వీక్షణం సాహితీ గవాక్షం - 72
- వరూధిని
ఆగస్టు నెల వీక్షణం కాలిఫోర్నియా బే ఏరియా లోని స్వాగత్ హోటల్ లో 12 వ తారీఖున అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. అధ్యక్షులు శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు ముందుగా మొదటి ఉపన్యాసకులు శ్రీ వేణు ఆసూరి గారిని ఆహ్వానించారు. ఆయన అర్మను హైసీ రచించిన "సిద్ధార్థ" నవలను సభకు పరిచయం చేసారు. కథని సూక్ష్మంగా పరిచయం చేస్తూ సిద్ధార్థ అనే యువకుడు గౌతమ బుద్ధుణ్ణి కలవడానికి వెళ్లడం, వారిరువురి మధ్య జరిగిన సంభాషణ, సన్యాసి సంసారిగా మారడం, తిరిగి సన్యాసిగా మారడం, చక్రభ్రమణం జీవితం అని తెలుసుకోవడం మొదలైన విషయాల్ని ఆసక్తికరంగా వివరించారు. అధ్యక్షుల వారి మాటల్లో చెప్పాలంటే "వేణు గారు అత్యంత గహనమైన విషయాన్ని ప్రశాంతంగా విడమర్చి చెప్పారు". ప్రసంగానంతరం రచయిత జీవిత విశేషాలు, ఇతర రచనల గురించి కూడా వివరించారు.
ఆ తర్వాత శ్రీమతి ఆర్. దమయంతి "డా||కె.గీత కవిత్వంలో స్త్రీ హృదయ స్పందన" అనే అంశంమ్మీద ప్రసంగించారు. నారింజ చెట్టు, కొండవాలు వాన తీగె, కథ ముగిసింది, పునరపి జననం మొదలైన కవితల్ని ఉదహరిస్తూ గీత కవిత్వం లో మాతృత్వం అమ్మ, పిల్లలు, నాన్నమ్మ, అమ్మమ్మ పాత్రల ద్వారా పెల్లుబుకుతుందన్నారు. "నారింజ చెట్టు" కవిత లో కూడా మాతృత్వపు స్పందన అద్వితీయమని కొనియాడారు. "పునరపి జననం" కవిత ద్వారా పురిటి బాధను సున్నితంగా వ్యక్తపర్చడం గీతకే చెల్లిందన్నారు. గీత కవిత్వంలో ప్రతి కవితా శీర్షిక ఒక్కో గాథ అని ముగించారు. తన కోరిక ప్రకారం ప్రసంగానంతరం సభలోని వారందరూ అందజేసిన "కవిత్వానికి నిర్వచనాల" ను అందరికీ చదివి వినిపించారు.
విరామానంతరం శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యాన జరిగిన సాహితీ క్విజ్ అందరినీ ఎప్పటిలానే అలరించింది. శ్రీ మృత్యంజయుడు తాటిపామల క్విజ్ మాస్టర్ గా వ్యవహరించారు. అనంతరం మృత్యంజయుడు గారు శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారి సహస్ర చంద్ర దర్శన సందర్భంగా గుంటూరు లో వెలువరించబడిన విశేష సంచికను, సన్మానపు విశేషాల్ని సభకు పరిచయం చేశారు.
శ్రీ కె.వి. రమణారావు గారి "పాట" కథా పఠనం, వారి శ్రీమతి సుభద్ర గారి లలిత గీతాలు, ఈశా వరకూరు స్వాతంత్ర్యోద్యమ గీతాలాపనలు సభకు ప్రత్యేక ఆకర్షణలయ్యాయి.
కవిసమ్మేళనంలో ఆచార్య గంగిశెట్టి, శ్రీ జి.హరనాథ్, డా|| కె.గీత, శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీ సుబ్బారావు, శ్రీమతి ఉమా వేమూరి, శ్రీ వేమూరి, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ లెనిన్, శ్రీ మృత్యంజయుడు తాటిపామల, శ్రీమతి జయ, శ్రీమతి శారద, శ్రీమతి ఛాయాదేవి, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి రమణమ్మ, శ్రీ ఇక్బాల్, శ్రీ ప్రసాద్, శ్రీ రామస్వామి, శ్రీ శ్రీచరణ్ మొదలైన వారు ఈ సభలో పాల్గొన్నారు. చివరగా శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీమతి దమయంతి గార్లు ఆలపించిన గీతాలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.
సెప్టెంబరు 16 న, ఉదయం 10 గం. నుండి సాయంత్రం వరకూ స్వాగత్ లో జరగనున్న వీక్షణం వార్షిక సమావేశానికి గీత గారు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఆ సందర్భంగా వెలువరించే ప్రత్యేక సంచికకు రచనలు ఆగష్టు 31 లోగా పంపవలసిందిగా విజ్ఞప్తి చేశారు.