వీక్షణం సాహితీ గవాక్షం - 80
- వరూధిని
వీక్షణం-80 వ సమావేశం కాలిఫోర్నియా బే-ఏరియాలోని పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారింట్లో ఏప్రిల్ 14, 2019 న జరిగింది.
ముందుగా పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు, శాంత గారు సభకు ఆహ్వానం పలుకుతూ నిన్నా మొన్న ప్రథమ సభ జరిగినట్లుగా ఉందని ఇంతలోనే వీక్షణం 80 వ సమావేశం లోకి అడుగు పెట్టడం, ఈ సమావేశం తమ ఇంట్లో జరగడం తమకు అత్యంత ఆనందదాయకమని అన్నారు.
ఉగాది కవి సమ్మేళనం ప్రధాన కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశానికి శ్రీ రావు తల్లాప్రగడ గారు అధ్యక్షత వహించారు.
ముందుగా శ్రీ చరణ్ గారు "రామ నామ శబ్ద విశిష్టత" అనే అంశమ్మీద మాట్లాడుతూ "రం" అనే ధాతువు గురించి, ఋగ్వేదంలోని శబ్ద మూలాల గురించి వివరించారు. రాముని పుట్టుకకు ముందే ఈ శబ్దం ఉన్నదనీ, అత్యంత ఆనందస్థితే ఈ శబ్దమని అంటూ రామ శబ్దానికి ఈశ్వర తత్త్వానికి ఒకటే అర్థమని వివరించారు. ఇందులో భాగంగా వేదాలు, ఇతిహాసాలు, పురాణాల గురించి వివరిస్తూ వేదాల్లో చెప్పిన విషయాలను అర్థం చేసుకోవడానికి ఇతిహాసాలు ఉపయోగపడతాయని, మిత్రసమ్మితంగా వచ్చేవి పురాణాలని అన్నారు. పదహారు సద్గుణాల సమ్మిళితమైన "రామ" శబ్ద విశిష్టత వల్లనే వాల్మీకి మహర్షి రామునికి ఆ పేరు పెట్టారని ముగించారు.
ఆ తరువాత జరిగిన కవిసమ్మేళనంలో ముందుగా రావు తల్లాప్రగడ గారు "మాయ మయ్యెనిట మాయాలింగము" అంటూ రాగయుక్తమైన గీతాన్ని ఆలపించారు.
తరువాత డా||కె.గీత గారు "2019 లో ఉగాది పండగ" అంటూ ఆధునిక యుగంలో మనిషి వాయిస్ అసిస్టెంట్ల మీద ఆధారపడడం పై హాస్యపూరిత కవితను వినిపించారు. మధు ప్రఖ్యా గారు "వెయ్యి వెయ్యి అడుగు" అంటూ కవితతో పాటూ జ్యోతిశ్శాస్త్రమ్మీద చమత్కారవంతమైన చిరు ఉపన్యాసం చేసారు. తరువాత కిరణ్ ప్రభ గారు తల్లిదండ్రుల విశిష్టతల్ని తెలిపే కవితల్ని వినిపించారు. కె.శారద గారు "ఉగాది ప్రహసనం" కవితను, నాగరాజు రామస్వామి గారు "విచ్చుకున్న అక్షరం", "ఉహాకోకచిలక" అనే కవితలను, బుస్సా రూప గారు "న గుణింతంలో కృష్ణుని పై" కవితను, "సీతారామ కల్యాణం" కవితను వినిపించారు. ఆ తర్వాత పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు చెన్నుని పద్యాలు, చెన్న కేశవ రెడ్డి గారు "ఎన్నికల కవిత" ను, వంశీ ప్రఖ్యా గారు "చిక్కటి చీకట్లు", నాగ సాయిబాబా గారు "ప్రేమకోసమై వలలో పడినే" అనే పాటకు ప్రేరడీ కవితతోను అందరినీ అలరించారు. చివరగా శ్రీ చరణ్ గారు ఇటీవల తమ అవధానంలోని "అంతరిక్షంలో వివాహం" అనే అంశమ్మీద, తాటకి, హిడింబ, పూతన, మంధర పదాలతో నవ వధువుని ఉద్దేశించి చెప్పిన పద్యాలను వినిపించి కవిసమ్మేళనాన్ని ముగించారు.
ఆ తర్వాత "తెలుగు రచయిత" నిర్వాహకులు డా||కె.గీత, సుభాష్ పెద్దు గార్లు మాట్లాడుతూ ఈ ఉగాదికి "తెలుగు రచయిత" మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని, నాలుగవ సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టిందని ఇప్పటి వరకు వెయ్యికి పైగా రచయితలకు ఇందులో స్థానం కల్పించడం జరిగిందని, ఇందుకు దోహదపడిన తానా వారికి, స్థానిక ప్రముఖులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులోనూ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేసారు.
విరామం తర్వాత శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరినీ అత్యంత అలరించింది.
చివరగా అక్కిరాజు రమాపతిరావు గారు రమణ మహర్షి 130 వ వర్థంతి సందర్భంగా ఉపన్యసించి సభను ముగించారు.
ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశంలో స్థానిక ప్రముఖులు అనేకులు విశిష్టంగా పాల్గొన్నారు.