Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 88
- రూపారాణి బుస్సా
Vikshanam

గొల్లపూడి మారుతీరావు గారికి నివాళులర్పిస్తూ రెండు నిముషాల పాటు మౌనం పాటించి 88 వ వీక్షణ సభ ప్రారంభించబడినది.

తరువాతి కార్యక్రమంగా వెంకట రమణ రావు గారు తాము వ్రాసిన కథ చదివారు. ఈ కథ పుట్టిల్లు అన్న శీర్షికతో 2008లో నవ్యలోప్రచురింపబడినది. ICFAI సంస్థ వాళ్ళు పెట్టిన పోటీలో మొదటి బహుమతి పొందింది. కథ నేపథ్యం అనంతపురంలో జరిగినట్టు చెప్పబడినది. కొన్ని సంభాషణలలో ప్రాంతీయ భాషా శైలి కనబడుతుంది.

కథ ఇలా కొనసాగుతుంది:-

పార్వతి తన కూతురి ఇంటికి వెళ్ళినప్పుడు తన ఊరి స్నేహితురాలు అలిమేలును కలిసి సొంత ఊరి వాళ్ళ గురించి తెలుసుకుని ఏదో స్వగతాలలో మునుగుతుంది. స్నేహితురాళ్ళంతా కలిసినపుడు తోట, స్నేహం ఉన్నంత వరకు ఇదే మన పుట్టిల్లు అని అనుకున్నారు. ఊరులో ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మకు కొడుకు, కోడలు వచ్చి ఎంత పిలిచినా తన అవసరం ఉన్న వారి దగ్గర ఉండడమే న్యాయం మరియు ఈ ఇంట్లో చివరి కాలం గడపడమే సమంజసం అంటూ చిరునవ్వు నవ్వుతుంది పార్వతమ్మ. తన ఊరు, ఆ వాతావరణము తనకు పుట్టినిల్లని నెమ్మదిగా నిట్టూర్చింది.

పార్వతమ్మ భావోద్వేగాలను చక్కగా కళ్ళకు అద్దినట్టు వ్రాశారు రచయిత. పల్లెటూర్ల మార్పులు గురించి పత్రికల్లో చదివినపుడు పల్లె గురించి వ్రాయాలన్న స్ఫూర్తి కలిగించుకుని, అక్కడ ఇక్కడ జరిగిన సన్నివేశాలను అల్లి కథ రూపం ఇవ్వడం రచయిత ప్రత్యేకత.

ఆలోచనను కథగా ఎలా మలచగలిగారన్న సుభాష్ గారి ప్రశ్నకు తెలిసో తెలియకో జ్ఞాపకాలను నెమరు వేస్తూ జరిగినకథలతో పాటు కాస్త కల్పనలను అల్లుతూ కథను వ్రాస్తాడు ఏ కవి అయిన అని చెప్పారు రచయిత వెంకట రమణరావు గారు.

తరువాతి కార్యక్రమం స్మరణిక. గొల్లపూడి మారుతీ రావు గారి గురించి కిరణ్ ప్రభగారు మాట్లాడారు.

గొల్లపూడి మారుతీరావు గారు తమ ఆత్మ కథను గురించి మునుపు స్వాగత్ హోటల్ లో మాట్లాడారు. మారుతీ రావు గారు స్మరణిక వ్రాసేటప్పుడు ఆయన ప్రత్యేకత ఆ వ్యక్తి తో తనకున్న అనుబంధాన్ని తెలపడం. కిరణ్ ప్రభగారు, మారుతీ రావు గారి గురించి తమకు తెలిసిన విషయాలను చెప్పారు. ఆయన సినిమా నటులుగానే అందరికీ తెలుసు. ఆయన పుట్టిన తేది 1939 ఏప్రిల్ 14. 16 సంవత్సరాలనుండే ఆయన వ్రాయడం మొదలు పెట్టారు. వ్రాతలలో ఆయన అనుభవం 65 సంవత్సరాలు. ఆయనకు కాలక్షేపమంటే కారులో షికారుచేయడం మాత్రమే. వేరే ఏది ఎన్నుకోవాలన్న నాటకాలు, సినిమా కథలు ఇలా ఏవీ మిగల్చకుండా అన్ని వ్రాశారు. అందులోపాత్రలు సహితం పోషించారు. "ఆంగ్లము రాక ఉద్యోగం ఎలా చేస్తావు రా" అని అడిగినందుకు పట్టుదలతో ఆంగ్లం నేర్చుకున్నారు. తన 20 వ ఏట నవల వ్రాశారు. ఆయన వ్రాసే నవలా శైలి అచ్చు చలం గారి శైలిలానే ఉంటుంది.

ఆయన చిత్తూరులో మొదట ఉద్యోగం ఆంధ్రప్రభలో చేశారు. 1962 నుంచి 83 వరకు రేడియోలో కొనసాగేరు. 82 లో డా.చక్రవర్తి అనే సినిమా కోసం వచ్చారు. ఆయనకు ఆత్మగౌరవం ఎక్కువ. ఎవరిని ఏమీ అడగరు. చాలా చిత్రాలకు చిత్రానువాదము చేశారు. చిత్రానువాదాలు కౢప్తంగా ఉండాలి. 81 -82 సినిమాల్లో బాగా వ్యస్థంగా ఉన్నారు. నాటకాల అనుభవం ఎక్కువ కాబట్టి ప్రతి నాయకుడి పాత్రలు పోషించారు. 82-92 వరకు సినిమాలలో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. 2019 సెప్టెంబర్ వరకు కాలమ్స్ వ్రాసేవారు.

ఆయనకు ముగ్గురబ్బాయిలు, అందరు చక్కగా స్థిర పడ్డారు. ఆర్థిక రీత్యా ఎటువంటి ఇబ్బంది ఆయనకు ఎన్నడూ లేదు. 92 తర్వాత దర్శకులకు మునుపంత క్రమశిక్షణ లేని కారణంగా చిత్రాలు మానేసారు. తదుపరి టెలివిజన్ లో మనసు-మమత అనే కార్యక్రమంలో కుటుంబాలలో కష్టాలను గురించి చర్చించేవారు. ఎర్రసీత, సాయంకాలం అయ్యింది రచన ప్రాథమికంగా 2002 వరకు జరిగింది. కిరణ్ ప్రభ గారికి మారుతీరావు గారు 2006 నుండి పరిచయం. ఈ మధ్య ‘రుణం’ అనే నవల వ్రాశారు.

ఆయన చక్కని రచయితే కాక మంచి శ్రోత కూడ, బాగా వినడానికి ఇష్టపడేవారు. కొన్ని ఏళ్ళు కౌముదిలో వ్రాశాక ఆంధ్రప్రభకు కాలమ్స్ వ్రాశారు. తిరిగి కౌముదికి వ్రాశారు. ఆయనకు 79 సంవత్సరాల వరకు ఆరోగ్యం చాలా బాగుండేది. 2018 ఫిబ్రవరి నుండి అనారోగ్యం బాధిస్తూ ఉంది. కాలమ్స్ వ్రాయడంలో విశిష్టత వారంలో జరిగినవిగా ఉండాలి. వ్రాసేది సమకాలికంగా ఉండాలి. విషయం లేక పోయినా పాత విషయాలను సమకాలానికి మార్చి వ్రాయగలగడం ఆయనొక్కరికే సాధ్యం. ఆత్మకథ వ్రాశారు అందులో ఆయన ప్రత్యేకత ఏమిటంటే ముందు అధ్యాయం అంతంలోనే రాబోయే అధ్యాయంలోజరిగే సంఘటనలపై కుతూహలం సృష్టించేవారు. మొత్తం 500 నుండి 600 వరకు కథలు, 25 నవలలు వ్రాశారు.

తదుపరి కార్యక్రమం సుభాష్ గారు నవోదయ రామమోహన్ గారికి స్మరణికను తెలిపారు. ఆయన చాలా మంచి వ్యక్తి ఎంతో మంది రచయితలు ఏమి లేకుండా వచ్చి అక్కడ కూర్చొన్నవారికి చాలా అవకాశాలను కల్పించారు. రచయితలను ప్రోత్సహించేవారు.

ఇద్దరు గొప్ప వ్యక్తులకు సభ అత్యంత గౌరవాభిమానాలతో నివాళులర్పించింది.

తదుపరి కార్యక్రమం కిరణ్ ప్రభ గారి క్విజ్ అందరినీ ఎప్పటిలాగే అలరించింది. తరువాత రూపారాణి బుస్సా నవ కెరటం శైలి కవిత చదివారు. సుభద్రగారు పాటలతో రంజింపజేసారు.

వీక్షణం నిర్వాహకురాలు డా|| కె. గీత ఇండియా వెళ్లడం వల్ల  సభకు హాజరు కాలేకపోవడం గొప్ప లోటని తల్చుకోవడంతో 88వ వీక్షణ సమావేశం సౌహార్ద్ర పూర్వకంగా ముగించబడినది.

Posted in January 2020, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!