
వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 149వ అంతర్జాల సాహితీ సమావేశం జనవరి17, 2024న చమక్కులతో మెరిసింది.
కాలిఫోర్నియా లోని తన గీర్వాణీ సాహితీ మందిరపు గవాక్షం తెరిచి వినువీధిలోకి వీక్షిస్తుంటారు డా.గీతామాధవి గారు కవులకోసం. కవి కనిపించినదే తడవుగా వారిని ఆహ్వానించి సాహిత్య విందు చేసి, సత్కరించి కానీ విడువరు. అంతటి సాహిత్య కండూతి వారిది. స్వయానా గొప్ప అంతర్జాతీయ కవయిత్రియైనా, ఇతరులనుండి ఇంకా ఏదో నేర్చుకోవాలనే నిత్య విద్యార్థిని వారు.
సహజంగానే ప్రతిసారీ ఏదో ఒక క్రొత్తదనాన్ని అద్దుతూనే వుంటారు గీతగారు వీక్షణం సమావేశాలకు. అలాగే ఈసారి కళా సింధు డా.ఆలపాటి గారి ప్రసంగం ఓ ప్రత్యేకత! ఓ మెరుపు. ఓ చమక్కు.
ముందుగా గీత గారి స్వాగత వచనాలతో సభ ప్రారంభమైంది. ఈ నాటి ప్రత్యేక అతిధి డా.ఆలపాటిగారిని వేదికపైకి ఆహ్వానించి వారి వైశిష్ట్యాన్ని సభకు పరిచయం చేశారు.
శ్రీ ఆలపాటి గారికి టాగ్ లైన్ కింగ్ గానూ, కళా సింధుగానూ, గొప్ప అనువాదకులు గానూ ప్రఖ్యాతి చెందినవారు.
ఎనిమిది భాషలలో పండితులు,కవీ, రచయిత. వారికి మూడు గౌరవ డాక్టరేట్ లు ఉన్నాయి. అంతే కాక క్రియేటివ్ రచయితగా, మోటివేషనల్ ప్రాసంగికునిగా జాతీయ స్థాయి పురస్కారాలెన్నో పొందిన ఘనాపాటి. కవిత్వంలోని అన్నిరకాల ప్రక్రియలలో ప్రావీణ్యులు.
సృజనాత్మక ప్రస్థానాలు :
- తొలి రచన-ఆంధ్ర ప్రభ-1971లో. అప్పటి నుంచి వేలాది రచనలు ( కథలు,కవితలు,గేయాలు, పద్యాలు,గజల్స్, నవలలు, వ్యాసాలు, సీరియల్స్,ఫీచర్లు Fiction/Non-fiction లలో దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ )
- స్వాతి వీక్లీ కథల పోటీలో "ఫాదర్ సీరియస్" అనే కథకి బహుమతితో సహా, అనేక ఇతర అవార్డులు
- "రాలిపోయిన చందమామ"నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణ నవలతో సహా ఎన్నో నవలలు
- డజన్లకొద్దీ రేడియో నాటికలు
- దూరదర్శన్ & ఇతర ఛానెల్స్ కార్యక్రమాలెన్నింటికో మాటలు-పాటలు-దర్శకత్వం-సమర్పణ
- అనేక ఛానెల్స్ లో పలు ఇంటర్వ్యూలు
- యూ-ట్యూబ్ ఛానెల్స్ లో వందలాది కార్యక్రమాలు
- అనేక ప్రాంతాల్లో జరిగే వేలాది కార్యక్రమాల్లో వేదికని అలంకరించడం
- డజన్ల కొద్దీ అత్యంత ప్రసిద్ధి గాంచిన ట్యాగ్ లైన్స్ ("ఓ ఐడియా - మీ జీవితాన్నే మార్చివేస్తుంది" మొ .వి)
- దశాబ్దాలుగా కలం+గళంతో అడ్వర్టైజింగ్ తదితర బహుముఖీన రంగాలలో విశిష్ట స్థానం
- Print/Audio/Video మీడియాల్లో Specializations కి దేశవ్యాప్తంగా గుర్తింపు
అరుదైన విశేషతలు:
- Concept నుంచి Final Products వరకూ "All-under-one-roof" & "One-stop-Solution" గా రాణింపు
- Print మీడియా products తో పాటు Ad-films, Documentaries & Audio & Video Ads creations
- ప్రముఖ "తెలుగు వన్" ఛానెల్ ద్వారా ప్రతి మంగళవారం విడుదలయ్యే "ఆలపాటి చమక్కులు" సాప్తాహిక వీడియో కార్యక్రమం 226 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని అప్రతిహతంగా కొనసాగుతోంది.
- ప్రసిద్ధ "టోరీ" రేడియోలో ప్రతి శుక్రవారం వస్తూ ప్రపంచవ్యాప్తంగా బహుళ జనాదరణ అందుకున్న "ఆలపాటి చమక్కులు లైవ్ షో" 213 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని అప్రతిహతంగా కొనసాగుతోంది.
- మరో గ్లోబల్ కార్యక్రమం "ఆలపాటి రేడియో" Podcasts ద్వారా Spotify తదితర అనేక Platforms ద్వారా జీవితానికి సంబంధించిన అనేక విషయాలపై ప్రతిరోజూ జీవన-అవగాహన కార్యక్రమం జరుగుతోంది.
ఇంతటి గొప్ప వ్యక్తిని ఈ సభకు స్వాగతించిన గీతగారికీ, రాజేంద్రప్రసాద్ గారికి నమస్సులు.
డా.ఆలపాటిగారు తన గంభీర స్వరంతో, స్పష్టమైన ఉచ్చారణతో ' చమక్కులు వ్రాయడం ఎలా ' అనే అంశంపై సుమారు45 నిమిషాలు ప్రసంగించిన తీరు సభికులను నిశ్చేష్టులను గావించింది.
అవ్వయార్ గారి తమిళ సూక్తిని ఉటంకిస్తూ.. "నేర్చుకున్నది అరచేయి అంత, నేర్చుకోవలసింది అపార జలధి అంత " అని చెప్తూ వారి చమక్కులను సోదాహరణంగా వివరించారు.తమ వేటపాలెంలో తాము 7వతరగతి చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన వారిని కవిగాఎలా మార్చిందో అదే వొక చమక్కనీ, మెరుపును అందుకోవడం దాన్ని పంచుకోవడం అనే చమక్కు ప్రతి కవికి అవశ్యమని, లేనిచో పలక కవితలుగానే నిలిచిపోతాయన్నారు. పోయిన పిదపకూడా బ్రతికి ఉండడం ప్రతివాని ధ్యేయమై ఉండాలని వుద్భోదించారు.
వారి ప్రసంగాన్ని శ్లాఘిస్తూ అనేకమంది కవులు స్పందించారు. ధన్యవాదాలు తెలిపారు.
పిదప శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన కవి సమ్మేళనం ప్రారంభమైంది.
తొలుతగా డా.గీతామాధవిగారు "అచ్యుతం, కేశవం "అనే గీతాన్ని తెలుగులోకి అనువదించి తన శ్రావ్యమైన కంఠంతో పాడి సభికులను మంత్ర ముగ్ధులను చేశారు. తరువాత "పండగంటే" అనే కవితలో నిజమైన పండుగ ఏదో తమ సహజ శైలిలో చెప్పారు. అద్భుతమైన కవిత.
తరువాయిగా డా.ఆలపాటి గారు ఒకే కవితలో వివిధ భాషలుపయోగిస్తూ ఒక క్రొత్త ప్రక్రియను వినిపించారు. శ్రోతల చప్పట్లతో సభ దద్దరిల్లినది.
శ్రీ ఆదిత్య ( కమర ) గారు ' మనోభావాలు దెబ్బతిన్నాయి 'అనే తన కవితలో హాస్యాన్ని పండించారు..శ్రీ వెంకట కొత్తూరి గారు సంక్రాంతి శోభపై చక్కని పద్యాన్ని చదివి అలరించారు. శ్రీ ఘంటా మనోహరరెడ్డి గారు గతము చేసిన గాయాల జ్ఞాపకాలు ఎందుకో అంటూ పేరుకు తగ్గట్టుగానే మనోహరంగా పాడారు.
తేళ్ల అరుణ గారు తమ కవితలో అతడు ఆమెలను ప్రకృతి పురుషులతో పోలుస్తూ చక్కని కవిత వినిపించారు. శ్రీ అయ్యల సోమయాజులు గారు అమలాపురంలో బొమ్మల కొలువును అందంగా వర్ణించారు. శ్రీగౌరీపతి శాస్త్రిగారు తన ' వేకువ సూర్యుడు ' అనే కవితలో మధ్యతరగతి మానవుడి ఇడుమలను గురించి వేదనా భరితంగా వివరించారు.
శ్రీమతి దీకొండ చంద్రకళ గారు చిరునవ్వులను చెదరనీకుమా అనే సందేశాత్మక కవిత అందరినీ ఆకట్టుకొంది.
సుప్రసిద్ధ తబలా కళాకారులు స్వర్గీయ జకీర్ హుస్సేన్ గారిపై కవిత చదివారు శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు.శ్రీ మోటూరి నారాయణరావుగారి మరో పొద్దుపొడుపు అనే కవిత అద్భుతంగా ఉంది.డా.దేవులపల్లి పద్మజ ' ప్రేమ..భ్రమ " కవితలో ఆరెంటి భేదాన్ని అందంగా వివరిస్తూ చదివిన తీరు శ్లాఘనీయం.
శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావుగారు " మా అమ్మాయికి పెళ్లైపోయింది "అనే కవితలో అమ్మాయి తన జీవనయానం లో ఎలా సహజ రూపాంతరం చెందుతుందో చెప్పిన తీరు గురుతుండి పోతుంది.
శ్రీమతి పరాంకుశం కృష్ణవేణి గారు " హృదయ గవాక్షం "అనే తన కవిత శ్రుత్యంగమంగాఉండినది. అమీనా కలందర్ గారు ఎక్కడికో ఈ పరుగు ఎవరికోసమో అంటూ కవితాగానం చేశారు.
బుక్కాపట్నం రమాదేవి గారు ఎద లోయల్లో ఇంద్ర ధనస్సు అనే కవిత అందరినీ ఆకట్టుకొంది. శ్రీమతి కోదాటి అరుణ గారు వివిధ వయో దశల్లో నవ్వు ప్రాధాన్యత ను సుందరంగా వినిపించారు.
డా.బృంద గారు జీవికి నీరు ప్రాణాధారం అంటూ చక్కని సందేశాత్మక కవిత చదివారు. కవితలోని అంత్యప్రాసల సౌందర్యం చెప్పుకోదగ్గది. శ్రీమతి సుజాతా కోకిల గారు " నా పిల్లలే నా ఆధారం " అంటూ చదిన కవిత కోకిల గానం చేసినట్టే ఉంది. శ్రీ చిట్టాబట్టిన వీరరాఘవులు గారు తన నిప్పు కణికలు అనే కవితలో సత్యం యొక్క వైశిష్ట్యాన్ని వివరించారు.
శ్రీమతి మంజులగారి కవిత విన సొంపుగా ఉంది. శ్రీమతి చీదేళ్ల సీతాలక్ష్మి గారు ' తెలుగువారి గుండె చప్పుడు 'అనే తన కవితలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రాశస్త్యాన్ని వివరించారు. వారిదక్షిణ భాగం శ్రీ సత్యమూర్తి గారు కూడా యన్టీయార్ పై తమ ప్రేమాభిమానాలు వారి కవితలో వివరించారు. శ్రీ ఉప్పలపాటి వెంకట రత్నం గారు ' ఆత్మార్పణం అనే కవితలో ప్రేమకు అంత ఆకర్షణ ఏమిటి అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు. ప్రసాదరావు రామాయణం అనే నేను నా కవితలో ప్రియురాలిచే మోసగింపబడి కన్నీటిలో మునకలెత్తుతున్న ఓ ప్రియుడు తన బాధా కాలకూటాన్ని త్రొక్కిపట్టి అందరినీ నవ్వులతో ఎలా అలరిస్తాడో విదారకంగా వినిపించాను. చివరిగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు చమక్కులపై తన కవితలో మెరుపులు మెరిపించారు. పిడుగులు దొర్లించారు.
తరువాత డిసెంబరు నెలలో ఫేస్బుక్ కవితల పోటీలో విజేతగా మల్యాల మనోహరరావు కవిత "జుగల్బందీ"ని ఎంపిక చేసారు.
వచ్చేనెలలో వీక్షణం 150వ సమావేశాన్ని జరుపుకోబోతున్న సందర్భంగా 150 మంది కవులతో ఈ-కవితా సంకలనాన్ని తీసుకురాబోతున్నట్లు గీతగారు ప్రకటించారు.
అత్యంత ఆనందంగా జరిగిన ఈ సభ గీత గారి తుది పలుకులతో విజయవంతంగా ముగిసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉత్సాహంగా పాల్గొన్న ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.