప్ప భక్తుడు లేడని ఆ గుళ్ళో దేవుడికి తెలియదూ?! తెలిసే ఉంటుంది! అన్నీ తెలిసేగా ఆయన అన్ని విషయాల్లో మౌనం వహించేది! తెలియని వాడికి చెప్పినా తెలియదు! తెలిసిన వాడు నోరే విప్పడు! శ్రీరంగ రంగా, ఇంక ఎట్లా!?

****సమాప్తం****

Posted in June 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *