Menu Close
వీక్షణం-150వ సాహితీ సమావేశం
-- భవాని ముప్పాళ్ళ --
vikshanam-150

2012 సెప్టెంబర్ లో ప్రారంభమైన వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) అప్రతిహతంగా నెలనెలా కొనసాగుతూ, ఇప్పుడు 150వ సాహితీ మైలురాయికి చేరుకొని ఫిబ్రవరి 21, 2025న 150వ సాహితీ సమావేశాన్ని ఆన్లైన్ లో అతివైభవంగా జరుపుకుంది. ఈ సందర్భంగా జరిగిన వీక్షణం సమావేశంలో దాదాపు 50 మందికి పైగా కవులు, రచయితలు, సాహిత్యాభిలాషులు ఇటు అమెరికా నించి అటు భారతదేశం వరకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ 150వ వీక్షణం ప్రత్యేక సమావేశంలో 150 మంది కవులతో వచనకవిత్వ సంచిక ఆవిష్కరణ, పరిచయం వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా. కె.గీతామాధవి గారి ఆధ్వర్యంలో జరిగింది. హైదరాబాద్ కు చెందిన శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు వీక్షణం భారతీయ సమన్వయకర్తగా ఇతోధికంగా తోడ్పడ్డారు.

సమావేశంలో ముందుగా ‘వీక్షణం’ విజయసారథి, డా.కె.గీతామాధవి గారి తొలిపలుకులతో కార్యక్రమం మొదలైంది. వీక్షణం మొట్టమొదట పదమూడేళ్ల కిందట 2012లో ఎలా మొదలైందో, ఎన్నో కష్టనష్టాల కోర్చి, ఈ రోజు వెయ్యిమంది సభ్యులతో 150వ సమావేశాన్ని జరుపుకునే ఎత్తుకు ఎదిగిన తీరుని ఎంతో ఆత్మీయంగా వివరించారు. అది ఖచ్చితంగా గీతగారి సాహిత్య పిపాస వలన మాత్రమే అని మనకు అర్థమవుతుంది. కేవలం సాహిత్యం మీద వారికున్న ఆసక్తిని నలుగురితో పంచుకోవాలన్న తపన ఈ కృషికి నాంది పలికింది. అమెరికాకు, ఇండియాకు, ఆమె ఒక సారధిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె వీక్షణం కోసం కృషి చేసిన వారందరినీ పేరుపేరునా జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసారు.

తరువాత గుండ్ల రాజేంద్రప్రసాదుగారు కూడా ఆమెను ప్రశంసిస్తూ ఆవిడ పదిచేతుల్తో పనిచేస్తారన్నారు. అకుంఠిత దీక్షతో చేయబట్టే, వీక్షణం ఇంతటి విజయాన్ని సాధించిందన్నారు. "ఆయన తన కుడిచేయి" అని గీతగారు తన ప్రసంగంలో చెప్పారు. వీరిద్దరి సాహిత్య కృషి నిజంగా ప్రశంసనీయం.

తరువాత ‘వీక్షణం’ తొలి రోజుల నించీ సభ్యులైన మృత్యుంజయుడు తాటిపాముల గారు మాట్లాడారు. ఆయన వీక్షణంమొదటి సమావేశం కొద్దిమందితో వేమూరి గారింట్లో ఎలా ప్రారంభమైందో వివరించారు. గీత గారి కృషి వల్ల, ఈ 150 వ సాహితీ సమావేశ సందర్భంగా వెలువరించబడుతున్న 150 మందితో తీసుకువచ్చిన అద్భుత కవిత్వ సంకలనం గిన్నిస్ బుక్ గుర్తింపుకు రావాలి అన్నారు. ఇన్నినాళ్లుగా ఆమె ఎవరిదగ్గరా ఆర్థిక సహాయం ఆశించకుండా, తను స్వయంగా నిర్వహిస్తున్నందుకు ఆమె కృషిని ప్రశంసించాలి అన్నారు.

తరువాత చిమటా శ్రీనివాస్ గారు ప్రసంగించారు. గీతగార్ని "One woman army" అని ప్రశంసించారు. ఆరంభ శూరత్వంగా కాకుండా సంవత్సరాల తరబడి ఈమె కార్యక్రమాలు స్వయంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇటువంటి సాహితీ సేద్యం ఈమెకే సాధ్యం అన్నారు.

తరువాత ప్రఖ్యాత సినీ గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు ప్రసంగించారు. వీక్షణం ద్వారా ఎంతో సాహితీ మిత్రులను కలిశామన్నారు. తరువాత శ్రీ కందుకూరి శ్రీరాములు గారు మాట్లాడారు. గీతగార్ని ముప్పది మూడు సంవత్సరాలుగా ఎరిగిన మనిషిగా ఆమె ఎలా ఎదిగారో ఆయన వివరించారు. స్థాయీభేదం లేకుండా రచయితలందర్నీ ఆమె సమంగా ఆదరించారని, ఆయన ప్రశంసించారు. తరువాత ప్రసాదరావు రామాయణం గారు, గీత గారిపై చాలా చక్కని కవిత వినిపించి అభినందనలు తెలిపారు.

తరువాత ఈ వీక్షణం 150వ సాహితీ సమావేశ150 మంది కవుల, కవయిత్రుల ప్రత్యేక కవితా సంకలన ఆవిష్కరణ అత్యంత అద్భుతంగా, అపూర్వంగా కొనసాగింది. గీతగారు పుస్తకానికి అందమైన ముఖచిత్రాన్ని అందజేసిన శ్రీమతి కాంతి కిరణ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సంకలనం కోసం అహోరాత్రాలు తనతో కలిసి కృషి చేసిన రాజేంద్రప్రసాదు గారి శ్రమ మరువలేనిదన్నారు.

సుప్రసిద్ధ కవి, విమర్శకులు శ్రీ నాళేశ్వరం శంకరం గారు ఈ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ప్రత్యేక సంచిక అద్భుతంగా ఉన్నదని, కవితలు చాలా గొప్పగా ఉన్నవని ప్రశంసించారు. 150 మంది కవులలో 53 మంది మహిళలు ఉండటం, 42 మంది కవులు అపార అనుభవము ప్రతిభ ఉన్న కవులు ఉండటం గర్వించదగ్గ విషయమని చెప్పారు. వీక్షణం స్థాపించి 13 సంవత్సరాల నుండి అప్రతిహతంగా సాగుతున్నదని,  వీక్షణం అధ్యక్షురాలు డా.గీతగారికి, అందుకు సహకరిస్తున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

పిమ్మట కవి, రచయిత, వ్యాసకర్త, ఉపన్యాసకుడు, వ్యాఖ్యాత, నటుడు, దర్శకుడు డాక్టర్ కె.జి.వేణు గారు పుస్తకంలోని పెక్కు కవితలపై చక్కని సమీక్ష చేసి అందరినీ అలరించారు. వివిధ కవుల కవితలను చదివి, విశ్లేషించి శ్రోతలను ఆకట్టుకున్నారు. కవిత్వమంటేనే సంస్కారమన్నారు. అన్ని కవితలు మంచి స్థాయిలో వున్నప్పటికీ, సమయం కారణంగా కొన్నిటిని ప్రసంగిస్తున్నానన్నారు. వేణు గారి ప్రసంగం నదీ ప్రవాహంలాగా, జలపాతంలాగా అరగంటపై సాగింది.

తరువాత మనోహర్ రెడ్డిగారు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ సంకలనాన్ని "సాహితీ మహా కుంభమేళ" అని ప్రశంసించారు. ముందు తరాలకు ఉపయోగపడ్తుందన్నారు. శ్రీధర్ బిర్లాగారు మాట్లాడ్తూ వీక్షణం వల్లనే కవినయ్యానని అభినందనలు తెలుపుతూ, ఇదొక ‘‘మహాయజ్ఞ"మన్నారు. వెంకట్ కొత్తూరు గారు మాట్లాడుతూ ఈ 150 వ సమావేశాన్ని 'పంచదశాధికశత' సమావేశం అంటూ తానూ ఈ మధ్య వీక్షణం లో భాగస్వామ్యమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మల్యాల మనోహర్ రావుగారు తమ కవితను ప్రచురించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

మొత్తమ్మీద వీక్షణం 150వ సమావేశ ప్రత్యేక కవిత్వ సంచిక కవితలపై నాళేశ్వరంగారు, వేణు గార్ల విశ్లేషణలు, భోగెల ఉపమామహేశ్వర్రావు గారు చేసిన సమీక్షలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి:

ముందుగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షురాలు, కవయిత్రి, గాయని, నెచ్చెలి మాసపత్రిక నిర్వాహకురాలు అయిన డాక్టర్ కె.గీత గారు మొదటి కవితలో"కిటికీ మూసుకునేవరకు" కవితలో తెల్లవారి నిద్రలేవగానే తనను సైబర్ ప్రపంచంలోకి రివ్వున విసిరేసే జీవనవిధానం ఎలా ఉంటుందొ చక్కగా వర్ణించారు. తెల్లవారితే చరవాణిలో చాటింగ్ మొదలు మరల నిద్రించేవరకు అదే కిటికీ మూసుకునేవరకు కవిత కిక్ ఇచ్చిందని చెప్పవచ్చు . అదే విధంగా 'తదుపరి ప్రశ్న' అనేకవితలో - శ్రీధర్ రెడ్డి బిల్లా హక్కులు, చట్టాలు, ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వడాలు, ఆపై అక్రమ అరెస్టులు గురించి క్లుప్తంగా వర్ణించారు.

ఇంద్రధనస్సులు అనే కవితలో ఏనుగు నరసింహారెడ్డి గారు అతడికి, ఆమెకు ఉన్న బేధాభిప్రాయాలు, ఆమెలో ఇతనికి, ఇతనిలో ఆమెకు నచ్చని విషయాలు వర్ణించారు.

'నదులు వేరైన చోట' అనే కవితను డాక్టర్ గీత గారి తల్లి శ్రీమతి కె.వరలక్ష్మి ఎవరి జీవితం వారిదే అన్నట్టు జీవితాలు జీవిస్తున్నారని, నదులు ఏ విధంగా పొంతన లేకుండా ఉన్నాయో జీవితాలు కూడా అంతే అని  కవిత రూపంలో వర్ణించారు.

'విశ్వ నరుడు' అనే కవితలో జాషువా రచించిన గబ్బిలం నవలలో చెప్పినట్లు తెలుగు పలుకుబడులు అంటూ సాదనాల వేంకటస్వామి నాయుడు సమాజంలో రుగ్మతలు గురించి వర్ణించారు.'అశ్రువొక్కటి 'కవితలో వ‌సీరా మనుషులు మనుషులనే దోచుకునే విధానం కుంభమేళాలు, పక్షులు జంతువులను ప్రేమించాలంటూ జంతువులు హింసించే విధంగా జల్లికట్టు పండగలు జరిపే విధానాన్ని నిశితంగా విమర్శిస్తూ చేసిన వర్ణన బాగుంది.

సాహితీ సంద్రం కవితలో ఏదైనా ఒక సామాజిక అంశం, ఒక వస్తువుని తీసుకొని అక్షర రూపంలో కవిత లేదా కథ రాయవచ్చునో కందుకూరి శ్రీరాములు తెలిపారు.

'రవినై....శశినై....కవినై'.. కవితలో ప్రపంచంలో చెట్టు, సూర్యుడు, చంద్రుడు, మేఘం అంశాలను తీసుకుంటూ వాటి ధర్మం ఎలా అయితే నిర్వహిస్తున్నాయో మానవుడు కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నిర్వహించడం మంచిది అంటూ, తేనె లాగా తీపినందిస్తానంటూ కవిగా కవితల ద్వారా సామాజిక అంశాలపై కవితలు రాసి ధర్మం పాటిస్తానని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ చాలా చక్కగా రాశారు.

కవిత్వం కవితలో రాయాలని రాయడం, చెప్పాలనేది చెప్పడం కవికే సాధ్యమని మౌనశ్రీ మల్లిక్ కవితా రూపంలో తెలియజేశారు. 'క్షణ-క్షణ-వీక్షణం' కవితలో ఇప్పుడు ఇలా ఉన్నాను, రేపు ఎలా ఉంటానో క్షణం చిత్రం, క్షణం మాయ, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు అంటూ ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి తన కవితలో అక్షరాలను అలరించారు.

'గుండెల్లో భూగోళం' కవితలో నేటి సమాజంలో ఆడది పడుతున్న అగచాట్లు అంశంగా తీసుకొని కొండపల్లి నీహారిణి ఒక స్త్రీగా ఆవేదన వెల్లబుచ్చారు.

'ఏ మనిషి చరిత్ర చూసినా' కవితలో మనిషి మనిషికి ఒక చరిత్ర, సుఖదుఃఖాలు, పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు బాధలు బందీలు ఆది మోపిదేవి కవిత రూపంలో వర్ణించారు.

'కవన కళ' కవితలో చుట్టూ ఎదిగితే ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, చెట్టు చనిపోతే ఎలా ఉంటుందో చక్కగా నాళేశ్వరం శంకరం వర్ణించారు.

'నమ్మండి నేను అనాధను' కవితలో మనుషుల్లో ఉన్న ధ్యాస భావాలు, ప్రేమ తత్వం లేకపోవడం,, స్వార్ధాలు పైన డాక్టర్ కె.జి.వేణు చక్కగా కవిత రూపంలో వర్ణించారు.

'భలే  భలే బడిపంతులు' కవితలో పూర్వం బడిపంతులు డాక్టర్,యాక్టర్, పురోహితుడు అన్నింటతానై గ్రామాల్లో ఏ విధంగా వ్యవహరించువారు చక్కగా దాలి.వి అభివర్ణించారు.

'శంకరాలు' కవితలో మానవుడు సమస్యల్లో చిక్కుకోవడం, ప్రతిదానికి చాదస్తంగా శంకించడం ప్రశ్నలు వేయడం డాక్టర్ శంకర నారాయణ కవిత రూపంలో వర్ణించారు.

'స్నేహ బంధం' కవితలో సమస్యలు, జరుగుతున్న సంఘటనలను స్నేహ బంధాలు ఎలా ఉంటాయో దాస్యం సేనాధిపతి కవిత రూపంలో వర్ణించారు.

'సహనం' కవితలో ఆమె స్త్రీగా ఆడది ఆగచాట్లు,, బాధలు స్త్రీలు పడుతున్న ఇబ్బందులు ఆడది ఆత్మాభిమానం డాక్టర్ రాధా కుసుమ చక్కగా ఆవేదనగా వర్ణించారు.

'మరువలేని జ్ఞాపకాలు' గత సంవత్సరం జరిగిన సంఘటనలు, నూతన సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై నారాయణ మద్దిరాల అక్షర రూపంలో చక్కగా వర్ణించారు.

'సర్వజనహితం -సాహిత్యం' కవిత లో సాహిత్యంతో సమస్యలు పరిష్కరించవచ్చు,, సంస్కారాలను ఉద్ధరించవచ్చు అని బంధకవి శ్రీనివాస రామారావు చక్కగా వర్ణించారు.

'మౌన ప్రవాహం లోకి' కవిత లో చనిపోయిన మనిషి, చితి మంటలు దాకా వెళ్లే పరిస్థితిపై, శవానికి ఏమి తెలుసు అన్నట్టుగా నిర్జీవ శరీరం ఊహిస్తున్నట్టుగా పిళ్ళా వెంకట రమణమూర్తి ఊహ కవిత ఊగిసలాడింది.

'అయ్య లేని నులక మంచం' కవితలో తన నాన్న కాదు అందరి నాన్నలు కూడా నడక మంచం,ఉత కర్ర అరిగిపోయిన తోలు చెప్పులు  జీవన విధానంపై రాము కోలా చక్కగా జ్ఞాపకాలను రచించారు. 'అబద్ధమా!' కవిత లో ప్రస్తుతం సమాజంలో కోర్టులలో, కార్యాలయాలలో అబద్దాలతో నిత్య కృత్యమై ఎలా జీవిస్తున్నారు ప్రసాదరావు రామాయణం చక్కగా కవితా రూపంలో వర్ణించారు. అదేవిధంగా అనేక కవితలను కవులు బహు పసందుగా వ్రాసి అందరి మన్ననలను పొందారు.

సమయ పరిమితి కారణంగా, కొందరికి మాత్రం ప్రసంగించడానికి, మరి కొందరికి కవితలు చదవటానికి అవకాశం యివ్వబడింది. కవి సమ్మేళనం ఆద్యంతం రాజేంద్ర ప్రసాద్ గారి చక్కని వ్యాఖ్యానం కార్యక్రమాన్ని అలరించింది.

ఈ సమావేశంలో అమెరికా కవులు బిల్లా శ్రీధరరెడ్డి, ఆదిత్య మోపిదేవి, శ్రీనివాస్ చింతా, మృత్యుంజయుడు, వెంకట్ కొత్తూర్, గీతా మాధవి గారు చేస్తున్న సాహిత్యకృషిని అభినందించారు. భారతీయ కవులు కందుకూరి శ్రీరాములు, మౌనశ్రీ మల్లిక్, వసీరా, రామాయణం ప్రసాదరావు, గంటా మనోహర్ రెడ్డి, అయ్యల సోమయాజులప్రసాద్, ఆకుల మల్లేశ్వరరావు, రాధా కుసుమ, మల్యాల మనోహరరావు, యు.వెంకటరత్నం, అవధానం అమృతవల్లి, డాక్టర్ ఎం.ఎన్.బృంద, పరాంకుశం క్రిష్ణవేణి, రామక్రిష్ణ చంద్రమౌళి, డాక్టర్ సమ్మెట విజయ, డాక్తర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, సుబ్రహ్మణ్యం, భోగెల ఉమామహేశ్వరరావు, మేడిసెట్టి యోగేశ్వరరావు, రమాదేవి వీక్షణం చేస్తున్న సాహిత్య సేవలను కొనియాడుతూ, కొందరు కవితలను వినిపిస్తూ సభకు హుందాతనం ఇచ్చారు.

అత్యంత అద్భుతంగా, చారిత్రక సమావేశంగా ఈ 150వ కవితా సంకలన సమావేశం అందర్నీ ముగ్ధుల్ని చేసింది.

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మభాష అమృతం, మాతృభాష మరందం అంటు మాతృభాష ముచ్చట్లు చెప్తూ కవిసమ్మేళనానికి ముగింపు పలికారు. చివరిగా డాక్టర్ గీతా మాధవి గారు అతిథులకు, కవులకు ధన్యవాదాలు తెలిపి సమావేశాన్ని ముగించారు.

చక్కని సమావేశం ఏర్పాటుచేసినందుకు కవులు అందరూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇకపై నెలనెలా తప్పకుండా వీక్షణం సమావేశాలలో పాల్గొంటామని వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు.అంతేకాకుండా వెన్నెలకోసం ఎదురుచూస్తున్న చకోర పక్షుల్లాగా వీక్షణం మార్చినెల 151వ సమావేశానికి నిరీక్షిస్తున్నామని పలువురు కవులు తెలియజేసారు.

అత్యంత ఆత్మీయంగా, ఘనంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

వీక్షణం-150వ సమావేశ ప్రత్యేక వచన కవిత్వ సంచికని ఇక్కడ కింద యిచ్చిన లింకులో చూడవచ్చు.

https://drive.google.com/file/d/1RzUfBEmwpbYUS0tceRhg-GiSpEsNbdgm/view?usp=sharing

Posted in March 2025, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!