Menu Close
విలువైనది జీవితం! (కథ)
-- ఏ. అన్నపూర్ణ --

''మా అమ్మా నాన్నలు పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నారు మంజరి !...వద్దు అని ఎంత చెప్పిన వినడంలేదు.

మనమధ్య వుండే అనుబంధం గురించి వాళ్లకి చెప్పేను. నాతో చాలా గొడవ పడ్డారు. నిన్ను విడిచిపెట్టకపోతే చచ్చి పోతాం అన్నారు. నన్ను ఏమి చేయమంటావ్? అన్నాడు మదన్.

''చేసుకో. వాళ్ళమాట విను. తల్లి తండ్రులుగా వాళ్ళు నీకు పెళ్లి చేయాలని అనుకోడం సహజమే. వాళ్ళ కోరిక తీర్చు'' అంది మంజరి...చాలా నెమ్మదిగా!

ఏడ్చి గోలచేసి తిట్టిపోస్తుందేమో ....ఇక నా మొహం చూడకు అంటుందేమో ....అనుకున్న మదన్ కి మంజరి చాలా ప్రశాంతంగా ఇలా చెప్పడం ఆశ్చర్యంగా వుంది.

''అదేమిటి? నీకు బాధగా లేదా! నన్ను నీకు మాత్రమే స్వంతంగా అనుకోవా....! అన్నాడు మదన్.

''నాకు ఆ హక్కులేదు. గుడిలో పెళ్లి. నోరులేని రాతిదేవుడు సాక్షి ....అని నమ్మే పిచ్చిదాన్నికాదు. అగ్నిసాక్షిగా సాంప్రదాయ పద్ధతిగా చేసుకోలేని పెళ్లి పెళ్లికాదు. కనీసం మన పెళ్లి రిజిస్టర్ కాలేదు కనుక నీ తల్లితండ్రులమాట నువ్వు వినాలి. వెళ్ళు'' అంది మంజరి.

''నేను పెళ్లి చేసుకుంటే తిరిగి రాను అనే భయం నీకు లేదా?

''చెప్పేనుగా! ఏ హక్కు లేనప్పుడు నమ్మకము ఉండదు. అన్నిటికి సిద్ధంగా వున్నాను.''

''మంజరి నువ్విలా అంటావనుకోలేదు. నేను ఏమైనా ఫర్వాలేదా....ఇన్నాళ్ల మనప్రేమ నిజంకాదా? నీ కోసం అన్నివదలుకుని అమ్మానాన్నలను మోసం చేసాను. ఇప్పుడు నాకు వాళ్ళు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తున్నారూ అంటే నీకు బాధలేదు. నేనే బాధపడుతున్నా. నిన్ను వదిలి వెళ్లాలని.''

మంజరి సమాధానం చెప్పకుండా తన రూములోకివెళ్ళి తలుపులు మూసుకుంది. మదన్ ఇంటికి బయలుదేరాడు.

''ఏమండీ ఈ రోజు గుడిలో పూజారిగారి అమ్మాయి తులసిని చూసాను. ఎంత అణకువగా సహనంగా ఉందో. బిఈడీ చేసిందిట. రేపోమాపో వుద్యోగం వస్తుందిట. మదన్కి చేసుకుందాము.'' అంటూ భర్త శంకరం గారికి చెప్పింది శివాని.

''నీకేమైనా మతివుందా? బంగారంలాంటి ఆ పిల్ల జీవితం పాడుచేస్తావా? మన సుపుత్రుడి నిర్వాకం తెలిసే మాటాడుతున్నావా! వద్దు.'' అన్నాడు శంకరంగారు.

''తెలుసును. కానీ తులసిని చూస్తే అబ్బాయి మారుతాడు అనిపిస్తుంది. ఇల్లు పిల్లలతో సందడిగా ఉంటే చూడాలని ఆశ పడుతున్నాను. మీ కుటుంబంలో అందరికీ మదన్ ఒక్కడే మగపిల్లాడు. వీడికి పెళ్లి సంతానం లేకపోతె ఇక మీ ఇంటి పేరుతో వారసులు వుండరు. చివరి ప్రయత్నం ఇది. కాదనకండి. ఇక ఏమి అడగను?.'' అంది శివాని బతిమాలుతూ.

''నిజమే కానీ మదన్ ఇంటిపట్టున ఉండడు. మంజరి దగ్గిరకు వెడుతూనే వుంటాడు. ఇలాంటి మనిషిని ఏ అమ్మాయి ఇష్టపడుతుంది? తులసి మోడులా ఉంటే నువ్వు భరించగలవా? తెలిసి తప్పుచేయకు.''

''తప్పుకాదు. ఒక ప్రయత్నం. బంధం అంటూ ఉంటే బాధ్యత తెలిసివస్తుంది. ఒక్కడే ఐన కారణంగా ఇలా వున్నాడు. వాడు బాగుపడతాడు...అని నా ఆశ!”

''నీ ప్రయత్నం సరి కాదు. వీడు చదువుకునే రోజుల్లోనే అమ్మాయిలతో స్నేహాలు చేసాడు. ఇప్పటికీ ఇలాగె వున్నాడు. అదృష్టం ఒక్కటే. లెక్చరర్ వుద్యోగం కనుక తిండికి లోటురాదు. ఇంటికి రాడు. మనం ఎలావున్నామో అక్కరలేదు. పెళ్లి చేస్తే మారుతాడు అనుకోడం నీ పిచ్చి అంతే!

''కాదనకండి మన ఇంట్లో ఒక్క పసిబిడ్డ తిరగాలి. పూజారిగారితో మాటాడదాం'' అంటూ కన్నీళ్లతో బతిమాలింది.

''అదే కనుక జరిగితే కావలసింది ఏముంది? ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరగకపోతే తులసిని దత్తత తీసుకుందాం. మన బిడ్డగా చేసుకుందాము. అందుకు ఒప్పుకుంటావా?”

''అలాగే మీకు నచ్చినట్టు చేద్దాం.! ఇప్పుడే గుడికి వెడదాం.'' పూజారి, శంకరం దంపతులు చెప్పిన మాటకు ఆనందభరితుడు అయ్యాడు.

ఆయనకు నలుగురు కూతుళ్లు. పెద్ద కూతురికి మేనరికం చేసాడు. రెండోది తులసి. మూడు చదువులో, నాలుగు స్పోర్ట్స్ లో రాణిస్తున్నారు. వాళ్ళ గురించి బెంగలేదు. ఇలా అనుకోకుండా వచ్చిన అదృష్టానికి మురిసిపోయాడు.

శంకరంగారు ఆ వూరిలో మంచిమనిషి. మదన్ గురించి తెలియకపోలేదు. పెళ్లి ఐతే ఇంటిపట్టున ఉంటాడులే ఏదో ఒక కూతురు భారం అయినా తగ్గుతుంది అనుకున్నాడు.

''ఆది దంపతులు నా కష్టాలను గట్టెక్కించడానికి వచ్చారు. ఇంతకంటే ఏమికావాలి...అని భార్యను నలుగురు కూతుళ్లను పిలిచి చెప్పేడు.

''అమ్మా తులసీ శివాని అమ్మ రోజూ గుడికి వస్తారు. నిన్నుచూసి కోడలుగా స్వీకరించాలని అడుగుతున్నారు.'' అంటూ చెప్పేడు.

''అమ్మాయి తల్లి గారిని కూడా అడిగి చెప్పండి తొందరలేదు.'' అన్నాడు శంకరంగారు ఇంటికి దారితీస్తూ.

''ఇంతకూ నీ సుపుత్రుడిని అడగాలికదా.... నీ ప్రయత్నం ఒక్కటే చాలదు. పెళ్లి టైముకి ఇంటిదగ్గిర ఉంటాడో లేదో...!

''తులసిని చూస్తే వాడే ఒప్పుకుంటాడు. నాకుతెలుసు. ఈ రోజు అడుగుతాను'' అంది శివాని సంతోషంగా.

వారం రోజులదాకా ఇంటికి రాలేదు మదన్. అతను ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో లెక్చరర్గా అక్కడ కాలేజీ లో పనిచేస్తున్నాడు. అదే కాలేజీలో మరో లెక్చరర్ ఆరేళ్ళు పెద్ద ఐనా మంజరితో పరిచయం పెరిగి ఓకే ఇంట్లో కాపురం చేసేదాకా వచ్చింది. మంజరి భర్త ఆర్మీలో ఆఫీసర్గా పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. అదే సమయంలో మదన్ తో స్నేహం ఏర్పడి ఇద్దరూ దగ్గిర అయ్యారు. పెళ్లి చేసుకుందాము అంది మంజరి. కానీ అమ్మా నాన్నలు ఒప్పుకోరని మదన్ కి తెలుసు. ఆ విషయం మంజరీతో చెప్పి సహజీవనానికి ఒప్పించాడు. పదేళ్లుగా సాగుతోంది ఈ సంబంధం.

శంకరం గారు విషయం తెలిసి మందలించారు. శివాని ఏడ్చి గోలపెట్టి మంజరి దగ్గిరకు వెళ్లి చీవాట్లు పెట్టింది. నా కొడుకు జీవితం నాశనం చేసావ్ అంది.

''తప్పు నాది మాత్రమేకాదు. మదన్ది కూడా. అని ఎదురు తిరిగింది. మీ కొడుక్కి బుద్ధి చెప్పుకోండి నా ఇంటికి రాకుండా! అంది. మదన్ బుద్ధి అలాంటిది. ఒంటరిదాన్ని. నన్ను ఇలా చేసింది అతనే అంది. అనవసరంగా వచ్చి గొడవ చేయద్దు. చేతనైతే అదుపులో పెట్టుకోండి. నాకు మీ డబ్బు అక్కరలేదు. ఆస్తిలో వాటా అక్కరలేదు. నేనే అతడి ఖర్చు భరిస్తున్నాను. అడిగి తెలుసుకోండి.” అంటూ దులిపి పడేసింది.

చేసేదిలేక మదన్ ని అదుపులో పెట్టుకోలేక కొడుక్కి వేరే పెళ్లి చేయడమే ఒక పరిష్కారం అనుకుంది శివాని.

మంజరి ఏమి అందగత్తేకాదు. మనిషి మాటకి చూపులకు కూడా మోటుగా ఉంటుంది. ఈ మదన్ కి ఏమి నచ్చిందో! కర్మ అనుకుంది.

తులసి ఒక సాధనంగా కనబడింది. పూజారిగారి పేదరికం సహకరించింది. కొడుకుమీద ప్రేమతో ఈ ప్రయత్నం చేసింది.

చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుక్కి తులసి గురించి చెప్పి,

''ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే మా ఇద్దరి మరణం చూస్తావ్. ఇక నువ్వు ఇంటికి రావద్దు. ఈ ఆస్తి వృద్ధాశ్రమానికి ఇచ్చేసి మరీ చనిపోతాం.” అని బెదిరించింది.

శంకరంగారు కూడా చాలా రోజులుగా మాటాడలేదు కొడుకుతో. భార్యమాట నామాట అన్నట్టుగా!

అటు చూస్తే మంజరి కూడా పెడసరంగాఉంది. మా అమ్మా నాన్నా పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారు. మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుంటాము అంటున్నారు. ఈ పెళ్లి నాకోసం కాదు. వాళ్ళకోసం నన్ను నమ్ము... అని మళ్ళీ మంజరికి ఫోను చేసి చెప్పి,

''ఐనా మన బంధం విడిపోదు. నేను ఎప్పటికి నిన్ను వదులుకోను'' అన్నాడు.

మంజరి ఏమి జవాబు చెప్పలేదు.

పూజారి పెళ్లి ముహూర్తం నిర్ణయించి శంకరం గారితో చెప్పేడు.

''పెళ్లి ఖర్చు అంతా మాదే ....అంటూ పూజారిగారి కుటుంబానికి పట్టు బట్టలు వెండి సామాను తులసికి నగలు అన్ని కానుకగా ఇచ్చారు...శంకరం దంపతులు.

పెళ్లి జరిగిపోయింది. నెలరోజుల ఇంటిదగ్గిరే వున్నాడు మదన్. ఒకరోజు తెల్లవారి లేచి ఇంటినుంచి వెళ్ళిపోయాడు.

తులసి నిద్ర లేచి పనులు చేసుకుంటూ ఉండగా శివాని అడిగింది.

''అమ్మా తులసి, ఇంత తొందరగా నిద్ర లేచేవేమిటి? అంత ముంచుకుపోయే పనులు యేమివున్నయి? త్వరగా లేవకు.''

''మీ అబ్బాయి త్వరగా వెళ్ళాలి అంటే సూట్కేస్ సర్ది కాఫీ ఇచ్చాను. ఎలాగూ లేచాను కదాని ఇంటిపని చేస్తున్నా.'' అంటూ చెప్పింది.

నిజానికి మదన్ లేచి వెళ్లడం తులసికి తెలియదు. బయటకు వెళ్ళేకనే లేచి చూసింది. ఈ విషయం చెప్పి వెళ్లినట్టు అత్తగారితో అబద్ధం ఆడింది.

శివాని కి కొడుకు చేసే పనులు తెలియనివి కావు.

''అవును. నిన్న నాతోకూడా అన్నాడు. ఉదయమే లేచి వెళ్ళాలి అన్నాడు. నాకే మతిలేదు'' అని కవర్ చేసింది.

శంకరంగారికి అర్ధం అయింది. సుపుత్రుడు చేసిన నెలరోజుల నిర్వాకం ముచ్చట. భార్య వైపు కోపంగా చూసాడు. నీ కొడుకు మారుతాడు అనేది భ్రమ! నాకు తెలుసు అన్నట్టు.

శివాని తలవంచుకుంది.

తులసిని రోజూ ఎటో తీసుకెళ్లడం నగలు, చీరలు, గాజులు అంటూ ఏదో కొనిపెట్టడం చేసేది. ప్రేమగా చూసేది. ఏమికావాలో చెప్పు క్షణంలో అమరుస్తాను అనేది. వారాలు నెలలు గడిచిపోతున్నాయి. మదన్ జాడలేదు.
కొడుక్కి ఫోను చేసి చీవాట్లుపెట్టింది. తులసిని తీసుకెళ్ళు. లేదంటే నేనే వచ్చి దిగబెడతాను. అని ఫోను చేసింది. జవాబు చెప్పడు. ఫోను నంబర్ మార్చేశాడు. తులసిని తీసుకుని భువనేశ్వర్ వెళ్ళింది. ఇల్లు తాళం పెట్టివుంది. ఆ ఇంట్లో అద్దెకి వుండేవాళ్ళు చెప్పేరు. వాళ్ళు లండన్ వెళ్ళేరని. తులసి ఎదుట శివాని తల ఎత్తుకోలేక కృంగిపోయింది. భారంగా ఇంటికి తిరిగి వచ్చింది.

''నేను తప్పు చేసాను తల్లి. మీ మామగారు వద్దు అంటూనే వున్నారు. నిన్ను చూసి మారుతాడని భ్రమ పడ్డాను. ఇక వాడు మారడు. నన్ను మన్నించు.'' అంటూ తులసి చేతులు పట్టుకుని క్షమాపణ అడిగింది.

శంకరం గారు భార్యను చీవాట్లు పెట్టి “ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం? తులసి జీవితం నాశనం చేసావ్.'' అన్నాడు.

''అవును. తులసి ఎలా చెబితే అలా చేద్దాం. ఇకనుంచి తులసి మన అమ్మాయి. కోడలు కాదు. ఈ కృష్ణా పురం వదిలి ఎటైనా వెళ్ళిపోదాం.'' అంది శివాని.

''అమ్మా తులసి నీ ముందు తలవంచుకుని మా తప్పు వొప్పుకుంటున్నాము. చెప్పు నువ్వెలా చెబితే అలా జరిపిస్తాను.'' అన్నారు శంకరం గారు.

''నేను నా చదువు కంటిన్యూ చేస్తాను. సివిల్ సర్వీస్ కి కోచింగ్ తీసుకోవాలి. హైదరాబాద్ వెడతాను.'' అంది.

''అలాగే. మనం ముగ్గురూ వెడదాం. వెళ్ళేలోగా నిన్ను దత్తత తీసుకుంటాము. మీ తండ్రిగారే ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పుడే వెళ్లి మాటాడుతాను'' అంటూ వెళ్ళేరు శంకరం గారు.

జరిగినదంతా పూజారి గారితో చెప్పి ఆయనకు క్షమాపణ చెప్పి తులసిని దత్తు తీసుకునే కార్యక్రమం చూడమని చెప్పేరు.

ఆయన భార్య బాధపడకుండా వుండరుగా. విచారించారు. అయితే శంకరం దంపతులు పెద్దమనసుతో చేసిన తప్పును దిద్దుకోవాలని అడుగుతున్నారు.

''శంకరం గారు, దత్తత అంటే పునర్జన్మ. నేను నా కూతురును వదులుకోవాలి. మీరు మీ కొడుకును వదులుకోవాలి. అందుకు మీరు సిద్ధం పడుతున్నారా? అన్నారు పూజారి.

''అవునండి నేను సిద్ధంగా వున్నాను. మదన్ చచ్చినవాడితో సమానం. మాట ఇస్తున్న. మా ఆస్తిలో సగం తులసి పేరున రిజిస్టర్ చేయిస్తాను. ఈ వూరిలో ఇల్లు పొలం మీకు దక్షిణ గా సమర్పించుకుంటాను. ఇప్పుడే లాయరుగారితో మాటాడుతాను'' అని అన్నారు.

పదేళ్లు కాలచక్రంలో గడిచిపోయాయి.

అది కలెక్టర్ తులసి శంకర్ గారి బంగ్లా. అర్ధరాత్రి గేటు దగ్గిర కాపలా దారుని బతిమాలుతున్నాడు లోపలకు వెళ్లనీయమని ఒక వ్యక్తి.

''వీల్లేదు. ఇప్పుడు అంతా నిద్రలో వుంటారు.'' అన్నాడు కాపలాదారు.

''ఒక్కసారి లోపలికి పోనీ. నీకు పుణ్యం ఉంటుంది. వారిని ఇబ్బంది పెట్టను. బయట చలిగా వుంది.'' ఆన్నాడు ఆ మనిషి.

అతడి వాలకం చూస్తే ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన రోగిలా, బాగా జబ్బుపడిన వాడిలా వున్నాడు. మాట నీరసంగా వుంది. చలికి వొణుకుతున్నాడు. బిచ్చగాడిలా వుంది అవతారం.

''నీకు బుద్ధిలేదా ఇది కలక్టరుగారి ఇల్లు. ఎవరిని రానివ్వకూడదు. అమ్మగారి అనుమతి తీసుకోవాలి. పో! నా పని పాడు చేయకు'' అంటూ గేటు బయటకు గెంటివేసాడు.

ఆ వ్యక్తి గేటు బయట చెట్టుకింద ముడుచుకుని కూర్చున్నాడు.

తెల్లవారింది. శంకరం గారు స్వేట్టర్ వేసుకుని తలకు టోపీ పెట్టుకుని చేతికఱ్ఱతో వాకింగ్కి బయలు దేరి గేటు బయటకు వచ్చారు. చెట్టుని అనుకుని కూర్చున్న మనిషిని చూసి, ఎవరది? అని అడిగారు. అతడు మాటాడలేదు.

రెండుమూడు సార్లు పిలిచినా కదలికలేదు.

కాపలా దారుని పిలిచి చూడమన్నారు.

అతను చేతిలోని లాఠీ తో భుజం మీద మెల్లగా కొట్టేడు. ముట్టుకుని చూసాడు. వొళ్ళు చల్లగా బిగుసుకుపోయి వుంది. అతడిలో ప్రాణం లేదు.

శంకరం గారితో చెప్పేడు.

''ఎవరో బిచ్చగాడు. జబ్బు చేసినట్టు వుంది. కార్పొరేషన్కి ఫోనుచేయి.'' అంటూ పార్క్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు.

****సమాప్తం****

Posted in July 2025, కథలు

1 Comment

  1. Sreenivas

    కథ బాగుంది అన్నపూర్ణ గారు. చివరలో ఆ వ్యక్తి ఎవరో పాఠకులకే వదిలేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *