
వీక్షణం సాహితీ గవాక్షం 151వ అంతర్జాల సాహితీ సమావేశం మార్చి14, 2025న రసవత్తరంగా జరిగింది. అతిథులకు. కవిమిత్రులకు డా. కె.గీతామాధవి గారు, శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల గారు, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు తొలుత స్వాగతం పలికారు. ఈ సమావేశంలో 150 సమావేశాల సమీక్షలతో సంచికను తీసుకువచ్చామని, అలాగే విశ్వావసు నామ సంవత్సర ఉగాది కవిసమ్మేళనం నిర్వహించుకోవడం చాలా ప్రత్యేకం అని చెప్పారు. బే ఏరియాలో కొద్దిమందితో మొదలైన వీక్షణం ప్రపంచవ్యాప్తంగా ఎదగడం ఊహించని మార్పు అని శ్రీ ఎం.జె గారు చెప్పారు. సెప్టెంబర్ 9న 2012లో వేమూరి గారింట్లో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తదుపరి ప్రతినెలా కాలిఫోర్నియాలో సమావేశాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళమని, కరోనా తర్వాత జూమ్ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం, అందులోనూ భారతీయ సాహితీ ప్రియులు పాల్గొంటూ ఉండడం విశేషమని గీత గారు వివరించారు.
వీక్షణం తొలినాళ్ళ నుండి ఇప్పటివరకు నిర్వహించిన సమావేశాల సమీక్షలతో కూడిన దాదాపు 400ల పేజీల ప్రత్యేక సంచికను శ్రీ రావు తల్లాప్రగడ గారు ఆవిష్కరించగా, కవి సమ్మేళనాన్ని శ్రీ మధు ప్రఖ్యా గారు, శ్రీ గుండ్ల పల్లి రాజేంద్రప్రసాద్ గారు నిర్వహించారు.ఈ సంచిక మొదటి సమావేశం నుండి మొదలుకొని 150 వ సమావేశం వరకు జరిగిన అన్ని సమావేశాల సమీక్షల సమాహార సంచిక. ఈ ప్రత్యేక సంచికకు అందమైన ముఖచిత్రాన్ని సమకూర్చిన శ్రీమతి కాంతి పాతూరి గారికి గీతగారు సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
కవి సమ్మేళనాలను, కవితలనూ గ్రంధస్తం చేసియుండవచ్చేమో కానీ ఇలా ప్రతి సమావేశంపై ఎవరెవరు పాల్గొన్నారో వాటి విశేషాలను, సమీక్షలను గ్రంధస్తం చేసిన వారెవరూ లేరని, ఉండబోరని, భవిష్యత్తులో ఇది సాహిత్యంపై ఎంఫిల్ చేసే వారికి ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదని మృత్యుంజయులు గారు చెప్పారు. శ్రీ మధు ప్రఖ్యా గారు ఒక ఆలోచన రూపుదాల్చి ఎదిగి నిరంతరం కొనసాగుతున్న పరిణితిని చూపుతోందని, వీక్షణం ప్రత్యేక పథం అని, ఇది ఒక చారిత్రక సంఘటన అని చెప్పారు. అంతేకాకుండా రానున్న ఒకానొక కాలంలో గీత గారిని గూర్చి పాఠ్య పుస్తకాల్లో చేర్చవచ్చని, ఆ క్షణాల్ని ఇప్పుడే వీక్షిస్తున్నామని చెప్పారు.
మొత్తం 33 మంది కవులు కవి సమ్మేళనంలో తమ కవితలు వినిపించారు. ముందుగా శ్రీ రావు తల్లాప్రగడ గారు గణేశస్తుతి కీర్తనను పాడి కవిసమ్మేళనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గీతగారు "అతని ప్రియురాలు" అనే కవితని చదివి కన్నీళ్లు తెప్పించారు. ఎందరి స్త్రీల గొంతుకలకో ఈమె గళం ప్రతినిధిగా నిలించిందని చెప్పక తప్పదు. కల్లోలాలని అంతరంగంలో దాచుకుని కెరటాలతో ఆడుతూ కన్నీళ్లను కలిపేసే స్థైర్యం ఆ కవితలో కనిపించింది. శ్రీధర్ బిల్లా గారు "పచ్చరాళ్లు" అనే కవితలో అగ్ర రాజ్య నిరంకుశత్వ ధోరణిని ఎండగట్టారు. ప్రకృతి సహజ సంపదే శాపంగా మారిన దౌర్భాగ్య స్థితిని ధిక్కార స్వరంతో వినిపించారు. ముప్పాళ్ళ భవానీ గారు "నా ఊహల్లో వసంతం" కవితని ఆలపించారు. మౌనశ్రీ మల్లిక్ గారు "కళ్ళజోడు" కవితలో జీవన సత్యావిష్కరణ చేసి కర్తవ్య బోధ జేశారు. సరిపల్లి మంజుల గారు "నీతి నీ గతి" అనే కవితను వినిపించారు. నేటి స్త్రీల పోకడలను పతనమౌతున్న నైతిక విలువలను సూటిగా వివరించారు. తాటిపర్తి బాలకృష్ణారెడ్డి గారు విశ్వావసు ఉగాది అమెరికా ఆంధ్రా కలయిక అనే కవితలో ప్రస్తుతస్థితి గతులను మనిషి జీవన శైలి అమెరికా ఆంధ్రా లో ఉన్న వైవిధ్యాన్ని చూపుతూ భారత సంస్కృతిని నిలపాలన్న ధ్యేయాన్ని వెలిబుచ్చారు. డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు "మనో నేత్రం విచ్చుకుంటే" అనే కవితలో నేటి సమస్యలు ఆవేదనతో పాటు అధిగమించే తీరును ఆశావహ దృక్పధంతో వివరించారు వారి కవితలో.
మోటూరి నారాయణరావు గారు "వేమన పద్యం మన జీవన సూత్రం" అనే కవితలో వేమన పద్యాల తీరును, సమాజమార్పుకై చేసినకృషిని వివరించారు. డా.పైడి నవనీత రవీందర్ గారు "కన్నీటి విలువ" అనే కవితలో స్వార్ధత నిస్వార్ధతల మధ్య అంతరాన్ని చక్కగా వివరించారు. రామకృష్ణ చంద్రమౌళి గారు "సోడా" కవితను చక్కగా పాడి అందరినీ ఆకట్టుకున్నారు. వంశీధర్ కుడికాల గారు "జ్వలనగానం" కవితలో వెలుగు అసత్యాల్ని పారద్రోలి సత్యాన్ని చూపుతుంది అని ఆవేదనతో కూడిన అగ్నిని పదాలపొందికలతో పటపట శబ్దాలని వినిపించారు. గౌడి సరిత గారు "నవవసంతాల ఉగాది సొబగులు" కవితలో ఉగాది ఆగమనాన్ని వివరించారు.
అద్భుతమైన రీతిలో వ్యాఖ్యానం చేస్తున్న మధు ప్రఖ్యా గారి గురించి మాట్లాడుతూ "ముఖే ముఖే సరస్వతి" అన్నట్లు కవిత్వం వారి నోట్లో నాట్యం చేస్తుందని, ఈ ఒక్కరోజుకై మిగిలిన 29 రోజులు ఎదురుచూస్తుంటానని కవిత్వమే శ్వాసగా జీవిస్తున్న తనకు ఈ రోజు చాలా సంతోషాన్ని ఇచ్చిందని గీతామాధవి గారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఆదిత్య మోపిదేవి (కమర) గారు "పునర్జన్మ ఉంటే బాగుండు"..అనే కవితలో ఒక్క సారి వెనక్కి వెళ్లి అవగాహనతో కూడిన ప్రవర్తన ఎలా ఉంటే బావుంటుందో ఆ జీవనం కోసం పునర్జన్మ ఉంటే బావుండు అని కోరుకున్నారు. రమాదేవి బుక్కపట్నం "నిన్నటి నేనుకై" అనే కవితలో ఉన్నకాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చక్కగా వివరించారు. అవధానం అమృతవల్లి గారు "సంయమన రథంపై శాంతి జెండా నెగరేస్తూ" అంటూ వసంతుని రాకకై ప్రకృతి ఆసాంతం ఎంత ఆశతో ఎదురుచూస్తూ ఎలా ముస్తాబయ్యిందో చదివి వినిపించారు.
మధు ప్రఖ్యా గారి సమీక్షకు స్పందించి గీత గారు కృష్ణ శాస్త్రి గారి 'మధూదయంలో మంచి ముహూర్తం మాధవి లతకు పెళ్ళీ పెళ్ళీ' అని పాటను గుర్తుచేసుకున్నారు. దేవులపల్లి పద్మజ గారు తెలుగు భాషపై చక్కని పద్యాలు చదివి వినిపించారు. పరాంకుశం కృష్ణవేణి గారు "పాడాలని ఉంది కోయిలనై" అంటూ చక్కని కవితను వినిపించారు.
పిమ్మట ఆచార్య అయ్యలరాజు సోమయాజులు ప్రసాద్ గారు "విశ్వావసు నీకు స్వాగతం" అంటూ ఉగాది సుఖశాంతులు తేవాలని స్వాగతం పలికారు. విశ్వ శాంతిని కోరారు తమ కవితలోడా.ఎన్.బృంద గారు జీవన రాగము కవితలో. మన దినచర్య గూర్చి సమయ విలువలను ఎలా పాటించాలో తెలిపారు.భోగెల ఉమామహేశ్వర రావు గారు ఉగాది గురించి చక్కని కవితను వినిపించారు. డా చీదేళ్ళ సీతాలక్ష్మి గారు "నవ వసంతం" గురించి చక్కటి పద్యాలను వినిపించారు. పరిమి వెంకటసత్యమూర్తి గారు "కళ్ళద్దాలు" గురించి హాస్య స్పూరకమైన కవితను చదివారు. డా.కోదాటి అరుణ గారు ఉగాది గూర్చి "వచ్చేనమ్మ వచ్చేను ఉగాది పండుగ వచ్చేను" అంటూ ఉగాది సంబరాలను వినిపించారు. బులసాని వనజ గారు "డ్రగ్స్" అంశంపై యువత పెడత్రోవపట్టడంపై ఆవేదన వ్యక్తం చేసే కవితను వినిపించారు. బోడిగం స్వాతి గారు "ఉగాది" ఉషస్సు అంటూ ఉగాదిని ఆహ్వానించారు. ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి గారు కవిని గాని నేను అంటూ ఆమె ఆశయాన్ని వెలువరించారు. ఉగాది గూర్చి ఆశావహ దృక్పధాన్ని ఆవిష్కరించారు.
చిట్టబత్తిన వీరరాఘవులు గారు "ఛిద్ర బ్రతుకు" అనే కవితలో రైతుల ఆవేదన వ్యక్తంచేశారు.మల్కాజి విజయలక్ష్మి గారు "ఆరిపోతున్న సూర్యుడు" అంటూ కవితలో సుఖదుఃఖాల్ని వివరించారు. ఆనం ఆశ్రీతరెడ్డి గారు "సాహిత్యంవైపు అడుగులు" అనే కవితలో కవిత్వం వైపు అడుగేయాలని సమాజ మార్పుకై కృషి చేయాలని చెప్పారు. మేడిశెట్టి యోగేశ్వరరావు గారు "ఆ మూర్ఖుడెవరు" అనే కవితలో యదార్ధ సంఘటనపై నాన్న పడ్డ శ్రమ, ఆవేదన అక్షరబద్ధంచేసి అద్భుతంగా వినిపించారు. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు చివరగా "ఉగాది ఊసులు" అనే కవితలో ఉగాది వస్తుంది, పలుకవితలకు నాంది పలుకుతుంది అని ఉగాది ఇచ్చే అనేక సంబరాలను, ముచ్చటలను వివరించారు.
చివరగా గీతామాధవి గారు ఇటీవల స్వర్గస్థులైన శ్రీ రామాయణం ప్రసాదరావు గారి సతీమణి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక నిమిషం సభలో మౌనం పాటింపజేసి, అందరికీ ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.
కవితలన్నీ బాగున్నాయని, కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా సాగిందని, వచ్చేనెల సమావేశం కొరకు ఎదురుచూస్తున్నామని కవులు సంతోషాన్ని వ్యక్తంజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉత్సాహంగా పాల్గొన్న ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.